Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూకాశ్మీర్‌కు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం రకరకాల కథనాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. 2019 ఆగస్టు 5న హఠాత్తుగా నాటకీయంగా కాశ్మీర్ ప్రతిపత్తికి సంబంధించిన 370వ అధికరణాన్ని పక్కన పెట్టడం, లడక్‌ను విడదీసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగాక ఒక రాజకీయ ప్రక్రియ చర్చలు అంటూ జరగడం ఇదే మొదటిసారి. అఖిలపక్ష సమావేశంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ ఒమర్ అబ్దుల్లాలు, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తిలతో పాటు బీజేపీ నేత రవీంద్రరైనా నిర్మల్ సింగ్, సీపీఐ(ఎం) నాయకుడు ఎంఎల్ఎ యూసప్ తరగామి, ఆప్ నీ పార్టీ నాయకుడు బుఖారి, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాడ్లోనే, ముజఫర్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ఆ రీత్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత ప్రచారం లభించడంలో ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ, జాతీయ పార్టీలతో పాటు బీజేపీ ప్రాపకంతో పెరిగిన కొత్త శక్తులను, సంస్థలను కూడా ఆహ్వానించారు. మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే కాశ్మీర్‌పై తీసుకున్న ఈ చర్య చరిత్రలో తొలిసారి కాశ్మీర్‌ను జాతీయ స్రవంతిలో లీనం చేసిందని గొప్పగా చెప్పుకున్నారు. అప్పటి నుంచి అక్కడి నాయకులను అరెస్టు చేయడం, ఆంక్షలు, సమాచార సంబంధాల నిలిపివేత మీడియాపై దాడులు మొత్తం అప్రజాస్వామిక వాతావరణం తాండవించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో కేంద్రం నియమించిన అధికార బృందం పెత్తనం చేసింది. దీనిపై దేశంలోనే గాక అంతర్జాతీయంగానూ వ్యతిరేకత వచ్చింది. ఈ నిర్బంధ వాతావరణంలోనే జిల్లా కౌన్సిళ్ల ఎన్నికలు జరపగా బీజేపీ ఆశించినట్టు పెద్ద శక్తిగా ఏమీ రాలేదు. కాశ్మీర్ చరిత్రతో ముడిపడిన రాజకీయ పక్షాలనూ సంస్థలనూ తోసిపుచ్చి బీజేపీ ఇష్టానుసారం వ్యవహారాలు నడపడం ఎంతో కాలం సాధ్యం కాదని స్పష్టమైపోయింది. అనివార్యంగా అఖిలపక్ష సమావేశం జరపాల్సి వచ్చింది. అరెస్టు చేసి అణగదొక్కాలని చూసిన పార్టీలనే పిలిచి మాట్లాడాల్సి వచ్చింది. ఎజెండా ముందు చెప్పకపోయినా, సమావేశంలోనూ ఏ నిర్దిష్ట హామీ ఇవ్వకపోయినా అసలు దాన్ని జరపాల్సిరావడమే కేంద్ర ప్రభుత్వ పరిమితులను ప్రపంచానికి వెల్లడించింది. ఈ రెండేండ్లలోనూ ఎంత బలప్రయోగం, ఎంత ఏకపక్ష నిర్బంధం సాగించినా కాశ్మీర్ ప్రజలలో బీజేపీ కొత్తగా పుంజుకున్నదేమీ లేదని ఒప్పుకోవాల్సి వచ్చింది. సమావేశంలో మోడీ అన్న మాటలు ఢిల్లీ కీ దూర్, దిల్ కీ దూర్ ఈ ఒప్పుకోలుకు నిదర్శనంగా ఉన్నాయి.
అయిదు ప్రధాన కోర్కెలు, బీజేపీ అసలు ఎజెండా
ఈ సమావేశం ఒక ఎత్తుగడ మాత్రమేననీ, రాష్ట్రంలోని రాజకీయ శక్తులన్నిటినీ రప్పించడం కేంద్రానికి విజయమనీ కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. హాజరైన 14 పార్టీలలో బీజేపీకి అనుకూలమైనవి కొన్ని ఉండొచ్చు గానీ మొత్తంపైన వాటిది ప్రధాన ప్రభావం కాలేకపోయింది. కాశ్మీర్ గురించి ఇంతకాలంగా బయిటసాగిన దుష్ప్రచార భాషను గాక కేంద్రం చర్చల భాషను ఉపయోగించవలసి వచ్చింది. ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షా, భద్రతా సలహాదారు అజిత్ దోవెల్, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలు కూడా చర్చలలో పాలు పంచుకున్నారు. మొత్తంపైన కాశ్మీర్ చర్చల ప్రక్రియ పునరారంభం సానుకూల పరిణామంగానే పరిగణించబడింది గాని నిర్దిష్టమైన ఫలితాలేమీ లభించలేదు. నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం ఈ సమావేశం పిలిచినట్టు స్పష్టమైంది. సమావేశంలో గుప్కార్ అలయన్స్ పార్టీలూ, కాంగ్రెస్ ప్రధానంగా అయిదు కోర్కెలు ముందుంచాయి. 1. రాష్ట్ర హోదా పునరుద్ధరణ 2. ప్రజాస్వామికంగా ఎన్నికలు 3. కాశ్మీర్ పండిట్ల పునరావాసం 4.నివాస నిబంధనల పునరుద్ధరణ 5.నిర్బంధంలో ఉన్న డిటెన్యూల విడుదల. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడివుందని ఈ సమావేశంలో మోడీ హామీ ఇచ్చినట్టు కొందరు నేతలు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనలో అందరూ పాలుపంచుకోవాలని ప్రధాని మోడీ ఈ సమావేశంలో కోరారు. తర్వాత ఇతర విషయాలు ఆలోచించవచ్చునన్నారు. హోంమంత్రి అమిత్ షా ఈ విషయం మరింత గట్టిగా చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనలో బీజేపీ వ్యూహాత్మక ప్రయోజనం ఒకటుంది. లడక్‌ను విడదీశాక కాశ్మీర్ శాసనసభలో 83స్థానాలున్నాయి. ఇందులో కాశ్మీర్ 47, 36 జమ్మూలో ఉంటాయి. పునర్విభజన వల్ల జమ్మూలో ఏడు సీట్లు పెరుగుతాయి. ఆ ప్రాంతంలో ఆధిక్యత గల బీజేపీ అప్పుడు తనే నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల అవకాశం వస్తుందని వారి ఆశ. ఎన్నికలు, దానికి ముందు నియోజకవర్గాల పునర్విభజన ముఖ్యమని అందుకే వారు పట్టుపట్టారు. పనిలో పనిగా కేంద్రం ఆధీనంలోకి వచ్చిన కాశ్మీర్లో చాలా చర్యలు తీసుకున్నట్టు, నిధులు మంజూరు చేసినట్టు కూడా చెప్పుకోవడానికి ఈ సమావేశాన్ని ఉపయోగించుకున్నారు. 370, 35ఎ పునరుద్ధరణ ముందు జరగాలని అన్నప్పుడు ప్రధాని మౌనం దాల్చారని చెబుతున్నారు. ఆ విషయం సుప్రీం కోర్టు ముందు విచారణలో వుంది గనక చర్చించడానికి లేదని ముజఫర్ బేగ్ అడ్డు తగిలారు. ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడు మెహబూబా ముఫ్తి పాకిస్థాన్‌తో కూడా కాశ్మీర్‌పై చర్చలు జరపాలని వాదించారు. 370 పునరుద్ధరణ లేకుండా తాము ఎన్నికలలో పాల్గొనబోమని చెప్పారు. కాని సమావేశంలో మాత్రం పాకిస్థాన్ ప్రస్తావన తేలేదని అంటున్నారు. బీజేపీ మద్దతు ఉన్నట్టు చెప్పబడే అప్నీ పార్టీ నాయకుడు బుఖారి కూడా పరోక్షంగా కేంద్రానికి మద్దతునిచ్చేలా మాట్లాడారు.
గుప్కార్ డిక్లరేషన్ సారాంశం
కాశ్మీర్ చర్చలోే గుప్కార్ అలయన్స్ గురించి పదేపదే వినిపిస్తుంటుంది. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడైన ఫరూక్ అబ్దుల్లా నివాసం పేరిట గుప్కార్ డిక్లరేషన్‌గా పేరొందిన ఈ పిలుపు సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితికి ప్రతిబింబం. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలూ చేతులు కలపడమంటేనే గుప్కార్ డిక్లరేషన్ పార్టీలకు అతీతంగా కాశ్మీర్ ప్రజల మనోభావాలకు అద్దం పడుతున్నట్టు అర్థమవుతుంది. వాస్తవంలో ఈ డిక్లరేషన్ 370 రద్దు వార్తల నేపథ్యంలో పార్లమెంటు చర్చకు ఒకరోజు ముందుగా జరిగింది. 2019 ఆగస్టు 5న పార్లమెంటులో 370వ అధికరణం రద్దు, కాశ్మీర్‌ను నుంచి లడక్‌ను విడదీయడం, రాష్ట్ర ప్రతిపత్తి తొలగించి రెండు భాగాలనూ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగాయి. అప్పటికే శాసనసభ రద్దయి ఉన్న పరిస్థితిలో కేవలం గవర్నర్ సిఫార్సును మాత్రం తీసుకుని విభజన చేసి హోదా తగ్గించారు. విలీన సమయంలో కాశ్మీర్ ప్రజలకిచ్చిన హామీకి ఇది విరుద్ధమనీ, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా వ్యతిరేకమని పలుపార్టీలు చెప్పినా కేంద్రం వినిపించుకోలేదు. ఏడు దశాబ్దాలలో ఎవరూ చేయని పని చేశామని గొప్పగా చెప్పారు. దేశంలోనే విదేశంగా ఉన్న కాశ్మీర్‌ను భాగం చేశామనీ, దీనివల్ల అభివృద్ధి పరుగులు పెడుతుందనీ, పెట్టుబడులు ప్రవహిస్తాయనీ ప్రకటించారు. అయితే ఆచరణలో జరిగింది వేరు. అనేక ఆంక్షలు విధించబడ్డాయి. నిరసన తెలిపే యువతపై కాల్పులు, నిర్బంధాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. అయినా అప్పటి నుంచి మాజీముఖ్యమంత్రులైన ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలు, ముఫ్తి మహ్మద్ సయిద్‌లను నిర్బంధంలో ఉంచడం వల్ల కార్యాచరణ సాధ్యపడలేదు. మరోవైపున సమాచార సంబంధాలు ఇంటర్ నెట్ కూడా నిలిపేయడం, పత్రికలపై సెన్సార్ తీవ్ర విమర్శకు కారణమైనాయి. పాత్రికేయులను సంపాదకులను అరెస్టులు చేయడంతో పాటు కీలకమైన ఎందరో నాయకులను జైళ్లలోనూ గృహ నిర్బంధంలోనూ ఉంచారు. ఇవన్నీ చాలాసార్లు సుప్రీం కోర్టు ముందు సవాలు చేయబడ్డాయి. అసలు రాజ్యాంగ సవరణలే చెల్లవన్న పిటిషన్లు కూడా దాని ముందున్నాయి. పలువాయిదాల తర్వాత సుప్రీం కోర్టు అక్కడ సమాచార సంబంధాల పునరుద్ధరణకై ఆదేశాలిచ్చింది. ఇన్ని పరిణామాల తర్వాత కాశ్మీర్‌ను ఎంత అణచిపెట్టినా అక్కడి రాజకీయ శక్తులను మటుమాయం చేయడం సాధ్యం కాదని గ్రహించే కేంద్రం ఈ సమావేశం జరిపింది తప్ప మౌలికంగా దాని ఆలోచనల్లో పెద్ద మార్పు లేదు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ నుంచి ఎలాంటి హామీ రాలేదని సీపీఐ(ఎం) నాయకుడు యూసప్ తరిగామి స్పష్టంగానే ప్రకటించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తాము కట్టుబడివున్నామని ఫ్రధాని చెప్పారని ఒక కథనం. కాని కాలక్రమంలో పునరుద్దరణ జరుగుతుందని అమిత్ షా పాత పల్లవినే ఆలపించారని కూడా ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగానే హడావుడిగా ఎన్నికలు జరిపించి అధికారంలోకి రావాలన్నదే బీజేపీ తాపత్రయం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నదాన్ని బట్టి ఈ విషయం స్పష్టం. అయితే ఇన్ని ప్రతికూల చర్యలు అణచివేతల తర్వాత జమ్మూలో కూడా బీజేపీపై కొంత విముఖత పెరిగి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.
దూరం పెరుగుతుందా తగ్గుతుందా?
ఈ సమావేశం ముందు తర్వాత కూడా వేర్వేరు వర్గాల నుంచి విభిన్నమైన స్పందనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో తాలిబాన్లు తమ దేశంలోకి రావచ్చు గనక పాకిస్థాన్ పశ్చిమ ప్రాంతంపై దృష్టి కేంద్రీకరిస్తుందనీ ఈ సమయాన్ని భారత ప్రభుత్వం ఎంచుకుందని ఒక వ్యాఖ్య. అందుకు తగినట్టే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహబూద్ ఖురేషి ఈ సమావేశం విఫలమైందని వ్యాఖ్యానించారు. 370 రద్దు తర్వాత కాశ్మీర్లో అణచివేత పెరిగిపోయిందని, యాభై శాతం పరిశ్రమలు మూతపడ్డాయని, తాము దీన్ని ఐరాసలోకూడా లేవనెత్తామని చెప్పారు. కానీ 2021 ఫిబ్రవరిలో పాకిస్థాన్ భారత్ దళాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఒకటి కుదిరింది. అజిత్ దోవెల్ ఆ చర్చలు కొనసాగించనున్నారు. తీవ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రతినిధులు అంటున్నారు. మరోవైపున కాశ్మీర్లో 370 పునరుద్ధరణ ప్రసక్తి ఉండరాదని హిందూత్వ అనుకూల వ్యాఖ్యాతలు రాశారు. ఎలాంటి మెతక వైఖరికి ఆస్కారం లేకుండా కఠినంగానే వ్యవహరించాలని వారు వ్యాసాలు రాశారు. మరోవైపున ఈ సమావేశంలో పాల్గొనడం స్పందించడమే ప్రతిపక్షాల మెత్తబడినట్టు తెలుస్తుందని మరికొందరు తీవ్రధోరణిలో వ్యాఖ్యానించారు. కాశ్మీర్ పాలనను కేంద్ర అధికారుల చేతుల్లోనుంచి రాష్ట్ర అధికారులకు అప్పగించాలని, ఆ చట్రం మిగిలిన రాష్ట్రాలలో లాగే ఉండాలని ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్ అనడం 370ని ప్రస్తుతం పక్కన పెట్టడమేనని కొందరు భాష్యం చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా ఏదోలా ఎన్నికలు జరిగితే మంచిదన్నట్ట్టు ఉందని వారి వాదన. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ప్రతిపక్షపార్టీల వైఖరులలో తేడాలు ఉండొచ్చు గాని వెంటనే పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ముఖ్యమన్నది కాశ్మీర్ ప్రజల ఏకాభిప్రాయం. మోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అందుకు భూమిక కాగలదా అన్నది భవిష్యత్తు చెప్పాలి. కేవలం బీజేపీ ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం రాజకీయ ఎత్తుగడలకు పాల్పడితే ప్రధాని చెప్పిన ''ఢిల్లీ కే దూర్ దిల్ కీ దూర్'' ఇంకా పెరుగుతుందే గాని తగ్గదు. కేంద్రం ఏమి చెప్పుకున్నా ఈ రెండేండ్లలో ఆ దూరం పెరిగిందనే పరిశీలకుల అభిప్రాయం, వాస్తవ అనుభవం. 370 రద్దుపై సీపీఐ(ఎం), నేషనల్ కాన్ఫరెన్స్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు విచారణలో ఉంది గనక అక్కడ ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూడవలసిందే. ఇప్పటికే ఆలస్యమైన ఈ కేసును త్వరగా తేల్చడం అత్యున్నత న్యాయస్థానం బాధ్యత.
- తెలకపల్లి రవి