Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందీ చలనచిత్ర రంగంలో 'ట్రాజెడీ కింగ్' అన్న బిరుదు, అపారమైన ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న నట దిగ్గజం దిలీప్‌కుమార్. (12 డిసెంబర్ 1922 - 7 జులై 2021). నటుడిగా అర్దశతాబ్దికి మించి సినీరంగంలో కృషి చేస్తూ రావడం మామూలు విషయమేమీ కాదు. తొలి దశలో భారత ప్రభుత్వం నుండి ఏ అవార్డూ, ఏ గౌరవమూ, ఏ ప్రోత్సాహమూ లభించని ఈ నటుడికి 1994లో దాదాఫాల్కే అవార్డు రావడంతో అభిమాన ప్రేక్షకుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఆ అత్యున్నత జాతీయ పురస్కారానికి స్వయంగా ఆయనే విస్మయానందాన్ని వెలిబుచ్చారు.
బ్రిటిష్ ఇండియాలోని పెషావర్‌లో పన్నెండు మంది సంతానంలో ఒకడిగా మహ్మద్ యూసుఫ్ఖాన్గా జన్మించారు. అయితే ముంబాయి (బొంబాయి) చలనచిత్ర రంగంలో అడుగుపెట్టడంతోనే పేరు మార్చుకున్నారు. ఆ రోజుల్లో 'కుమార్' అనే పదానికి క్రేజ్ ఉండేది. అందుకే దిలీప్‌కుమార్‌గా మారిపోయారు. అలనాటి అందాల తార దేవికారాణి ప్రోత్సాహంతో 1944లో 'జవార్ బాటా' చిత్రంలో మొదట నటించారు. ఆ తర్వాత వచ్చిన చలన చిత్రాలన్నీ విశేష జనాదరణ పొందుతూ ఉండడం వల్ల, దిలీప్ సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిపోయారు. దేవదాస్, ఆగ్, దాగ్, మధుమతి, అందాజ్, కోహినూర్, నయాదౌర్, ఆజాద్, నగీనా, సంఘర్ష్, లీడర్, దీదార్ వంటి ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఇవేకాక చెప్పుకోదగ్గ గొప్ప చలనచిత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ''మొగల్-ఎ-ఆజమ్''లో సలీం పాత్ర ఎంతో క్లిష్టమైంది. పృథ్వీరాజ్ కపూర్ (అక్బర్) దుర్గాకోటి (అక్బర్ భార్య జోదాబాయి) మధుబాల (అనార్కలీ) వంటి హేమాహేమీలకు ధీటుగా నిలబడి సలీం పాత్రను హుందాగా పోషించడం ఒక అగ్ని పరీక్ష లాంటిది. అయితే ఆ పరీక్షలో దిలీప్‌కుమార్ అవలీలగా విజయం సాధించారు. దేశ వ్యాప్తంగా ఒక్కొక్క థియేటర్లో యేండ్లకేండ్లు నడిచిన 'మొగల్-ఎ-అజమ్' వంటి చారిత్రాత్మకమైన - చరిత్ర సృష్టించిన సినిమా - మళ్ళీ భారతదేశంలో రూపొందలేదంటే అతిశయోక్తి కాదు. మన హైదరాబాదు ఆబిడ్స్ కూడలిలో ప్యాలెస్ థియేటర్ ఉండేది. అందులో ఆ సినిమా ఏకధాటిగా సంవత్సరంపైగా నడిచింది. (అప్పుడే నేను మొదటిసారి హిందీ సినిమా చూశాను. నాకు అప్పుడు పదేండ్లు కూడా ఉండి ఉండవు. నిజంగానే చరిత్ర పాఠంలోని అక్బర్‌ని చూస్తున్నానని భ్రమించాను.)
'గంగా-జమున' చిత్రంలో బందిపోటు పాత్ర, 'రామ్ అవుర్ శ్యామ్' చిత్రంలో కవలల పాత్రలు, వారి భిన్న మనస్తత్వాలు కేవలం ఆయన మాత్రమే పోషించగలడనే స్థాయిలో ఉన్నాయి. 1960-70ల దాకా విషాదరస పోషణలో తిరుగులేని నటుడు అని ముద్ర పడిన దిలీప్‌కుమార్ ఆ తర్వాత క్రమంగా వైవిధ్యమున్న ఎన్నో ఇతర పాత్రలు పోషించనారంభించారు. 'లీడర్' 'గోపి' వంటి చిత్రాలలో సరదాగా హాస్య కథా నాయకుడయ్యారు. మశాల్, శక్తి, ఇన్సానియత్, విధాత, కానూన్ ఆప్నా అప్నా, కర్మ, క్రాంతి వంటి ఇతర చిత్రాలలో కథానాయకుడిగానే కాక, నటనకు ప్రాధాన్యమున్న కేరక్టర్ యాక్టర్‌గా ముఖ్య భూమికలు పోషించారు.
చిన్నప్పుడు దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్ కుటుంబాలు పెషావర్‌లో ఒకే ప్రాంతంలో ఉండేవి. అందువల్ల వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. అయితే ఒకనాటికి ఆ ఇద్దరూ దేశంలో తిరుగులేని వెండితెర వెలుగులవుతారని ఎవరూ ఊహించలేదు. ఆ రోజుల్లో నాటకాల్లో, సినిమాల్లో వేషాలు వేయడమనేది తక్కువ స్థాయి పనుల కింద జమ కట్టేవారు. అందుకే దిలీప్‌కుమార్ మొదట సినిమాలో నటించిన విషయం ఇంట్లో చెప్పలేదు. రాజ్‌కపూర్ తండ్రి పృథ్విరాజ్ కపూర్ నాటక రంగంతో పరిచయం ఉన్నవాడు గనక, సినిమా పోస్టర్‌పై దిలీప్‌ను గుర్తుపట్టి విషయం గ్రహించాడు. తర్వాత, పండ్ల వ్యాపారి అయిన దిలీప్ తండ్రికి చెపితే విషయం ఆ ఇంట్లో తెలిసింది. తర్వాతి కాలంలో బొంబాయిలో స్థిరపడి బాలివుడ్ సామ్రాజ్యానికి చక్రవర్తులయ్యారు. అదొక సుదీర్ఘ ప్రయాణం.
ఒకవైపు అమాయక ప్రేమికుడి పాత్రలతో రాజ్‌కపూర్ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటే, మరోవైపు దేవానంద్ తన రొమాంటిక్ పాత్రలతో యువతరాన్ని ఉర్రూతలూగిస్తూ ఉంటే.. దిలీప్‌కుమార్ అతి బరువైన పాత్రలతో విషాద భరిత కథా చిత్రాలతో తన సత్తా చూయించేవాడు. ప్రేక్షకుల్ని హాస్యంతో ఆకట్టుకోవడం సులభం. కానీ, త్యాగాలతో మరణాలతో ఆకట్టు కోవడం చాలా కష్టం. ఆ కష్టమైన పనినే దిలీప్‌కుమార్ సాధించాడు. అందుకే ఆయన ఎప్పుడూ 'వాసి'కి విలువనిచ్చారే గాని, రాశికి కాదు. మరొక ముఖ్య విషయమేమంటే, అంతర్జాతీయంగా ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టే హాలీవుడ్ పాత్రల్ని కూడా ఆయన తృణప్రాయంగా వదులుకున్నారు. ఆయనకు సరిపడే పాత్ర, కథ, వాతావరణం, భాష అన్నీ ఉంటేగాని ఆయన రంగం మీదికి దిగేవారు కాదు. తనను నమ్ముకున్న దర్శక నిర్మాతలకు ఎప్పుడూ ఏవిధమైన నష్టం కలగకుండా చూసుకునేవారు. నిజాయితీకి, కట్టుబాట్లకు కొన్ని నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చేవారు. అందుకే 'దేవదాసు' చిత్రంలో తాగుబోతు పాత్రను చేస్తూ ఉండగా, దర్శకుడు గురుదత్ తన 'ప్యాసా' చిత్రానికి ఆహ్వానిస్తే.. మర్యాదగా తిరస్కరించారు. కారణం ఏమీలేదు. ఒకే రకమైన పాత్ర ఒకే సమయంలో వేరు వేరు సినిమాల్లో చేయడానికి ఇష్టపడలేదు. అయితే అది గురుదత్‌కు చాలా ఉపయోగపడింది. 'నువ్వు రూపకల్పన చేసిన పాత్ర - నీకన్నా బాగా ఎవరు చేయగలరూ?' అని శ్రేయోభిలాషులు సూచించడంతో 'ప్యాసా' చిత్రంలో హీరో పాత్ర దర్శకుడైన గురుదత్తే పోషించారు. అది అఖండ విజయం సాధించడమే కాదు, గురుదత్లోని ఒక గొప్ప నటుణ్ణి బయటికి తీసుకొచ్చింది.
'గంగా-జమున' రషెస్ చూసిన డేవిడ్ థావన్ దిలీప్‌కుమార్‌ను తన చిత్రం 'లారెన్స్ ఆఫ్ అరేబియా'లో నటించడానికి రమ్మని టెలిగ్రాం పంపాడు. తనకు సరిపడే వాతావరణం అక్కడ ఉండదని, నటనలో తనదైన అభివ్యక్తిని ప్రదర్శించే వీలు ఉండదని ఆ ఆహ్వానాన్ని కూడా మర్యాదగా తిరస్కరించారు. ట్వంటియత్ సెంచరీ ఫాక్స్ వారి ''వెన్ ద రెయిన్స్ కేమ్'' అనే చిత్రం రీమేక్‌లో పనిచేయడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే తన దేశంలో తన రంగంలో కేవలం తనదే అయిన ప్రత్యేక ఇమేజ్‌ని కాపాడుకోవడానికి! గాలి వాటంలో పడికొట్టుకు పోవడం ఆయనకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. ఆయన సమకాలికులు రాజ్‌కపూర్, దేవానంద్, శాంతారామ్ వంటి వాళ్ళంతా సినీదర్శకులై సినీరంగాన్ని శాసిస్తున్న రోజుల్లో కూడా ఆయన కేవలం నటనకు మాత్రమే పరిమితమయ్యారు. డైలాగ్ డెలివరీకి, స్టెప్పులు వేయడానికి, చేతులు తిప్పడానికి ఆ రోజుల్లో దిలీప్‌కుమార్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. దాన్ని యధాతథంగా అనుకరిస్తూ తర్వాత కాలంలో ఎంతో మంది హీరోలుగా చలామణి అయ్యారు.
నళినీ జయవంత్, మధుబాల, నర్గీస్, మీనాకుమారి, సైరాబాను వంటి నటీమణులతో ఆసిఫ్, విమల్రారు, హృషీకేష్ ముఖర్జీ, రాజ్ కపూర్, బి.ఆర్.చోప్రా, సుభాష్ ఘారు వంటి దర్శకులతో దిలీప్‌కుమార్ కలిసి పనిచేశారు. రాజ్‌కపూర్ ఆత్మగా భావించబడే గాయకుడు ముఖేష్ తొలి దశలో దిలీప్‌కుమార్‌కు కూడా తన గొంతును అందించారు. తర్వాత చాలా వరకు మహ్మద్ రఫీయే పాడారు. 'మధుమతి' చిత్రంలో దిలీప్‌కుమార్‌కు పాడిన ముఖేష్ పాటలు ఎంత హిట్టో ఆ అభిరుచి ఉన్నవారికి తెలుస్తుంది. విక్టోరియా డిసికా, ఫెల్లినీ, ట్రుఫట్ వంటి విదేశీ చలన చిత్రదర్శకులు, స్వదేశీ దర్శకుడైన సత్యజిత్ రే అంటే తనకు ఎంతో అభిమానమని తరచూ చెప్పుకునే వారు. వారి చిత్రాలతో తనెంతో స్ఫూర్తిని పొందానని సగర్వంగా ప్రకటించుకునే వారు.
పాకిస్థాన్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్ యె ఇమ్తియాజ్' 1998లో ప్రకటించినప్పుడు దాని చుట్టూ ఇక్కడ రాజకీయాలు నడిచాయి. ఆ అవార్డు తీసుకుని రావొద్దని శివసేన పార్టీ ఆక్షేపించింది. కానీ అప్పటి దేశ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పారు కల్పించుకుని- దేశాల మధ్య ఉన్న సమస్యలకూ, ఆ దేశం సగౌరవంగా ఒక కళాకారుడికి ఇచ్చే అవార్డుకు ముడిపెట్టొద్దన్నారు. దిలీప్‌కుమార్‌కు అన్ని రకాలుగా రక్షణ కల్పించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రస్తుత పాలకులు తమ నాయకుడైన అటల్జీ మాటల్ని, చేతల్ని గుర్తుపెట్టుకుంటే ఎంత బావుండునూ? పాకిస్థాన్‌లో దిలీప్‌కుమార్ పుట్టిన రోజును అక్కడి ప్రజలు ప్రతిసంవత్సరం జరుపుకుంటున్నారు. పెషావర్‌లో ఒకప్పటి ఆయన ఇంటిని ఆయన పేరుతో మ్యూజియంగా మార్చారు. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్థాన్‌తో శాంతి చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం ఆయన సేవలు ఉపయోగించుకుంది. మిలిటరీ, పోలీస్ వంటి రక్షణ రంగాలలోనైనా, సంగీత, సాహిత్య, కళా, సినిమా రంగాలలోనైనా భారతీయ ముస్లింల భాగస్వామ్యం చాలా గొప్పది. ఆ విషయం ప్రస్థుత పాలకులు, వారి అనుచరులు గుర్తుంచుకోవడం మంచిది.
పద్మభూషణ్ (1991), పద్మ విభూషణ్ (2015) మొదలైన గౌరవాలు స్వీకరించడమే కాకుండా 2000-2006 మధ్య కాలంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఇతర నటులవలె ప్రత్యక్ష రాజకీయాలతో ఆకర్షింపబడలేదు. నటి సైరాబాను (భార్య)తో ప్రశాంత జీవనం గడిపారు. మౌలానా ఆజాద్, ఫక్రుద్దీన్ అహ్మద్, షా నవాజ్, మెయిన్ ఉల్ హక్ వంటి రాజకీయ నాయకులతో బంధుత్వం బాంధవ్యం ఉండి కూడా రాజకీయాలకు దూరంగా ఉండడం విశేషం. సాంఘిక కార్యకర్తగా, ఎన్నో సంస్థలకు మార్గదర్శిగా ఉన్నారు. జాతి పురోగమనానికి సర్వదా కృషి చేస్తూనే వచ్చారు. వయసు మీద పడిన తర్వాత కూడా ఇరుగు పొరుగు పిల్లలతో క్రికెట్ ఆడుతూ, ఫుట్‌బాల్ ఆడుతూ చివరిదాకా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వృద్ధ బాలకుడాయన! స్వయం కృషితో ఒక రంగంలో లెజెండ్‌గా నిలబడడం ఆషామాషీయేమీ కాదు. అధికారంలో ఉన్నవారికి భజన చేస్తూ తిరగకుండా, బాధ్యత గల భారతీయుడిగా జీవించిన దిలీప్‌కుమార్ ఎందరికో ఆదర్శప్రాయుడు. తన నటనలో తీవ్రతను కేంద్రీకరించి, దాన్ని తన పాత్రల ద్వారా ఆవిష్కరించి, ఈ సమాజాన్ని అలరించిన ఒక మహానటుడి సాంస్కృతిక, సామాజిక సేవను బేరీజు వేయడం అంత సులభం కాదు. ప్రారంభం లాగే ముగింపూ తప్పదని తెలిసినా, దిలీప్‌కుమార్ తన 98వ యేట కన్నుమూశారని తెలుసుకుని తట్టుకోలేక.. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్లలో ఉన్న ఆయన అభిమానులు బాధాతప్త హృదయాలతో నివాళులర్పిస్తున్నారు.
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు