Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని, మధ్యవర్తులకు ముడుపులు అందాయని ఫ్రాన్స్ దేశానికి చెందిన ''మీడియా పార్ట్'' అనే పరిశోధనాత్మక వెబ్సైట్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కథనాలు ప్రచురించడం ఉభయ దేశాల్లో రాజకీయ దుమారానికి కారణమైంది. భారతదేశానికి చెందిన ది వైర్ కూడా రాఫెల్ కుంభకోణంలో చీకటి కోణాల్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది. లోగడ ఫ్రాన్స్ దేశంలో ఆర్థిక నేరాలపై పరిశోధన చేసే సెర్ఫ్ అనే ప్రభుత్వేతర సంస్థ రాఫెల్ అవకతవకలపై ఫిర్యాదు చేసింది. వాస్తవానికి 2012 సంవత్సరంలోనే 126 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసమని భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందం జరిగింది. దాదాపు 2015లో ఈ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చే సమయంలో నూతనంగా ఎన్నికైన ప్రధాని హౌదాలో ఫ్రాన్స్ పర్యటన చేసిన నరేంద్రమోడీ ఒప్పందంలో కీలకమైన మార్పులు చేసారు. అప్పటికే ఫ్రెంచ్ భాగస్వామి డసోకి భాగస్వామిగా ఉన్న భారత భాగస్వామి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ని మార్చి ఆ స్థానంలో రిలయన్స్ కంపెనీని చేర్చారు. పైగా ఈ ఒప్పందం జరుగుతున్న సమయంలో మోడీ వెంటే అనిల్ అంబానీ ఉన్నారని, కనీస నిబంధనల ప్రకారం నాటి రక్షణమంత్రి లేరని నాడు ఆయన గోవాలో చేపల విక్రయశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్నారని విమర్శలున్నాయి. తేలికపాటి యుద్ధ విమానాలు తయారుచేసిన అనుభవం ఉన్న హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీని కాదని కనీసం సబ్బుబిళ్ళ కూడా తయారు చేసిన అనుభవంలేని రిలయన్స్ కంపెనీకి ఈ ఒప్పందాన్ని ఎలా ఇస్తారని ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి మేథావులు అప్పటి నుంచీ ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పంద చర్చలు జరుగుతుండగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు హౌలాండ్ మూవీ భాగస్వామి జూలీ గాయేట్ సంస్థలో అనిల్ అంబానీ పెట్టుబడులు పెట్టడం కూడా అనుమానాలకు బలమిస్తోంది. ఓ పక్క రాఫెల్ ఒప్పందం విషయంలో భారత భాగస్వామిని మార్చడంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఒత్తిడేమీ లేదని హౌలాండే ప్రకటించడం కూడా తప్పు భారత ప్రభుత్వానిదేనా అనే సందేహాలు పెరగడానికి దోహదం చేస్తున్నది. అయితే రాఫెల్ ఒప్పందం విషయంలో ఇప్పటికే పార్లమెంటు సాక్షిగా ఎన్నోసార్లు చర్చ జరిగినప్పటికీ ఒప్పంద వ్యయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం మరికొంత గందరగోళం ఏర్పడేందుకు కారణం అయ్యింది. ఒప్పందంలో అంతర్గత అవకతవకల విషయంలో దర్యాప్తు చేశామని ఎలాంటి అవాంఛనీయ అంశాలు చోటు చేసుకోలేదని ఫ్రెంచ్ రక్షణ సంస్థ డసో చెబుతోంది. సాంకేతిక పరిజ్ఞానం బదిలీ విషయంలో రెండు దేశాలూ ఓ నిర్దిష్టమైన అభిప్రాయానికి రాకపోవడంతోనే అంచనా వ్యయాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతుండగా తమ ఆశ్రితులకు మేలు చేకూర్చేందుకే ఒప్పంద వ్యయాలు పెంచాలని డసో సంస్థ మీద భారత ప్రధాని, ప్రభుత్వ ఒత్తిడి చేశాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
- పి. నాగఫణి
సెల్:8074022846