Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులే వారి శక్తి సామర్థ్యాలను, స్థాయిని తెలుపుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యానించారు. ప్రామాణికమైన గొప్ప గొప్ప తీర్పులు కొలమానాలుగా నిలుస్తాయి. ప్రజా చైతన్యంలో భాగమై దేశ గమనానికి దిశా దశా నిర్దేశం చేస్తాయి. బింబ-ప్రతిబింబ సూత్రానికి అనుగుణంగా న్యాయం ఎల్లెడలా పరుచుకుంటుంది. సంక్లిష్ట సంక్షోభ సమయాల్లో ఒక్కోసారి న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు కారుచీకట్లో కాంతిరేఖల్లా పనిచేస్తాయి. జస్టిస్ పి.డి. దేశారు పదిహేడవ స్మారకోపన్యాసంలో రమణ ఈ కీలక వ్యాఖ్య చేయడం హర్షణీయం.
న్యాయం అనేది రెండంచుల కత్తివంటిది. ఒకవైపున బాధితులకు న్యాయం అందేలా చేయడంతో పాటు మరోవైపు అన్యాయం జరగకుండా అరికడుతుంది. అందుకే రమణ చట్టసభలు రూపొందించే చట్టాలు, ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ అమలు పరిచే విధి విధానాలు క్షుణ్ణంగా పరిశీలించడానికి న్యాయవ్యవస్థకు సంపూర్ణ స్వాతంత్య్రం ఉండాలని కోరుకున్నారు. మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నాలుగు మూలస్తంభాలపై నిలబడి ఉన్న విషయం తెలిసిందే. 1. చట్టసభలు 2. కార్యనిర్వాహక (పాలనా) వ్యవస్థ 3. న్యాయవ్యవస్థ 4. పత్రికా రంగం - మీడియా. ఇవి వేటికవే స్వతంత్రంగా పనిచేస్తూ రాజ్యాంగాన్నీ దేశాన్నీ కాపాడుతూ ఉండాలి. ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. అదే సందర్భంలో పరస్పర గౌరవంతో వ్యవహరించాలి. ఇదే ప్రజాస్వామ్య మూలసూత్రం.
ఈ నాలుగు ప్రధాన వ్యవస్థల్లో నాయకత్వం వహిస్తున్నవారు మన రాజ్యాంగం నిర్దేశిస్తున్న విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు తరచి చూసుకోవాలి. కేవలం పాలనాధికారాన్ని మార్చినంత మాత్రాన దోపిడీ, పీడన, దౌర్జన్యం అంతమవుతుందన్న భరోసా ఉండదు. ప్రతిదీ రాజ్యాంగబద్దంగా అమలు జరుగుతున్నదా లేదా అని పరిశీలించేది న్యాయవ్యవస్థ మాత్రమే. కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పాలకపక్షం తన మందబలంతో ప్రజావ్యతిరేక చట్టాలను రూపొందించడం అమలుపరచడం సర్వసాధారణమైంది. అందుకు తార్కాణం నల్ల వ్యవసాయ చట్టాలే. ఆ చట్టాలను భేషరుతుగా రద్దు చేసి, తమ పంటకు కనీస మద్దతు ధరకు చట్టభద్రత కల్పించమని 200రోజులకుపైగా రైతులు నిరసన తెలుపుతున్న విషయం విధితమే.
ఇలాంటి సందర్భాల్లో ప్రజాందోళనలకు రక్షణ కల్పించేది ధర్మాసనాలే. మరి పాలకపక్షం ధర్మాసనాలపై అంటే న్యాయమూర్తులపై వత్తిడి తెచ్చి, న్యాయం ప్రజల పక్షం వహించకుండా చేస్తే ఏమవుతుంది. ప్రజాస్వామ్యమే గల్లంతు అవుతుంది. అందుకే ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, విస్తృతికి భంగం కలిగించే రీతుల్లో చట్టాలు రూపొందించడంగాని, వత్తిడి చేయడంగాని, నియంత్రించడం గాని అంతిమంగా ప్రజాస్వామ్యానికే చేటు చేయడం అవుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. చట్టబద్దపాలన (రూల్ ఆఫ్ లా) అనే అంశంపైనే ఆయన ప్రసంగించారు.
సామాజిక మాద్యమాల్లో ఎన్నెన్నో వార్తలు నేడు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు భావోద్వేగాలతో స్పందిస్తున్నారు. ఇందులో వాస్తవాలూ అవాస్తవాలూ రెండూ ఉన్నాయి. నిజాలు నిగ్గుతేల్చాలంటే లోతైన పరిశీలన అవసరం. అందుకే తీర్పులు వెలువరించడానికి కేవలం మీడియా ఒక్కటే ప్రాతిపదిక కాదు. బయట నుండి వచ్చే వత్తిళ్ళకు, ప్రలోభాలకు లొంగకూడదు. కత్తిమీద సాములా వీటికి అతీతంగా పనిచేసినప్పుడే న్యాయంగా పనిచేయడం సాధ్యమవుతుంది.
చట్టబద్ద పాలన అంటేనే 'చట్టం దృష్టిలో అందరూ సమానమే' అన్న సూత్రాన్ని జీర్ణం చేసుకోవడం. మన దేశంలో దాదాపు సగం మందికి పైగా ప్రజానీకం పేదరికంలోనో, నిరక్షరాస్యతలోనో, మూఢాచారాల అజ్ఞానంతోనో బతుకుతున్నారు. ఈ కారణాల రీత్యా వారు రాజ్యాంగం కల్పించే హక్కులు అనుభవించలేకపోతున్నారు. ఆర్థిక అంతరాలేకాదు, కుల, మత, లింగ వివక్షలు బలంగా పాతుకుపోయాయి. వీటన్నింటిని ఛేదించి సమన్యాయం అందిచే బాధ్యత న్యాయమూర్తులది. ఈ డెబ్భై ఏండ్ల స్వతంత్ర భారతావనిలో జరిగిన 17 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎనిమిదిసార్లు అధికార పార్టీలను కుర్చీల నుండి కిందకు దించిన విషయాన్ని రమణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే మన ప్రజాస్వామ్య గొప్ప విజయంగా అభివర్ణించారు.
న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ప్రజా చైతన్యానికి ఎలా ఉపకరిస్తాయో అన్యాపదేశంగా ఉటంకించారు. న్యాయమూర్తులు రాజ్యాంగ స్వరూప స్వభావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, అవగాహనతో బాధ్యతా యుతంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చిన్నపరెడ్డి ఒకానొక సందర్భంలో... ''ఈ ఆధునిక కాలంలో న్యాయమూర్తులు కమ్యూనిస్టు మ్యానిఫెస్టో చదివి అర్థం చేసుకోకుంటే, న్యాయాన్ని విశాలార్థంలో అమలు చేయడం కష్టతరమవుతుంది'' అని ఏనాడో చెప్పారు. ఇక్కడే మనకు ఇటలీ మార్కిస్టు వేత్త ఆంటోనీ గ్రాంసీ గుర్తుకు వస్తాడు. ఏ రంగంలో (వృత్తిలో) పనిచేసే మేథావులు ఆరంగంలో తమ సహజమైన సృజనశీలతతో, అనుభవ జ్ఞానంతో మానవాళి విముక్తికోసం అంకిత భావంతో పాటు పడగలరని, వారినే మనం సహజాతి మేథావులు (ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్) అని పిలుచుకుంటామని అన్నారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు న్యాయవ్యవస్థలో పనిచేసేవారి పాత్ర అనుపమానమైనదని చెప్పక తప్పదు.
- కె శాంతారావు
సెల్: 9959745723