Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలినాళ్లలో రెండు ప్రభుత్వాలు అత్యంత సన్నిహితంగా ఉంటాయనీ, సఖ్యతతో సమస్యలను పరిష్కరించుకుంటామని ప్రగతిభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు. కానీ అందుకు విరుద్ధంగా నేడు తెలుగు రాష్ట్రాల జలవివాదం ముదురుతోంది. వీటిని పరిష్కారించుకోకుండా ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కష్ణా నదీ జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడు తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుందంటూ ఏపీ సీఎం కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపించిన తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు పులిచింతల నుంచి జల విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులూ తమదైన శైలిలో పరస్పర దూషణలతో వివాదాన్ని మరింత జఠిలం చేశారు. స్థాయి మరిచి మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రివర్గ సమావేశాల్లో తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటం కన్నా ఎదుటివారిని ఎలా ఇరుకున పెట్టాలా అన్నదే ప్రధానాంశమైంది. ప్రజలకు తాగు, సాగు అవసరాలు, జల విద్యుత్తు, పారిశ్రామిక అవసరాలు ఇలా నీటి వినియోగ ప్రాధాన్యతలు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా నిర్ణయించబడి ఉన్నాయి. ఆ నియమాలను పాటిస్తూ, ప్రత్యేక పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకొని పరస్పరంగీకారంతో ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించుకోవాలి. దేశాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య సాధారణంగా ఇలాగే జరుగుతోంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో దానికి భిన్నంగా గలగల పారే నీటి సవ్వడి వినిపించాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు పోలీసుల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల సమస్యల కంటే, తమ పార్టీలో ఇతర నేతల చేరికలే ముఖ్యమని తేల్చి చెప్పింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొట్టుకు చావండి... మేం తమాషా చూస్తామన్నట్టుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటక, మహారాష్ట్ర లకు కేటాయించిన అదనపు జలాలను వారు వినియోగించుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు మిగులు జలాలు కాదు కదా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలకు కూడా గ్యారంటీ ఉండదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కష్ణా జలాలలో తమ వాటాగా ఉన్న నికర జలాలకు గ్యారంటీని పొందడంతో పాటు బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన పద్ధతిలో మిగులు జలాలను వినియోగించుకునే హక్కును తెలుగు రాష్ట్రాలు కాపాడుకోవాలి. అలాంటి కషి జరగాలంటే ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర విశ్వాసం, పూర్తి సదవగాహన ఉండాలి. ఇరు రాష్ట్రాలూ ఉమ్మడిగా కేంద్ర పెత్తనాన్ని ఎదుర్కోవలసింది పోయి ఘర్షణ పడడం నష్టదాయకం. ఈ వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలని అనడం 'పిట్టల పోరు పిల్లి తీర్చిన' చందమవుతుంది. కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ రాష్ట్రానికో విధంగా 'ఏ రోటికాడ ఆ పాట' పాడుతూ విద్వేషాలు సష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అదే బాటలో టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలూ తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతను ఇస్తున్నాయే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించడంలేదు.
ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోకుండా 'పిల్లి మీద ఎలుక, ఎలుక మీద పిల్లి' అన్న చందంగా నీటి సమస్యతో భావోద్వేగాలను తీవ్రతరం చేస్తున్నారు. ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల నుంచి మరిలిచేందుకు వాడుకుంటున్నారు. మరోవైపున అటు ఆర్థిక సంక్షోభం, ఇటు కరోనా విపత్తుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవలసిందిపోయి పెట్రోల్ డీజిల్ గ్యాసు తో సహా నిత్యావసరాల ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం జనం నడ్డి విరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పేర్లతో పన్నులు, జరిమానాలతో జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ విషయాలపట్ల ప్రజలు అప్రమత్తం కాకుండా వివాదాలు వారి దృష్టి మళ్లిస్తున్నాయి. నీటి పంపిణీ అంశాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగిస్తాయి. కనుక కేవలం పాలక పార్టీ మాత్రమే తమకు తోచినదేదో చేసుకుపోవడం కాకుండా అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉమ్మడి అభిప్రాయాన్ని కూడగట్టడం అవసరం. సున్నితమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వాటా నికర జలాలకు కట్టుబడి ఉంటూ, మిగులు జలాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఉభయులకూ నష్టదాయకం. వీలయినంత త్వరగా సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకుని ఇటు తెలంగాణ అటు రాయలసీమలోని కరువు ప్రాంతాలకు నీటిని తరలించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. అక్కరకు రాని ఈ ఘర్షణలతో నష్టపోయేది ఇరు రాష్ట్రాల సామాన్య ప్రజలే.
- మోహన కృష్ణ
సెల్: 8897765417