Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మంజిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన అంబటిపుడి మరియమ్మ, మానవత్వం కోల్పోయిన కిరాతక పోలీసు మృగాల చేతిలో అసువులు బాసింది. మూడు దఫాలుగా కొట్టడమే గాక నానా రకాల చిత్రహింసలతో ఘోరంగా వేధించారు. ఇంతకీ మరియమ్మ చేసిన నేరం ఏమిటి? ఎందుకు అడ్డగుడూరు పోలీసులు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు? అసలు కారణాలేమిటి? వివరాలలోకి వెళితే... మృతురాలు మరియమ్మ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం గోవిందాపురం గ్రామంలో బాలశౌరి అనే ఫాస్టర్ ఇంట్లో వంట పనిచేస్తుంది. సదరు ఫాస్టర్ హైదరాబాద్ ఓ పనిపై వెళ్లారు. అదే టైంలో మరియమ్మ తన కుమారుడు తమ స్వంత గ్రామం కోమట్లగూడెం వెళ్లారు. తిరిగి వచ్చిన ఫాస్టర్ తన ఇంట్లో రూ.2లక్షలు దొంగతనం జరిగిందని, ఇది మరియమ్మ ఆమె కుమారుడే దొంగిలించారని అడ్డగుడూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయాలి. కానీ హుటాహుటిన అడ్డగుడూరు నుంచి ఖమ్మంజిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం వచ్చిన పోలీసులు అర్థరాత్రి 2గంటల సమయములో మరియ్మను చితకబాదారు. మా అమ్మను కొట్టకండని తన కూతురు కాళ్ళమీద పడ్డా కనికరించలేదు. అదే రాత్రి చింతకాని పీఎస్‌లో నిర్బంధించారు. మళ్ళీ అడ్డగుడూరు తీసుకొచ్చి అక్కడ లాకప్‌లో తల్లి కొడుకుని వేసి విచక్షణ రహితంగా చావబాదారు. మహిళా పోలీసులు ఎవరూ లేరు. మగ పోలీసులే రాత్రంతా అడ్డగుడూరు పీఎస్‌లో ఈ దాష్టికానికి ఒడిగట్టారు. మరియమ్మ దెబ్బలకు తాళలేక బట్టల్లోనే మూత్రం పోసుకుంది. స్పృహ కోల్పోయిన ఆమెను స్థానిక ఆర్ఎంపీ డాక్టర్‌కు చూపించారు. పరిస్థితి విషమించడం వల్ల భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె అక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడు ఉదరు కిరణ్‌ను మర్మావయవాలపై విపరీతంగా కొట్టారు. ఆయన ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కేవలం ఆరోపణ ఎదుర్కొంటున్న మహిళపట్ల ఇంత అమానుషంగా వ్యవహరించడం ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నాయి.
ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉదరుకిరణ్ పోలీసు హింసకే మా అమ్మ మరణించిందనీ, దెబ్బలకు తాళలేక తల్లి తన చేతుల్లోనే కన్ను మూసిందని బోరుమన్నాడు. విజరు మాల్యా, నీరవ్ మోడీలు వేల కోట్ల రూపాయలు దేశ ప్రజల ఆస్తులు కొల్లగొట్టి వెళితే వారికి మన దేశ పాలకులు రాచమర్యాదలు చేశారు. మరియమ్మను మాత్రం కిరాతకంగా హింసించి చంపారు. ఒకవేళ ఆమె నిజంగా దొంగతనం చేసిందని నిర్థారణ అయితే ఆమెపై కేసు పెట్టి జైలుకు పంపవచ్చు. కానీ నేరం రుజువు కానప్పుడు ఎందుకు అంత పైశాచికంగా లాఠీ దెబ్బలు కొట్టాల్సి వచ్చింది? ఎవరిచ్చారు పోలీసులకు ఆ అధికారం?
ఒక చర్చి ఫాస్టర్ పిర్యాదుకు పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేశారు? ఏసుప్రభువు బైబిల్లో పేర్కొన్నట్టు చర్చి నియమాలు, విలువలకు విరుద్ధంగా ఫాదర్ తన దగ్గర అంత డబ్బు ఎందుకు ఉంచుకున్నాడు? అలా ఉంచుకోవచ్చునా? ఫిర్యాదులో ఆ ధనం ఎక్కడిదో, ఎందుకు తన వద్దనే ఉన్నదో తెలియచేయలేదు. మరియమ్మను ఇతరత్రా ఏమైనా కారణాలతో కేసులో ఇరికించారా వంటి ప్రశ్నలు అనేకం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల ఇంటరాగేషన్ అంత క్రూరంగా ఉండటం వెనుకా, మరియమ్మ మరణం వెనుకా పైకి కనిపించని ఇతరత్రా కారణాలు లక్ష్యాలు ఉండవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ, ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేయడం, పరిహారం ప్రకటించడంతో చేసిన పాపం తీరినట్టు కాదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టు కాదు. మరియమ్మ మరణానికి దారితీసిన ఈ మొత్తం వ్యవహారంపై ఒక ఉన్నతస్థాయి విచారణ జరగాలి. ఎవరిపాత్ర ఎంతో, ఒక పేదరాలిపై అంత కక్షపూరితంగా, నిర్ధయగా వ్యవహరించడానికి పురిగొల్పిన కారణాలేమిటో వెలుగుచూడాలి. గతంలో చోటుచేసుకున్న ఈ తరహా ఘటనల్లో దోషులపై చర్యలు లేకపోవడం, పోలీసులకు అడ్డూ అదుపూలేని స్వేచ్ఛతో పాటు, తమను అడిగేవారు లేరన్న ధైర్యం కలిగించడం మరియమ్మ లాకప్‌డెత్‌కు ఓ కారణం. పాలకులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉంటాయి.
ఒక దొంగతనం కేసులో పోలీసులు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించి, కేవలం ఆరోపణ ఎదుర్కొంటున్న మహిళపట్ల ఇంత అమానుషంగా వ్యవహరించడం దుర్మార్గం. పోలీసుల ఇంటరాగేషన్ అంత క్రూరంగా ఉండటం వెనుకా, మరియమ్మ మరణం వెనుకా పైకి కనిపించని ఇతరత్రా కారణాలూ లక్ష్యాలూ ఉన్నాయా? ప్రభుత్వం నిగ్గుతేల్చాలి. ప్రభుత్వం బాధిత కుటుంబానికి నష్టపరిహారంతో పాటు, తల్లిని కోల్పోయిన కుమారుడికి ఉద్యోగాన్ని ప్రకటించడం స్వాగతించదగినదే. కానీ ఈ లాకప్‌డెత్‌కు వెనుక అసలు కారణాలు వెలికితీసి దోషులను శిక్షించినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
మరియమ్మ కేసులో హైకోర్టు జోక్యం కూడా అభినందనీయం. రాష్ట్రంలో లాక్డౌన్ కాలంలో దళితులపై అనేక దాడులు దౌర్జన్యాలు జరిగాయి ఏ ఒక్క నాడు అధికార పార్టీ మంత్రులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ స్పందించలేదు. ఓ వైపు ఉపాధి కోల్పోయి బిక్కు బిక్కు మంటుంటే మరో వైపు వివిధ కారణాల పేరుతో ఆధిపత్య శక్తులు దాడులు దౌర్జన్యాలు ముమ్మరం చేశాయి వీటిని అరికట్టడానికి ఉన్న చట్టాలు తెలంగాణలో అమలుకు నోచుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలుకాకపోవడంతో ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నాయి. మరియమ్మ లాకప్ డెత్ ఉదంతంలో పోలీసుల ఓవర్ యాక్షన్ తెలియజేస్తుందేమిటి? రక్షకభటులమని చెప్పే వారు రాక్షస భటులుగామారి మరియమ్మను మట్టుబెట్టారు. అలాంటి కిరాతక పోలీసులపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసుతోపాటు హత్యానేరం కేసు నమోదు చేయాలి. హౌంమంత్రి డీజీపీ వంటి వారు మానవీయకోణంలో స్పందించాలి. సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి. మరో మరియమ్మ లాకప్ డెత్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
- టి. స్కైలాబ్ బాబు
సెల్ 9177549646