Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో గత కొన్ని నెలల్లో నిరుద్యోగిత రేటు సుమారు 12శాతం వరకు పెరిగింది. ఇది ప్రజల కష్టాలను ప్రతిబింబిస్తోంది. కోవిడ్ కాలంలో సామాన్యులు ఆర్థిక భారాల కింద నలిగిపోయారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడటానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.
ప్రయివేట్ కన్సల్టెన్సీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ప్రకారం, జూన్ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 12శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో, రేటు చాలా అధికంగా దాదాపు 15శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది.
ఈ సంవత్సరం జనవరిలో ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లుగా అంచనా. ఆ తరువాత నెలల్లో వరుసగా తగ్గుతూ మే నాటికి 36.6 కోట్లకు కుప్పకూలింది. లాక్డౌన్లు అసంఘటితరంగంలో రోజువారీ ఆదాయాలపై ఆధారపడిన జనాభా సంపాదన అవకాశాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. వారు ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి కోల్పోవడం, సంపాదన లేకపోవడం ఊహించనివేమీ కావు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది శ్రామిక జనాభా కష్టాలు మరింత తీవ్రమయ్యాయి.
ప్రస్తుత ఉపాధి గత ఏడాది జూన్‌లో మాదిరిగానే ఉంది. ఈ ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతం కావడంతో మార్చి నెల మధ్య నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా లాక్డౌన్లు, ఆంక్షలు విధించాయి. మొత్తం మీద 26 రాష్ట్రాలు ఈ బాట పట్టడంతో అసంఘటితరంగంలో స్వయం ఉపాధికి గండిపడింది. పరిశ్రమలతోపాటు దానిపై ఆధారపడిన వివిధ రంగాల కార్మికులు ఉద్యోగాలకు దూరమయ్యారు.
దేశంలో ఉద్యోగాలు భారీగా పడిపోవడానికి మరో కారణం కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం. 2020 ప్రారంభంలో మహమ్మారి మన దేశంలో కనిపించడానికి కొన్ని నెలల ముందే, 2019లోనే ఆర్థిక వృద్ధి మందగించడం ప్రారంభమైంది. నోట్లరద్దు, జీఎస్టీ విధించడం వంటి ఆర్థిక మార్పులలోనే ప్రస్తుత సంక్షోభానికి మూలాలున్నాయి. గత ఏడేండ్లుగా గుడ్డిగా అనుసరిస్తున్న హద్దుల్లేని కార్పొరేట్ అనుకూల విధానాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ విధానాలు నిరుద్యోగం, వేతన స్తబ్దత, ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. దీంతో నిరుపేదలు నిర్విరామంగా దోపిడీకి గురవుతున్నారు. మరోవైపు కార్పొరేట్ రంగం కొత్తగా గణనీయమైన పెట్టుబడులను పెట్టడమూ లేదు... కొత్త ఉద్యోగాలను సృష్టించడమూ లేదు. అదే సమయంలో తగినంత పన్నులు కూడా చెల్లించడం లేదు.
2021లో లాక్డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వేతనాలు, వ్యాపారరంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ప్రధానంగా పట్టణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
గత ఏడాది మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ ఉద్యోగావకాశాలు కుంచించుకుపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటితరంగ కార్మికులు గత రెండు నెలల్లో 88 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎంఐఇ అంచనా వేసింది. దీంతోపాటు తీవ్రంగా ప్రభావితమైన తయారీరంగంలో 42 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆతిథ్య రంగంలో 40 లక్షలు, వాణిజ్య రంగంలో 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
మొత్తం నిరుద్యోగిత రేటు ఎన్నడూలేనివిధంగా మే 2021లో రెండంకెల స్థాయికి పెరిగిపోయింది. సిఎంఐఇ నివేదిక ప్రకారం మే నెలలో సగటు నిరుద్యోగం దాదాపు 12శాతం. మార్చి మధ్య కాలంలో దేశంలో సగటు నిరుద్యోగిత రేటు 6.5శాతంగా ఉండగా, మూడు నెలల్లో ఇది దాదాపు రెట్టింపై 12శాతానికి చేరుకుంది. అంటే దాదాపు నాలుగు కోట్ల మంది ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తక్కువ వేతనాలకే చాలామంది కొత్త ఉద్యోగాల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూన్‌లో పట్టణ నిరుద్యోగం దాదాపు 15శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు దాదాపు 11శాతంగా ఉంటుందని అంచనా. నిరుద్యోగులలో అధిక భాగాన్ని వ్యవసాయం గ్రహిస్తుంది. పట్టణ ప్రాంతాలకు ఆ రకమైన అవకాశాలేమీ ఉండవు. వలస కార్మికులు గత సంవత్సరం మాదిరిగానే తాము పని చేస్తున్న పట్టణాలు, నగరాలను విడిచిపెట్టి గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. వీరు పొలాల్లో పనులకు వెళ్తున్నారు. వీరితోపాటు నిరుద్యోగ యువత, ఇతరులు కూడా చేరతారు. ఈ 'అదనపు' వ్యక్తులందరికీ 'ఉపాధి లభించినట్టు'గా లెక్కించారు. వాస్తవానికి, ఇదే పనిని అంతకు ముందెన్నడూ లేనంత ఎక్కువ మంది చేస్తున్నారు. అదే రాబడిని అంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. దాంతో వారి ఆదాయాలు తగ్గిపోతాయి. ఇది నిరుద్యోగానికి మరో రూపమే. దాని పర్యవసానం పేదరికమే.
ఈ భయంకర పరిస్థితులలో ప్రభుత్వాలు కుటుంబాలకు అండగా ఉండేందుకు తక్షణ ఉపశమన చర్యలను తీసుకోవాలి. కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, లాక్డౌన్ కాలంలో వేతనాల్లో కోత పెట్టకూడదని, వేతనాలు నిలిపివేయకూడదని యజమానులకు ఆదేశాలు ఇవ్వడం, అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించకుండా ఆపడం, ఉచిత వైద్య సేవలు అందించడం వంటి తక్షణ సహాయక చర్యలతో ముందుకు రావాలి. గత సంవత్సరం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్దగా స్పందన లేదు.
ప్రజల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడవేసేందుకుగాను... పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు ప్రతి నెలా కనీసం రూ.7,500 చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఇది ప్రస్తుతం అందజేస్తున్న రేషన్‌కు అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం 10కిలోల ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు ఇవ్వాలి. ఇది బాధిత ప్రజలకు ఉపశమనాన్ని కల్పించడమే కాక, ఆర్థిక వ్యవస్థకు నిజమైన, అర్థవంతమైన ఉద్దీపనను అందిస్తుంది. ప్రజా సంక్షేమం కోసం తక్కువగాను, ధనవంతులైన ఉన్నత వర్గాల కోసం ఎక్కువగాను ఖర్చు చేయాలన్న నయా ఉదారవాద సిద్ధాంతాన్ని ప్రభుత్వం వదిలివేస్తేనే ఇది జరుగుతుంది. అలా చేయకపోవడం వల్ల రాబోయే నెలల్లో మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతప్తి పెరుగుతుంది.
- సవేరా