Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి కోసం...
భుక్తి కోసం...
వెట్టి చాకిరి విముక్తి కోసం...
బానిస బతుకులకు వ్యతిరేకంగా సామాన్య జనం జరిపిన చైత్యన్య జ్వాల తెలంగాణ సాయుధ పోరాటం... దొరతనాన్ని బొంద బెట్టి నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసిన మహౌజ్వల చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటం.
ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య... అన్న మల్లయ్య అడుగు జాడల్లో చిచ్చర పిడుగై చెలరేగి దొరతనాన్ని సవాల్ చేసిన కొమరయ్య వీర మరణంతో ఎరుపెక్కిన చరిత్రే తెలంగాణ పోరాట చరిత్ర... ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా జనగామ తాలూకా కడివెండి గ్రామంలో దొడ్డి కొండయ్య, గట్టమ్మ ఆరుగురి సంతానంలో నాల్గవ కుమారుడు కొమరయ్య... సాయుధ పోరాటంలో కడివెండి గ్రామానిది ప్రత్యేకమైన పేజీ... నిజాం ఏలుబడిలో సామాన్యుల జీవితాలు స్వేచ్ఛలేని బానిస బతుకులు. కడివెండి కేంద్రంగా విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి, ఆయన తల్లి జానకమ్మ దొరసాని ఆగడాలు, అకృత్యాలు, హత్యలు... మానబంగాలు.. ప్రతి రోజూ ప్రతి చోటా నిత్యకృత్యమై సాగుతున్న కాలం... దొర ఇంటి పని చేసినంకనే జనం తమ పని చేసుకోవాలి. దొర పొలం ముందు దున్నినంకనే తమ పొలం దున్నాలి... దొర పొలం నాటు పెట్టినంకనే తమ పొలం నాటు పెట్టాలి... దొర పొలం కోసినంకనే తమ పొలం కోయాలి... కులాల వారిగా, వృత్తుల వారిగా దొరల ఇండ్లలో నిత్యం పని చేయాలి... విసునూరు రామచంద్రారెడ్డి ఆరోజుల్లో బాగ విలాసాలకు అలవాటు పడి ప్రజలను పీల్చి పిప్పి చేసి విలాసవంతమైన పెద్ద భవనాన్ని 2 లక్షల రూపాయలతో ఎలాంటి కూలీ నాలీ ఇవ్వకుండా ప్రజలతో కట్టించుకుండు... కన్నె పిల్ల కంట పడితే చాలు పక్కలోకి రావాల్సిందే... పని చేసే చోట చంటి పిల్లలకు కూడ పాలు ఇవ్వనీయని పరమ దుర్మార్గుడు.... పాలు ఇవ్వటానికి వెళ్లే స్త్రీల రొమ్ములు పిండి పాలు చూపిస్తే కానీ పంపియ్యని నీచుడు... బండమీద ఉమ్మి వేసి ఆరకముందే రావాలంటూ హుకుం జారీ చేసే వాడు... స్త్రీలను తన కోట గోడల ముందు నగంగా బతుకమ్మలు ఆడించి పైశాచిక ఆనందాన్ని పొందిన నికృష్టుడు.... అలాంటి దుర్మార్గుని ఆగడాలు ఎదిరించి నిలబడి కలబడిన గ్రామం కడివెండి.... దేశ్ ముఖ్ల దాష్టికాలు, అకృత్యాలపై తిరగబడేందుకు అదును కొరకు ఎదురు చూస్తున్న కడివెండి గ్రామ ప్రజలకు 'సంఘం'' చేయూత నిచ్చింది... ప్రజలు ఆంధ్ర మహాసభలో చేరి చైతన్యమవుతున్నారు. దొడ్డి కొమరయ్య ఉరుకలెత్తిన ఉడుకు రక్తం, దొరసాని పై ఉన్న కసి, సంఘ ప్రభావంతో గ్రామంలో గుత్పల సంఘం, గొడ్డలి సంఘం, ఒడిసెల సంఘం, కారం పొడి సంఘం, కొడవళ్ళ సంఘం, అన్ని వర్గాలతో ఏర్పాటు చేసిండు... ఆంధ్ర మహాసభ అందించిన ఆ చైతన్యం చూసి, పురిటిలోనే తెగ నరకాలని దేశ్ ముఖ్ అనుచరులు మిస్కిన్ అలీ, గడ్డం నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో 40 మంది సాయుధ గుండాలు, హైదరాబాద్ నుండి రాజకార్లు వందల మంది రాత్రి రాత్రే కడివెండి చేరుకొని ఆయుధాలతో అదును కొరకు ఎదురుచూస్తున్నరు.. రెచ్చ గొట్టి సంఘం నాయకుల ఇండ్లపై రాళ్లు రువ్వుతుండ్రు... సంఘం అంతా కూడింది... ఊరంతా ఒక్కటైంది... ఉద్యమమై సాగింది.
ఉద్యమం : అన్న మల్లయ్యతో కలిసి గుదుప పట్టుకొని జై కొడుతూ... కొదమసింహంలా ఉరిగింపులో ముందుండు కొమరయ్య... ఉప్పెనలా సాగిన జన ప్రళయం చూసి భయపడి విసునూరు గుండాలు గురిపెట్టి ఊరేగింపుపై గుండ్ల వర్షం కురిపించారు... కొమరయ్య కడుపులో తూటా దిగింది... వీరుడు నేలకు ఒరుగుతూ సంఘం వర్ధిల్లాలి, వెట్టిచాకిరి నశించాలి.. అంటూ కన్ను మూసిండు...
కొమరయ్య వీరమరణంతో తెలంగాణ అంతటా అగ్గి రాజుకుంది... వేలాదిమంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు... 1946 జులై 4న దొడ్డి కొమరయ్య మరణం తెలంగాణ విముక్తి పోరాటానికి ఆయుధం అయ్యింది... తెలంగాణ సాయుధమై ఆయుధాలు చేతబట్టి సమరానికి సిద్ధమైంది... పొలికేకై రజాకార్లను, దొరల భూస్వాములను ఊరి పొలిమేరలు దాటించి తరిమి కొట్టింది. లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచింది.... బువ్వలేని బడుగులకు భూమే ప్రధాన 'భూమిక ''అయ్యింది... 4 వేలమంది అసమాన త్యాగాల చరిత్రతో తెలంగాణ పుణీతమైంది... తెలంగాణ నేల నెత్తుటి ముద్దయింది.. ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అగ్ర భాగాన నిలిచింది... కొమరయ్య నెత్తుటితో తడిసిన ఈ నేల నేటికీ ఆ మహౌన్నత పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రజా పోరాటాలకు ఊపిరిలూదుతూనే ఉంది. దోపిడీపై యుద్ధ సాగుస్తూనే ఉంది.
- ఎన్. వెంకటేశ్వర్లు
సెల్: 9848720533