Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ ముగుస్తున్న దశలోనే మూడవ వేవ్ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ వేరియంట్ వల్లే మనదేశంలో మూడవ వేవ్ రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది ఎంత మేరకు మనకి నష్టం కల్గిస్తుందనే విషయంపై పాధమిక అంచనాలు మాత్రమే ఉన్నాయి. కరోనా వైరస్ వరకు ఎన్ని అలలు వచ్చినా అవి పిల్లలపై తక్కువ ప్రభావాన్నే చూపిస్తాయని పలు సంస్థలు చెబుతున్నాయి.
వైరస్ గురించి అతిగా భయపడటం లేదా నిర్లక్ష్యంగా ఉండటం రెండూ ప్రమాదకరమే. అతి భయం వల్ల మనలో సహజ వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. నిర్లక్ష్యం వల్ల కరోనా మనపై త్వరగా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. కోవిడ్ నిబంధనలు పాటిస్తే ఏ వేరియంట్ వచ్చినా అదుపులోనే ఉంటుందని ఎయిమ్స్ తెలియజేస్తున్నది. కరోనా నియంత్రణకి మనకి మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్న కరోనా నిబంధనలు మరికొంతకాలం పాటించాలి. రెండవది వ్యాక్సినేషన్ కాగా, మూడవది మన సహజ వ్యాధి నిరోధక శక్తిని కాపాడుకోవడం. వ్యాధి నిరోధక శక్తి వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో పెరగదు. మనకి సీజనల్ వ్యాధులున్నట్లే, సీజనల్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. భౌగోళిక పరిస్థితిని బట్టి ఆయా ప్రాంతాల్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు పండుతాయి. వివిధ సీజన్ల బట్టి ఆయా రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. మద్యం ధూమపానానికి దూరంగా ఉండాలి. ఒకప్పుడు ఏదైనా అంటువ్యాధి వస్తే 30 నుంచి 35శాతం మంది ప్రజలు మరణించేవారు. ఇప్పుడు కరోనాతో మరణించే వారి సంఖ్య 2శాతంలోపే ఉంది. ఎవరి ప్రాణం అయినా ఒకటే. ఈ భూమిపై ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు మూడవ వేవ్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ వేవ్ కనుక వస్తే నియంత్రణ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. గత ఏడాది మార్చిలో నెల్లూరులో ఒక కేసు రాగానే చాలా భయపడ్డాం. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు కూడా సక్రమంగా జరిగే పరిస్థితి అప్పుడు లేదు. అప్పుడు వైద్యులు పీపీ ఈ కిట్లు వేసుకొని మాత్రమే వైద్యం చేయగలిగారు. ఇప్పుడు కొన్ని సాధారణ జాగ్రత్తలు మాత్రమే తీసుకొని వారు వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు అంత్యక్రియలు కూడా చాలావరకు సక్రమంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మన చుట్టుప్రక్కల కరోనా కేసులున్నా, మనం ధైర్యంగానే ఉంటున్నాము. ఇది ఒక సానుకూల పరిణామం. అమెరికాకి చెందిన ఫ్రెడ్ ఆడ్లర్ అంచనా ప్రకారం కరోనా కొంతకాలం తర్వాత సాధారణ జలుబుగా మారుతుందని తెలియజేశారు. అందుకు ఆయన రష్యిన్ ఫ్లూని ఉదహరించారు. ఈవ్యాధి 1970వ దశకంలో వ్యాపించి కొంత కాలం తర్వాత బలహీన పడింది. కరోనా విషయంలో కూడా ఇదే జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయం పై మనకి మరింత స్పష్టత రావాలంటే మరికొంత సమయం పడుతుంది. కరోనా నియంత్రణకి ప్రభుత్వాలు మరికొన్ని చర్యలు చేపట్టాలి. మరో నాలుగు నుంచి ఆరు నెలల పాటు పెద్ద పెద్ద సభలపై నిషేధం విధించాలి. వచ్చేదంతా పండుగల సీజన్ కాబట్టి ప్రజలు భావోద్వేగాలకి అతీతంగా వివిధ వేడుకల్ని నిర్మలంగా జరుపుకోవాలి. ప్రభుత్వ చర్యలతో పాటు, పౌర సమాజం కృషి చేస్తే ఈ మహమ్మారిని త్వరగానే నియంత్రణ చేయవచ్చు.
- ఎం. రాం ప్రదీప్
సెల్: 9492712836