Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంప్రదాయవాదులైన కొందరు, భండార్కర్, దత్ లాంటి చరిత్రకారుల్ని పరిగణనలోకి తీసుకోక పోవచ్చు. రామ్మోహన్రారు, వివేకానంద, గాంధీలను అసలు చరిత్రకారులే కాదనవచ్చు. సరే, ఏది ఏమైనా డి.డి. కోశాంబిని కాదనలేరు కదా? ఆయన భారతదేశ చరిత్రకు మార్క్సిస్టు దృక్కోణాన్ని జోడించాడు. ప్రతి విషయాన్నీ వైజ్ఞానిక దృష్టి కోణంలోంచి విశ్లేషించాడు. ఆయన చిత్తశుద్ధిని, విషయ పరిజ్ఞానాన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. అభిరుచి, ఉత్సుకత ఉన్నవారు ఆయన రాసిన an introduction to the study of indian history చదవండి. పురాణాలేవో, చరిత్ర ఏదో స్పష్టంగా తెలుసుకో గలుగుతారు. పురాణాలు కల్పిత గాథలు. చరిత్ర గతంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారం. పురాణాలకూ, చరిత్రకూ తేడా తెలుసుకోకుండా రామాయణ, మహాభారతాల్లో జరిగిన యుద్ధాలకు తేదీలు నిర్ణయిస్తుంటారు. అదెంతటి పిచ్చిపనో వారు గ్రహించుకోరు. ''మనకు ఉన్న చారిత్రక ఆధారాల ప్రకారం - రామాయణ, మహాభారత కావ్యాలలో జరిగిన యుద్ధాలు ఎప్పుడు ఎక్కడ జరిగాయో తెలుసుకోవడం అసంభవం'' అని అన్నారు డి.డి. కోశాంబి. ''కురుక్షేత్ర యుద్ధం ఒక కల్పిత ఘటన - అంతకు మించి ఏమీ కాదు'' అని కూడా తేల్చి చెప్పారు. హెచ్.డి. సంకాలియా (ఆర్కియాలజిస్ట్), దినేష్చంద్ర సర్కార్ (చరిత్రకారుడు)లు కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగింది కాదని... కోశాంబి అభిప్రాయాన్ని బలపరిచారు. రెండు తెగల మధ్య జరిగిన కలహాలను సాహిత్యీకరించడం తప్ప మరొకటి కాదన్నారు.
పురావస్తు శాస్త్రం కొన్ని ఆధారాలు బయటపెడుతుంది. ఆయా ఆధారాల మూలంగా చరిత్ర రాయబడుతుంది. అంటే నిజాల్నీ, వాస్తవాల్ని మాత్రమే అవి నమోదు చేస్తాయి. సాహిత్యం అలా కాదు. ఊహలకు, భ్రమలకు అలంకరణలు చేస్తాయి. అందుకే అందులో అలంకరణలు, ఉపమానాలు గజిబిజిగా అల్లుకుపోయి ఉంటాయి. చాలా సందర్భాల్లో పురావస్తు శాస్త్రం ప్రకటించిన వాస్తవాలు సాహిత్య రచనల్లో కనిపించవు. ఈ ప్రమాదాన్ని పసిగట్టి ప్రపంచంలోని కొన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉదాహరణకు సుమేరియా, బాబిలోనియా, గ్రీస్, రోమ్, ప్రష్యా, లిడియా, క్రీట్, ఈజిస్ట్, ఫినీసియా, అస్సీరియా, కార్తేజ్, ఫైరియాకు సంబంధించిన చరిత్రకారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అందుకే పురాణాల్ని చరిత్రగా భ్రమించే అలవాటు ఆ దేశ ప్రజలకు లేదు. భారతదేశపు పరిస్థితి వేరు. ఇక్కడి ప్రజలు వేల సంవత్సరాల నుండి పుక్కిటి పురాణాల మధ్య ఊపిరి పీల్చుకుంటున్నారు. దాని మోతాదు అధికమవడం వల్ల, దేశ జనాభాలోని అత్యధికులు బ్రాంతిలో పడ్డారు. ఆ బ్రాంతిలోంచి బయట పడడం వారికి చేతకావడం లేదు. ప్రస్థుతాన్ని పక్కకునెట్టి - ఆధునిక ఆవిష్కరణల్ని పక్కకు నెట్టి, గతానికి భజన చేస్తున్నారు. చరిత్రను పక్కకు నెట్టి, పురాణ గాథల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. చారిత్రక పురుషుల్ని అశ్రద్ధ చేసి, పురాణ పురుషులే తమకు ఆదర్శమని భావిస్తున్నారు. అందుకే చూడండి.. ఇప్పటికీ అయోధ్య గొప్పతనాన్ని, హస్తినాపురం సొబగుల్ని, మయసభ వెలుగుజిలుగుల్ని ఊహించుకుంటూ తేలిపోతున్నారు. లేకపోతే ఒక కల్పిత పురాణ పాత్ర అయిన ఆంజనేయుడి జన్మస్థలం గురించి పండితులు జుట్లు పట్టుకోవడం ఎందుకూ? వాదోపవాదాలెందుకూ? గౌరవనీయులు, పీఠాధిపతులు, పండితులు, అర్చకులు అని చెప్పబడే వారికే ఇంగిత జ్ఞానం లేకపోవడం ఈ దేశపు ప్రత్యేకతా?
సర్ విలియం జోన్స్ (1746-94) ఇండో - ఆర్యన్, ఇండో - యూరోపియన్ భాషల సారూప్యాన్ని అధ్యయనం చేశాడు. 1784లో ఏసియాటిక్ సొసయిటీ ఆఫ్ బెంగాల్‌ను స్థాపించాడు. జేమ్ ప్రిన్సెప్ (1799-1840) బ్రహీ లిపిని, ఖరోస్తి లిపిని వెలుగులోకి తెచ్చాడు. వాటితో ఎన్నో చారిత్రికాంశాలు వెలుగులోకి వచ్చాయి. దానితో అశోకుడి శాసనాలు పరిశీలించడానికి వీలుయ్యింది. ఇక్కడ మేజర్ జనరల్ సర్ అలెగ్జాండర్ కన్నింగ్ హాంను కూడా గుర్తుచేసుకోవాలి. కన్నింగ్ హాం (1814-93) బ్రిటిషు ఆర్మీ ఇంజనీయర్. బెంగాల్ ఇంజనీర్లతో కలిసి, భారత దేశ పురాతత్వ శాఖవారి తవ్వకాల్లో పాల్గొంటూ, మరోవైపు భారతదేశ చరిత్ర అధ్యయనం చేసినవాడు. ప్రాచీన భారతదేశపు భౌగోళిక, సామాజిక అంశాలను ఏరి, ఒకచోట కూర్చిన బుద్దిశాలి. ఆయన కల్పించుకోకపోతే మనం ఇంకా అనేక విషయాల్ని తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉండేవాళ్ళం. 'దేవానాం ప్రియ' అనేది అశోక చక్రవర్తికి ఉన్న బిరుదు. దాన్ని వక్రీకరించి 'ఉన్మత్తుడు' అనే అర్థాన్ని పురాణేతిహాసాలు దుష్ప్రచారం చేశాయి. అది కాకుండా దేవానాం ప్రియ - అనేది శ్రీలంకలోని ఒక రాజుకు ఉన్న బిరుదు అని కూడా ప్రచారం చేశారు. అలాగే 'ప్రిషాల' అంటే శూద్ర అని, పాప పంకిలుడని నిఘంటువుల్లో రాయించారు. ఇవన్నీ తప్పుడు రాతలని కన్నింగ్ హాం స్పష్టం చేశాడు.
ఇలాంటి తప్పుడు రాతల్లో కురుక్షేత్ర యుద్ధం ఒకటి. ఎందుకంటే పూర్వ తరాల్లోని ప్రసిద్ధ చరిత్రకారులు, ఆర్కియాలజిస్ట్‌లు ఎంతో మంది దాన్ని పుక్కిటి పురాణమని కొట్టేశారు. నిజంగా అది జరిగి ఉంటే దాని ప్రస్తావన వేదాలలో ఎందుకు లేదూ అని ప్రశ్నించారు. విన్సెంట్ ఎ. స్మిత్ - మహాభారత యుద్ధాన్ని చారిత్రికేతర గాథగా పరిగణించాలన్నాడు. చరిత్రలో లేనిదంటే.. జరగలేదనే కదా అర్థం? కల్పించిన కట్టుకథ అనే కదా ఆయన చెప్పింది? 1843-1920 మధ్య కాలంలో జీవించిన విన్సెంట్ స్మిత్ ప్రసిద్ధ చరిత్రకారుడు, ఇండాలజిస్టు. the early history of india - oxford press 1914 గ్రంథంలో క్రీ.పూ. 600 నుండి అలెగ్జాండర్ దండయాత్ర, ఆ తరువాత మహమ్మదీయుల దండయాత్ర మొదలైన అంశాలతో భారతదేశ చరిత్రను విపులంగా రాశాడు. అలాగే జర్మన్ చరిత్రకారుడు, ఇండాలజిస్ట్ ఆల్బ్రెక్ట్ వెబర్ (1825-1901) మహాభారత యుద్ధాన్ని - ఆర్య తెగల యుద్ధమని తేల్చాడు. ఈయన ప్రాచీన భారతదేశ భాషా సాహిత్యాల మీద అధ్యయనం చేసినవాడు. ఆ శాఖలో ప్రొఫెసర్‌గా పనిచేసినవాడు. మాక్స్ ముల్లర్‌కు ఆప్తమిత్రుడు. మన భారతీయ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ (89) భారత యుద్ధాన్ని ఒక 'ముఠా తగాదా' అని అన్నారు. (a history of India: పెంగ్విన్ 1966). ఆమె ఢిల్లీలోని జె.ఎన్.యూ.లో ప్రాచీన భారతదేశ చరిత్ర - ప్రొఫెసర్. ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఆమె మేథోసంపత్తికి అబ్బురపడి గౌరవించుకున్నాయి. సత్కరించుకున్నాయి.
క్రీ.పూ. 4004 మార్చి 23న బైబిల్ ప్రకారం భగవంతుడు ఆడంను సృష్టించినట్టు బిషప్ ఆషర్ ప్రకటించాడు. మరి ఇప్పటికి ఆరువేల ఏండ్లకు పైబడినా, ఆ భగవంతుడి సృష్టికి ఎవరూ ఆధారం చూపలేదు. అదే ఆలోచనా ధోరణిని పుణికి పుచ్చుకున్న లక్షల మంది బిషప్‌లు కూడా ఈ ఆరువేల ఏళ్ళలో ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించలేక పోయారు. మేం విశ్వసిస్తున్నాం. మీరూ విశ్వసించండి. అనేది మూఢ నమ్మకమవుతుంది. ఆధారం చూపించి నిరూపించగలిగితేనే అది వాస్తవమవుతుంది. వాస్తవమయితేనే అది చరిత్రలో భాగమవుతుంది. సైన్సు దాన్ని ఒప్పుకుంటుంది. కాలానుగుణంగా ఏ విషయమైనా నిరూపించబడకపోతే విశ్వాసం మూఢ విశ్వాసంగా మురిగిపోతుంది. బిషప్ ఆషర్ను ఆదర్శంగా తీసుకుని, ఇక్కడి భారతీయ పండితులు గోపాలయ్యర్, ఎస్బి రారు లాంటి వాళ్ళు కురుక్షేత్ర యుద్ధానికి తేదీలు ప్రకటించారు. కృష్ణుడి జీవితకాలం నిర్ధారించారు. వీళ్ళను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వారు చెప్పిన దానికి రుజువుల్లేవు. ఆర్కియాలజీ విభాగం వారు చేపట్టిన తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలూ లేవు. కార్బన్ డేటింగ్ విధానంతో వెలుగు చూసిన నిజాలూ లేవు. స్వతహాగా వారు పరిశోధకులూ కారు. వైజ్ఞానికులూ కారు, చరిత్రకారులూ కారు. మతి భ్రమించి చెప్పే మాటలకు, రాసే రాతలకు ఏ విలువా ఉండదు.
''తొలుత ప్రాకృతంలో ఉన్నదంతా తర్వాతి కాలంలో సంస్కృతంలోకి మార్చారు. సూత్రధారుల స్థానాన్ని క్రమంగా బ్రాహ్మణులు ఆక్రమించారు. స్తోత్రాలలోని అర్థాన్ని భద్రపరుకునే ప్రయత్నంలో 'భృగులు' పురాణాల్లో మార్పులు చేర్పులు చేశారు. తమ స్థాయి దేవతలను మించి ఉందన్నట్టు కథలు రాసుకున్నారు. భృగుడు విష్ణువు వక్షస్థలం మీద తన్నినట్టు ఒక పురాణ గాథ ఉంది. అంటే హరిహరాదుల కంటే తామే అధికులమని భావించారు'' ఈ విషయాలన్నీ ఆంత్రపాలజిస్ట్ ఐరావతీ కార్వే (1905-1970) యుగాంత, 1966 (పూనా) పేజీ 5లో రాశారు. వేమూరి శ్రీనివాసరావు పూర్వగాథలహరి, 1952 కూడా పరిశీలించొచ్చు. ఇవి ఇలా ఉంటే మహాభారతాన్ని ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించిన వాడు ప్రొఫెసర్ హాప్కిన్స్ - అతనేమంటాడంటే.. ''ఇందులోని ప్రతి అధ్యాయమూ మార్పులకు గురి అయ్యింది. పాత శ్లోకాలు తొలగించి కొత్త వాటిని ఎన్నో చేర్చుతూ వచ్చారు'' అని ధృవీకరించాడు. మూడు, నాలుగు దశాబ్దాలకు చెందిన ఒక గోవులు కాచుకునే వాణ్ణి దృష్టిలో పెట్టుకుని అభూత కల్పనలతో అతణ్ణి దేవుణ్ణి చేశారని చెప్పాడు. అనూహ్యంగా ఆ గోవుల కాపరి - కృష్ణుడిగా ద్రౌపతి వస్త్రాపహరణంలోకి జొచ్చుకుని వచ్చి, హఠాత్తుగా స్థాయి పెంచుకున్నాడనీ, అక్కణ్ణించి అతను సృష్టికర్త స్థానానికి ఎదిగిపోయాడనీ వివరించాడు.
జనాన్ని మత మౌఢ్యంలోకి లాగడానికి, ఆనాటి వాస్తవ ప్రపంచంలో అధిక సంఖ్యాకులైన బౌద్ధుల్ని ఆకర్షించడానికి పురాణ రచయితలు ఎన్నో గిమ్మిక్కులు చేసిన విషయాన్ని పరిశీలకులు బయటపెట్టారు. మందలో పడి కొట్టుకుపోయే గొర్రెలకు విషయాలు అర్థం కావు. అందులోంచి బయటపడి, విడిగా స్వంత మెదడు ఉపయోగించి ఆలోచించినప్పుడే వాస్తవానికీ కల్పించినదానికీ తేడా గ్రహించుకో గలుగుతారు.
వందల సంవత్సరాలు భారతదేశం బ్రిటిషు పాలనలో ఉన్నందువల్ల ప్రపంచ దేశాల మేథావులు, పరిశోధకులు, ఇంజనీర్లు, డాక్టర్లు, భాషా శాస్త్రవేత్తలు సివిల్ సర్వీసులో ఉన్నవారు ఎంతోమంది ఈ దేశానికి వచ్చారు. ఇక్కడి మూలాల మీద అధ్యయనం చేశారు. వాస్తవాలు ప్రకటించారు. అందువల్ల కొన్ని కొన్ని నిజాలు బయటపడ్డాయి. ఇక్కడి వైదిక సూత్రాలు, వేదాలు, పురాణేతిహాసాలు అన్యాయంగా ఈ దేశ ప్రజలపై రుద్ది, వారిని బానిస మనస్కులుగా తీర్చిదిద్దింది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటికైనా జరిగిన మోసాల్ని గ్రహించాలి. నిజాల వెంటపడి నిగ్గు తేల్చుకోవాలి. ప్రపంచమంతా ఒక్కటి! ప్రపంచ మానవులంతా ఒక్కటి!! ఎవరూ అధికులు కారు. ఎవరూ పవిత్రులు కారు - అనే నిజాన్ని జీర్ణించుకోవాలి. ఇంతకీ మహాభారత యుద్ధం ఎప్పుడు ఎక్కడ జరిగిందీ..? అది మహాభారత కథను కూరుస్తున్నప్పుడు.. ఆ'రచన'లో జరిగింది! మహాభారతమనే 'కావ్యంలో' జరిగింది!! అంతే...
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు