Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జల వివాదాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఉభయ పాలకులు ఉద్వేగాలను, విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. మాటలు హద్దు మీరుతున్నాయి. పరుష పదజాలం వాడుతున్నారు. శత్రుదేశాలతో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించినట్టుగా సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు వైపులా పోలీసు బలగాలు మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు. కృష్ణానదీ జల వివాదాలు ఆసరాగా చేసుకొని తమ రాజకీయ, స్వప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఇరు రాష్ట్రాల పాలకులు చేస్తున్నారు. పరిష్కారం చూపాల్సిన కేంద్ర సర్కార్ రొచ్చుగుంటలో చేపలు పట్టే పనిలో ఉంది.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జల జగడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక కారణమైతే, రెండవది తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ కేంద్రాలలో నూటికి నూరుశాతం విద్యుత్ ఉత్పాదన చేపట్టడం. ఇది మొదట లేఖల యుద్ధంతో ప్రారంభమై మాటల యుద్ధానికి దారి తీసింది. రెండు రాష్ట్రాలు ఎవరికి వారే నీటిబొట్టు వదలమని భీష్మించుకు కూర్చున్నారు. రెండు రాష్ట్రాలు కయ్యం పెట్టుకుంటుంటే కేంద్రం చోద్యం చూస్తోంది. మొత్తానికి కేంద్రం ''చలవ''తో ఈ సమస్య మరింత జఠిలమవుతోంది. కేంద్ర జలశక్తి సంఘం, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎపెక్స్ కమిటీ, కృష్ణా నది పరివాహక మేనేజ్మెంట్ బోర్డు.. ఇన్ని ఉండి కూడా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? దీనికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్నది అందరికీ తెలిసినదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఎప్పటికప్పుడు పచ్చి అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయి. దీనివల్ల ఎవరికి అవకాశం ఉంటే వాళ్లు జలాలను తమ ఇష్టమొచ్చినట్లు వాడుకుపోవటానికి ఆస్కారం కలుగుతుంది. ఎవరి జల అవసరాలు వారికుంటాయి. అలాగని ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులను బాహాటంగా ఉల్లంఘించి, హద్దు మీరి జలాలను అదనంగా వాడుకుంటున్నారు. మొదటి నుంచి రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల వివాదం కొనసాగటం సాధారణంగా వస్తున్నది.
కష్ణానది పుట్టిన మహారాష్ట్ర, ఆ తర్వాత పరివాహక ప్రాంతమైన కర్నాటక, చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు మధ్య జలవివాదాలు రగులుకున్నాయి. ఎగువనున్న రెండు రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగించుకుంటున్నదనే వివాదాన్ని పై రాష్ట్రాలు రెండు లేవనెత్తాయి. అది పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1968 దశకంలో ఆర్ఎస్ బచావత్ కమిటీని రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ అంతకుముందు కృష్ణానదిలో వంద సంవత్సరాల జల పరివాహకాన్ని పరిగణలోకి తీసుకొని నీటి కొలతలు వేసి, వివిధ దేశాలలో నీటి పంపకాలను పరిశీలించి చివరకు మూడు రాష్ట్రాల వాటాలను తేల్చింది. ఆర్ఎస్ బచావత్ ప్రముఖ ఇంజనీర్ కావడంతో ఆయన అనేక అంశాలను దూరదృష్టితో పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందులో మిగులు జలాలు కూడా ఎవరు ఎలా వాడుకోవాలి అన్నదానిపై కూడా పరిష్కారం చూపారు. 75శాతం డిపెండబులిటీని ఆధారంగా చేసుకొని నికరజలాలను తేల్చారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో 2060 టీఎంసీలు నికరజలాలుగా నిర్ణయించారు. మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్నాటక 700 టీిఎంసీలు ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు కేటాయింపులు చేస్తూ 1973 సంవత్సరంలో తీర్పునిచ్చారు. బచావత్ కమిటీ ఇచ్చిన తీర్పు 2000 జూన్ 31 నాటికి ముగిసింది.
బచావత్ కమిటీ ముగిసిన తర్వాత 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణానదీ జలాల పరివాహకాన్ని గుర్తించి 65శాతం డిపెండబులిటీగా తీసుకొని మూడు రాష్ట్రాల మధ్య జలాలను కేటాయించింది. 2060గా ఉన్న నికర జలాలను బ్రిజేష్ కమిటీ 2578 టీఎంసీలుగా గుర్తించింది. దాని ప్రకారం ఎగువన కర్ణాటకకు 700+211=911 టీఎంసీలు, మహారాష్ట్రకు 560+106=666 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 811+190=1001 టీఎంసీలు కేటాయించింది. ఇప్పుడు అదనంగా కేటాయించిన 190 టీఎంసీలలో సగం వాటా తెలంగాణకు కావాలని ప్రధానాంశంగా మారింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అంతకుముందు 811 టీఎంసీలలో 512 ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కృష్ణా జలాలు కేటాయించబడినాయి. కమిటీ అదనంగా కేటాయించిన 190 టీఎంసీల నీటిలో తమకు తక్కువ వాటా ఇవ్వడం కుదరదని తెలంగాణ వాదన. అంతేకాదు మొత్తం కేటాయింపులలో చేరి సగం వాటాను పంచుకోవాలని తెలంగాణ వాదిస్తున్నది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల సంఘ మంత్రిత్వ శాఖకు, కృష్ణా మేనేజ్మెంట్ రివర్ బోర్డ్‌కు తన వాదనలు, హక్కులను వినిపిస్తున్నది.
ముఖ్యంగా గత సంవత్సరం పోతిరెడ్డిపాడు ఎగువన సిద్ధేశ్వరం వద్ద కేంద్ర అనుమతులు లేని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిధుల కేటాయింపు జరిపారు. పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మరో నాలుగు టీఎంసీల నీటిని తెలుగుగంగ కాల్వకు లింక్ చేయడం ద్వారా రోజుకు ఎనిమిది టీఎంసీల నీటిని అంటే 80వేల క్యూసెక్కులు జలాలను తోడుకుపోవచ్చు. ఎటువంటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వ జలసంఘం దృష్టికి తీసుకపోకుండా, నీటి కేటాయింపులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం పట్ల తెలంగాణ ప్రభుత్వం సహజంగానే తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వెంటనే నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాయలసీమ పథకాల ద్వారా వరద సమయంలో రోజుకు 80 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలిస్తే నాగార్జునసాగర్‌కు, కృష్ణానదిపై నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి మొదలగు పథకాలకు నీళ్లు మిగలవని తెలంగాణ ప్రభుత్వం వాదన. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలపాలని కేంద్రం వద్ద వాదిస్తున్నది. రాయలసీమ పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవని నిలుపుదల చేయాలని తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ గూడా ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉండటాన్ని గుర్తుచేసింది. అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు కూడా రాయలసీమ పథకాన్ని పరిశీలించిన తర్వాత సమావేశం ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని వివరిస్తామని అంటున్నది. కేంద్ర జల సంఘం కూడా అక్రమ ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మించకూడదని అంటున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జూరాల ఎగువన ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించే ప్రాజెక్టులు ఆపకపోతే తాము కూడా తమ ప్రాంతంలో కృష్ణానదిపై ప్రాజెక్ట్‌లు కట్టుకొని నీటిని వినియోగించుకుంటామని అంటున్నది. వాస్తవంగా కృష్ణాజలాలను పరివాహక ప్రాంతం 68శాతంకు పైగా తెలంగాణలో ఉన్నది. దీని ప్రకారం జిలాల్లో వాటా 548 టీఎంసీలు దక్కాలని తెలంగాణ అంటున్నది. అందుకు బదులుగా కేవలం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించబడినాయని వాదిస్తున్నది. 32శాతం మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నది. అందుకు 512 టీఎంసీలు పొందుతున్నది. ఇది న్యాయమా..? అని ప్రశ్నిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తక్కువ ప్రవాహం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎక్కువ జలవాటా పొందుతుంది. 68శాతం పరివాహక ప్రాంతం ఉన్నా.. తెలంగాణకు తక్కువ వాటా దక్కుతుంది. పరివాహక ప్రాంతాన్ని అనుసరించి కేటాయింపులు జరపాలని తెలంగాణ కోరుతున్నది. దీనిపై 2021 జూలై 9న కేంద్రం కృష్ణా రివర్ బోర్డు సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల సమావేశాన్ని జరపాలని నిర్ణయించింది. అందుకు కేసీఆర్ సమావేశాన్ని జులై 20కి పొడిగించాలని కోరుతున్నారు. కాగా అక్రమంగా ప్రాజెక్టులు నిండకముందే, 834 అడుగులకు శ్రీశైలం జలాలు చేరక ముందే తెలంగాణ విద్యుత్తును ఉత్పత్తి చేసి రోజుకు 30 వేల క్యూసెక్కుల వాడుకుంటోందని, ఇది అక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వాదన. అంతేకాకుండా కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర అనుమతులు లేకుండా అనేక ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. తమకు కేటాయించిన జలాల నుండే చట్టబద్దంగా తమ అవసరాలకనుగుణంగా వాడుకుంటున్నామని కేసీఆర్ అంటున్నారు. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధంగా రెండు రాష్ట్రాల మధ్య పోటాపోటీగా నీటి వాడకం విషయంలో వివాదాలు ముదురుతున్నాయి. తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయడం వల్ల రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులకు పైగా నీళ్లు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో వృధాగా పోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని ఏపీ ఎదురుచూస్తున్నది. ముందుగా నీటి వాటాలను కేటాయించిన తర్వాత చర్చలు జరపడం ద్వారా ప్రయోజనం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నది. నీటి కేటాయింపులపై స్పష్టత లేకుండా సమావేశాలు జరిపితే ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి కేటాయింపులు లేని జలాలను రాయలసీమకు తరలించుకుపోతున్నదనీ, దాదాపు 450 టీఎంసీలు నిల్వ చేసుకునే 32 రిజర్వాయర్లను తెలుగుగంగ పథకం కింద ఏర్పాటు చేసుకున్నదనీ, దాదాపు 150 టీఎంసీలకు పైగా అక్రమంగా నీటిని వాడుకుంటున్నదనేది విమర్శ. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. 2005లో ప్రారంభించిన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పథకం పది కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. తెలంగాణ వచ్చి ఏడేండ్లు అయినా ఈనాటికీ పూర్తి చేయలేదు. అదేవిధంగా కృష్ణానది మీద ఉన్న పాలమూరు రంగారెడ్డి పథకం, డిండి, ఉల్పర, ఉదయసముద్రం లాంటి లక్షల ఎకరాలకు గ్రావిటీ, ఎత్తిపోతల ద్వారా సాగునీరంందించే అనేక పథకాలు నేటికీ అసంపూర్తిగా పెండింగ్‌లో పడిపోయాయి. బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఉన్నా వ్యయం చేయడంలో ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. వీటిని త్వరితగతిన పూర్తి చేసినట్లయితే కష్ణానదిలో కేటాయించిన నీటిని సంపూర్తిగా వాడుకునే వీలు కలుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. బ్రిజేష్ కమిటీ కేటాయించిన అదనపు నీటిని ఉపయోగించుకోవాలి.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ జలసంఘం, కృష్ణా రివర్ బోర్డులు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులను జరిపినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వారి వాదనలు విని న్యాయంగా రావాల్సిన వాటాను కేటాయించాలి. గత సమావేశాల్లో తెలంగాణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీనిచ్చింది. అందుకు సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంలో కేసును ఉపసంహరించుకుంది. కానీ కేంద్రం మాత్రం రెండు రాష్ట్రాలు తగవులాడుతుంటే తమాషా చూస్తూ కాలయాపన చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని ఈ జల వివాదం మరింత జఠిలం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. అందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చొరవ చూపాలి. అఖిలపక్షాల సహకారం తీసుకోవాలి. ఇందులో ఎవరు నెగ్గారు! ఎవరు ఓడారు! అన్నది ముఖ్యం కాదు. ప్రజల శ్రేయస్సు, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడమే సరైన మార్గం.
- జూలకంటి రంగారెడ్డి