Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివరించలేని వాటిని సమర్థించడానికి చాలా వాదనలు వస్తూ ఉంటాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రభుత్వాలు ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఎంతైనా ఉంది. గ్లోబల్ మార్కెట్ ధరలు పెట్రోలియం ఉత్పుత్తుల ధరలను నిర్ణయిస్తాయన్నది చాలా తరచుగా మనకు వినబడే వాదన. ఇందులో ప్రభుత్వాలకు ఎలాంటి పాత్ర లేదు.
2002లో మొదటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భారత్ పాలనాపరమైన ధరల యంత్రాంగాన్ని (ఏపీఎం) రద్దు చేసినప్పటికీ, 2010, 2014ల్లో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. కానీ ఈ ఏడాది మే 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత పెరగడం ఆరంభించాయి. ఇప్పటికే పెరుగుతున్న మొత్తం ద్రవ్యోల్బణంపై వరుస రీతుల్లో ప్రభావాన్ని చూపగల ఇంధన ధరలను తగ్గించడంలో ప్రభుత్వం పోషించగల పాత్రను ఇది వెల్లడిస్తుంది.
గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు, దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు పోల్చి చూస్తే ఈ వాదన ఎంత తప్పో తెలుస్తుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉండడమన్నది వాస్తవం. ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్ 52 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధరలు ఇటీవల కాలంలో సగటున 71 డాలర్లుకు చేరాయి. కానీ, 2013 జూన్‌లో ముడి చమురు ధర బ్యారెల్ 101 డాలర్లుగా ఉంది. అప్పుడు మన దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.63, డీజిల్ ధర రూ.77గా ఉంది. డాలర్-రూపాయి మారకం విలువలోని ఒడిదుడుకులను సద్దుబాటు చేసిన తర్వాత కూడా ఈ ధరలు ఇలానే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 30శాతం తక్కువ ఉన్నప్పటికీ, దేశీయంగా రిటైల్ మార్కెట్లో పెట్రోల్ ధర 2013లో కన్నా 30శాతం అధికంగా ఉంది.
2018 అక్టోబరులో గ్లోబల్ ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్లుగా ఉంది. అప్పుడు దేశీయ రిటైల్ మార్కెట్లో డీజిల్ ధర లీటరుకు రూ.76గా ఉంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఉన్న ముడి చమురు ధర 2018లో కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
చమురు బాండ్లలపై తప్పుడు ప్రచారం
పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లింపులతో పాటుగా రూ.2 లక్షల కోట్ల విలువైన చమురు బాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని బీజేపీ నేతలు తరచుగా చెబుతూ ఉంటారు. అందువల్ల, పెట్రోలియం ఉత్పత్తులపై అధిక పన్నులనేవి యూపీఏ వారసత్వం ఫలితంగా వచ్చినవని వారి వాదన. ఈ వాదనను బలపరిచేలా పాలక పార్టీ నేతలు ఎలాంటి డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలూ పేర్కొనరు. కానీ, బడ్జెట్ పత్రాలను పరిశీలించినట్లైతే మరో విధమైన వాదన వెల్లడవుతుంది. ఇందుకు సంబంధించి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చూస్తే ఈ వాదన ఎంత అసంబద్ధమైనదో తెలుస్తుంది. 2018 డిసెంబరు 12న అహ్మద్ పటేల్ అడిగిన 296వ నెంబరు ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి ఇచ్చిన సమాధానం ఇలా ఉంది : ''రూ.3500 కోట్ల విలువైన స్పెషల్ సెక్యూరిటీలను 2015 మార్చి (మెచ్యూరిటీ తేదీ)లో చెల్లించడం జరిగింది. 2015-16 నుంచి 2017-18 వరకు ప్రతి ఏటా రూ. 9,989.96 కోట్ల మొత్తాన్ని చెల్లించడమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతే మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉంది.'' వాస్తవాలను నిర్థారించుకునే వెబ్సైట్ 'ఫ్యాక్ట్లీ' జరిపిన దర్యాప్తులో మరిన్ని విషయాలు బయట పడ్డాయి.
2014-15 బడ్జెట్లో 6ఇ అనుబంధ పత్రాల ప్రకారం, ''నగదు సబ్సిడీకి అనుగుణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు జారీ చేసిన స్పెషల్ సెక్యూరిటీలు'' అనే శీర్షికతో 2013-14 చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న చమురు బాండ్ల మొత్తం విలువ రూ.1,34,423 కోట్లు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు... 2014-19 కాలంలో (మోడీ ప్రభుత్వ పదవీ కాలం) మెచ్యూరిటీ కావాల్సిన బాండ్లు 2015లో మెచ్యూర్ అయిన రెండు సెట్ల బాండ్లే, మొత్తం రూ.3500 కోట్లు... 2019-20 బడ్జెట్లో 2ఇ అనుబంధ పత్రాల ప్రకారం 2018-19 నాటికే బకాయిల మొత్తం రూ.1,30,923 కోట్లుగా ఉంది.
వ్యయ బడ్జెట్ కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ పద్దుల్లో ''వడ్డీ చెల్లింపులు'' శీర్షికతో ఉన్న డాక్యుమెంట్ ప్రకారం, యూపీఏ-2 ప్రభుత్వం 2009-10 నుంచి 2013-14 మధ్య ఐదేండ్ల కాలంలో చమురు బాండ్ల వడ్డీ కింద మొత్తంగా రూ.53,163 కోట్లు చెల్లించింది. మరోవైపు, 2014-15 నుంచి 2018-19 మధ్య ఐదేండ్ల కాలానికి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రూ.50,216 కోట్లు చెల్లించింది. అందువల్ల, చమురు బాండ్లకు లేదా వాటిపై వడ్డీకి ఎన్డీఏ ప్రభుత్వం అసాధారణ మొత్తంలో చెల్లింపులు జరపలేదని స్పష్టమవుతోంది. మరి ఈ రూ.2 లక్షల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో ఎవరికీ తెలియదు!
యూపీఏ కాలం నాటి చమురు బాండ్ల విముక్తి దిశగా మోడీ ప్రభుత్వం తన రెండో పదవీ కాలంలో కేవలం రూ.41,150 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టిందని ఇటీవలి 'బిజినెస్ లైన్' నివేదిక తెలియచేస్తోంది. అందువల్ల, పెట్రో ధరల్లో ప్రజా వ్యతిరేకమైన పెంపును సమర్థించుకునేందుకు కాషాయ దళం నిరాశా నిస్పృహలతో చేస్తున్న ప్రచారాల సమ్మేళనమే ఈ రూ.2 లక్షల కోట్ల గురించి మాట్లాడడం.
భారీ పన్నుల భారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా విధించే పన్నుల కారణంగానే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో వినియోగదారుడు చెల్లించే ధరలో 60శాతానికి పైగా పన్నుల మొత్తాలే ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు, సుంకాల్లో సింహ భాగం కేంద్రానిదే. పెట్రోల్, డీజిల్‌లపై వివిధ రకాల సెస్సులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వీటిని రాష్ట్రాలతో పంచుకోదు. ఆ రకంగా, పెట్రోల్, డీజిల్‌లు ప్రభుత్వాలకు కీలకమైన రెవిన్యూ వనరులుగా మారాయి. ఈ ఉత్పత్తుల వినియోగం ధరలతో సంబంధం లేకుండా ఉన్నందున ఈ ధోరణి పెరుగుతూనే ఉంటుంది.
2020-21 సంవత్సరానికి సెంట్రల్ ఎక్సైజ్ సుంకాల వసూళ్ళు రూ.2,67,000 కోట్లుగా ఉంటాయని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ సవరించిన అంచనాల ప్రకారం రూ.3,61,000 కోట్లకు పెరిగాయని రిసీట్ బడ్జెట్ (బడ్జెట్ రశీదు), 2021 పేర్కొంటోంది. అంటే బడ్జెట్ అంచనాలతో పోల్చుకుంటే రూ.94 వేల కోట్లు పన్ను వసూళ్ళు పెరిగాయి. 2021-22 సంవత్సరానికి బడ్జెట్లో ఇంధన పన్ను రూ.3.2 లక్షల కోట్లుగా ఉంది. ఆ రకంగా, తక్కువగా ఉన్న గ్లోబల్ ముడి చమురు ధరలను అవకాశంగా తీసుకుని ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయాలను సమకూర్చుకుంటోంది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తీవ్రంగా తగ్గినా కూడా వినియోగదారుడు ఏ మాత్రమూ లాభపడడం లేదు. పైగా, అధిక గ్లోబల్ ముడి చమురు ధరల భారాన్ని మోస్తున్నాడు.
వాతావరణ మార్పు వాదన
ఇంధన ధరల గురించి జరిగే చర్చల్లోకి వాతావరణ మార్పులపై పోరాటాన్ని కూడా లాగుతున్నారు. పెట్రోల్, డీజిల్‌లు శిలాజ ఇంధనాలు. వీటి వినిమయం పెరగడం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతాయి. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోంది. అందువల్ల, అధిక ఇంధన ధరలను సమర్థించడానికి వారు చేసే వాదన ఎలా ఉంటుందంటే, ధరల పెరుగుదల వల్ల వినిమయం తగ్గితే వాతావరణ మార్పులపై పోరుకు దోహదపడుతుందని పేర్కొంటున్నారు. కానీ, సాక్ష్యాధారాలు భిన్నమైన కథనాన్ని అందిస్తున్నాయి.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చేసిన పరిశోధన ప్రకారం, ఈ ఏడాది మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో భారత్ 78 లక్షల టన్నుల (ఎంటీ) పెట్రోల్‌ను వినియోగించింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20) ఇదే త్రైమాసికంలో వాడిన ఇంధనం 71.2లక్షల టన్నులతో పోల్చుకుంటే 9.7శాతం పెరిగింది. రికార్డు స్థాయిలో అధిక ధరలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వినియోగం జరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో డీజిల్ వినియోగం కూడా 4.1శాతం పెరిగి 20.60 మిలియన్ టన్నులుగా ఉంది.
పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ విడుదల చేసిన అంచనాల ప్రకారం, పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం వినిమయం 9.8శాతానికి పెరిగి 2021-22లో 215.24 మిలియన్ల టన్నులకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అందువల్ల, సాంప్రదాయేతర ఇంధన వనరులకు రాయితీలు, క్రియాశీలమైన ప్రభుత్వ రవాణా వ్యవస్థ, మెరుగైన రహదారుల సదుపాయాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీకి ప్రోత్సాహం వంటి చర్యల వల్ల శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది. కేవలం ఇంధన ధరలు పెంచితే అది, ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణ భారాన్ని మోస్తున్న వినియోగదారునిపై మరింత భారాన్ని మోపడమే అవుతుంది.
ప్రభుత్వానికి వనరులు అవసరం
సంక్షేమ చర్యలకు అవసరమైన వనరులను సమకూర్చాల్సిన అవసరం ఉందన్నది అధికారంలో ఉన్నవారు తరచూ చేసే వాదన. కరోనా మహమ్మారి వల్ల ఆదాయాలు పడిపోతున్న సమయంలో, కచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన మొత్తాలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంధన పన్నులు మినహా ప్రభుత్వాలకు మరో అవకాశం లేదు. కానీ, ఈ వాదనలో ఒక విషయం పట్టించుకోవడం లేదు. ఈ కరోనా సమయంలో ప్రభుత్వం కన్నా సగటు భారతీయుడు మరింత ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటున్నాడు. అధిక ఇంధన ద్రవ్యోల్బణం సామాన్య మానవుడిని మరింత ఇబ్బందుల పాల్జేస్తోంది.
పది శాతం కార్పొరేట్ ఆదాయ పన్నును తగ్గించడం ద్వారా 2019లో దాదాపు రూ.1.45 లక్షల కోట్లను కేంద్రం కోల్పోయింది. ఈ ఏడాదిలో పెట్రోల్, డీజిల్ నుంచి మొత్తం రూ.2.4 లక్షల కోట్ల మేరకు పన్ను ఆదాయాలను కేంద్రం అందుకుంది. ఆ రకంగా, కేంద్రం కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీల మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సామాన్య మానవుడు పెట్రోల్, డీజిల్‌లపై అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్ పన్ను తగ్గించడం అధిక జాతీయాదాయానికి లేదా ఉద్యోగాల కల్పనకు దోహదపడదు. 2021లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3శాతం మేరకు కుంచించుకు పోయింది. వేతనాల్లో కోత, ఉద్యోగాల్లో కోత కారణంగా కంపెనీల లాభాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. కార్పొరేట్ లాభాలకు సాయం చేయాలని సగటు భారతీయుడిని అడగాలనే వాదనను ఎలా సమర్థిస్తారు?
ప్రొ|| కె. నాగేశ్వర్