Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనా కమ్యూనిస్టు పార్టీ వందేండ్ల పాటు సజీవంగా, శక్తివంతంగా కొనసాగుతూ... అత్యధిక జనాభా ఉన్న ఒకనాటి వెనుకబడిన దేశాన్ని అమోఘమైన అభివృద్ధి పథంలో నడిపించడం ఉత్తేజం కలిగించే వాస్తవం. ప్రథమ సోషలిస్టు దేశమైన సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై ఆ భావజాలానికే కాలం చెల్లిందని వినవచ్చిన జోస్యాలను పటాపంచలు చేయడం అంతకు మించిన సైద్ధాంతిక ప్రాధాన్యత గల అంశం. చైనా కమ్యూనిస్టుపార్టీ వైభవోపేతంగా అనంతమైన విశ్వాసంతో శతవార్షికోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. కమ్యూనిస్టులే గాక ప్రగతిశీల వాదులు అణగారిన వర్గాలు అమితోత్సాహంతో ఈ అరుణారుణ ప్రస్థానానికి వందేండ్ల వందనం సమర్పిస్తారు. చైనా విముక్తి, పురోగమనం, ప్రపంచీకరణ నేపథ్యంలోనూ ఆధునిక సోషలిజం నిర్మాణం అన్నిదేశాలకూ ప్రత్యేకించి కమ్యూనిస్టులకు మార్క్సిస్టు సిద్ధాంతానికీ గర్వ కారణం. ఎందరో సామ్రాజ్యవాదుల జోక్యానికి బలైన చైనా ప్రజలు భయానక దారిద్య్రాన్ని, బానిసత్వాన్ని, కడగండ్లను అనుభవించారు. నల్లమందు భాయిలుగా పేరు పొందారు. అలాంటి జాతిని మేల్పొల్పి, మహత్తర పోరాటంలోకి నడిపిన ఖ్యాతి కమ్యూనిస్టులదైతే అందుకు నాయకత్వం వహించిన మహానేత మావో, చౌఎన్‌లై, చూటేలతో కలసి అదో త్రయం.
సుదీర్ఘ చరిత్రలో ఆటుపోట్లు
ప్రాచీన చరిత్ర గల ఆసియా దేశం చైనాలో అసమర్థ చక్రవర్తుల కారణంగా విదేశీ శక్తులు తిష్టవేశాయి. ప్రజల స్థితి ఘోరంగా దిగజారింది. వారి జాతీయ నేత సన్‌యెట్‌సేన్ కొమింగ్‌టాంగ్ పార్టీని స్థాపించారు. పక్కనే సోవియట్ ఆవిర్బావంతో సోషలిజం భావాలు వ్యాపించాయి. 1919 మే4 ఉద్యమంలో పెకింగ్ యూనివర్సిటీ విద్యార్థులు వేలాది మంది ప్రదర్శన ఒక మలుపు. 1921లో షాంఘైలో 13 మందితో చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభ జరిగింది. కమ్యూనిస్టుపార్టీ స్థాపన తర్వాత ఏడాదిన్నరకాలంలో మూడులక్షల మంది కార్మికులతో 100 సమ్మె పోరాటాలు జరిగాయి. బ్రిటన్, అమెరికా, జపాన్‌లు రకరకాల కుట్రలతో వేర్వేరు భాగాలు అధీనంలోకి తెచ్చుకున్నాయి. కమ్యూనిస్టు పార్టీ తీవ్ర చర్చ తర్వాత కొమింగ్టాంగ్తో ఐక్య సంఘటనకై పిలుపునిచ్చింది. కమ్యూనిస్టులు, సోవియట్‌తో మైత్రి, కమ్యూనిస్టులతో మైత్రి, కార్మిక కర్షకుల సహకారం అనే మూడు సూత్రాల పంథా సన్‌యెట్‌సేన్ ప్రకటించారు.1925లో సన్‌యెట్‌సేన్ మృతిచెందారు. చాంగ్‌కైషేక్ కొమింగ్‌టాంగ్ నాయకుడయ్యాక కమ్యూనిస్టులపై కత్తి కట్టాడు. కమ్యూనిస్టు పార్టీ చాంగ్‌కైషేక్ దురాగతాలను ఎదుర్కొని పోరాటం కొనసాగించాలని, ఫ్యూడల్ శక్తులను ప్రతిఘటించాలని నిర్ణయించింది. అందుకోసం మావోను హునాన్ రాష్ట్రం పంపించింది. ఆయన రైతాంగ పోరాటాలతో చాలా ప్రాంతాలు విముక్తి చేసుకుంటూ జంగాంగ్ పర్వతాలకు చేరుకున్నాడు. చౌఎన్‌లై, చూటేలు కూడా ఇతర ప్రాంతాలలో విముక్తి పోరాటాలు విజయవంతం చేసుకుని, అక్కడకు చేరుకున్నారు. మావో కమాండర్‌గా ఎర్రసైన్యంఏర్పడింది.
సాటిలేని లాంగ్ మార్చ్
విప్లవ శక్తులు 1927 మార్చి నాటికి పారిశ్రామిక కేంద్రమైన షాంఘైని, తర్వాత నాన్కింగ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా, బ్రిటన్ నౌకలు నాన్కింగ్ పక్కనే గల యాంగ్సీ నదిలో నుండి మందుగుండు కురిపించాయి. చాంగ్‌కైషేక్ వారితో చేతులు కలిపి నాన్కింగ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కమ్యూనిస్టులపై నిర్బంధకాండ తీవ్రమవడంతో ఎర్రసైన్యం వ్యూహాత్మకంగా పట్టణాల నుండి వెనక్కు తగ్గి, గ్రామాలకు చేరుకుంది. గెరిల్లా యుద్ధం ప్రారంభించింది. ఎర్రసేన పోరాటాలు, వ్యవసాయక విప్లవంతో ముడిపెట్టి, గ్రామాలను విముక్తి చేసుకుంటూ క్రమంగా నగరాలను చుట్టుముట్టి చివరకు దేశవ్యాప్త విజయం సాధించాలని మావో సిద్ధాంతీకరించాడు. తీవ్ర నిర్బంధం మధ్య 1928 జులైలో మాస్కోలో జరిగిన చైనా పార్టీ మహాసభ విప్లవ పోరాటాన్ని కాపాడుకునే మార్గాలను చర్చించింది. వ్యవసాయ కార్మికులు, పేదరైతులపై ప్రధానంగా ఆధారపడటం, ధనిక రైతులను నిరోధించడం, మధ్య తరగతి రైతులను ఐక్యం చేయడం, భూస్వాముల భూములను స్వాధీనపరచుకుని దున్నే వారికివ్వడం వ్యవసాయ విప్లవసూత్రాలు. దాంతో రైతాంగ విముక్తితో పాటు 1930 నాటికి 60 వేల మందితో ఎర్రసైన్యం విస్తరించింది. 1931లో మావోచైóైర్మన్గా విముక్తి ప్రాంతాలలో కార్మిక కర్షక ప్రభుత్వం ఏర్పడింది. చూటే ఎర్రసేన అధిపతి అయ్యాడు. అటు జపాన్దాడి, ఇటు చాంగ్దాడి పరీక్షా సమయంలో ఎర్రసేన చరిత్రాత్మకమైన లాంగ్ మార్చ్ ప్రారంభించింది. 1934 అక్టోబర్16న యాంగ్సీ విప్లవ స్థావరాన్ని విడిచి శత్రుదిగ్బంధనాన్ని ఛేదించుకుంటూ 12000కిలోమీటర్లు నడిచి ఉత్తరాన షాంగ్జీ విప్లవ కేంద్రాన్ని చేరాల్సివచ్చింది. నదులు, పర్వతాలు, దుర్భర పరిస్థితులను, దాడులను, ఆకలిబాధలను, అనారోగ్యాలను ఎదుర్కొంటూ ముందుకు నడిచింది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో చాంగ్ అనుయాయులైన ఇద్దరు సైనికాధికారులు సియాన్‌లో ఆయనను బంధించి కమ్యూనిస్టులతో కలిసి పనిచేయడానికి ఒప్పించారు. అయితే చాంగ్ ద్రోహంతో 1940 అక్టోబర్‌లో కమ్యూనిస్టులపై చివరిసారి పెద్దదాడి చేశాడు. పధాన నాయకులతో సహా ఎందరో ఎర్ర సైనికులు మరణించారు. స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో నాజీజర్మనీపై సోవియట్ సైన్యాల విజయం వల్ల కమ్యూనిస్టులకు ఒకవైపు దన్ను దొరికింది. యుద్ధంలో జపాన్ లొంగుబాటుతో దాని ఆధీన ప్రాంతాలు విముక్తయ్యాయి. అప్పుడేేే అమెరికా చాంగ్‌కు తోడ్పాటుగా రంగప్రవేశం చేసింది. 43లక్షల మందిగల చాంగ్ సైన్యాన్ని 12లక్షల ఎర్రసైన్యం వీరోచితంగా ఎదుర్కొని 11లక్షల 20వేలమందిని తుడిచిపెట్టింది. 1947జులైలో ఎదురుదాడి ప్రారంభించి, 1949 ఏప్రిల్ నాటికి కొమింగ్‌టాంగ్ అధికారపీఠమైన నాన్కింగ్ను స్వాధీనపరుచుకుంది. చాంగ్ దళాలతో తైవాన్ పారిపోయాడు. అయిదు కోట్ల మంది ప్రాణాలర్పించిన సుదీర్ఘ చైనా విప్లవపోరాటంతో 1949అక్టోబర్1న చైనా ప్రజా రిపబ్లిక్ అవతరించింది.
విముక్తి తర్వాత..
విముక్తి తర్వాత కూడా సామ్రాజ్యవాదులు చైనా పురోగమనాన్ని అడ్డుకోవడానికి చేయనికుట్ర లేదు. అమెరికా శిబిరం 1971వరకూ ఐరాసలో చైనా తరపున తైవాన్‌కే ప్రాతినిధ్యం ఇచ్చింది. అయినా చైనా తొలిదశలో గొప్ప ముందంజ పేరిట ఉత్పత్తిని పెంచుకోవడంపై కేంద్రీకరించింది. మొదట సోవియట్ సహకారం ఉన్నా సైద్ధాంతిక విభేదాలతో తర్వాత ఉపసంహరించుకుంది. ఈపరిణామం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికే చాలా హానికలిగించింది. 1960లలో సాంస్కృతిక విప్లవం అనేది చైనాను అనేకసమస్యల్లోకి నెట్టింది. అంతర్గతంగానూ విదేశీ సంబంధాలలోనూ కొన్ని పెడధోరణులకూ దారితీసింది. అదంతా వేరేచరిత్ర. చైనా లేదా నాటి సోవియట్ తప్పులు ఏవైనా అక్కడ సోషలిజాన్ని బలపర్చాలనే విధానాన్ని సీపీఐ(ఎం) అనుసరించింది. అందుకు తగినట్టే చైనా కమ్యూనిస్టు నాయకత్వం జరిగిన పొరబాట్లు సమీక్షించుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుకోవడంపై కేంద్రీకరించింది. 1978లో డెంగ్‌సియావో పింగ్ నాలుగు ఆధునీకరణలతో వేగంగా అభివృద్ది మార్గం వేశారు. సంస్కరణల కోసం తలుపులు తెరిస్తే గాలితోపాటు దోమలుకూడా వస్తాయని హెచ్చరించాడు. 1985లో సోవియట్ నాయకత్వం చేపట్టిన గోర్బచెవ్ గ్లాస్‌నాస్త్ పెరిస్త్రోయికాల మాదిరిగాక సంస్కరణలతోపాటు వచ్చే సమస్యలను దృష్టిలోపెట్టుకోవడం చైనాపార్టీ విశిష్టత. ఆర్థికాభివృద్ధి, ప్రజల సాంస్కృతిక బౌద్ధిక స్థాయి పెరగకుండా కేవలం సిద్ధాంత బోధనే చాలదనివారు గుర్తించారు. అయితే ఆర్థిక సంస్కరణల కన్నా రాజకీయ సంస్కరణలను ముందు నిల్పడం బండి ముందు గుర్రం తర్వాత చందం అవుతుందనీ గ్రహించారు. 1989లో తూర్పు యూరప్‌లో సోవియట్‌లో సోషలిజం దెబ్బ తింటున్నప్పుడే చైనాలోనూ తినాన్మేన్ స్కేర్ ఘటనలు జరిగాయి. వాటిపై వ్యతిరేకులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా చైనా రాజీపడకుండా ముందుకు నడచింది. అదేసమయంలో ఆ గుణపాఠాలతో తగుమార్పులు, చేర్పులు చేసుకుంది.
మావో హయాంలోనూ, ఆ తర్వాతా కీలక నాయకులు ఎందరు మారినా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర విషయంలో మార్పులేకపోవడం ప్రధానమైన విషయం. ఒక కమ్యూనిస్టుపార్టీలో సరైన విధానాలకోసం అంతర్గతపోరాటం అనివార్య భాగం. ఇందులో ప్రజాస్వామిక పార్శ్యాన్ని చూడకుండా నాయకుల మార్పును కుట్రలుగా చూపించే ప్రచారాలు ఎప్పుడూ ఉంటాయి. కాని ఆ మార్పులు చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు పంథాను బలోపేతం చేయడం ముఖ్యం. అమెరికాలో నిక్సన్ వాటర్‌గేట్ కుంభకోణం నుంచి ఇటీవల ట్రంప్ మూకల వైట్హౌస్దాడి వరకూ గుర్తుచేసుకుంటే వారి ప్రజాస్వామ్యం బండారం బోధపడుతుంది. పైగా ఇతర దేశాలపై ఆధిపత్యవాదం ఇప్పటి బైడెన్ హయాంలోనూ యథాతథంగా కానసాగుతున్న స్థితి. ఇజ్రాయిల్ జాత్యహంకారాన్ని ఎగదోస్తున్న స్థితి. ఇక నాయకత్వ మార్పుల విషయానికి వస్తే భారత దేశంలో కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబ నాయకత్వం తేలక కాంగ్రెస్ ఎలా కొట్టుమిట్ట్టాడుతోంది? బీజేపీలో అద్వానీ వంటివారు ఎక్కడున్నారు? కేంద్రంలో మోడీత్వ, రాష్ట్రాలలోనూ కుటుంబపాలన ఆరోపణలు, వీరందరిపైనా కార్పొరేట్ ప్రాబల్యాలు అసలైన ప్రజాస్వామ్యానికి నిదర్శనాలా? వందకోట్ల పైబడిన చైనా ప్రజలు ఎవరో అణచివేస్తుంటే భరిస్తున్నారనీ, అయినా ఆ దేశం ప్రపంచ మహాశక్తిగా ఎదిగిందని చెప్పడం తర్కానికి నిలిచేదేనా? ఏ దేశ పరిస్థితులను బట్టి ఆ దేశ ప్రజలు పాలనావ్యవస్థను, విధానాలను రూపొందించుకొంటారు తప్ప బయిటనుంచి శాసించడం దూషించడం చెల్లుబాటు కాదు. తప్పొప్పులు అందరికీ ఉన్నట్టే వారికీ ఉండొచ్చు. విదేశీ శక్తులు లీజు పేరిట కుట్రలతో తీసుకున్న మకావును గాని, హాంగ్‌కాంగ్‌ను గాని కాపాడుకోవడం వారి హక్కు. అయినా ఒక దేశం రెండు వ్యవస్థలు అంటూ పట్టువిడుపులతో పాతికేండ్లకు పైబడి హాంగ్‌కాంగ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం నిజం. వీటిపై వక్రీకరణలకు లోనవడం గాక వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవానికి ఉత్తర కొరియా వంటి దేశాల విషయంలో చైనా సంఘీభావం ఎంతో కీలకమైంది. అదే సమయంలో వారి విదేశాంగ విధానంలో అనేక అంశాలు వారి అంచనాలపై ఆధారపడి ఉండటం అర్థం చేసుకోవచ్చు. ఎవరి అంచనాలు వారికి ఉండొచ్చు.
విశ్వశాంతికి భరోసా
ఆధునీకరణ తర్వాత చైనా జీడీపీ 80రెట్లు పెరిగింది. 77కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయిటవేసినట్టు ప్రపంచబ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. దుర్భర దారిద్రం నుంచి ప్రజలను బయిటపడేయటమే తమ లక్ష్యమని జీ జింగ్పింగ్ వాస్తవికంగా ప్రకటించారు. పజల కొనుగోలుశక్తి పెంచడం ఈవిధానంలో కీలకం. ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో చైనా వాటా 18.34శాతం ఉంది. 2049నాటికి మరిన్ని రెట్లు అభివృద్ధి చెందుతుందని చైనా అధినేత జీ జింగ్పింగ్ ప్రకటించారు. చైనాతో పోల్చితే వాణిజ్యంలో అమెరికా 34 వేల కోట్ల డాలర్లు లోటులో ఉంది. చైనా ఉత్పత్తులు లేకుండా మనగలగడం అన్ని దేశాలకు సవాలుగా ఉంది. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం ప్రజానుకూల మార్కెట్ విధానం అనుసరించడం ఇందుకు కారణమని కమ్యూనిస్టుపార్టీ అంటుంది. చైనాసైనిక పాటవాన్ని, సాంకేతిక సామర్థ్యాన్ని వందేండ్ల వేడుకలే వెల్లడించాయి. ఆధిపత్య పోకడలను అదుపు చేయడానికి చైనా ఒకఅడ్డుగోడగా ఉంది గనకే అమెరికా క్వాడ్ వంటి వేదికలను పెంచుతూ దానిపై వ్యతిరేకత కుమ్మరిస్తున్నది. ఈ కూటమిలో మోడీ ప్రభుత్వం చేరిక పెద్దతప్పిదం. భారత చైనాల మధ్య సరిహద్దు ఘర్షణలు సాగినా మొదటి నుంచి పరస్పర సంబంధాలు ఉంటూనే ఉన్నాయి. చైనాను ముందుగా గుర్తించిన కమ్యూనిస్టేతర దేశం ఇండియానే. వివాదాలు పరిష్కరించుకుని ఈ రెండుదేశాలు కలసి నడవడం ఈ రెండు దేశాలకే గాక ప్రపంచ శాంతికి ప్రయోజనకరం.1991లో సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ముప్పై ఏండ్లకు ఈ ఉత్సవం జరగడం, తనకు ఎదురులేదని విర్రవీగే అమెరికాను మా జోలికి వస్తే తలపగులుతుందని ఈ వేదిక నుంచి జీ జింగ్పింగ్ హెచ్చరించడం విశ్వశాంతికి ఒక భరోసా. ఆయన మావోతరహా దుస్తులు ధరించడం గురించి చెప్పిన మీడియా ఆమహత్తర వారసత్వానికి ప్రతినిధి అనే సత్యాన్ని మరుగుపరచి దుస్సాహసిగా చిత్రించవచ్చుగాని, చైనా కమ్యూనిస్టుపార్టీ వందేండ్ల అరుణారుణ ప్రస్థానమే ఆమాటలలో ప్రతిధ్వనించింది.
- తెలకపల్లి రవి