Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పెరుగుట విరుగుట కొరకే ఏమీ భయపడవద్దు'' అని నాయకుడు యూ ట్యూబులో పెట్టాడు. తరవాత ట్వీట్ చేశాడు. ఫేసుబుక్కులో పెట్టాడు. తన వందిమాగధులు, పరమ భక్తులు తాను ఇలా అన్న వెంటనే దాన్ని ప్రజలకు చేరవేయడం, రెండవ బ్యాచి దాన్ని బలపరుస్తూ కామెంట్లు పెట్టడం, మూడవ బ్యాచ్ వెంటనే వాటిని ఫార్వర్డ్ చేయడం ఇలా సాఫీగా జరిగి పోయేది ఎందుకీరోజు పెరుగుట లేదు, తన పరపతి పొరబాటున పెరుగుట మరచి విరిగి పోయిందా! విరుగుటయే ఎరుగని అజ్ఞాత శత్రువు కదా తాను. అలా నా అప్పోజిషన్ వాళ్ళు కూడా పలకరేం ఈరోజు! దీనిపైన వెంటనే ఒక కమిటీ వేయించి దీని అంతు చూడవలసిందే అనుకున్నాడు నాయకుడు.
''ఇక ఈ మౌనం భరింపలేకున్నాను. ప్రతిపక్షాలకే చేసి కనుక్కొనెద'' అనుకుంటూ తను నవ్వకున్నా తనతో అప్పుడప్పుడూ నవ్వుతూ మాట్లాడే ఓ నాయకుడికి ఫోన్ చేశాడు.
''కైసేహౌ నేతా మహౌదరు''
''బహుత్ అచ్ఛా హై జీ'' ఇప్పటిదాకా బాగానే ఉన్నాను అని లోలోన అనుకున్నాడు
''ఎప్పుడూ వెంటనే స్పందించే మీరు పెరుగుట విరుగుట కోరకేనని నేను ట్వీట్ చేస్తే, అంత నిశ్శబ్దంగా ఉన్నారేమిటి, విమర్శించకుండా''
''అదే పనిలో ఉన్నా మహౌదరు, ఏమిటి ఇలా లేటుగా స్పందిస్తే కూడా మీ సమాచార చట్టం కొత్త అధికారాల కింద కేసు పెడతారా ఏమిటి. నేను రిప్లై ఇవ్వనుగాక ఇవ్వను మహౌదరు''
''హ్హ హ్హ హ్హ ఎన్ని రోజులైంది నవ్వి?! ఒక్కో రాష్ట్రమూ నా ఆశలు పోగొడుతుంటే ముందే సీరియస్ మొహం ఇంకా సీరియస్సై పోయింది. భలే నవ్వించారు. కేసు వేయకుండా నేను చూసుకుంటా గాని పెరుగుట విరుగుటపై స్పందించండి వెంటనే''
''స్పందిస్తానుగాని మళ్ళీ కేసు పెట్టకూడదు''
''కేస్ నహీ రఖేంగే!! ఏ మేరా ప్రమాణ్ హై. మేరా దిల్ కీ బాత్ హై. ముఝే విశ్వాస్ కరో!!''
''ఇలాంటి ప్రమాణాలు విని, విశ్వాస్‌లు నమ్మే ప్రజలు ప్రాణం మీదికి తెచ్చుకున్నారు''
''క్యా బోలా?''
''కుచ్ భీ నై బోలా... ఆప్ కా డ్రస్ అచ్చాహై బోలా...''
''టీక్ హై టీక్ హై''
నీకు టీక్ టీక్ ముందుందని అనుకుంటూ ప్రతిపక్ష నాయకుడు సోషల్ మీడియా అన్నింటిలో జవాబు పెట్టాడు
''ప్రజలారా పెరుగుట విరుగుట కొరకేనని అమాయకులైన ప్రజల్ని నమ్మించడానికి మన నేతా మహౌదరు మళ్ళీ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈయన వచ్చినప్పటినుండి ఏమేమి పెరిగాయో చెబుతా వినండి. డీజిలు, పెట్రోలు, విద్యుత్తు ఇలా అన్ని రెక్కలొచ్చినట్టు పెరిగి పోతున్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్న సూత్రం ప్రకారం ఇవి తగ్గాలి కదా! ఇదే అడిగితే ఆదా లీటర్ యాభై రూపాయలే కదా అంటున్నారు. ఇవే కాదు కూరగాయలు, బియ్యం, గోధుమలు, జొన్నలు, కందిపప్పు ఇలా అన్నీ ఆకాశంలో ఉన్నాయి. అవి ఎన్నడూ దిగి రాలేదే? ఈ నేతా మహౌదరు మాటలు ఎలా నమ్మాలి మనం, మీరే చెప్పండి''
ఆయనే కొనసాగించాడు ''ఉద్యోగాలు పెరుగుతాయన్నాడు, అవిమాత్రం పెరగకున్నా తగ్గిపోతున్నారు. కరోననే తీసుకుందాం. కరోన వ్యాప్తి పెరిగిపోతోంది, వ్యాక్సిన్లు తగ్గిపోతున్నారు. మరణాలు పెరిగిపో తున్నారు, జనాభా తగ్గిపోతోంది. మాటలు పెరిగి పోతున్నారు, చేతలు తగ్గిపోతున్నారు. గంగా నదిలో నీళ్ళు తగ్గి శవాలు పెరుగుతున్నారు. స్కీమ్‌లు తగ్గి స్కామ్‌లు పెరుగుతున్నరు. పవిత్రంగా చెప్పే గుడి స్థలంపై కూడా డబ్బులే కనిపిస్తున్నరు. ప్రజలారా బాగా గమనించండి. ఆయనకు ఓట్లు తగ్గిపోతున్నారు, రాష్ట్రాలు తగ్గిపోతున్నారు, బీపీ, టెన్షన్లు పెరిగిపోతున్నారు, రేపు మంత్రులు పెరుగుతారు మన దృష్టి మరల్చడానికి. బార్డర్లో బాగాలేదంటారు. ఇవి మనం నమ్మొద్దు. నేతా మహౌదరు చెప్పినట్టు పెరుగుట విరుగుట కొరకే ప్రపంచ మీడియా పటంలో రేటింగులు పడిపోయారు. నిజమే పెరుగుట విరుగుట కొరకే అన్న మాట ఇక్కడ మాత్రం పనిచేస్తోంది. ఇన్ని రోజులు పెరిగేలా చేసిన ప్రజలు నేడు అధికార దాహం విరిగేలా చేసే పనిలో ఉన్నారు...''
నేతా మహౌదరు ఆశ్చర్యపోయాడు. తన ఐటీ చట్టం కింద పెట్టే కేసులకు భయపడి తన ట్వీట్‌కు జవాబు మంచిగా పెడతాడనుకున్నాడు. ఇదేమి ఇలా చేశాడు విపక్ష్కి నేతా అని మనసులో అనుకున్నాడు. భయపడ్డాడు. వెంటనే తన సహాయకులను పిలిచాడు గట్టిగా
''ఏమిటి ఏం జరుగుతోంది? విపక్ష్ నేతా చెప్పింది నిజమేనా? నా సలహాదారులుగా మేరేం చేస్తున్నారు. ఆ సీతారాం ఏచూరి, కొందరు కవులు, కాలమిస్టులు లాంటివాళ్ళే ధైర్యంగా ఉన్నారనుకుంటే ఇప్పుడు అందరూ ధైర్యస్తులై పోతున్నారు''
''అవును ప్రభూ, పెరగడం ఆగిపోయి విరుగుట ప్రారంభమైంది. మీడియా రేటింగులు కూడా వెనకపట్టు పట్టాయి. మాటలు పెరుగుతున్నారు చేతలు పూర్తిగా తగ్గిపోతున్నాయని నేను చెప్పడం కాదు ప్రజలే చెబుతున్నారు, వారి కోపం పెరిగిపోతోంది. ఆ కోపం కూడా పెరిగి పెరిగి తగ్గిపోతుందేమోనని గ్రాఫులు గీశారు నిపుణులు. తేల్చిందేమంటే ప్రజల ఓపిక పెరిగి పెరిగి తగ్గడం మొదలయింది. అదొక్కటే పెరుగుట విరుగుట కొరకే అన్న సూత్రానికి కట్టుబడి ఉంది. ఈ ప్రపంచంలో ప్రతిదీ మారుతూ ఉంటుందంటే నమ్మకపోతిరి. ఇప్పుడు మీమీద నమ్మకం అపనమ్మకంగా మారింది. అదీ సంగతి''
''దీనికి సంబంధించి కారణాలు పక్కనబెట్టి మార్గం చూపించండి''
''మీకు గురజాడ యాద్ హై''
''కైకూ నై దేశమంటే మట్టి...''
''దేశమంటే మట్టి కాదోరు''
''ఓ బాత్ సచ్ఛ్ కర్నా హై, ఇంకా ఒట్టిమాటలు కట్టి పెట్టోరు గట్టి మేల్ తల పెట్టవోరు , ఏ భీ కర్కే దిఖానా హై''
''హమ్ కో ఒట్టి మాటలు బినా ఔర్ కుఛ్ ఆతాహీ నహీ''
''ఓ ఆనేకా వక్త్ ఆగయాహై, ఇప్పటికే సమయం మించి పోయింది...''
''????.....!!!!....!?!?''
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298