Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరవయ్యో శతాబ్దపు బూర్జువా అర్థశాన్త్రవేత్తల్లోకెల్లా అత్యంతలో తైన దృష్టి కలిగినవాడు జాన్ మేనార్డ్ కీన్స్్. పెట్టుబడిదారీ వ్యవస్థలో ముఖ్యమైన లోపం అది ఎప్పుడూ భారీ నిరుద్యోగంతో పెనవేసుకుని ఉండడమేనని కీన్స్ గుర్తించాడు. ఆ కారణం వలన ఆ వ్యవస్థను తిరస్కరించి ఆ స్థానంలో ఒక కొత్త వ్యవస్థను ప్రజలు ఏర్పాటు చేసుకునే ప్రమాదం ఉందని అతడు ఆందోళన చెందాడు. పెట్టుబడులను పెట్టే విషయాన్ని కొంతమంది పెట్టుబడిదారులు, ఎవరికి వారు, విడివిడిగా నిర్ణయించుకుంటారు. అందువలన వారు పెట్టే మొత్తం పెట్టుబడి అంతా కలిపితే పూర్తిస్థాయిలో ఉపాధి కల్పన జరిగేందుకు సరిపడా ఉండదు. (ఎప్పుడో అరుదుగా పెట్టుబడిదారులు అత్యుత్సాహపడే సందర్భాలు వస్తాయి. అప్పుడు మాత్రమే పూర్తిస్థాయి ఉపాధి కల్పన సాధ్యపడుతుంది) పూర్తి స్థాయిలో ఉపాధికల్పన ఉంటే జరిగే ఉత్పత్తినంతటినీ వినియోగించగల డిమాండ్ ఉండదు. మొత్తం జరిగిన ఉత్పత్తిని అంతటినీ వినియోగించ గలిగినంత కొనుగోలు శక్తి మార్కెట్లో ఉండాలంటే అంతమేరకు పెట్టుబడులు అదనంగా పెడుతూవుండాలి. కాని పెట్టుబడిదారుడు ఎప్పుడూ తన ఉత్పత్తి అమ్ముడుపోవడం పైనే దృష్టి ఉంచుతాడు తప్ప మొత్తం దేశంలోని ఉత్పత్తులన్నీ అమ్ముడుపోవడం ఎలా అన్నది ఆలోచించడు. అందుకే నిరుద్యోగం భారీగా పెరుగుతూవుంటుంది.
ఈ కారణం దృష్ట్యా, పెట్టుబడులు పెట్టే నిర్ణయాలను సమాజం తరఫున ప్రభుత్వమే చేయాలని, అందుకనుగుణంగా విత్త, ద్రవ్య విధానాలను రూపొందించాలని కీన్స్ సూచించాడు. తద్వారా, మొత్తం ఉత్పత్తినంతటినీ వినియోగించగలిగేంత ఉపాధికల్పన జరిగేటట్టు ప్రభుత్వమే గ్యారంటీ చేయగలుగుతుందని, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ సాఫీగా, ఒడిదుడుకులు లేకుండా సాగిపోగలదని కీన్స్ భావించాడు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టే విధానాన్ని ప్రభుత్వమే నియంత్రించడం గనుక జరిగితే ఇక ఆ వ్యవస్థలో ఎటువంటి లోపాలూ లేనట్టేనని కీన్స్ తలిచాడు. అందుచేత ఉత్పత్తి సాధనాలను సమాజపరం చేయాల్సిన అవసరం, అంటే సోషలిజం ఏర్పడాల్సిన అవసరం లేదని అతను అనుకున్నాడు. ''ఉత్పత్తి సాధనాల మీద అధికారం ఎవరికి ఉంది అన్నది ముఖ్యం కాదు. సమాజం ఆ అధికారాన్ని చేతుల్లోకి తీసుకోనవసరం లేదు. ఉత్పత్తి అయిన సరుకులన్నిటినీ వినియోగించగలిగే వనరులు సమాజంలో ఉండేలా చూసుకోవడం, ఉత్పత్తిదారులకు తగిన లాభాలు వచ్చేలా చూడడం- ఈ రెండూ ప్రభుత్వం చేయగలిగితే సరిపోతుంది'' అని అన్నాడు.
కీన్స్ జీవించివున్న కాలంలోనే, అప్పటి మార్క్సిస్టు మేథావులు కీన్స్ సూచిస్తున్న పరిష్కారం ఎంతమాత్రమూ సరిపోదని ఆ ప్రతిపాదనలోని లోపాన్ని ఎత్తిచూపారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోపలే, కేవలం పెట్టుబడులను ప్రభుత్వం నియంత్రించినంత మాత్రాన నిరుద్యోగ సమస్య తొలగిపోదని వారు వివరించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా గడిచిన దశాబ్దాల అనుభవాలు ఆ విషయాన్నే మరింత బలంగా ధృవపరుస్తున్నాయి.
తగినంత కొనుగోలుశక్తి లేకపోవడం అనే ఒక్క కారణం వల్లనే పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం ఏర్పడుతుందని అనుకోరాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగాలంటే ఎంతోకొంత స్థాయిలో నిరుద్యోగం ఉండటం అవసరం. - దీనినే మార్క్స్ ''శ్రామికవర్గపు రిజర్వు సైన్యం'' అని అభివర్ణించాడు. నిరుద్యోగం పెట్టుబడిదారీ వ్యవస్థలో తలెత్తే లోపం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యూహంలో ఒక అంతర్భాగం. 1930 దశకంలో వచ్చిన మహామాంద్యం నాటి భారీ నిరుద్యోగం, లేదా మామూలుగానే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండే నిరుద్యోగం యొక్క స్థాయిని ప్రభుత్వ జోక్యంతో, కొనుగోలుశక్తిని పెంచే ఉద్దీపనలతో తగ్గించవచ్చు. అయితే, పోలండ్‌కు చెందిన మార్క్సిస్టు ఆర్థిక వేత్త మైకేల్ కాలెక్కీ చెప్పినట్టు సాంప్రదాయ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎప్పుడూ ఉత్పత్తి అయిన సరుకుల కన్నా వాటి వినిమయం (డిమాండ్) తక్కువగానే ఉంటుంది. ఏదోఒక విధంగా ఆ డిమాండ్‌ను ప్రభుత్వ జోక్యం ద్వారా పెంచుతూపోతే అది భారీ ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో ''శ్రామికవర్గపు రిజర్వుసైన్యం'' చేసే పని ఏమిటి? కార్మికులు ఎక్కువ వేతనాలు డిమాండ్ చేయకుండా వారి బేరసారాల శక్తిని అదుపులో ఉంచడం. నిరుద్యోగం గనుక ఒక స్థాయికన్నా బాగా తగ్గిపోతే ఇలా అదుపుచేసే శక్తి ఉండదు. కార్మికుల బేరసారాల శక్తి పెరిగి వారు ఎక్కువ వేతనాలను డిమాండ్ చేస్తారు. (శ్రామికుల ఉత్పాదక శక్తి పెరిగిన దానికన్నా కూడా ఎక్కువగా) తద్వారా లాభాల్లో మరింత ఎక్కువ వాటా వారు కోరుతారు. కాని పెట్టుబడిదారులు లాభాల్లో తమ వాటా తగ్గించుకోడానికి ఎంతమాత్రమూ అంగీకరించరు. అందుచేత వారు కార్మికుల డిమాండ్‌ను అంగీకరిస్తూనే ఇంకోపక్క సరుకుల రేట్లు పెంచుతారు. అప్పుడు వేతనాలు పెరిగినా, లాభాల్లో కార్మికుల వాటా పెరగదు. సరుకుల రేట్లు పెరిగినందువలన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అప్పుడు కార్మికులు మళ్ళీ వేతనాలను పెంచమని కోరతారు. అప్పుడు ద్రవ్యోల్బణం మరింతగా బలపడుతుంది. దానివలన కార్మికులు రానున్న కాలంలో పెరగబోయే ధరలను దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను రూపొందిస్తారు. అప్పుడు ద్రవ్యోల్బణం మరింత వేగాన్ని పుంజుకుంటుంది.
అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థలో నిరుద్యోగాన్ని నిర్మూలించడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఒక స్థాయికన్నా దిగువకు ఉండేలా నిరుద్యోగాన్ని అదుపు చేయడమూ సాధ్యం కాదు. అలా చేయడానికి ప్రయత్నిస్తే అదుపు చేయలేని రీతిలో ద్రవ్యోల్బణం ఏర్పడి వ్యవస్థ పనిచేయకుండా పోతుంది.
ఇదేదో ఊరికే సిద్ధాంతం చెప్పడం కాదు. యుద్ధానంతరం వచ్చిన వృద్ధి ఆగిపోడానికి కారణం ఇదే. రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఎక్కువ పెట్టుబడిదారీ దేశాల్లో కీన్స్ విధానాలనే అమలుచేశారు. అందువలన డిమాండ్ పెరిగి నిరుద్యోగం తగ్గుముఖం పట్టింది. డిమాండ్ బాగా పెరిగింది కనుక పెట్టుబడిదారులు మరింతగా పెట్టుబడులు పెట్టారు. అది ఎక్కువ స్థాయి వృద్ధిరేటుకు దారితీసింది. ఈ కాలాన్ని ''పెట్టుబడిదారీ వ్యవస్థ స్వర్ణ యుగం'' అని అభివర్ణిస్తారు. అయితే ఎక్కువకాలంపాటు నిరుద్యోగం తక్కువ స్థాయిలో ఉండడం వలన లాభాల్లో కార్మికుల వేతనాల వాటా పెరగాలనే డిమాండ్ ముందుకొచ్చింది. పెట్టుబడిదారులకు, కార్మికులకు నడుమ రాజీ సాధ్యం కాని ఘర్షణ తలెత్తింది. అది పెట్టుబడిదారులు సరుకుల రేట్లను పెంచివేయడానికి, అంతిమంగా అది ద్రవ్యోల్బణానికి దారితీసింది. దాని ఫలితంగా మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్థలో రీగన్, థాచర్‌ల కాలానికి నిరుద్యోగం హెచ్చు స్థాయికి చేరుకుంది.
ఈ విధంగా నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకోకుండా, కీన్స్ విధానాన్ని కొనసాగించడానికి కొంత ప్రయత్నం జరిగింది. అందుకోసం ''ధరలు, వేతనాల విధానం'' అమలు చేశారు. లాభాల్లో కార్మికలు వాటా ఎంత, పెట్టుబడిదారుల వాటా ఎంత అన్నదానిపై ఇరుపక్షాలకు నడుమ ఒక ఒప్పందానికి రావడానికి, తద్వారా అటు వేతనాలు, ఇటు ధరలు విచ్చలవిడిగా పెరగకుండా అదుపు చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ ''ధరలు-వేతనాలు'' విధానం అమలు చేయడం సాధ్యపడదు. ఒకవేళ ప్రతీ పరిశ్రమలోనూ కార్మికులు, యజమానులు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ, కార్మికుల ఉత్పాదకత పెరిగే వేగం ఆ యా పరిశ్రమను బట్టి వేరువేరుగా ఉంటుంది. ఉత్పాదకత ఎక్కువగా పెరిగిన పరిశ్రమల్లో కార్మికుల నిజవేతనాల పెరుగుదల రేటు కూడా వేరువేరుగా ఉంటుంది.
ఉత్పాదకత పెరగడం కేవలం కార్మికులపైనే ఆధారపడదు. అందువలన ఉత్పాదకత పెరుగుదల తక్కువగా ఉన్న పరిశ్రమల్లో కార్మికులు, వారి దోషం ఏమీలేనప్పటికీ, వేతనాలలో ఎటువంటి పెరుగుదలా లేని స్థితిని ఎదుర్కుంటారు. కార్మికులలో కొన్ని తరగతులవారికి వేతనాలు వేగంగా పెరుగుతూవుంటే, మరొక తరగతికి ఎటువంటి పెరుగుదలా లేకుండా ఉంటుంది. ఆ విధంగా కార్మికులలో ఒక విభజన ఏర్పడుతుంది. అందుచేత అంతిమంగా ఈ ''ధరలు-వేతనాలు'' విధానం విఫలం ఔతుంది.
ఈ సమస్యకు మార్గాంతరం దేశవ్యాప్తంగా కార్మికుల ప్రతినిధులకు, పెట్టుబడిదారుల ప్రతినిధులకు నడుమ లాభాల్లో వాటా ఎవరికెంత అన్న విషయంపై ఒక ఒప్పందానికి రావడం. అప్పుడు సగటు ఉత్పాదకత రేటు పెరుగుదల ఆధారంగా అన్ని పరిశ్రమల్లోనూ నిజవేతనాలు ఒకే విధంగా పెరుగుతాయి. కాని అప్పుడు ఎక్కువ ఉత్పాదకత ఉన్న పరిశ్రమల్లో యజమానులకు లాభాల వాటా ఎక్కువగా వస్తుంది. తక్కిన పరిశ్రమల్లో వారి వాటా తగ్గుతుంది. అందువలన ఇటువంటి దేశవ్యాప్త ఒప్పందం కూడా పనిచేయదు. లాభాల్లో తమ వాటా తక్కువగా వస్తున్న పెట్టుబడిదారులు దానిని అమలు చేయడానికి తిరస్కరిస్తారు. అందుచేత ''ధరలు- వేతనాలు'' విధానం పెట్టుబడిదారీ వ్యవస్థలో పని చేయదు..
దీనినే ఒక సోషలిస్టు ఆర్ధిక వ్యవస్థతో పోల్చి చూడండి. అన్ని పరిశ్రమలూ ప్రభుత్వ యాజమాన్యం కిందనే ఉంటాయి, అన్ని పరిశ్రమల లాభాలూ అంతిమంగా ప్రభుత్వ ఖాతాకే చేరుతాయి కనుక ఏ పరిశ్రమలో ఎంత లాభం వచ్చిందన్నది అప్రస్తుతం అయిపోతుంది. ఉత్పాదకత ఏ మేరకు పెరుగుతోందో ఆ మేరకు కార్మికుల నిజ వేతనాలు పెరిగేలా ఒప్పందం కుదరడం సాధ్యం అవుతుంది. (వేతనాల్లో కార్మికుల వాటా పెంచుకోవాలనుకుంటే వారి నిజవేతనాలు కార్మిక ఉత్పాదకత రేటు పెరుగుదల కన్నా ఎక్కువగా ఉండవచ్చుకూడా. అదే విధంగా ఒక వేళ లాభాల్లో కార్మికుల వాటా తగ్గించుకోవాలనుకుంటే ఉత్పాదకత రేటు పెరిగినా, కార్మికుల నిజవేతనాల పెరుగుదల తక్కువగా ఉంటుంది) అంటే ఒక సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో ''వేతనాలు-ధరలు'' విధానాన్ని అమలు జరుపుతూ పూర్తి స్థాయి ఉపాధి కల్పన చేయడం తేలికగా సాధ్యపడుతుంది. సోషలిస్టు దేశాలు ఇప్పుడు చేసినది అదే.
అందుచేత 1930 దశకంలో కీన్స్ చెప్పిన పరిష్కారం పెట్టుబడిదారీ విధానంలో ఒక లోపాన్ని మాత్రమే తొలగించగలదు. కాని ఆ పెట్టుబడిదారీ విధానం అమలు జరిపే వ్యూహమే లోపభూయిష్టంగా ఉంది. అది వర్గ వైరుధ్యాలతో కూడుకుని ఉంది. కనుక అటువంటి వ్యవస్థను లోపరహితంగా నడపగలమని అనుకోవడం కేవలం ఒక భ్రమ.
పెట్టుబడిదారీ విధానంలో తీవ్రంగా ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు దాని భారాలను ముడి పదార్థాలను సరఫరా చేసే మూడవ ప్రపంచ దేశాలమీదకు తోసేస్తారు. ఆ దేశాలకు బేరసారాలాడే శక్తి ఉండదు. సంపన్న దేశాలకు వారు ముడిపదార్థాలను సరఫరా చేయడమే గాని, వాటి ధరలను నిర్ణయించేశక్తి వారికి ఉండదు. అందుచేత ద్రవ్యోల్బణపు తాకిడిని వారే ఎక్కువగా భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా బేరసారాలాడే శక్తి లేని స్థితిలోనే మూడవ ప్రపంచ దేశాలను ఉంచడం సామ్రాజ్యవాదులకు చాలా అవసరం. అయితే, ఈ మూడవ ప్రపంచ దేశాల వాటా ఇప్పటికే చాలా హీనంగా పడిపోయింది. ఇంకా మరింతగా ఆ దేశాలనుంచి పిండుకోవడం దాదాపు అసాధ్యం అయిపోతున్నది. ఇటువంటి స్థితిలో వచ్చే ద్రవ్యోల్బణపు తాకిడిని అధిగమించి సంపన్న దేశాల పెట్టుబడిదారీ వ్యవస్థలు స్థిరంగా ఉండడం కోసం మరింతగా ఆ మూడవ ప్రపంచ దేశాలనే బలి చేయబూనడం అన్యాయమే కాదు, అవాస్తవికం కూడా అవుతుంది.
-స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్ పట్నాయక్