Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ గురించి మరోసారి పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. దాదాపు అన్ని పత్రికలు, టీవీలు ఆర్టీసిపై కథనాలు ఇస్తున్నాయి. పాడైపోతున్న పరిస్థితిని చక్కదిద్దుకొనేందుకు కార్మిక సంఘాలు కూడా మరోసారి ఐక్యత వైపు అడుగులు వేస్తున్నాయి. అసలు ఆర్టీసీ ప్రయాణం ఎటువైపు ఉంది? ప్రభుత్వాలు దీనిని ప్రజల సంస్థగా ఉండనిస్తాయా? అనే అనుమానం అందరికీ కలుగుతుంది. సంస్థ లేకపోతే ప్రజలకు జరగబోతున్న నష్టం ఏమిటి? కార్మికుల పరిస్థితి ఏమిటి అనేది పరిశీలిద్దాం.
ఆర్టీసీ రూటెటు? : ఆర్టీసీ సంస్థను ప్రభుత్వాలు చూసే కోణంలోనే ప్రధానమైన తేడా ఉంది. ప్రజలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా దేశంలో ఆర్టీసీ యాక్ట్ 1950 వచ్చింది. ఎన్ఎస్ఆర్ ఆర్టీడీగా ఉన్న (నిజాం స్టేట్ రైల్ Ê రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంటు) సంస్థ 1958 జనవరి 11న ఏపీఎస్ ఆర్టీసీగా ఆవిర్భంచింది. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం 2015 జూన్ 3 నుండి టీఎస్ ఆర్టీసీగా ఏర్పడి పని చేస్తున్నది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజల అవసరాలను బట్టి ఆర్టీసీ బస్‌లు నడుపుతారు తప్ప, బాగా డబ్బులు వచ్చే చోట మాత్రమే బస్‌లు తిప్పడం, లేనిచోట తిప్పకపోవడం అనే సౌకర్యం ఆర్టీసీకి లేదు అనే విషయం పాలకులకు తెలుసు. అయినాసరే ఆర్టీసీ సమీక్షను ఆదాయం ప్రాతిపదికనే చేస్తూ నష్టాల సంస్థ అని ముద్ర వేస్తున్నారు. సేవ చేయడంలో తనకు నిర్దేశించిన ప్రమాణాలను దాటి కృషి చేస్తున్న విషయం అంగీకరించడం లేదు.
2019 అక్టోబర్ 5 నుండి 55 రోజులు జరిగిన చారిత్రాత్మక సమ్మెలో కూడా ఆర్టీసీ ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కార్మికులు డిమాండ్ చేశారు. కానీ టీఆర్ఎస్ నాయకత్వంలోని ప్రభుత్వం ఒక్క మౌలిక సమస్య పరిష్కారానికీ ముందుకు రాలేదు. టీఆరెస్సే కాదు, వివిధ సందర్భాలలో పాలకపార్టీలన్నీ ఆయిల్‌పై ధరను స్థిరీకరించడానికి గాని, వ్యాట్ నుండి ఆర్టీసీని మినహాయించడానికి సిద్ధపడకపోవడాన్ని చూస్తే, పాలకులు మారారు తప్ప, ఆర్టీసీని చూసే కోణంలో పాలకుల ఆలోచనలు మారలేదని అర్థం అవుతుంది.
ఈ వైఖరి వల్ల నేడు ఆర్టీసీ పరిస్థితి మరింత కృశించి పోతున్నది. 2019 నవంబర్‌లో ఆర్టీసీ ఇచ్చిన బుక్‌లెట్‌లోని సమాచారం బట్టి చూస్తే 2021 చివరి నాటికి 4313 బస్‌లు కాలం చెల్లిపోయి స్క్రాప్ చేయాల్సి వస్తుంది. మరి ఆ బస్‌ల పునరుద్ధరణకి ప్రణాళిక ఆర్టీసీ వద్ద గాని, ప్రభుత్వం వద్ద గాని ఉందా? అనే ప్రశ్న వస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీలో జరిగిన చర్చకు రవాణా మంత్రి సమాధానం చెప్తూ, 'ఇక ముందు కొత్త బస్ ఉండదు. కొత్త బస్టాండ్ ఉండదు. ఎంఎల్ఎలకు ఇస్తున్న నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి డిపో మేనేజర్లతో సమన్వయం చేసుకొని బస్టాండ్స్ రిపేర్లు చేయించుకోవలసి ఉంటుంది' అని అన్నారు. ఈ వ్యాఖ్యల అర్థం ఏమిటి?
ప్రజలెటుపోవాలి?: పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు 12శాతం బస్‌లు పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా చూస్తే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆర్టీసీ ఆధ్వర్యంలో 19,736 బస్‌లు నడుస్తూ ఉండాలి. కానీ 2019 నవంబర్ నాటికి ఆర్టీసీ బస్‌లు 8357, ప్రయివేట్ అద్దె బస్‌లు 2103 కలిపి మొత్తం 10460 బస్‌లే ఆర్టీసి వద్ద ఉన్నాయి. సమ్మె ముగిసిన మరుక్షణం ఒక్క హైదరాబాద్ నగరంలోనే 800 బస్ సర్వీసుల్ని తగ్గించారు. దీనర్థం ఏమంటే ప్రజలకు అవసరమైన మేరకు బస్‌లు వేయకుండా వారిని ప్రైవేటు వాహనాలు లేదా వ్యక్తిగత వాహనాల వైపు నెడుతున్నారు. ఈ పరిస్థితి వల్ల ప్రజలు ప్రయాణం ఖరీదయిందిగా మారడమే కాక, ఆర్టీసీని ఏర్పాటు చేసిన మౌలిక లక్ష్యమే పక్కకు వెళ్ళిపోతుంది. ఆర్టీసి కనుమరుగై, ప్రైవేటు వాహనాలదే ఆధిపత్యం అయితే ప్రజలు ప్రయివేటు బస్ యజమానుల లాభాల వేటలో సమిధలవుతారు.
కార్మికులేమికావాలి?: ఈ రోజు ఆర్టీసీలో 49,300 మంది పని చేస్తున్నారు. 55 రోజుల చారిత్రాత్మక సమ్మె అనంతరం ప్రభుత్వం ఆర్టీసీలో కార్మికోద్యమంపై అప్రజాస్వామిక పద్ధతిలో నిర్బంధం కొనసాగిస్తున్నది. యూనియన్ల స్థానంలో ఎటువంటి హక్కులు లేని సంక్షేమ మండళ్ళను ముందుకు తెచ్చింది. ఈ వ్యవస్థ ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మబలుకుతున్నది. రాష్ట్రంలో సుమారు 1000 బస్‌లు తగ్గాయి కానీ, ఆర్టీసీ నడుపుతున్న కి.మీ. 3లక్షలు పెరిగాయి. దీనర్థం ఏంటంటే ఆ మేరకు కార్మికులపై పని భారం పెరిగింది. మరోవైపున కార్మికులు అదనంగా ఉన్నారనే పేరుతో రావలసిన ప్రమోషన్లు ఆగిపోయాయి. రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి.
ఇకపోతే సంస్థకు ప్రభుత్వం బాగా సహాయం చేస్తుందని, ప్రభుత్వం నిధులతోనే జీతాలు ఇస్తున్నామని పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో రవాణా మంత్రి ప్రవేశపెట్టిన లెక్కలు పరిశీలిస్తే అర్ధం అవుతుంది. అసెంబ్లీ సమావేశం నాటికి 5939 కోట్ల అప్పులు, బకాయిలు వున్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేశారు. వాటిల్లో 1852 కోట్లు బ్యాంక్ అప్పులున్నాయి. కార్మికుల పి.ఎఫ్ ట్రస్టుకు చెల్లించాల్సిన డబ్బులు 1283 కోట్లు. సిసిఎస్ (ఇది కార్మికుల సంస్థ) కోసం రికవరీ చేసిన సొమ్ము 787 కోట్లు (నేటికి అది 908 కోట్లు, వడ్డీ 172 కోట్లు అయింది), ఇతర చెల్లింపులలో 2017 కోట్లు ఉన్నది. అంటే సుమారు 4087 కోట్లు కార్మికుల సొమ్మే ఆర్టీసి సంస్థ వాడుకున్నది. నిజంగానే ప్రభుత్వం బాగా సహాయం చేస్తుంటే పిఎఫ్, సీసీఎస్ డబ్బులు ఎందుకు జమ చేయడం లేదు. 2013 వేతన ఒప్పందం అరియర్స్ బాండ్స్ విలువ 280 కోట్లు (వడ్డీ అదనం) ఎందుకు ఇవ్వడం లేదు? 2018 మార్చి తరువాత రిటైరైన వారికి చెల్లించాల్సిన 52కోట్లు ఎందుకు నేటికి ఇవ్వలేదు. గత 4 నెలలుగా రిటైరైన కార్మికులకు ఇవ్వాల్సిన ఎస్ఆర్బిఎస్ బెనిఫిట్స్ ఎందుకు చెల్లించడం లేదు? 2019 జులై నుంచి కార్మికులకు రావలసిన 4 కరువు భత్యాలు ఎందుకు అమలు చేయడం లేదు? 2017 ఏప్రిల్, 2021 ఏప్రిల్ నుంచి రావలసిన వేతన ఒప్పందాలు ఎందుకు చేయడం లేదు? 2020 నుంచి వివిధ కారణాలతో సర్వీసులో వుండి చనిపోయిన 400 మంది కార్మికుల కుటుంబాలకు పిఎఫ్లోని ఇన్సూరెన్స్ స్కీం అయిన ఇడిఎల్ఐఎస్ ద్వారా రావలసిన 24 కోట్లు (ఒక్కొక్కరికి 6 లక్షలు) ఎందుకు ఇవ్వడం లేదు? దీనికి యాజమాన్యం, ప్రభుత్వం జవాబు చెప్పాలి.
అసలు దోషి కేంద్ర ప్రభుత్వం: రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిధిలోని రవాణాను కేంద్రం తనకు దఖలుపర్చుకొంటున్నది. ఆర్టీసీల రక్షణ కోసం చేసిన రాజ్యాంగ సవరణను నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్రాల పరిధిలోని పర్మిట్ విధానాన్ని కేంద్రం తీసుకుంటున్నది. ఇవన్నీ చేయడం కోసం ఎం.వి.యాక్ట్ సవరణ చట్టం - 2019ని ఆమోదింప చేసుకున్నది. ఈ చట్టం సాయంతో ఈ రోజు యాప్ ఆధారిత సంస్థలను (ఓలా, ఊబర్) అనుమతించింది. త్వరలో ఉబర్ సంస్థ నుంచి బస్‌లు రాబోతున్నాయి. టాక్సీ విధానంలో మార్పులు తెచ్చి లక్షల కార్లకు పర్మిషన్ ఇచ్చారు. టారిస్టి పర్మిట్ విధానంలో మార్పులు ముందుకు తెచ్చి, పరిమితమైన ఫీజుతో దేశవ్యాపితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా, స్టేజి క్యారేజి తరహాలో తిప్పుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. విద్యుత్ బస్‌లకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఆర్టీసిలకు ఇవ్వకుండా, ప్రయివేటు కన్సార్టియంలకు మాత్రమే ఇచ్చేలా విధానం రూపొందించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ యాక్ట్ కింద విధించబడ్డ లాక్డౌన్ వల్ల ఆర్టీసిలకు వచ్చిన నష్టాన్ని చెల్లించకపోగా, ప్రయివేట్ బస్ యాజమానులకు 18,000 కోట్లుఖర్చు చేసి, 20,000 బస్‌లను కొనిచ్చే ప్రతిపాదన 2021-22 బడ్జెట్లో పెట్టారు. మరోపక్కన 2014 డిసెంబర్లో లీటర్ డీజిల్ రేటు రూ.50లు ఉంటే, నేడు రూ.96 చేరింది. ఈ ధరలో 60శాతం పన్నులే ఉన్నాయి. పన్నుల పెంపు, ధరల పెంపు ఆగేలా లేదు. ఇవన్నీ ఆర్టీసీలను ప్రజల నుండి దూరం చేసే విధానాలుగానే ఉన్నాయి.
కేంద్ర విధానాలను ప్రతిఘటించని రాష్ట్ర ప్రభుత్వం : ఎం.వి. యాక్ట్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఆ తర్వాత తన వైఖరిని మార్చుకొన్నది. పార్లమెంటులో ఆ బిల్లు చట్ట రూపంలోకి రావడానికి ఆ పార్టీ ఎంపీలు అనుకూలంగా ఓటు చేశారు. ఆ బిల్లులో ఆర్టీసీలను నిర్వీర్యం చేసేలా ఉన్న ఏ అంశంపైనా టీఆర్ఎస్ పార్టీ తన అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. అలాగే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల హక్కుగా ఉన్న రవాణాను కేంద్రం లాగేసుకుంటూ, పర్మిట్ విధానం కూడా కేంద్రం చేతుల్లోకి తీసుకుంటుంటే దానిని వ్యతిరేకించలేదు. ఇప్పుడు టూరిస్టు పర్మిట్లను సరళతరం చేసి, దాదాపు స్టేజి క్యారియర్స్‌గా నడుపుకొనేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంటే, దానినీ వ్యతిరేకించటంలేదు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం చూస్తే, 'కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు' అన్న చందంగా ఉంది.
ఆర్టీసీని రక్షించుకునే బాధ్యత ఆర్టీసి కార్మిక సంఘాలది మాత్రమే కాదు. ప్రజలదరిది కూడా. అందుకని ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలు, అది లేకుండాపోతే ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ప్రజలందరికి తెలియాలి. ఇందుకు ఆర్టీసీలోని కార్మిక సంఘాలు నాంది పలకాలి. పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కూడా ఆర్టీసీ పరిరక్షణోద్యమంలో భాగస్వాములు కావాలి.
- పుష్పా శ్రీనివాస్