Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించిన ప్రముఖులలో కొరటాల సత్యనారాయణ ఒకరు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం అమృతలూరు మండలంలో ఉన్న ప్యాపర్రు గ్రామంలో ఒక ధనిక రైతు కుటుంబంలో 1923 సెప్టెంబరు 24న జన్మించారు. ఎనభై మూడు సంవత్సరాల వయస్సులో 2006 జూలై ఒకటిన కాన్సర్‌తో మరణించారు. పదిహేను సంవత్సరాలు గడచిపోయాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా కమ్యూనిస్టు ఉద్యమంలో వ్యక్తులుగా అనేక మంది ఎవరి ప్రత్యేకతలను వారు కలిగి ఉన్నారు. వారిలో కొరటాలది ఒక ప్రత్యేక స్థానం.
ఏ ఉద్యమం, పార్టీ అయినా సిద్దాంతాలు ఒకటే కావచ్చు గానీ, నాయకులు, కార్యకర్తల వ్యక్తిత్వాలు ప్రత్యేకంగా ఉంటాయి. పార్టీలో అత్యున్నత విభాగమైన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేస్తూ కూడా యువకులను ఏరా బాబూ అంటూ పలకరించుతూ, తోటి వయస్కుల మాదిరి భుజాలపై చేతులు వేసి కాఫీకో, టీకో వెళ్లిన నేత కొరటాల ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఇది ఒకటి అంటే అందరూ అలాగే ప్రవర్తించమని కాదు. కార్యకర్తల కుటుంబాల మంచి చెడ్డలను తెలుసుకోవటం, అవసరాలను గుర్తించటం వంటి విషయాల్లో శ్రద్ద కూడా ముఖ్యమైన లక్షణమే. కార్యకర్తలతో నేతల దగ్గరితనం అభిప్రాయాలు స్వేచ్చగా వెల్లడించటాన్ని ప్రోత్సహిస్తుంది. కమ్యూనిస్టు పార్టీల్లో హౌదాలు బాధ్యతలు తప్ప దర్పాన్ని ప్రదర్శించుకొనేందుకు కాదు అనడానికి కొరటాల నిలువెత్తు ప్రతీక.
కొరటాలకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కలు ఉన్నారు. అన్నయ్య, ఒక బావ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా ఉన్నారు. వారి ప్రభావం కొరటాల మీద ఉంది. అమృతలూరు మండలం తురిమెళ్ల గ్రామ హైస్కూల్లో చదువు తున్న సమయంలో (1938-39) పరీక్షల్లో తప్పిన వారిని తిరిగి అదే తరగతిలో ఉంచే విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉద్యమం జరిగింది. దానికి స్కూల్లో నాయకత్వం వహించిన వారిలో కొరటాల ఒకరు. ప్రధానోపాధ్యాయుడు మొండి పట్టుదల వీడకపోవటంతో పదకొండు రోజులు సమ్మె జరిగింది. ఏం చేయాలనే సలహా తీసుకొనేందుకు అప్పటికే గుంటూరులో కమ్యూనిస్టుగా, రాష్ట్ర విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్న మాకినేని బసవపున్నయ్యను కలిశారు. ఆయన జోక్యంతో ప్రధానోపాధ్యాయుడు దిగి రావటంతో సమ్మె ముగిసింది. అది కొరటాల జీవితాన్ని మలుపు తిప్పింది. జీవితాంతం కమ్యూనిస్టుగా, కష్టజీవుల పక్షపాతిగా పని చేయటానికి పునాదులు పడ్డాయి.
తమ పరిసరాలలో జరుగుతున్నదేమిటో తెలుసుకొని స్పందించినపుడే కార్యకర్తలు ఉద్యమాలను నిర్మించగలరు. అలాంటి లక్షణం కొరటాలలో ఉంది గనుకనే రైతు కుటుంబంలో పుట్టినా రేపల్లె పరిసర ప్రాంతాలలో గణనీయంగా ఉన్న చేనేత కార్మికుల జీవితాలను ఎంతో నిశితంగా పరిశీలించారు. అది ఎంతగా ఉందంటే చేనేత కార్మికులు చివరకు ఆయనను తమ సామాజికతరగతికి చెందిన వ్యక్తిగా పరిగణించారంటే అతిశయోక్తి కాదు. రేపల్లె, బాపట్ల, చీరాల ప్రాంతంలో కాంగ్రెస్‌లో నాడు చేనేత సహకార సంఘాల రాష్ట్రనేతగా ఉన్న ప్రముఖుడి కంటే ఎక్కువగా, దగ్గరగా సామాన్య చేనేత కార్మికులకు చేరువగా కొరటాల స్పందించటమే దీనికి కారణం.
కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రనేతలుగా ఉన్న వారు ప్రజా ఉద్యమాల నుంచే వస్తారు తప్ప ఇతర పాలక పార్టీల మాదిరి పై నుంచి రుద్దటం ఉండదు. గుంటూరు జిల్లాలో నక్సలైట్ విచ్ఛిన్నం నాటికి రేపల్లె ప్రాంత నేతగా ఉన్న కొరటాల తరువాత సిపిఎంను పునర్నిర్మాణం గావించేందుకు జిల్లా కేంద్రంలో బాధ్యతలు తీసుకున్నారు. తరువాత రాష్ట్రనేతగా ఎదిగారు. ప్రజా సమస్యలపట్ల ఆయనకున్న ఆసక్తి, అన్నింటికీ మించి ఆధ్యయనం నేటి తరం కార్యకర్తలు అలవరుచుకోవాల్సి ఉంది. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, చేనేత కార్మిక సంఘాలలో ప్రత్యక్షంగా పని చేసిన అనుభవం ఆయనను అసలైన ప్రజా నాయకునిగా తీర్చిదిద్దింది. యువజన, విద్యార్ధి, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, ఇతర అనేక ప్రజా సంఘాలకు మార్గదర్శిగా కొనసాగిన నేత అతడు.
కొరటాల గారి మరొక ప్రత్యేకత ఏమంటే వివిధ తరాల వారధి అని చెప్పవచ్చు. తనకు ముందు తరం అగ్రనేతలతో, తన సమకాలికులు, తరువాత తరాల వారితో కలసిపోయారు. ఉద్యమం వెనుక పట్టు పట్టిన తరువాత వచ్చే సమస్యలు వ్యక్తిగతం లేదా పార్టీ పరంగా కావచ్చు. తనకంటే పెద్ద వారిని-యువతరాన్ని సమన్వయం చేయాల్సిన దశలో కొరటాల రాష్ట్రకమిటీలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రలో, గుంటూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ ఉచ్ఛస్ధాయిని చూశారు. పూలమ్మిన చోటనే కట్టెలమ్మినట్లుగా విచ్ఛిన్నాన్నీ గమనించారు. తొలి సాధారణ ఎన్నికల్లో 1952లో తెనాలి లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ దిగ్గజంగానూ, తరువాత కేంద్ర మంత్రిగానూ పని చేసిన కొత్త రఘురామయ్య మీద కేవలం పదకొండు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత రఘురామయ్య తన స్దానాన్ని గుంటూరుకు మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. కొరటాల రెండు సార్లు రేపల్లె నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
రాష్ట్రంలో పత్తి రైతుల ఆత్మహత్యల వార్తలు రావటాన్ని చూసి వెంటనే స్పందించి ప్రకాశం జిల్లాలో పర్యటన జరిపి ఆ సమస్య తీవ్రతను వెలుగులోకి తెచ్చింది కొరటాలే అంటే అతిశయోక్తి కాదు. మహబూబ్ నగర్ జిల్లాలో గంజి కేంద్రాల ఏర్పాటు, కులవివక్ష వ్యతిరేక సంఘం ఏర్పాటులోనూ చొరవ ఆయనదే. రేపల్లె డివిజన్ నేతగా ఉన్న కొరటాల 1967లో పార్టీ రాష్ట్రకమిటీకి ఎన్నికయ్యారు.1978లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, తరువాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. కమ్యూనిస్టు నేతలు అనేక మంది సహజ జర్నలిస్టులుగా మారిపోయారు. పత్రికల్లో ప్రజాసమస్యల మీద రాయాల్సిన అవసరం వారిని అలా తయారు చేసింది. అదే క్రమంలో రైతు, వ్యవసాయ, చేనేత రంగ సమస్యలు అనేక వ్యాసాలను కొరటాల చేత రాయించాయి. పార్టీ నిర్వహించే పత్రికా నిర్వహణ పట్ల శ్రద్ద, దాన్ని జనంలోకి తీసుకుపోవాలన్న తపన నిరంతరం ఉండేది, అదే ఆయన్ను ప్రజాశక్తి సాహితీ సంస్ద చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించేట్టు చేసింది. నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజా గొంతుకగా కొనసాగుతున్న ప్రజాశక్తి, నవతెలంగాణ పత్రికలకు అవసరమైన పునాదులు వేయడంలో ఆయన పాత్ర చిరస్మరణీయం.
పార్టీ, ప్రజా ఉద్యమాలు వెనుక పట్టు పట్టినపుడు, సైద్దాంతికంగా ఇతరంగా ఎదురు దెబ్బలు తగిలినపుడు కార్యకర్తలు నిబ్బరం కోల్పోకుండా ఎలా ఉండాలో కొరటాల జీవితం నుంచి నేర్చుకోవచ్చు. అదే విధంగా ఆయన రెండు సార్లు ఎంఎల్ఏగా పని చేసిన తరువాత, రాష్ట్ర నేతగా ఎదిగిన తరువాత కూడా బస్సులు, రైళ్లలో ప్రయాణించటానికే మొగ్గు చూపేవారు. ఆయనను దగ్గరగా గమనించిన వారికి అర్దమయ్యేదేమంటే వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరు ఏ అభిప్రాయం చెప్పినా వినటమనే వినమ్ర లక్షణం ఆయన సొంతం. నేను నాయకుడిని, అనేక ఉద్యమాలను చూశాను నాకే చెబుతావా అనే లక్షణం లేదు. అదే ఆయన్ను కార్యకర్తలకు దగ్గర చేసింది. గుంటూరు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక వచ్చినపుడు సీపీఐ(ఎం) వైపు ఎక్కువ మంది మొగ్గారు. తరువాత సీపీఐ(ఎం) నుంచి జిల్లా నాయకత్వం మొత్తం నక్సలైట్లుగా మారిపోయారు. జిల్లాలో అక్కడ డక్కడ మిగిలి ఉన్న కార్యకర్తలను సమీకరించి తిరిగి సీపీఐ(ఎం)ను పునర్ నిర్మించటంలో కొరటాల కృషి ఎంతో ఉంది. ఇప్పుడు ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు కొరటాల వంటి వారి పని విధానం, ప్రవర్తనను మార్గదర్శకంగా తీసుకొని పని చేయటమే ఆయనకు అర్పించే ఘన నివాళి.
- సత్య