Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 సెంకడ్ వేవ్ అదుపుతప్పి ఆందోళనగా మారింది. కార్పొరేట్ దోపిడీ సాగుతూనే ఉంది. ప్రభుత్వం వద్ద మాటలు తప్ప చేతల్లేవు. మనదేశంలోనే గాక ప్రపంచానికే వ్యాక్సిన్ దాతలమన్న ఆత్మస్తుతి, శ్రుతిమించినది. చప్పట్లు కొట్టించి, దీపాలు పెట్టించి ప్రచార ప్రహసనాలు నడిపి పసలేని ప్యాకేజీతో నామకార్థంగా ముగించారు. 18ఏండ్లు దాటిన వారికి టీకా ఉత్త మాటగా మిగిలింది. ఒకప్పుడు భారత్‌ది వ్యాక్సిన్ల తయారీలో అగ్రస్థానం. నేడు ప్రభుత్వ ఫార్మారంగాన్ని చేజేతులా.. ప్రయివేటు చేతుల్లో పెట్టి చేతులెత్తేశారు. రెమిడిస్వేర్ వంటి మందులు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ప్రజారోగ్యం ప్రథమం అన్న వాతావరణం మారిపోయింది. పేదవాడికి రోగం వస్తే.. చావే పరిష్కారం అనే పరిస్థితి దాపురించింది.
పెట్టుబడి.. రాబడి.. లాభాలు.. అన్నీ బడాకంపెనీల సూత్రాల ప్రకారమే.. ''కరోనా''ను సైతం క్యాష్ చేసుకున్నారు. దీనులను, హీనులను కనీసం చెయ్యి పట్టి చూసేవాడేలేడు. ఎవడిచావు వాడు చావడమే.. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు వుండీ రాజ్యం అనాథగా మారింది.
కళ్ళోలంలో ఒక కాలం ఉంటుంది. ఆ కాలానికి కూడా తల అనించిన భుజం ఒకటి ఉంటుంది. ఆ భుజం కూడా చెమట తడి అంటిన భుజం. లాభాపేక్ష లేకుండా వ్యవస్థ శిథిలావస్థకు చేరకముందే శస్త్ర చికిత్స చేయాలనే దృఢమైన సంకల్పం దానిది. ప్రజలకు ఆపద వచ్చినప్పుడల్లా కమ్యూనిస్టులే ముందుకొచ్చిన చరిత్ర అది. సునామీలు, వరదలు, కరువు కాటకాలు, ఊళ్ళకు ఊళ్ళు శ్మశానాలుగా మారిన గత్తరల చరిత్రలనేకం. అయోమయంలో ఆభద్రత భావంలో ఆపత్కాలంలో ప్రజలకు ఆసరా ఇచ్చిన చెయ్యి అప్పుడూ ఇప్పుడూ ఏప్పుడూ కమ్యూనిస్టులదే.. ప్రజల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అనుక్షణం అలుపెరగని చరిత్ర కమ్యూనిస్టులదే.. 'సేవాగుణం' కమ్యూనిస్టుల సంప్రదాయంలోనే భాగం.
ఈ ప్రపంచంలో ప్రతి ఇజం స్వార్థం కోసం పుట్టిందే.. కానీ నిజాల పునాదుల్లోంచి పుట్టింది కమ్యూనిజం. ఆపత్కాలంలో అవరోధాలను అధిగమిస్తూ ఆలోచనలకు రూపమిచ్చి అడుగులు కదిపింది. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ''కార్యకర్తలంత కదిలి కరోనా బాధితులను ఆదుకోండి.. ప్రజల ప్రాణాలను కాపాడండి..'' అంటూ పిలుపునిచ్చింది. ఆ పిలుపునందుకుని వాలంటీర్స్‌గా ప్రంట్‌లైన్ వారియర్స్‌గా రోగులకు సేవలు అందించేందుకు గొప్ప చైతన్యంతో కదిలారు పార్టీ కార్యకర్తలు. ప్రజలతో మమేకం అయ్యారు. కరోనా బాధితుల సేవలో 60రోజులుగా కరోనాపై యుద్ధమే చేశారు. కన్నవారు.. సమీప బంధువులు కూడా ముఖం చాటేసుకుంటున్న తరుణంలో.. కమ్యూనిస్టుల కోవిడ్ ఉచిత ఐసోలేషన్ కేంద్రం మే 3న సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కష్టాల్లో ఉన్నామంటే ఆదుకునే దాతలు, ఆపదలో ఉన్నామని తెలిస్తే.. పరిగెత్తుకొచ్చే స్వచ్ఛమైన మనుషుల చేతులుకలిసాయి. కార్యకర్తలకు తోడు ప్రజల పట్ల నిబద్దత కలిగిన డాక్టర్లు, నర్సులు రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా తీవ్ర ఒత్తిళ్ళలోనూ చిరునవ్వుతోనే విధులు నిర్వహించారు. అడ్మిట్ అయినప్పటి నుండి డిశ్చార్జిదాకా పెషెంట్లకు తోడైవున్నారు. ఈ కష్టకాలంలో వారు అందించిన సేవలు నిరూపమానం. కుటుంబ సభ్యులు, సమీప బందువులు కూడారాని.. కోవిడ్ వార్డుల్లో బాధితులకు ''నర్సులే'' అండా దండా. తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ.. విధులు నిర్వహిస్తున్న ఈ సేవా సైన్యానికి సెల్యూట్.. బాధితులకు భరోసానిచ్చే ప్రాణదాతలుగా డాక్టర్స్ బృందం సమర్థవంతంగా పనిచేసింది. ఒక్క సుందరయ్య విజ్ఞాన కేంద్రమే కాదు, కమ్యూనిస్టుల ఐసోలేషన్ సెంటర్లు, సహాయ కేంద్రాలు తెలంగాణ రాష్ట్ర మంతటా ఆపత్కాలంలో కోవిడ్ బాధితులకు బాసటగా నిలిచాయి. కార్పొ''రేటు'' ఆసుపత్రుల్లో వైద్యం కోసం లక్షల్లో పోగొట్టుకుని బాగుపడని వారు ఇక్కడ బాగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్ళిన సందర్భాలున్నాయి. కోవిడ్ పెషెంట్స్కి పౌష్టికాహారం సూరీడు లేవకుండానే వారి ముంగిట్లో వేడినీళ్ళతో ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు అనేక రకాల పండ్లు, పప్పుదినుసులు, డ్రైఫూట్స్ సకాలంలో అందించారు. సంపూర్ణ ఆరోగ్యం పొందిన బాధితులెందరో వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ ''కష్టాల్లో కమ్యూనిస్టులెప్పుడు ముందుంటారని నిరూపించారు, మీ సేవలెప్పుడూ మేము మరిచిపోము'' అంటూ సుందరయ్యగారి చిత్రపటానికి దండంపెట్టి వెళ్లిన ఘటనలెన్నో... ఇక్కడ చికిత్స పొంది ఆరోగ్యంతో తిరిగివెళ్తున్నవారు పొందే ఆనందం, వారి చిరునవ్వులు చూసినప్పుడు ఎంతో తృప్తిగా ఉందని కార్యకర్తలు తమ శ్రమను కూడా మరిచిపోయారు. ఇక్కడ చేరిన ప్రతి పెషెంటుకూ వారు కుటుంబ సభ్యులుగా మారిపోయారు. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరేదాంట్లో లేదనీ, త్యాగంలోనే సేవకు విలువనీ ఆది ఆచరించేవాడే నిజమైన కమ్యూనిస్టనీ వారు నిరూపించారు. ''ఎంతచెప్పినా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐసోలేషన్ సెంటర్ రుణం తీర్చుకోలేం'' అని కరోనా పెషెంట్ కృష్ణ (కవి) అన్న పలుకులివి. ఇతర పార్టీలకు కమ్యూనిస్టులకు కచ్చితమైన తేడా కనిపించింది. మనిషికి ప్రాణం కంటే విలువైనది మరేదిలేదు. ఆ ప్రాణం ప్రజల కోసం తృణప్రాయంగా ఇవ్వడానికైనా వెనుకాడని సంసిద్ధత, ఉక్కు క్రమశిక్షణ గల కార్యకర్తలే ఈ విజయానికి పునాదులు.
మన ముందు మూడవ ముప్పు అత్యంత సమీపంలోనే ఉందనీ, అది డెల్టాఫ్లస్ వేరియంట్ రూపంలో సీరియస్‌గా పొంచి ఉన్నట్టు జాతీయ వైరాలజీ విభాగం శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రజల్ని పాలకులను అప్రమత్తం చేయాలని తగు సూచనలు, జాగ్రత్తలు పాటించాలని కోరారు. మూడవ ముప్పు నుంచి బయటపడటమే ఏకైక కర్తవ్యంగా ప్రజల్ని, ప్రభుత్వాల్ని మేల్కొలిపి మరో పోరాటానికి సంసిద్ధం కావాలి. మూడో ముప్పుకైనా ఈ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేద్దాం.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్: 9490098343