Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకార్మిక వ్యవస్థపై కరోనా పిడుగు పడింది. అసలే పాలకుల విధానాలు బాల కార్మిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని మనకు తెలుసు. ఇప్పుడు ఈ కరోనా దెబ్బ గోరుచుట్టుపై రోకటిపోటులా పరిణమించింది.
కరోనా కాలంలో ఆర్థిక అంతరాలు తీవ్రంగా పెరుగుతున్నాయని సర్వేలు చెపుతున్నాయి. సంపన్నుల ఆస్తులు మరింతగా పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. ఫలితంగా కోట్లాది మంది ప్రజలు పేదరికంలోకి వేగంగా జారిపోతున్నారు. మన కండ్లముందే చాలా మంది ఉపాధిలేక పస్తులతో ఆకలి చావులకు గాని, అప్పులతో ఆత్మహత్యలకు గాని పాల్పడటం గమనిస్తున్నాం. ఇదో దుర్భర దశ.
పాలకులు తమ చర్యలతో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. బతుకుపట్ల భరోసా ఇవ్వాలి. కానీ ప్రధాని మోడీ పదే పదే చెప్పే ఆత్మనిర్భర్ వంటి మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయని అనుభవం చెపుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా పదహారు కోట్ల మంది బాల కార్మికులున్నారు. మనదేశంలో కోటిమందికి పైగా ఉన్నారు. ఐదేండ్ల నుంచి 14ఏండ్లలోపు పనిలో ఉండేవారిని బాలకార్మికులు అంటారు. అసలు బడిబయట ఉండి చదువుకోనివారందరూ బాల కార్మికులేనని యునిసెఫ్ వంటి సంస్థలు మొత్తుకుంటాయి. ఈ లెక్కన చూస్తే ఈ కరోనా కాలంలో బాల కార్మికుల సంఖ్య ఎంతగా పెరుగుతున్నదో లెక్కకు అందడం లేదు.
వ్యవసాయం, చేతివృత్తులు, నిర్మాణ రంగం, ఇటుక బట్టీలు వంటి సాధారణ పనులే కాకుండా, గనులు, క్వారీలు, నాపరాళ్ళు, పత్తివిత్తన క్షేత్రాలు, గాజు, రసాయనాలు, ప్రేలుడు పదార్థాల వంటి ప్రమాదభరిత రంగాల్లో సైతం ప్రాణాలు ఫణంగా పెట్టి బాలలు పనిచేస్తున్నారు. అంతే కాకుండా గంజాయి, నల్లమందు, సారా బట్టీలు, అక్రమ రవాణా (లైంగిక వ్యాపారం) వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కూడా బాలల్ని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. బాలల పట్ల కనీస జాలి, దయ కనికరం లేని దుర్మార్గులే ఇలాంటి ఘాతుక పనులకు ఒడిగడతారు.
మనదేశంలో 37శాతం మంది ప్రజానీకం వలసజీవులే. బతుకు తెరువుకోసమే వారు వలసబాట పడతారు. వారిలో అత్యధికులు పేదలని వేరుగా చెప్పక్కర్లేదు. కరోనా కారణంగా వీరి ఉపాధి నేడు కనుమరుగైపోయింది. కొందరు విధిలేక సొంత ఊర్లకు చేరుకున్నారు. వీరితో పాటు వీరి పిల్లలు... అటు ఉపాధి పోవడం, ఇటు తిరుగు వలస పట్టడం ఏదైతేనేమి బాలలు మాత్రం బడికి దూరమయ్యారు. తాత్కాలికంగా బడులు మూసినా, చాలా మంది బాలలకు బడులు శాశ్వతంగా దూరమయ్యే దుస్థితి ఏర్పడింది.
కరోనా వలన దేశ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు శీఘ్రగతిన పతనం కావడంతో అంతిమంగా ఆ భారం అంతే వేగంగా బాలలపై పడుతున్నది. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ కొమ్ముకాసే ఆర్థిక వేత్తలు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు గతంలో రూపొందించిన చట్టాల పట్టును సడలించాలని, ఆ నిషేధాలను ఎత్తివేయాలని, లేకుంటే ముందుకు పోలేమని వితండ వాదనలు చేస్తున్నారు. అంటే వీరి దృష్టిలో బాలల శ్రమతో ప్రపంచం బతకాలన్నమాట. బాలల హక్కుల్ని గప్చిప్గా తుంగలో తొక్కేయాలని కోరుకుంటున్నారు. ఇంతకన్నా అమానుషం ఏం ఉంటుంది?
అసలు ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా పేదరికం పెరుగుతున్న కొద్దీ ఆ దేశంలో బాలకార్మికులు పెరుగుతారు. మార్క్సిస్టు ఆర్థికవేత్తలే కాదు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కంకణం కట్టుకున్న నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి వంటి వారు కూడా చెపుతున్న వాస్తవం ఇది. అంతెందుకు ఇంత కరోనా కష్టకాలంలో కూడా అంబానీ, అదానీల ఆస్తులు ఎన్నోరెట్లు పెరిగాయి తప్ప తరగలేదు. అయినా పిల్లలను బాల కార్మికులుగా మార్చేందుకు తప్పుడు సిద్ధాంతాలతో ప్రజల్ని ప్రభావితం చేయాలని ఈ ఆర్థిక వేత్తలు తాపత్రయపడుతున్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఈ కరోనా కష్టకాలంలోనే ఆదరాబాదరగా నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) తీసుకొచ్చిన విషయం విదితమే. మొత్తం భారతదేశ విద్యావ్యవస్థను కాషాయికరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ (మూడు సీలు) దిశగా మార్చేందుకు దీనిని తీసుకువచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. అందరి కంటే ముందుగా ఈ విద్యావిధానాన్ని ఈ ఏడాది నుంచే అమలు పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమయింది. అంగన్వాడీలు రద్దయి ప్రాథమిక విద్యాబోధనతో కలుస్తాయి.
కరోనా కాలంలో అంగన్వాడీ పిల్లలు పౌష్టికాహారానికి, బడిపిల్లలు మధ్యాహ్నభోజనానికి దూరమయ్యారు. ఆ కాస్త సదుపాయాలు ఇకముందుంటాయా? అనేది పెద్ద ప్రశ్నార్థకం. పైగా ప్రాథమిక బడుల దూరభారం పెరిగి డ్రాప్అవుట్స్ (మధ్యలో బడిమానేయడం) పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషించడమే అవుతుంది.
ఇలా ప్రతి రాష్ట్రంలో వేలాది అంగన్వాడీలు మూతబడితే పాఠశాల విద్యకు బాలల్ని సన్నద్దం చేసే ప్రక్రియకు అంతరం ఏర్పడదా..? అందుకే అప్రమత్తంగా లేకపోతే ఒక తరం తరం బాలలు విద్యకు దూరంగా కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుందని విశ్లేషకులు వాపోతున్నారు.
2025నాటికి బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలన్నది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. 2021 సంవత్సరాన్ని బాల కార్మిక నిర్మూలనా సంవత్సరంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇంత ఘోరం జరగడం మహావిషాదం. బాల్యం అంటే విరబూసే మానవ వనరుల భావి సంపద. బాల్యంపై ధ్వంస రచనకు పూనుకుంటే మన కాళ్ళు మనం నరుక్కోవడం కాక మరేమిటి? అందుకే పుడమిని, పర్యావరణాన్ని కాపాడు కోవడంతో సమాంతరంగా బాల్యాన్ని కాపాడుకోవాలనే నూతన ప్రజా ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి.
- కె. శాంతారావు
సెల్:9959745723