Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిచ్చెన తంతెల కుల పునాదుల బలం పెరుగుతున్న పాలనలో కుల క్రూరత్వం కోరలు చాపుతోంది. కింది కులాల బలం పెరగకుండా అణగదొక్కుతోంది. బలిసినోళ్లు ఏంజేసినా మాఫీ అవుతోంది. అది గునపమై గుచ్చుతోంది. ఏ బక్కోనికి చిన్న తప్పు చేసినా చట్టాన్ని ధిక్కరిస్తూ కోర్టులను కాదని శిక్షలు అమలు చేస్తున్నారు. శరీరాలను ఛిద్రం చేస్తూ ప్రాణాలను హరిస్తున్నారు. ఖమ్మంజిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడేనికి చెందిన దళితురాలు అంబడిపూడి మరియమ్మ పోలీసు కస్టడీలో ఇలాగే చనిపోయింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో లబ్ది పొందేందుకు బయటికి వచ్చి ప్రజలను ఆకర్షించుకునే పని మొదలు పెట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఇది కొంత కోపాన్ని తెప్పించింది. ఓట్ల దారిలో అసంతృప్తి ముండ్లేరుతున్న సమయంలోనే పోలీసులు ఇలా చేయడంతో, దానిని దళిత వర్గాలు మరిచిపోయేలా వారికి? పదిలక్షల రూపాయల' పథకాన్ని ప్రకటించారు. మరియమ్మ మరణ వివాదం ముదిరి అసంతృప్తికి దారి తీస్తుందేమోనని భయపడి దానికి ముగింపు పలికే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జరిగిన ఇలాంటి సందర్భాలకు భిన్నంగా మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించారు. కుమారుడికి ఇల్లు, ఉద్యోగం, రూ.15లక్షలు, కూతుళ్లు ఇద్దరికీ చెరో రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో తెలంగాణలో జరిగిన దళితుల హత్య, లాకప్‌డెత్‌లకు భిన్నంగా ఈ కేసులో కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డీజీపీని కూడా ఆదేశించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక దగ్గర్లో ఉండడం వల్లే సీఎం ఇలా నష్టపరిహారం ప్రకటించారు. పైసల ఆశ చూపుతూ, పోలీసు బలగాలతో బెదిరిస్తూ ప్రశ్నించే తత్వాన్నీ, చైతన్యాన్నీ చంపడంలో కేసీఆర్ బాగా ఆరితేరారు. ఇది తెలంగాణలో ఒకప్పుడు? ''జాలీం కౌన్ రే.. ఉస్క జులూం క్యారే'' అని జనం పాడుతూ పోరాడిన ఘట్టాన్ని మళ్లీ తెచ్చేలా ఉంది. కేసీఆర్ పాలనపై దళిత వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరియమ్మ ఘటనతో మరింత రగులుతున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఎవరైనా మరణిస్తే, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరపాలి. కానీ ఈ కేసులో అలా చేయలేదు. ఆర్డీఓతో నివేదిక రాయించారు. మరియమ్మను అరెస్టు చేసినప్పుడు మహిళా పోలీసులు లేరు. అర్థరాత్రి ఇంటి దగ్గర కొట్టి అరెస్ట్ చేశారనీ, ప్రయివేటు వాహనంలో సివిల్ డ్రెస్‌లో వచ్చి అరెస్ట్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులను చావబాదిన పోలీసులపై, ఆదిలాబాద్ జిల్లాలో టేకు లక్ష్మి హంతకులపై చర్యలు లేనట్టే మరియమ్మ కేసునూ తప్పుదోవ పట్టిస్తారు. అధికారంలో ఉన్న దొరలను కాపాడుతున్నందున ఏంజేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు దళితులు ఆ జులుంను మరిచిపోయి హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఓటు వేయాలని ప్రత్యేక పథకాల ఎరను వేస్తున్నారు.
-మేకల ఎల్లయ్య
సెల్ : 9912178129