Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక విధానాల విషయంలో మోడీ ప్రభుత్వం ప్రపంచంలోని తక్కిన దేశాలన్నింటికన్నా ఎక్కువ మితవాద వైఖరిని పాటిస్తోంది. కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. ఒక్క మోడీ ప్రభుత్వం మాత్రం ఇందుకు మినహాయింపు. మూడవ ప్రపంచ దేశాలలో మరి కొన్ని ప్రభుత్వాలు తమ దేశాలలో సార్వత్రిక నగదుబదిలీ చేసివుండకపోవచ్చు. కానీ అందుకు కారణం ఐఎంఎఫ్ తదితర సంస్థలు విధించిన షరతులు. కాని అటువంటి షరతులు భారత ప్రభుత్వానికి ఏ విదేశీ సంస్థలూ పెట్టలేదు. ప్రజలకు నగదు బదిలీ చేయకుండా పిసినారిగా మోడీ ప్రభుత్వం వ్యవహరించడం పూర్తిగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప వెలుపలినుండి ఏ వత్తిడీ లేదు. ఆర్థిక మితవాదానికి పూర్తిగా గుడ్డిగా కట్టుబడివుంది గనుకనే ఈ ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ మితవాద వైఖరి ఏ విధంగా దేశాన్ని భ్రష్టు పట్టించిందో మనందరికీ కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది.
ద్రవ్యలోటును అదుపులో ఉంచడానికి ప్రభుత్వ వ్యయాన్ని కొన్ని పరిమితులకు లోబరిచివుంచారు. ద్రవ్యలోటు అదుపులో ఉంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందన్నది దీని వెనుక ఉన్న అవగాహన. ఇలా ప్రభుత్వ వ్యయాన్ని పరిమితం చేసివుంచినప్పటికీ మే 2021లో టోకుధరలు 12.94శాతం, రిటైల్ ధరలు 6.3శాతం పెరిగాయి కదా? ద్రవ్యలోటు శాతం కూడా (జీడీపీలో ద్రవ్యలోటు శాతం) పెరుగుతోంది. ఇంకోపక్క కార్పొరేట్ రంగానికి భారీగా పన్ను రాయితీలిచ్చారు. దానివలన లాక్డౌన్ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఆస్కారం కలుగుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఏప్రిల్ నెలలో 4.3శాతం వృద్ధి రేటు ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి రంగం మే నెల వచ్చేసరికి 3.1శాతానికి పడిపోయింది. ఇది గాక మితవాద విధానాలు అమలు చేస్తే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సంతృప్తి చెందుతుందని, అప్పుడు దేశంలోకి నిధుల ప్రవాహం పెరుగుతుందని, దానివలన రూపాయి మారకపు రేటు బలపడుతుందని చెప్పారు. అయితే, ఈ కాలంలో రూపాయి మారకపు రేటు మరింత తగ్గిపోయింది. అంటే, ఈ మితవాద విధానాల వలన ఎటువంటి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం చెప్పిందో, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తున్నాయి.
టాటా సంస్థలలో అధికారిగా ఉన్న టి వి నరేంద్రన్ ప్రస్తుతం సీఐఐకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సీఐఐ తరఫున ఆయన రూ.3 లక్షలకోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. అందులో నగదుబదిలీ కూడా ఒక అంశం. కాబట్టి నగదు బదిలీ అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు, ప్రతిపక్షపార్టీలు, పౌర సంఘాలు మాత్రమే గాక పెట్టుబడిదారులు కూడా సమర్థిస్తున్న ప్రతిపాదన అని స్పష్టం అయింది. వీరంతా ఒకే విధమైన ప్రతిపాదనలు చేశారని కాదు. కాని వీరంతా ఒక విషయాన్ని మాత్రం గుర్తిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్న వాస్తవ సమస్య ప్రజల చేతుల్లో కొనుగోలుశక్తి లేకపోవడమే అని వారంతా అంగీకరిస్తున్నారు, ఒక్క మోడీ ప్రభుత్వం తప్ప. ప్రభుత్వ ఆర్థిక వేత్తలు కూడా మోడీ మాదిరిగానే నగదు బదిలీ వలన ప్రజలు చేసే వ్యయం గాని వారి వినిమయం కాని పెరగదని అర్థంలేని వాదన చేస్తున్నారు!
కోటక్ మహింద్రా బ్యాంక్ యజమాని ఉదరు కోటక్ ద్రవ్యలోటు పెంచాలని గట్టిగా చెప్పడమే గాక, అందుకోసం అదనంగా కరెన్సీని కూడా ముద్రించాలని సూచిస్తున్నారు. ఇటువంటి ప్రతిపాదనలు మితవాద ఆర్థికవేత్తలకు ఏమాత్రమూ మింగుడుపడవు. ఉదరు కోటక్ తీసుకున్న వైఖరికి, ప్రభుత్వం తీసుకున్న వైఖరికి ఎంత తేడా ఉందో సుప్రీం కోర్టు ముందు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ వెల్లడి చేస్తోంది. కోవిడ్-19 కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి తమవద్ద సొమ్ములు లేవని ప్రభుత్వం ఆ అఫిడవిట్లో పేర్కొంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కలనే ప్రమాణంగా లీసుకుంటే కోవిడ్ మరణాలు దేశంలో 4లక్షలకు మించవు. ఒక్కొక్క మరణానికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలంటే రూ.16,000 కోట్లు అవుతుంది. ఒక అనవసరమైన, విధ్వంసకారిగా మారిన సెంట్రల్ విస్తా వంటి డాబుసరి ప్రాజెక్టు కోసం ఖర్చు చేయడానికి రు. 20,000 కోట్లు ఈ ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాని ప్రజలకు పరిహారం చెల్లించడానికి మాత్రం ఉండవా? ఈ ప్రభుత్వ నైతిక ప్రాధాన్యతలేవిధంగా ఉన్నాయో ఈ వైనం వెల్లడి చేస్తోంది. అంతకన్నా ఇప్పుడు మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం స్వయానా ఒక బ్యాంకర్ అయిన ఉదరు కోటక్ అదనంగా నోట్లు ముద్రించడం ప్రస్తుత పరిస్థితుల్లో తప్పులేదంటున్నాడు కాని ప్రభుత్వం మాత్రం ప్రజలకు పరిహారం చెల్లించడానికి తన దగ్గర డబ్బు లేదంటోంది.
ఈ పెట్టుబడిదారులకు ఉన్నట్టుండి పేదలమీద ప్రేమ గాని పుట్టుకొచ్చిందా? అటువంటిదేమీ లేదు. కాని వాళ్ళు వాస్తవ పరిస్థితిని గుర్తించారు. ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజలకు నగదు అదనంగా చేరాలని గుర్తించారు. మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల దారిద్య్రం ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రజల కొనుగోలుశక్తి పెంచడం గాక దానిని తగ్గించడం ద్వారా చేయదలుచుకుంది. ఆ వాదన ఈ విధంగా సాగుతుంది: ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ప్రభుత్వ వ్యయం పెంచనవసరం లేదు. ఒకవేళ పెంచినా, దానిని మౌలిక వసతుల కల్పన కోసం ప్రధానంగా వెచ్చించాలి. ద్రవ్యలోటు పెరగకుండా అదుపు చేయాలి. పెట్టుబడిదారులపై పన్నులు వేసే సమస్యే లేదు. నిజానికి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి. ప్రభుత్వ వ్యయంలో పెరగుదలకు అవసరమైన ధనాన్ని కార్మికులనుండే, పరోక్ష పన్నులు పెంచడం ద్వారా రాబట్టాలి. ఇదీ మితవాద ఆర్థిక విధానం చెప్పేది.
ఈ వాదనలో మౌలికంగానే తప్పు ఉంది. ప్రభుత్వ వ్యయం పెంచడానికి కార్మికులపై అదనంగా పన్నులు వేస్తే, ఆ కార్మికులు చేసే వ్యయం తగ్గిపోతుంది. ప్రభుత్వ వ్యయం పెరిగినందువలన పెరిగే డిమాండ్ కన్నా, కార్మికుల వ్యయం తగ్గినందువలన తగ్గిపోయే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఆర్ధిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉండదు. అంతే కాదు, కార్మికులపై పరోక్ష పన్నులు పెంచినందువలన ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగినందువలన ప్రభుత్వ వ్యయం కూడా పెంచాల్సివుంటుంది. దానికి కావలసిన అదనపు వనరులు ఎక్కడినుంచి వస్తాయి? అప్పుడు పరోక్ష పన్నులను మరింత పెంచాల్సి ఉంటుంది. అది మరింతగా ధరలు పెరగడానికి దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మాట అటుంచి ద్రవ్యోల్బణం పెరగడానికి ఈ ఆర్థిక మితవాదం తోడ్పడుతుంది.
ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఇదే. పరోక్ష పన్నుల పెంపు ఫలితంగానే పెట్రో ధరలు పెరిగాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోలు రూ.100 మార్కు దాటేసింది. ఇది ధరల పెరుగుదలకు దారి తీసి, ఎక్కువగా పేదలను దెబ్బ తీసింది. ఇదే పద్ధతిలో ప్రభుత్వం ధరలను పెంచు కుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ ఏమాత్రమూ పుంజుకోదు.
ఇందుకు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిద్దాం. పేదలకు ప్రభుత్వం రూ.100 నగదును బదిలీ చేసిందనుకుందాం. ఆ మొత్తాన్ని పేదలు పూర్తిగా ఖర్చు చేస్తారు. వారికి సరుకులను అమ్మిన పెట్టుబడిదారుల వద్దకు ఆ సొమ్ము చేరుతుంది. ఆ సొమ్మును తిరిగి సరుకులు ఉత్పత్తి చేయడానికి పెట్టుబడిదారులు ఖర్చు చేస్తారు. (అందులోనుంచి వారి స్వంతానికి ఏమీ ఖర్చు చేయరు అని అనుకుందాం) అప్పుడు దేశంలో మొత్తం డిమాండ్ రూ.200 పెరుగుతుంది. (కార్మికులు చేసిన ఖర్చు రూ.100 ప్లస్ పెట్టుబడిదారులు చేసే ఖర్చు 100) డిమాండ్ పెరిగినందున ధరలు పెరుగుతాయి అని అనుకోలేం. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో అమ్ముడుపోకుండా సరుకుల నిల్వలు ఉన్నాయి. అందుచేత అదనంగా డిమాండ్ పెరిగినా, ధరలు స్థిరంగానే ఉంటాయి. మొత్తంగా డిమాండ్ రూ.200 పెరిగింది కాబట్టి అమ్మకాలు కూడా రూ.200 పెరుగుతాయి. ఇందులో పెట్టుబడిదారు లకు లాభం సగం అని అనుకుంటే వారివద్దకు అదనంగా రూ.100 చేరుతుంది. ఇలా అదనంగా చేరిన లాభాన్ని మొత్తం పన్ను క్రింద వారివద్దనుండి వసూలు చేయాలి.
అప్పుడు (1) ద్రవ్యలోటులో పెరగుదల ఏమీ ఉండదు. (2) పెట్టుబడిదారుల ఆస్తులలో అదనంగా పెరుగుదల ఏమీ ఉండదు (వారివద్దకు చేరిన అదనపు లాభాన్ని పన్ను రుపంలో వసూలు చేస్తాం కాబట్టి) అందువలన సంపద అసమానతలు పెగడం అనేది ఉండదు. (3) కార్మికుల జీవితాలలో నగదు బదిలీ వలన మెరుగుదల వస్తుంది. పైగా ఉత్పత్తి పెరిగినందువలన అదనపు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. (4) దీనివలన ఎటువంటి ధరల పెరుగుదలా ఉండదు.
ఈ ప్రత్యామ్నాయ విధానం మితవాద ఆర్థిక విధానానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. మితవాద ఆర్థిక విధానం కార్మికుల జీవితాలను మరింత దిగజారుస్తుంది. పైగా ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి ఏమాత్రమూ తోడ్పడదు. దానికి ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారులపై అదనంగా పన్ను విధించి ఆ అదనపు సొమ్మును కార్మికులకు నగదుగా బదిలీ చేసే విధానం వలన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది, పైగా ఎటువంటి ద్రవ్యోల్బణమూ ఉండదు. పెట్టుబడిదారులకు అదనంగా చేకూరే లాభాన్ని మాత్రమే పన్ను రూపంలో తీసుకుంటాం గనుక వారి పరిస్థితి ఇంతకు ముందు ఏ విధంగా ఉండేదో, ఇప్పుడూ అదే విధంగా కొనసాగుతుంది.
మోడీ విధానాలు ఎంత అర్థరహితంగా ఉన్నాయో ఆఖరుకు ఆ పెట్టుబడిదారులకు కూడా అర్థం అవుతోంది కాని ఈ మోడీ ప్రభుత్వానికి మాత్రం అర్థం కావడంలేదు !
- స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్పట్నాయక్