Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వజ్రాల కోసం మధ్యప్రదేశ్‌లో వనాలను నాశనం చేసేందుకు సిద్ధమయ్యారు. వజ్రపు కాంతులు అంటూ పర్యావరణాన్ని హననం చేసే చర్యలు చేపట్టనున్నారు. ఛతర్పూర్ జిల్లా బక్స్ వాహ అడవుల్లో త్వరలో రెండు లక్షలకు పైగా చెట్లను నరికేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బందర్ డైమండ్ బ్లాక్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కోసం, డైమండ్ మైనింగ్‌కు దాదాపు అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్నారు. వర్షాభావాన్ని ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో మైనింగ్ పనులు ప్రారంభమైతే పర్యావరణ ముప్పు వాటిల్లడంతోపాటు ఆదివాసులు, వన్యమృగాల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్థిక వృద్ధి సాధించడంతోపాటు ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. నరికిన వృక్షాల కంటే ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటుతామని చెబుతోంది. రెండు దశాబ్దాలుగా సా...గుతున్న 'వజ్రాలవేట'లో భవిష్యత్తులో పర్యావరణానికి, ఆదివాసులకు, వన్యప్రాణులకు ముప్పు వాటిల్లితే రాష్ట్రంలో, దేశంలో అధికార, విపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
అనుమతుల కోసం రెండు దశాబ్దాలు..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా ఎంతో వెనకబడిన జిల్లా ఛతర్పూర్. ఈ జిల్లా పరిధిలోనే శతాబ్దాల క్రితం ఏర్పడిన బక్స్వాV్‌ా అడవులు విస్తరించి ఉన్నాయి. 2011 సెన్సెక్స్ ప్రకారం ఇక్కడి జనాభా 10,216. అయితే ఈ అడవుల భూగర్భంలో వజ్రాలు ఉన్నాయని 2004లో ఆంగ్లో ఆస్ట్రేలియన్ కంపెనీ అయిన రియో టింటో కనుగొన్నది. ఎన్నో సంప్రదింపుల తర్వాత 2010 అక్టోబర్‌లో అప్పటి మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాంతం నుంచి వెలికితీసిన వజ్రాల అమ్మకం ద్వారా వచ్చిన లాభాల్లో పది శాతం మైనింగ్ రాయల్టీ కింద ప్రభుత్వానికి ఇచ్చేందుకు రియోటింటో ఆఫర్ ఇచ్చింది. ఈ ప్రాంతంలో 2.74 కోట్ల క్యారెట్ల వజ్రాలు ఉన్నాయని అంచనా వేశారు. ఆ సమయంలో 971హెక్టార్లలో అనుమతుల కోసం కంపెనీ ప్రయత్నించింది. సుమారు ఐదు లక్షల వృక్షాలను నరికేందుకు ప్రణాళికలు సైతం రూపొందించింది..
షెహ్లా మసూద్ హత్యతో..
పర్యావరణాన్ని కాపాడేందుకు, డైమండ్ మైనింగ్‌ను ఆపేందుకు పర్యావరణ కార్యకర్త, ఆర్టీఐ కార్యకర్త అయిన షెహ్లా మసూద్ ప్రయత్నాలు చేశారు. 2011లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అప్పటి హౌం మంత్రితోపాటు పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి మైనింగ్ అనుమతులు ఇవ్వవద్దని ఆమె లేఖలు రాశారు. అంతేకాకుండా అనుమతుల జారీలో నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరింది. 2011 ఆగస్టు 16న షెహ్లా మసూద్ పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో చాలా మంది రియోటింటో కంపెనీ, డైమండ్ మాఫియాతోపాటు స్థానిక బీజేపీ నాయకులపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖండించి కేసును సీబీఐకి అప్పగించింది. హత్యను తాము ఖండిస్తున్నామని, అయితే ఈ కేసులో తమ పేరు ఎందుకు వచ్చిందో తెలియడం లేదని రియోటింటో కంపెనీ ప్రతినిధులు స్పందించారు. షెహ్లా మసూద్ హత్య తర్వాత మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలను ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు వాల్మిక్ థాపర్, పహల్ ఎన్జీఓ, పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు తీసుకెళ్లాయి. ఈ ఆందోళనల ఫలితంగా 2016 మార్చిలో మైనింగ్‌కు ఎంచుకున్న ప్రాంతం నిబంధనలు ఉల్లంఘించకూడని ప్రాంతమని, టైగర్ కారిడార్ సమీప ప్రాంతమని అటవీ సలహా కమిటీ నిర్థారించింది. ఈ మైనింగ్‌ను జాతీయ పులుల సంరక్షణ సంస్థ కూడా ఓ నివేదికలో వ్యతిరేకించింది. ఈ నివేదికలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న అప్పటి ప్రభుత్వం 2016 మైనింగ్ అనుమతులన్నింటిని రద్దు చేసింది. అప్పుడు రాష్ట్రంలో శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలో ఉండగా, నివేదికలు వ్యతిరేకంగా రావడంతో మిన్నకుండ ిపోవాల్సి వచ్చింది. 76హెక్టార్ల ప్రాంతంలోనైనా మైనింగ్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని రియోటింటో కంపెనీ కోరినా, దీన్ని కూడా అటవీ సలహా కమిటీ నిరాకరించింది. ఆందోళనలు జరుగుతుండడం, సంస్థల నివేదికలు వ్యతిరేకంగా రావడం, ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో తాము ఈ ప్రాజెక్టును వదిలిపెడుతున్నట్టు 2017 ఫిబ్రవరిలో రియోటింటో కంపెనీ ప్రకటించింది. ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోతే అందరూ సంతోషంగానే ఉండేవారు కానీ..
మళ్లీ తవ్విన కాంగ్రెస్..
2018లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ బాధ్యతలు స్వీకరించారు. వజ్రాల మైనింగ్ కోసం బందర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.2500 కోట్లు కాగా, దీని ద్వారా రూ.5500 కోట్లు సంపాదించవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. మైనింగ్ కోసం వేలం ప్రక్రియను చేపట్టారు. ఇందులో 34మిలియన్ క్యారెట్ల వజ్రం ఉన్నట్టు, ప్రతి సంవత్సరం 3మిలియన్ క్యారెట్ల కఠినమైన వజ్రాలు ఇక్కడ లభిస్తాయని అంచనా వేశారు. చాలా కంపెనీలు ఈ వేలంలో పాల్గొన్నా ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన ఎస్సెల్ మైనింగ్ 50ఏండ్ల లీజుకు మైనింగ్‌ను దక్కించుకుంది. అయితే 374హెక్టార్ల అటవీ ప్రాంతంలో మైనింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మైనింగ్ చేపట్టడం ద్వారా వచ్చిన లాభాల్లో 58శాతం ఆదిత్య బిర్లా గ్రూప్, 42శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోగా, బీజేపీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను ముందుకు నడిపించింది.
నీటి కరువు ఉన్న చోట..
బక్స్ వాహా అడవులు బుందేల్‌ఖండ్‌లోని కరువు పీడిత ప్రాంతం కిందికి వస్తాయి. ఇప్పటికే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ ఈ ప్రాంతాన్ని సెమీ క్రిటికల్‌గా ప్రకటించింది. దీంతో అక్కడి పరిమిత నీటి వనరులను వజ్రాల అన్వేషణకు వాడితే స్థానికంగా పర్యావరణం మరింత దెబ్బతినే ప్రమాదముంది. బందర్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రోజుకు 5.9మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరమని అంచనా వేశారు. ఈ అవసరాన్ని తీర్చడానికి ఒక ఆనకట్టను సైతం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఆ నీటిని స్థానిక అవసరాలకు కాకుండా వజ్రాల అన్వేషణకు మళ్లించడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రజల సంపద కార్పొరేట్ల చేతుల్లో..
పర్యావరణం, అడవులు, ఖనిజాలు, సహజ వనరులు అనేవి ప్రజల సంపద. కానీ లాభాల పేరుతో ప్రభుత్వాలు వీటిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నాయి. లాభాల్లో ప్రభుత్వానికి అందే వాటా ద్వారా సంక్షేమ పథకాలు చేపడుతామని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు ఎన్ని కారణాలు చెప్పినా.. జరిగే నష్టాన్ని చూస్తే అది ఏ మూలకు ఉండదు. అంతే కాకుండా ఇక్కడ ఉత్పత్తి అయ్యేది వజ్రాలు. ఇవి కేవలం ఒక శాతం ధనవంతులు మాత్రమే వినియోగించేవి. 99శాతం మంది ప్రజలకు వీటిద్వారా ఎలాంటి లాభం ఉండదు. ఇలాంటి వాటి కోసం పర్యావరణాన్ని నాశనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని పర్యావరణవేత్త నేహా సింగ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేశారు. వజ్రాల గనికి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని అభ్యర్థిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గడప కూడా తొక్కారు. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించు కొని జూన్ 5న బక్స్ వాహా అడవిలో సింబాలిక్ 'చిప్కో ఉద్యమం' (చెట్లును కౌగిలించుకొని వాటిని నరకకుండా నిర్వహించే నిరసన ప్రదర్శన) నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా ఏర్పడే పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా సామాన్యులు, పర్యావరణవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయం లేదా..!
దేశంలో, ప్రపంచంలో ఒక శాతమే ఉన్న ధనవంతుల కోసమే వజ్రాలు అవసరమని అనుకున్నా.. మైనింగ్ జరపకుండా వజ్రాలు తయారు చేసే ప్రత్యామ్నాయం లేదా అంటే ఉందనే చెబుతున్నాయి ప్రపంచంలోని పలు పలు వజ్రాల కంపెనీలు. భూమి లోలోపలి పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద కర్బన అణువులు ఘనీభవించగా ఏర్పడేదే వజ్రం. కార్బన్డయాక్సైడ్ ద్వారా ఇవి తయారవుతాయి. వజ్రాలు తయారు కావడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది. అయితే వజ్రాల వెలికితీత కోసం మైనింగ్ చేపట్టడం, పర్యావరణాన్ని నాశనం చేయడం, వన్యప్రాణులకు హాని కలిగించడం బాధ కలిగించి, కొన్ని కంపెనీలు కత్రిమంగా వజ్రాలు తయారు చేసే పరిశోధనలు చేపట్టాయి. కర్బన వాయువులను అధిక పీడనంతో వజ్రాలుగా తయారు చేయగలిగారు. భూగర్భంలో లభించే వజ్రాలకు, కత్రిమంగా ఇలా తయారు చేసిన వజ్రాలకు నాణ్యతలో ఎలాంటి తేడా కనిపించలేదు. ధర కూడా తగ్గింది. నాణ్యతలో ఎలాంటి తేడా లేకపోవడంతో కత్రిమ వజ్రాల వాడకం కూడా పెరిగింది. ప్రకతికి ఎలాంటి హానీ కలిగించకుండా కత్రిమంగా వజ్రాలను తయారు చేసే అవకాశమున్నా.. పర్యావరణాన్ని, అడవులను నాశనం చేసే చర్యలు ఎందుకు చేపడుతున్నారని పర్యావరణవేత్తల ప్రశ్న. దీనిపై దాటవేతలు తప్ప ప్రభుత్వాల వద్ద సమాధానం లేదు.
- ఫిరోజ్ ఖాన్
సెల్:9640466464