Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ చరిత్రలో జులై 4 అతి ముఖ్యమైన రోజు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అంకురార్పణ జరిగిన రోజు. భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే మహౌజ్వల ఘట్టంగా భాసిల్లిన వీర తెలంగాణ పోరాటాన్ని రగిలించిన అగ్గి రవ్వ.. దొడ్డి కొమరయ్య అమరుడయిన రోజు. కొమురయ్య అమరత్వానికి నేటితో 75ఏండ్లు నిండుతున్నాయి. దొడ్డి కొమురయ్య యాది.. వీర తెలంగాణ పోరాట స్ఫూర్తి.. నేటి తరానికీ మార్గదర్శనమై, నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దిక్సూచియై విరాజిల్లుతున్నవి.
తెలంగాణ, మరాట్వాడా ప్రాంతాలతో పాటు 3 కన్నడ జిల్లాలు కలిగిన హైదరాబాద్ సంస్థానాన్ని ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్న రోజులవి. పైన ముస్లిమ్ రాజు.. రాజుకు అండగా ఉన్న హిందూ దొరలు కలగలిసి.. హైదరాబాద్ సంస్థానంలోని అన్ని మతాల ప్రజలపై అనేక దౌర్జన్యాలను కొనసాగిస్తున్న ఫ్యూడల్ పాలన నడుస్తున్న కాలమది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం నడుపుతున్న జాతీయ కాంగ్రెస్ నాయకత్వం.. ''స్వదేశీ సంస్థానాల వ్యవహారాల్లో తలదూర్చ కూడదు'' అనే నియమాన్ని పాటిస్తూ.. నిజాం రాజుకు పరోక్షంగా అండగా నిలిచింది. నాటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడైన స్వామి రామానంద తీర్థ ఢిల్లీకి వెళ్లి, మహాత్మా గాంధీతో సమావేశమై, నిజాం రాజు ఆగడాలను వివరించి, హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు అండగా నిలబడాలని కోరినప్పుడు.. ''స్వదేశీ రాజు నిజాంకు వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు చేయకూడద''ంటూ ఆయన స్వామి రామానంద తీర్థను మందలించి ఆదేశాలు జారీ చేశాడు. ఆ నేపథ్యంలో.. గోసలు భరించలేని తెలంగాణ బిడ్డలు.. తిరుగుబాటు వైపు అడుగులు వేస్తున్నప్పుడు.. వారికి అండగా, ఆలంబనగా నిలిచిన ఏకైక శక్తి ఆంధ్ర మహాసభ. 1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరిగిన తొలి ఆంధ్రమహాసభతో తెలంగాణ ప్రజల సంఘటిత చైతన్యం మొదలయ్యింది. 1944లో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభ నాటికి.. ఆంధ్రమహాసభ ప్రధాన నాయకులందరూ కమ్యూనిస్టు ఆదర్శాలతో ప్రభావితులై.. కమ్యూనిస్టులుగా మారారు. కొండా వెంకట రంగారెడ్డి లాంటి దొరలు ఆంధ్రమహాసభ నుంచి బయటకు వచ్చి తెలంగాణ బిడ్డల పోరాటాలను వ్యతిరేకించడం మొదలెట్టారు.
ఆ విధంగా 1944 నుంచి తెలంగాణ ప్రజాపోరాటం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొనసాగింది. అయితే... నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన కారణాన... ఆంధ్రమహాసభ పేరుతోనే కమ్యూనిస్టుపార్టీ కార్యకలాపాలు కొనసాగాయి. అలా ఎర్రజెండా నీడలో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై అటు దొరలూ, ఇటు నిజాం రాజు అకృత్యాలను ఎదుర్కొనడానికి పోరాటం మొదలుపెట్టారు. ఊరూరా, వాడవాడలా ఆంధ్ర మహాసభ శాఖలు విస్తరించాయి. ఆంధ్రమహాసభకు పల్లెజనం పెట్టిన పేరు ''సంఘం''. చేతులలో గుత్పలతో దొరల గుండాల దౌర్జన్యాలను ఎదుర్కొనేవారు కాబట్టి సంస్థకు మరో పేరు ''గుత్పల సంఘం''. ఆ సంఘానికి నాటి నల్లగొండ జిల్లా జనగామ తాలూకా కడివెండి గ్రామం ఓ ప్రధాన కేంద్రం.
తెలంగాణ ప్రజలను అరిగోసలు పెడుతున్న దొరలలో పెద్ద దొర.. జనగామ తాలుకాకు చెందిన దేశ్ ముఖ్ విసునూరు రామచంద్రా రెడ్డి. విసునూరు దేశ్ముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా సంఘం అండతో ప్రజలు తిరగబడ్డారు. జనగామ తాలుకాలోని పాలకుర్తి గ్రామంలోని చిట్యాల ఐలమ్మ పండించిన పంటను కాజేయడానికి దొర పన్నాగాలు వేసినప్పుడు.. సంఘం అండతో ఐలమ్మ దొరకు ఎదురుతిరిగింది. సంఘం నాయకులైన కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరి రావులు పాలకుర్తికి చేరుకుని సంఘం వాలంటీర్లను సమీకరించి దొర గుండాలని ఎదిరించి పొలంలోని పంటని బండ్లకు ఎక్కించుకుని ఐలమ్మ ఇంటికి చేర్చారు. తన కింద బానిసలుగా బతికిన ప్రజలు తిరగబడడంతో విసునూరు దొర ఉగ్రుడయ్యాడు. భీమిరెడ్డి నరసింహారెడ్డితో పాటు మిగతా కమ్యూనిస్టు పార్టీ నాయకులపై నిజాం పోలీసుల అండతో కేసులు బనాయించి విసునూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంత చేసినా ఐలమ్మ మాత్రం బెదరలేదు. ఐలమ్మ ఇంటికి చేరుకున్న పంట దొరకు దక్కకుండా పోయింది. దాంతో.. తన గుండాలను పురిగొల్పి సంఘం నాయకులపై దౌర్జన్యాలు కొనసాగించాడు దొర. దొర జులుం ఎదిరించే క్రమంలో 1946 జులై 4న.. కడవెండి గ్రామ వీధుల్లో.. సంఘం జండాలతో ప్రజల ఊరేగింపు సాగింది.
దొర గడీలో నక్కి దాక్కున్న గుండాలు ఊరేగింపుపై తుపాకులతో కాల్పులు జరిపారు. ముందు వరుసలో ఉండి.. ''సంగానికి జై'' అంటూ నినదిస్తూ సాగుతుస్న దొడ్డి కొమురయ్య ఆ తూటాలకు నేలకొరిగి ప్రాణాలు వదిలాడు. కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య, సంఘం నాయకులు మంగలి కొండయ్య, నరసయ్యలకు తూటాలు తగిలి గాయాలయినవి. ఆగ్రహౌదగ్రులైన ప్రజలు కాల్పులకు వెరవకుండా గుండాలను తరిమికొట్టి దొర గడీకి అగ్గి పెట్టి బూడిద పాలు చేశారు. కొమురయ్య అమరత్వంతో తెలంగాణ బిడ్డల పోరాటం సాయుధ రూపు సంతరించుకున్నది. గుత్పలు వదిలేసిన ప్రజలు తుపాకులు చేత బట్టి నిజాం రాజ్యాన్ని కూల్చడానికి.. దొరల రాక్షసత్వానికి గోరీ కట్టడానికి సంసిద్ధులయ్యారు.
అలా 1946 జులై 4న ఆరంభమైన వీర తెలంగాణ పోరు.. 1951 అక్టోబర్ 21 వరకు సాగింది. తొలుత నిజాంకు, భూస్వాములకూ వ్యతిరేకంగా మొదలైన తెలంగాణ బిడ్డల పోరాటం... అటు తర్వాత దొరలకు మద్దతుగా గ్రామాలలోకి దిగిన నెహ్రూ - పటేల్ సైన్యాలకు వ్యతిరేకంగా కూడా కొనసాగింది. బాంచన్ కాల్మొక్తా అంటూ బతికిన తెలంగాణ బిడ్డలు.. బరిసెలు, బందూకులూ చేతబట్టి... దొరల రాజ్యం కూల్చడానికి ఉద్యమించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో రైతాంగపోరాటం ఉధృతంగా సాగింది. దొరలు ఊర్లను విడిచి పరారయ్యిండ్రు. మూడు వేల గ్రామాలు విముక్తమై... గ్రామ రాజ్య కమిటీల ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ఏర్పడింది. దొరల కబ్జాలో ఉన్న పది లక్షల ఎకరాల భూమి పేద రైతులకు పంచబడింది. రుణ పత్రాలు రద్దయ్యాయి. వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగాయి. వెట్టి చాకిరీ రద్దయింది. కుల వివక్ష, లింగ వివక్ష కట్టడి చేయబడినాయి.
దేశ స్వాతంత్య్రం తర్వాత.. ఢిల్లీ గద్దెనెక్కిన నెహ్రూ ప్రభుత్వం నిజాం రాజును సకల మర్యాదలతో అరుసుకున్నది. ఆయనకున్న ఆస్తులు, రాజభవనాలు ఆయనవేనని ప్రకటించింది. హైదరాబాద్ రాష్ట్రానికి ''రాజ్ ప్రముఖ్'' పదవినిచ్చి సత్కరించింది. మరోవైపు తెలంగాణ ప్రజలపై తన సైనిక చర్యను కొనసాగించింది. పటేల్ సైన్యాలు తెలంగాణ పల్లెల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేని డాక్టర్ జయసూర్య (సరోజినీ నాయుడు కొడుకు) నాయకత్వంలోని మేథావుల బృందం నాటి గవర్నర్ జనరల్ జే.ఎన్. చౌదరిని కలిసి... తెలంగాణ ప్రజలు కూడా భారతీయులేననీ.. వారి ఆకాంక్షలను గుర్తించి ఉద్యమకారులతో చర్చలు జరపాలని ప్రతిపాదించారు. నెహ్రూ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కర్కశంగా తిరస్కరించింది. నిజాం హయాంలో... నెత్తిన రూమీ టోపీలు ధరించి... తెలంగాణ బిడ్డలపై జులుం చెలాయించిన దొరలు... ప్రజలు తిరగబడడంతో పల్లెల నుంచి పారిపోయి, సెప్టెంబర్ 17, 1948 తర్వాత... పటేల్ సైన్యాల అండతో నెత్తిన గాంధీ టోపీ ధరించి మళ్లీ పల్లెల్లోకి అడుగుపెట్టి... తమ పాత దోపిడీ విధానాలను యథావిథిగా కొనసాగించిన వైనాన్ని తెలంగాణ బిడ్డ, ప్రముఖ రచయిత దాశరధి రంగాచార్య తన రచనల్లో (జనపథం, మోదుగుపూలు, జీవనయానం) కండ్లకు కట్టినట్టు రికార్డు చేసిండు.
సామాన్య ప్రజలకున్న మతపరమైన, ప్రాంతీయ అస్తిత్వ సెంటిమెంట్లను తమ స్వార్థ రాజకీయాలకు అనుకూలంగా మలుచుకుని దుర్వినియోగ పరిచే దుష్ట రాజకీయం నేడు జాతీయస్థాయిలో.. తెలుగు రాష్ట్రాల్లోనూ నడుస్తున్నది. పాలకుల కుల మతాల కుట్రలను ఛేదిస్తూ.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. అసలు సమస్యలపై నికరంగా పోరాడిన చరిత్ర వీర తెలంగాణది. ప్రజా పోరాటాలు ఎలా ఉండాలో.. పాలకవర్గాల టక్కుటమార ట్రిక్కులను, విచ్ఛిన్నకర రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో.. దేశ ప్రజలందరికీ దిశానిర్దేశనం చేసిన ఘన చరిత్ర తెలంగాణ బిడ్డలది. ప్రజలందరూ ఐక్యమై.. తమ ఉమ్మడి హక్కుల సాధన కోసం, మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఒక్కటిగా పోరాడగలిగే గంగా - జమునా తెహజీబ్ తెలంగాణ సంస్కృతి. ప్రజల అమాయకపు సెంటిమెంటులను వాళ్ళకు వ్యతిరేకంగా సంధిస్తూ.. వారి సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోని ఈ కాలపు పాలకులు తెలంగాణ సింబల్ ఎన్నటికీ కాబోరు. నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ సింబల్స్ అంటే.. వీరతెలంగాణ పోరాట యోధులైన.. దొడ్డి కొమరయ్య, చిట్యాల ఐలమ్మ, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మగ్దూం మొహియుద్దీనులే! ''అనల్ ముల్క్'' (ముస్లింలందరూ ప్రభువులే) ''జిల్ ఉల్ అల్లా'' (నిజాం రాజు అల్లా ప్రతినిధి) అంటూ.. నిజాం రాజు తాబేదార్లు కొనసాగించిన మతోన్మాద ప్రచారాలకు లొంగకుండా ప్రజల పక్షం వహించి ప్రాణాలొడ్డిన షోయబుల్లా ఖాన్ను మించిన తెలంగాణ సింబల్ ఎవరు? జల్ జంగల్ జమీన్ కోసం.. దున్నేవాడికే భూమి దక్కాలంటూ.. కష్టజీవుల హక్కులు నిలబడాలంటూ.. విముక్తి కోసం పోరాడి చరిత్ర సృష్టించిన కొమురం భీం, షేక్ బందగీ, ఆనాటి మహౌన్నత తెలంగాణ సాయుధ పోరాటానికి రాజకీయ నాయకత్వం అందించిన సుందరయ్యల వారసత్వమే నేటి తెలంగాణ బిడ్డలందరిది. దొడ్డి కొమురయ్య అమరత్వపు విలువను.. వీర తెలంగాణ పోరాట స్ఫూర్తిని.. నేటి ప్రజలు పుణికిపుచ్చుకుని.. కుల, మత, ప్రాంతీయ విభజన వాదాలను పూర్వపక్షం చేస్తూ ముందుకు సాగితే.. ప్రజాకంటక శక్తుల పరాజయము, ప్రజాశ్రేణుల విజయమూ తథ్యం. వీర తెలంగాణ చరిత్రయే అందుకు ప్రబల నిదర్శనం.
- ఆర్.రాజేశమ్
సెల్ : 9440443183