Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరతరాలుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన దళితులను అభివృద్ధి చేయాలనే తలంపు అభినందనీయమే. గత నెల27న ముఖ్యమంత్రి దళిత సాధికారతపై ఆఖిల పక్షం నిర్వహించడం ఆహ్వానించదగినదే. సుమారు 10.30గంటలపాటు సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. ఏడేండ్లలో ఆయన సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా గేటుదాటి గర్భగుడిలోకి ప్రవేశించేందుకు అనుమతిలేదనే చర్చ ఉంది. అలాంటి సీఎంకు హఠాత్తుగా ప్రజాస్వామ్యం ప్రతిపక్షం దళిత సాధికారత గుర్తుకు రావడం, ఎప్పుడులేని విధంగా ఇలా వ్యవహరించడం స్వాగతించాల్సిందే. 119 నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజక వర్గానికి 100 మంది దళితులకు రూ.10లక్షలు చొప్పున 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. అవసరం అయితే భవిష్యత్‌లో 30 నుండి 30వేల కోట్ల రూపాయల దాకా దళిత సాధికారితకు ఖర్చు చేయడానికి వెనుకాడబోమని సీఎం ప్రకటించారు. హుజురాబాద్‌లో దళితుల ఓట్లు 45వేలు ఉన్నాయి. కాబట్టి రేపు జరుగబోయే ఉప ఎన్నికల్లో దళిత ఓటు బ్యాంకును తమ సొంతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాడని పలు సంఘాలు, వ్యక్తులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడేండ్ల కాలంలో దళితులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సుమారు 89వేల కోట్లు కేటాయించగా దారి మళ్లించి కోత విధించిన డబ్బులతో కలిపితేనే 55వేల కోట్లు విడుదల చేశారు. మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ట్రాన్స్ పోర్ట్ రంగానికి, ఈవిఎంలను భద్రపర్చడానికి కూడా దళిత నిధులే దారి మళ్లించారు. కాగితాల్లో కేటాయిస్తున్న నిధులు విడుదల కావడం లేదు, విడుదల అయిన నిధులు ఖర్చు కావడంలేదు. దీంతో ఇది కాగితాల్లో అంకెలు దళితులకు, ఖర్చు మాత్రం ధనవంతులకు అన్నట్లుగా ఉంది. 1200 కోట్ల రూపాయలు 1900 మంది లబ్ధిదారుల గురించి అఖిలపక్షం నిర్వహించినప్పుడు సుమారు 40వేల కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా దారిమళ్లించి కోత విధించిన వాటిపై ఎందుకు చర్చించడం లేదని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రంలో 3లక్షల మంది పేద దళిత కుటుంబాలకు 3ఎకరాల చొప్పున భూములు పంచుతామన్నది వాగ్దానం. కానీ ఈ ఏడేండ్లలో 7వేల మందికి కూడా పంపిణీ చేయలేదు. అంటే నూటికి ఇద్దరికి కూడా భూపంపిణీ చేయలేదు. పైగా దశాబ్దాలుగా దళితుల స్వాధీనంలో ఉన్న అసైన్డ్ భూములను రైతు వేదిక, ప్రకృతి వనం, వైకుంఠ దామాల పేరిట బలవంతంగా లాక్కున్నారు. దళితులకు భూములు పంపిణీ చేయడానికి భూమిలేదని ముఖం చాటేసిన ప్రభుత్వం తమ వద్ద ఉన్న ప్రభుత్వ భూములను అమ్మడానికి రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. దీంతో భూపంపిణీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి తేటతెల్లం అయింది.
1974లో ఎస్సీ కార్పొరేషన్లో అర్హులైన నిరుద్యోగులకు రుణాలు అందడం లేదు. కార్పొరేషన్‌కు కేటాయిస్తున్న బడ్జెట్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకూ మధ్య భారీ తేడా ఉంటుంది. ఈ సంవత్సరం 2లక్షల మంది అప్లై చేసుకోగా ప్రభుత్వ సబ్సిడీ బ్యాంక్ రుణం, లబ్ధిదారుడి వాటా కలిపితే కేవలం 786 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే ఎలా రుణాలు దక్కుతాయి. డిఐసి రుణాలు నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉండడం, ఎస్సీ కార్పిరేషన్ 2018-19 రుణాలు అందకపోవవడంతో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. దళిత ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలి.
రాష్ట్రంలో 49 కుల దూరహంకారహత్యలు జరిగాయి. ఈ అన్ని ఘటనల్లో ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. పైగా కొన్ని హత్యల్లో అధికారపార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు హంతకులకు మద్దతిచ్చారు. కులాంతర వివాహాలకు రక్షణ చట్టం చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీలో తీర్మానం చేసినట్లుగా మన తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కులాంతర వివాహాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. జీవో నెం 12 ప్రకారం 2.5లక్షల ప్రోత్సాహాన్ని పెళ్లి జరిగిన నెల రోజుల్లో అందించాలి. వీడిసిల పేరిట నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి నిర్మల్ వంటి జిల్లాల్లో దళిత గిరిజన బలహీన వర్గాలను సుమారు 200 గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు చేసినప్పుడూ ప్రభుత్వం స్పందించలేదు. మరియమ్మ లాకప్ డెత్‌లో సీఎం స్పందన అభినందనీయమే. కానీ గతంలో జరిగిన అన్ని ఘటనలపైనా ఇలా స్పందించి ఉంటే కొన్ని సంఘటనలు అయినా జరుగకుండా ఉండేవి. ఇప్పటికీ మరియమ్మ కేసులో సంపూర్ణ న్యాయం జరుగలేదు. కిరాతక పోలీసులపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఫిర్యాదు దారుడైన ఫాస్టర్ బాలశౌరిపై కేసు నమోదు చేయాలి. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.
కేరళ తరహాలో కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల కుటుంబాలకు మెస్ చార్జీలు స్కాలర్ షిప్‌లు పంపిణీ చేయాలి. దళిత విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలలో రాణించడానికి వసతితో కూడిన శిక్షణ ఇవ్వాలి. అనంతరం ఉపాధి చూపాలి. గురుకులాల మాదిరిగానే మిగిలిన సాంఘిక సంక్షేమ హాస్టళ్లనూ ఆధునీకరించాలి. దళిత వాడల్లో ఒక కాలపరిమితి పెట్టి సిసి రొడ్లు, సైడ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్, వీధి లైట్లు, క్రీడా స్థలం, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. జస్టీస్ పున్నయ్య సిఫారసులను అమలు చేయాలి. 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలి. ఈ కేసుల్లో పిఎస్ లోనే స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో దళితులపై మరిన్ని దాడులు జరుగుతున్నాయి. స్టేషన్ బెయిలు రద్దు చేయాలి.
ఎన్ని గొప్ప గొప్ప తీర్మానాలు, నిర్ణయాలు చేసినా అమలుకు నోచుకోకపోతే అవి చెత్తబుట్టలో వేసే చిత్తు కాగితాలేనని ఓ మహనీయుడు చెప్పాడు. దీనిని బట్టి గతంలో చేసిన వాగ్దానాలు అందులో అమలైన అంశాలు పెండింగ్‌లో ఉన్న అంశాలపై మరోదఫాదళిత సంఘాలు మేధావులు రాజకీయ పార్టీలతో సీఎం అఖిల పక్షసమావేశం నిర్వహించాలి. గత వాగ్దానాల మాదిరిగానే ఈ సాధికారతకు కూడా భంగం జరిగితే ప్రయోజనం ఉండదు.
- టి. స్కైలాబ్ బాబు
సెల్:9177549646