Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వాతావరణ న్యాయం (క్లైమేట్ జస్టిస్)లో భారతదేశం నాయకత్వ స్థాయికి ఎదుగుతోందని అన్నారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే వాతావరణ మార్పుల వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభావితమైన ఏడవ దేశంగా భారతదేశం నిలిచినట్టు మరో ప్రకటన వెలువడింది. దేశం పర్యావరణ విపత్తులోకి అడుగుపెడుతోందని వాతావరణ మార్పులపై అధ్యయనం చేసే ఓ అత్యున్నత సంస్థ హెచ్చరించింది. గిరిజనులతో పాటు, వివిధ స్థానిక తెగల సమస్యలపై గళమెత్తే ప్రజాతంత్ర వాదులను, పర్యావరణ ఉద్యమకారులను మోడీ ప్రభుత్వం జైళ్లలో నిర్బంధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మైనింగ్ సంస్కరణల్లో భాగంగా పర్యావరణ చట్టాల్లో పేర్కొన్న రక్షణ నిబంధనలకు తూట్లు పొడిచే కార్యక్రమాన్నీ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదే ప్రారంభించింది. ఇక మోడీ ఘనంగా చెప్పుకున్న 'క్లైమేట్ జస్టిస్' దేశంలో ఏ మేరకు అమలు జరుగుతోంది? ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టుల కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పులకు బాధితులుగా మారే ప్రజానీకానికి ఏ మాత్రం న్యాయం జరుగుతోంది. వారి జీవనోపాధి, సహజ జీవన శైలి దెబ్బ తినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందా?
నిజానికి, పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజు కూడా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ చట్టాలను నీరుగార్చే పనిలో నిమగమైంది. 1972 నాటి వన్య ప్రాణుల రక్షణ చట్టంలో కూడా మార్పులు తీసుకు రావడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సిద్ధమౌతోంది. పర్యావరణ పరంగా కీలకమైన ప్రాంతాల్లోనూ మౌలికవనరుల ప్రాజెక్టులు, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా ఈ కసరత్తు జరుగుతుండటం గమనార్హం. అంతేకాదు, అటవీ పరిరక్షణ చట్టాల్లోనూ మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పటికే ఆ దిశగా అనేక చర్యలను ప్రతిపాదించింది.
ఈ ఏడాది మార్చిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ 'ప్రాజెక్టులకు సూత్రబద్దమైన అనుమతి లభించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అదనపు నిబంధనలను చేర్చవు' అని ప్రకటించింది. దీని అర్థం ప్రయివేటు వ్యక్తులు ఎవరైనా అటవీ ప్రాంతాల్లో ప్రాజెక్టుల కోసం ఒకసారి అనుమతులు పొందితే ఇక అధికార యంత్రాంగం జోక్యం చేసుకోదని, వారికి సర్వహక్కులు దఖలు పడతాయని చెప్పడమే! దీని ప్రభావం నేరుగా గిరిజన సమూహాల మీదా, వారి అటవీ హక్కుల మీదా పడుతుంది. దేశంలో 60శాతం అటవీభూమి 187 గిరిజన జిల్లాల్లో విస్తరించి ఉంది. ఆ ప్రాంతాలకు చెందిన ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే ఇంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా కూడా స్థానిక ప్రజల ప్రతినిధులతోనూ, వారి సంఘాలతోనూ, ప్రతినిధులతోనూ చర్చించలేదు. ఫలితంగా రాబోయే రోజుల్లో ఇది సామాజిక అసంతృప్తికి కారణం కానుంది. 'మైన్స్ అండ్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం-1957' లో కూడా కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేస్తోంది. మైనింగ్ రంగంలోని కార్పొరేట్ శక్తులు ఈ మార్పులకోసం కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఆ రంగానికి సంబంధించి ఈ మార్పులు అత్యంత ముఖ్యమైన సంస్కరణగా అధికారులు చెబుతున్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టనున్నారు.
మైనింగ్ రంగంలో ప్రతిపాదించిన సంస్కరణలు పర్యావరణ ఉద్యమకారుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కుంటున్నాయి. క్యాపిటివ్-నాన్ క్యాపిటివ్ గనుల మధ్య ప్రస్తుతం ఉన్న తేడాను తొలగించడంతో పాటు ప్రభుత్వ సంస్థల పరిధిలో ఉన్న బ్లాకులను ప్రయివేటు యాజమాన్యాలకు అప్పగించడం వంటి కార్పొరేట్లకు లబ్ధి చేసే సంస్కరణలు వీటిలో ఉండటమే దీనికి కారణం. స్టాంపు డ్యూటీని ఖనిజాల విలువ ఆధారంగా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి. ఒకసారి ఈ సంస్కరణలు అమలు లోకి వచ్చిన తరువాత ఖనిజాల విలువ ఆధారంగా కాకుండా భూమి కింద గని విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని స్టాంపు డ్యూటీని నిర్ణయించాల్సి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపనుంది. బొగ్గులోని బూడిద పరిమాణంపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను కూడా కేంద్రం తొలగించనుంది. దీంతో కాలుష్య కారకమైన చౌక బొగ్గు మార్కెట్‌ను ముంచెత్తనుంది. నాణ్యతకు సంబంధించిన ఈ కీలక నిబంధనను తొలగించడంతో అనేక చోట్ల మైనింగ్ కార్యక్రమాలు ప్రారంభమై పెద్ద ఎత్తున పర్యావరణ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అండమాన్-నికోబార్, లక్షద్వీప్ అభివృద్ధి పేరిట మోడీ ప్రభుత్వం చేపట్టనున్న సంస్కరణల పట్ల పర్యావరణ నిపుణులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ దీవుల్లోని ప్రకృతి సంపదను పూర్తిగా నాశనం చేసే విధంగా ఈ చర్యలు ఉన్నాయి.
పెట్టుబడిదారీ, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం కారణంగా దేశ పర్యావరణం, సహజ వనరుల మనుగడ ఇప్పటికే ప్రశ్నార్థకంగా మారింది. పర్యావరణ న్యాయం కోసం పోరాడుతున్న వారి గొంతులు నొక్కబడుతున్నాయి. పాత నీటి వనరులను పునరుద్ధరించడం, సహజ అడవుల అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పర్చడం ద్వారా వాతావర ణాన్ని కాపాడుకోవాలన్నది ఈ ఏటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందేశం. ఈ లక్ష్య సాధనకు స్థానిక పౌర సమాజాలను ఎక్కడికక్కడ కలుపుకుని పోవాల్సి ఉండగా, వారిని విస్మరించడం, వారి అభిప్రాయాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జడ్) నిబంధనలను పూర్తి స్థాయిలో సమీక్షించడానికి మోడీ ప్రభుత్వం అంగీకరిచింది. ఈ నిబంధనలను మార్చివేయాలని పలు కార్పొరేట్ సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తీర ప్రాంత రక్షణ, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను ఇప్పటి వరకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ (2011) ఆధారంగా నిర్ణయిస్తున్నారు. సీఆర్‌జడ్ కిందకు వచ్చే ప్రాంతాలు, అక్కడ అనుమతించడానికి వీలయ్యే అభివృద్ధి కార్యక్రమాలను ఈ నోటిషికేషన్లో నిర్థారించారు. ముంబయి మహానగర కార్పొరేషన్ రూ.14 వేల కోట్లతో చేపట్టిన రింగ్‌రోడ్డు నిర్మాణం ఇక్కడ ప్రస్తావించాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును నీరుగార్చేలా, ప్రయివేటు వాహనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దానితో పాటు అరేబియా సముద్రాన్ని ఆనుకుని, సముద్రం నుంచి బయటపడిన భూభాగాన్ని కూడా వాడుకుంటూ ఈ నిర్మాణం సాగనుంది. నిజానికి ఈ ప్రాంతం అరుదైన మొక్కలకు వేదికగా ఉంది. వీటిని ఆధారంగా చేసుకుని మత్య్స సంపద కూడా ఇక్కడ బాగా పెరుగుతుంది. దీనితో పాటు సముద్ర ప్రాంతంలో నివసించే స్థానిక తెగలు కొన్ని తమ జీవనాధారం కోసం ఈ ప్రాంతంపైనే ఆధారపడతాయి. రోడ్డు నిర్మాణంతో ఈ జీవ చక్రం అంతా దెబ్బ తినే ప్రమాదముంది. ఇటువంటి ఉదాహరణలు దేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి.
వాతావరణ న్యాయం (క్లైమేట్ జస్టిస్)ను సాధిస్తున్నట్టుగా ఈ చర్యలనే మోడీ ప్రభుత్వం చెప్పుకోవచ్చుగాక. ఆచరణలో జరగుతున్నది అభివృద్ధి పేరుతో పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలను భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కార్పొరేట్లకు పంచి పెట్టడం! ఒక్కసారి కార్పొరేట్ల పెత్తనం స్థిరపడిన తరువాత జరిగేది పర్యావరణ విధ్వంసం...భావి తరాల నిర్మూలన మాత్రమే!
('న్యూస్ క్లిక్' సౌజన్యంతో)
- సుమేథ పాల్