Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్ద ఎత్తున మరణాలు, ఇబ్బందులతో సెకండ్ వేవ్‌లో కోవిడ్ మహమ్మారి కలిగిస్తున్న కష్టాలకు తోడు... నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలను తీవ్రంగా కడగండ్ల పాల్జేస్తున్నాయి. ఆదాయాలు పడిపోయి, ఆకలితో, నిరుద్యోగంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికి మించి ద్రవ్యోల్బణం పెరిగి నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ విధానాల ఫలితమే ఇది. ఏప్రిల్, మే మాసాల్లో 2కోట్ల 20లక్షల మంది ప్రజలు తమ ఉపాధులను కోల్పోయారు. మే నెలలో నిరుద్యోగం రేటు 12శాతానికి చేరింది. (మూలం- సి.ఎం.ఐ.ఇ). గృహ వినిమయం స్థాయిలు రికార్డు స్థాయిలో తక్కువగా నమోదయ్యాయి. ఉచిత ఆహార కేంద్రాల ముందు పెరుగుతున్న క్యూలు చూస్తుంటే ఆకలి బాధలు ఎక్కువైపోయాయని మనకు అర్థమవుతోంది.
ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ముడి చమురు ధరలు పెంపు భారాన్ని ప్రజలపై మోపింది. పెరిగిన ఈ ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతుండడమే. మే 4 నుంచి ఈ ధరలు 24సార్లు పెరిగాయి. జూన్‌లో ఇప్పటివరకు (22వ తేదీ వరకు) 12సార్లు పెరిగాయి. ఇప్పుడు ముంబయి, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాలతో సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరు రూ.100 లేదా అంతకన్నా ఎక్కువగానే ఉంది.
పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన కేంద్ర ఎక్పైజ్ సుంకాలు, ఇతర పన్నులు కారణంగానే వీటి ధరలు ఇంతలా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ పన్నులే 55 నుంచి 58శాతం ఉంటున్నాయి. ఫలితంగా 2014-15 నుంచి పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయం 138 శాతం పెరిగింది.
రవాణా ఖర్చులు పెరగడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అంతిమంగా నిత్యవసర ధరలపై ప్రభావం పడుతోంది. దాంతో ంౠద్ధి రేటు క్షీణిస్తోంది. మాంద్యం నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ద్రవ్యోల్బణం బలపడుతోంది. 2021 మే నెలలో టోకు ధరల సూచీ దాదాపు 13శాతం (12.94) పెరిగింది. గత 11ఏండ్ల కాలంలో ఇదే అత్యధికం. ఇదే సమయంలో వినిమయ ధరల సూచీ 6.3శాతంగా ఉంది. బియ్యం, ఖాద్య తైలాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు వంటి ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. వంట నూనెల ధరలైతే అత్యంత భయంకరంగా 60శాతం పెరిగాయి. పంపు సెట్లకు, ట్రాక్టర్లకు డీజిల్ ఉపయోగించే రైతులైతే ఈ పెరిగిన వ్యయంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
సబ్సిడీలో గణనీయంగా కోత విధించడంతో వంట గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. 2019-20లో వంట గ్యాస్‌కు మొత్తంగా నేరుగా ఇచ్చే నగదు సబ్సిడీ రూ.22,635 కోట్లుగా ఉంది. ఇప్పుడది కేవలం రూ.3,559 కోట్లు (ఫిబ్రవరి 2021 వరకు)గా ఉంది. ఫలితంగా, భారం మొత్తంగా వినియోగదారులపై పడింది. ధరల నియంత్రణ చర్యలు అమలు చేయడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఖాద్య తైలాలతో సహా నిత్యవసరాలపై నియంత్రణలను తొలగించేం దుకు ఇప్పటికే నిత్యవసర వస్తువుల చట్టాన్ని నీరుగార్చారు. దీంతో వంట నూనెలను అక్రమంగా నిల్వ ఉంచడం, సట్టా వ్యాపారం తో బడా వ్యాపారులు గణనీయంగా లాభాలు ఆర్జించారు. ఇది, నిత్యవసర వస్తువుల చట్టానికి చేసిన సవరణ యొక్క ప్రజా వ్యతిరేక స్వభావాన్ని వెల్లడిస్తోంది. ఇతర వ్యవసాయ చట్టాలతో పాటుగానే ఈ నిత్య వసర వస్తువుల చట్టానికి సవరణ చేశారు.
పన్నులు తగ్గించడం ద్వారా ఇంధన ధరలను తగ్గించలేమని ఇటీవలనే కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఎందుకుంటే ఈ డబ్బు సంక్షేమ పథకాలకు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు అవసరమని చెప్పారు. కానీ, కార్పొరేట్ పన్నుల్లో కోత విధించడం ద్వారా ఆదాయాలను తగ్గించుకున్నది ప్రభుత్వమే, ఈ క్రమంలో ఇతర రాయితీలు, మినహాయింపులు కాకుండా రూ.1.45 లక్షల కోట్లను నష్టపోయింది. కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సును వెనక్కి తీసుకోవడం వల్ల కలిగిన ఆదాయ నష్టాన్ని, 2019 ముందు నాటి స్థాయికి కార్పొరేట్ పన్నును పునరుద్ధరించడం ద్వారా భర్తీ చేసుకోవచ్చు. అత్యంత ధనవంతులపై సంపద పన్ను విధించడం ద్వారా తగిన ఆదాయాలు పొందవచ్చు.
అయితే, కార్పొరేట్లను, ధనవంతులను బుజ్జగించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇబ్బందులు, కష్టాలు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ఆదాయాలు పెంచుకోవడం కోసం ప్రజలను పిండేస్తున్నారు. ధరల పెరుగుదల ద్వారా ప్రజలపై విధిస్తున్న భరించలేని ఈ భారాలను ఇక ఎంత మాత్రమూ సహించలేం. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, ద్రవ్యోల్బణాన్ని అణిచివేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ వామపక్షాలు పోరాడుతున్నాయి. కేంద్ర ఎక్సైజ్ సుంకాలపైన, పెట్రోల్, డీజిల్ మీద విధించే ఇతర పన్నుల పైన కోత విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. వంట గ్యాస్‌కు సబ్సిడీని పునరుద్ధరించాలని కోరుతున్నాయి. నిత్యవసర సరుకుల చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ధరల నియంత్రణకు హామీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. వంటనూనెల ధరలను ఇష్టానుసారం పెంచే సట్టా వ్యాపారానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్షాలు కోరుతున్నాయి. అందరికీ 10కిలోలు చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వాలి. పప్పులు, వంట నూనె, చక్కెర, టీ వంటి వాటితో కూడిన ఫుడ్ కిట్‌ను కూడా అందచేయాలి. నెలకు రూ.7500 చొప్పున ఆరు మాసాల పాటు ఆదాయపన్ను యేతర వర్గాలకు చెందిన అన్ని కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ చేయాలి.
అందరికీ ఉచితంగా వేగంగా వ్యాక్సినేషన్, ఉచిత ఆహార కిట్ల సరఫరా, ఉపాధి హామీ పథకాల విస్తరణ, పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర పన్నుల్లో కోతలతో సహా ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు... అన్నీ కూడా ఒకేసారి జరగాలి.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం