Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యమలోకంలో యమధర్మరాజు కొలువుతీరి ఉన్నాడు. పాపులతో సభ కిక్కిరిసి ఉంది. చిత్రగుప్తుడు పెద్ద చిట్టా పుస్తకం ముందుపెట్టుకుని, యముడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు.
''చిత్రగుప్తా! ఆలస్యం ఎందులకు? చిట్టా చదువుము!'' ఆదేశించాడు యముడు.
''చిత్తం!'' అంటూ చిట్టా తెరిచాడు చిత్రగుప్తుడు.
''సుబ్బారావ్!'' అంటూ పిలిచాడు. వెంటనే సుబ్బారావు బోనులోకి వచ్చి నిలబడ్డాడు.
''ఈ సుబ్బారావు 99సార్లు అబద్ధం ఆడాడు ప్రభూ!'' అని చిట్టా చదివాడు చిత్రగుప్తుడు.
''ఇంకొక్క అబద్ధం చెబితే సెంచరీ కొట్టేవాడివి కదా! సరే ఇతడికి శూలదండన శిక్ష విధిస్తున్నాను!'' అన్నాడు యమధర్మరాజు.
''అయ్యా! నాదొక మనవి!'' అడిగాడు సుబ్బారావు.
''ఏమది?'' అడిగాడు యమధర్మరాజు.
''శూలదండనం బదులుగా సలసల కాగే నూనెలో వేయించండి ప్రభూ!'' ప్రార్థించాడు సుబ్బారావు.
అంగీకరించాడు యముడు.
''సుందరీ!'' పిలిచాడు చిత్రగుప్తుడు. ''ఈమె కోడలిని రాచి రంపాన పెట్టింది ప్రభూ!'' అన్నాడు.
''పేరు సుందరి అని పెట్టుకుని ఇంత వికృతంగా వ్యవహరిస్తావా? ఈమెను ఏనుగులతో తొక్కించండి!'' అన్నాడు యముడు కోపంగా.
''అయ్యా నాదొక ప్రార్థన!'' చేతులు జోడించింది సుందరి.
''ఏమి నీ ప్రార్థన!'' చిరుకుగా అడిగాడు యముడు.
''ఏనుగులతో తొక్కిస్తే తట్టుకోలేను! నన్ను నూనెలో వేయించండి దేవా?'' చేతులు జోడించి ప్రార్థించింది సుందరి!
''ఉు ఉు..'' అంటూ అంగీకార సూచకంగా తలూపాడు యముడు.
''మొద్దుశీనూ!'' అంటూ పిలిచాడు చిత్రగుప్తుడు. ''ఇతడు తన బావ కళ్ళలో ఆనందం చూడాలని మూడు హత్యలు చేశాడు ప్రభూ!'' అన్నాడు.
''వీడిని రంపాలతో కోయించండి!'' ఆజ్ఞాపించాడు యముడు.
''బావ ఆనందం కోసం నేను చేసిన తప్పులకి పశ్చాత్తాపపడుతున్నాను దేవా.. నా శిక్షను రద్దుచేసి క్షమాభిక్ష పెట్టండి!'' వేడుకున్నాడు.
''ఏమి కండకావరము! నేను శిక్ష విధించిన తర్వాత రద్దు చేయుటయా అసంభవం!'' హూంకరించాడు యముడు.
శ్రీను భయపడ్డాడు! ''రంపాలతో కోసే శిక్షను మార్చి, సలసల కాగే నూనెలో నన్ను వేయించి శిక్షించండి!'' అంటూ ప్రాధేయపడ్డాడు.
''ఊు వీడిని కూడా నూనెలో వేయించండి!'' అంటూ ఆదేశించాడు యముడు.
''అయ్యా! ఈ విధంగా శిక్షలు మార్చుట సమంజసం కాదేమో సమవర్తీ!'' అన్నాడు చిత్రగుప్తుడు సణుగుతూ.
''చిత్రగుప్తా! శిక్షల వల్ల భయం పెరిగి, తప్పులు చేయటం మానుకోవాలని, ఈ విధమైన ఏర్పాటు చేయబడినది. అయినా మానవులు తప్పులు చేస్తూనే ఉన్నారు. మనం శిక్షలు విధిస్తూనే ఉన్నాము. మార్పేమీ లేదు కదా! ఈ మాత్రం దానికి ఏ తప్పుకి ఏ శిక్ష విధించినా ఒకటే! నీ సణుగుడు మాని, పాపులను ప్రవేశపెట్టుము'' అన్నాడు యముడు.
''అమ్జాద్ ఖాన్!'' అని పిలిచాడు చిత్రగుప్తుడు. ''ఇతడు ఉగ్రవాది! బాంబుపెట్టి 10మంది ప్రాణాలు బలిగొన్నాడు!'' అన్నాడు.
''ఈ ఉగ్రవాదిని ఎత్తైన పర్వతములపై కిందికి దొర్లించి, ఆపై బండరాళ్ళు కూడా వేయండి!'' అన్నాడు యముడు.
''నేను జీహాద్ చేశాను! దానికి ఇంత పెద్ద శిక్షా! నాకు కూడా శిక్షను మార్చి, సలసల కాగే నూనెలో వేయించండి సాబ్!'' అన్నాడు అమ్జాద్‌ఖాన్.
''వీడిని నెల రోజులు సలసల కాగే నూనెలో వేయించండి'' ఆదేశించాడు యమధర్మరాజు.
అమ్జాద్‌ఖాన్ లోలోపల సంతోషపడుతూ వెళ్ళిపోయాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన పాపులు కూడా ఏ శిక్ష విధించినా, దాన్ని మార్చి సలసల కాగే నూనెలో వేయించే శిక్ష విధించాలని విజ్ఞప్తులు చేశారు. దాంతో యమధర్మరాజుకి విసుగొచ్చింది.
''చిత్రగుప్తా! ఎందుకో పాపులందరూ మిగిలిన శిక్షలు వద్దని, కేవలం సలసల కాగే నూనెలో వేయించే శిక్ష మాత్రమే విధించాలని ప్రాధేయపడుతున్నారు. వారి ముచ్చట మనమెందుకు కాదనవలె! ఈ రోజు విచారించవలసిన పాపులందరికీ సలసల కాగే నూనెలో వేయించే శిక్షనే విధించుతున్నాను. అమలు జరిపింపుము'' అని అంత:పురానికి బయలుదేరాడు. అంతలోనే ఆగి చిత్రగుప్తుడుని పిలిచాడు.
''శిక్ష అమలులో ఏ లోటూ జరుగరాదు! జాగ్రత్త!'' అంటూ హెచ్చరించాడు యముడు.
''మీరు నిశ్చింతంగా ఉండండి ప్రభూ! మాన పాత పర్యవేక్షకుడిని తొలగించాను. శిక్షల విధింపు, అమలులో బాగా అనుభవం గల తెలంగాణ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను పర్యవేక్షణకై పెట్టాను. చాలా బ్రహ్మండంగా పనిచేస్తున్నాడు. మీరు నిశ్చింతగా ఉండండి ప్రభూ!'' హామీ ఇచ్చాడు చిత్రగుప్తుడు.
యముడు సంతృప్తిగా అంత:పురానికి వెళ్ళాడు. యముడి భార్య శ్యామలాదేవి ఎదురొచ్చింది!
''ఇంత తొందరగా వచ్చేశారు! ఏమి విశేషాలు!'' అడిగింది శ్యామలాదేవి.
''సభను తొందరగా ముగించాను! నాకు ఏదైనా తినాలని ఉంది! పకోడీలు చేయించి పెట్టు దేవీ?'' అన్నాడు యముడు.
శ్యామల మాట్లాడలేదు.
''ఏమి దేవీ మాట్లాడవు? ఈ రోజు తొందరగా వచ్చితిని అని సంతోషపడుతావని అనుకుంటిని, కాని పకోడీలు చేయమంటే మాట్లాడుట లేదు. ఎందులకు?'' ప్రశ్నించాడు.
''మీరు తొందరగా వచ్చినందుకు సంతోషమే! కాని పకోడీలు చేయమంటేనే ఇబ్బంది కలుగుతున్నది. వంట నూనెల ధరలు ఎప్పుడో స్వర్గలోకం దాటిపోయాయి! నిన్న గ్యాస్ సిలండర్ ధర కూడా నూనె ధరలను అందుకునేందుకు ఎగిసిపడింది! అందుకే మీకు పకోడీలు చేసి పెట్టడం కుదరనే కుదరదు!'' నిక్కచ్చిగా అన్నది శ్యామలాదేవి.
భార్య మాటలు పూర్తికాకముందే యముడు లేచి పాపులను శిక్షించే నరకానికి పరుగెత్తాడు! అక్కడ దృశ్యాలు చూసి యముడికి కళ్ళు తిరిగాయి! తమాయించుకుని ''చిత్రగుప్తా'' అని అరిచాడు. ''చిత్తం!'' అంటూ ప్రత్యక్షమయ్యాడు చిత్రగుప్తుడు.
శిక్షలు అనుభవిస్తున్న పాపులను చూపించాడు యముడు.
పాపులందరినీ వరసగా పెద్ద బానాలలో కూర్చోబెట్టారు. అన్ని బానాలలో ఒకే చుక్క నూనె వేశారు. ఒక్క గ్యాస్ సిలిండర్ నుండి పైప్‌లైన్ ద్వారా ఆ బానల కింద సన్నటి మంట పెట్టారు. ఆ మంట దీపం కన్నా సన్నగా వస్తున్నది. పాపులందరూ ఆనందంగా ఆ శిక్షను అనుభవిస్తున్నారు.
''ఇదేమి శిక్ష చిత్రగుప్తా! ఒక్క నూనె చుక్కతో సన్నటి మంట మీద వేయిస్తే ఎలా?'' అన్నాడు యముడు.
''చిత్తం! నూనెలు, గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మీరు కేటాయించిన బడ్జెట్లో పాపులకు సరిపోయేటంత నూనె గ్యాస్ సిలిండర్లు కొనలేకపోతున్నాము. అందుకే కొద్దిరోజులుగా ఉన్న నూనె, గ్యాస్ సిలిండర్లతో ఇలా సరిపెడుతున్నాము ప్రభూ!'' అన్నాడు చిత్రగుప్తుడు వినయంగా.
పాపులందరూ తమకు విధించిన శిక్షలకు బదులుగా నూనెలో వేయించే శిక్ష విధించాలని ఎందుకు ప్రాధేయపడ్డారో యముడికి అప్పుడు అర్థమైంది! ఇంటివద్ద పకోడీలు చేయనని శ్యామలాదేవి ఎందుకు తెగేసి చెప్పిందో కూడా అర్థమైంది! దాంతో చిత్రగుప్తుడి వైపు సానుభూతిగా చూశాడు!
యముడి చూపుల్లోని భావం చిత్రగుప్తుడికి అర్థమైంది! ''అయ్యా మా ఇంట్లో మంచి నూనె వాడకం గత రెండు నెలల నుండీ ఆపేశాము!'' అన్నాడు తలదించుకుని.
''సరే! సరే! మన సంసారాల సంగతి తర్వాత చూసుకుందాం! నూనెలు, సిలిండర్ కొనటానికి నిధులు పెంచమని మన కుబేరుడికి విజ్ఞప్తి పంపిచుము!'' ఆదేశించాడు యముడు.
''ఆ పని ఎప్పుడో చేశానండయ్యా! కాని నిధులు ఇవ్వడం కుదరదని కుబేరుడు ఇంతకు ముందే ప్రత్యుత్తరం పంపాడు!'' విన్నవించుకున్నాడు చిత్రగుప్తుడు!
''ఏం ఎందుకు కుదరదంట?'' చిరాకుగా ప్రశ్నించాడు.
మన భారత ప్రధాని ఇప్పటికే తనకు 10లక్షల కోట్ల అప్పుకావాలని కుబేరుడికి ధరఖాస్తు పెట్టుకున్నాడట. అందువల్ల ఇంకెవరికీ నిధులు కేటాయించుట సాధ్యం కాదని కుబేరుడు తెలిపాడు! పాపం ప్రపంచం అంతటా అప్పులు తెచ్చి, ఇక చివరికి మన కుబేరుడిని దేబిరించినట్టున్నాడు భారత ప్రధాని!'' వివరించాడు చిత్రగుప్తుడు.
పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పటికే విపరీతంగా పెంచారు. వంటనూనెలు, గ్యాస్ ధరలు పెంచారు. నిరుద్యోగం పెంచారు. అన్నింటి మీదా జీఎస్టీ బాదుడు. వీటికి తోడు 70లక్షల కోట్ల అప్పులు భరిస్తున్నారు భారతీయులు. పాపం చేసిన వారు పుణ్యం చేసినవారు అనే తేడా లేకుండా భారతీయులందరికీ బతికుండగానే నరకం కనబడుతున్నది! ఇంకా ప్రత్యేకంగా మనం విచారణ జరిపి శిక్షలు విధించటం అనవసరం! ఒక తప్పుకు రెండుసార్లు శిక్షలు విధించటం అన్యాయం! ఇక నరకలోకం ఉనికి అనవసరం! ఇదే విషయం త్రిమూర్తులకు మనవి చేస్తాను! అంటూ యముడు వెళ్ళిపోయాడు.
- ఉషాకిరణ్