Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వమానవాళి అప్రతి హాతంగా పెరిగిపోతుంది. అలా పెరిగిపోతున్న జనాభా జీవించడానికి, నివసించడానికి వనరులు కావాలి. అనూహ్యంగా పెరిగే జనాభాకు వనరులు పరిమితంగానే ఉన్నాయి. ఏతా వాత చెప్పొచ్చేది ఏమంటే? జనాభా పెరిగితే వనరులు తగ్గుతాయి. కాబట్టి జనాభా పెరుగుదలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చించడానికి ఒకరోజు ఉండాలని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఓ) భావించి ''ప్రపంచ జనాభా దినోత్సవం''గా జులై 11ను 1987న ప్రారంభించబడింది. నాటికి 500కోట్ల జనాభా దాటినందున అప్పటినుంచి ప్రపంచ జనాభా దినోత్సవం కొనసాగుతుంది. 1989 నుండి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విరామంగా జరుగుతుంది. ఈ రోజున జనాభా పెరుగుదల వలన వచ్చే సమస్యలపై చర్చించడం, నియంత్రించడం, పరిష్కారాలపై ప్రపంచ ప్రజలను చైతన్య పరచడం సభలు, సమావేశాలు, ర్యాలీలు తీయడం లాంటివి చేస్తారు. పెరుగుతున్న జనాభా మూలంగా కరువులు, పేదరికం, సహజ వనరుల కొరత, ఉగ్రవాదం, ఆధిపత్యాలు, అంతర్యుద్ధాలు, పర్యావరణ, వాతావరణ కాలుష్యాలు ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్న వేళ... విశ్వమానవాళి ప్రకృతి సమ్మిళిత జీవనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నేడు ఏర్పడింది. ఈ భూగోళంపై మూడు వంతుల నీరు ఉంటే ఒకవంతు భూమి ఉంది. ఒక వంతు భూమిలో అడవులు, జలవనరులు, నివాస యోగ్యంలేని భూమి మినహాయిస్తే జనాభా జీవించాల్సిన భూభాగం పరిమితంగానే ఉంది.
ప్రపంచంలోని జనాభాలో మొదటి స్థానం చైనా దేశం ఆక్రమిస్తే, రెండవస్థానంలో మన భారతదేశం ఉంది. ఈ రెండు దేశాలే ప్రపంచ జనాభాలో 37శాతం కలిగి ఉన్నాయి. అందులో భారతదేశం వాటా 16శాతంగా ఉంది. అయితే ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, వెనకబడిపోవాలన్నా, మానవవనరులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మానవ వనరులను వినియోగించుకోవడంపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆధిపత్య పోరులో స్వార్థంతో పాలకులు శీఘ్రగతిన అద్భుత ప్రగతి పేరిట ప్రకృతి (వనరులను) సమతూకాన్ని దారుణంగా ధ్వంసం చేయడం వలన భూకంపాలు, తుఫానులు, సునామీలు, ఆమ్లవర్షాలు, వైరసులు, కరోనా లాంటి వ్యాధుల ముప్పేట దాడితో.. ప్రపంచ జనాభా అశాంతికిలోనై శాంతియుత, ఆరోగ్య వంతమైన జీవనం కోల్పోతుంది.
మనదేశంలో 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశం మొత్తం మీద నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా జనాభా 134 కోట్లకు చేరింది. నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే, 16మంది కన్ను మూస్తున్నారు. మొత్తమీద నికరంగా దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు. 2019 ఏడాది వ్యవధిలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించగా, మరణాలు 83లక్షలున్నాయి. దేశంలో నమోదైన జననాల్లో 81.2శాతం ప్రభుత్వ లేదా ప్రయివేటు దవాఖానాల్లో ప్రసవాలు జరిగినాయి. 83లక్షల మరణాల్లో 34.5శాతం మందికి మరణించే వేళ ఎలాంటి వైద్య సదుపాయాలు అందలేదు. ఇవన్నీ సహజ మరణాలుగా నమోదు అయినాయి. దవాఖానాల్లో చేరి వైద్యం పొందుతూ సంభవించిన మరణాలు 32.1శాతంగా ఉన్నాయి. ఇతర కారణాలతో మిగిలిన మరణాలు జరుగుతున్నాయి. మనదేశం జనాభాలో కొంత కాలంలోనే చైనాదేశాన్ని అధిగమించి మొదటిస్థానాన్ని ఆక్రమిస్తుందని నిపుణులు చెపుతున్నారు. జనాభా నియంత్రణకు ఏకైక మార్గమైన కుటుంబ నియంత్రణను ఖచ్చితంగా పాటించాలి. కానీ కొన్ని మత విశ్వాసాలు, మూడనమ్మకాలు, లింగభేదాలు కారణాలుగా చూపుతూ చదువుకున్నవారు కూడా కుటుంబ నియంత్రణ పాటించడం లేదు. విభిన్న సంస్కృతులకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు నిలయమైన మనదేశం కొన్ని కులాల, మతాల ఆధిపత్యం కోసం బాహాటంగా మతాధిపతులు, ప్రజాప్రతినిధులే నియంత్రణ పాటించకండి. పిల్లల్ని కనండని ఆదేశిస్తున్నారు. ప్రపంచలో అనేక దేశాలు ఇలాంటి కారణాల వలన జనాభా పెరుగుదలకు కారణమవుతున్నాయి. ప్రపంచ జనాభా పెరగుతుండడం వలన, స్వార్థంతో సహజ వనరులు కొల్లగొట్టడం చేత భూగోళం ఉష్ణమండలంలా మారి వినాశకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ ప్రపంచ దేశాల పాలకులు ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో జనాభా నియంత్రణ చర్యలకు చిత్తశుద్ధితో ఇప్పటి నుండే నడుం బిగించాలి. భూగోళానికి, వాతావరణానికి హానిచేయకుండా మానవ జీవన శైలిలో మార్పు వచ్చేలా ప్రపంచ ప్రజలను జాగృతం చేయాలి. చిత్తశుద్ధితో సంకల్పిస్తే చేయలేనిది ఏముండదు. ఆ వైపుగా సంఘటితంగా పురిగొల్పబడాలి.
తాజాగా ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు, భారతదేశ జనాభా సుమారు 139 కోట్లకు చేరిన వేళ... ప్రపంచ యవనికపై మన భారతదేశం తనవంతు పాత్రను నేడు కీలకంగా పోషించాల్సి ఉంది. ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానంకు చేరుకోబోతున్న వేళ పాలకులు, పాలితులు జనాభా నియంత్రణ చిత్తశుద్ధితో పాటిస్తూ ప్రకృతి సమ్మిళిత జీవనం, శాంతి సామరస్య పూర్వక ధోరణితో దేశాన్ని అభివృద్ధి పరచాల్సి ఉంది. మనదేశ ప్రజల మనస్సుల్లో చిన్న కుటుంబం ఆవశ్యకతను గ్రహించేలా చేసి ఆరోగ్యకర జీవనానికి దారులు వేసుకోవాలి. పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల పౌర సమాజంగా వ్యక్తుల నుంచి కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు, జిల్లా, రాష్ట్రాలు, దేశం ప్రగతిశీల, వైజ్ఞానిక, అభ్యుదయ భావజాలాలను వ్యాప్తి చేస్తూ మెరుగైన జన జీవనాన్ని గడుపుతూ వసుదైక కుటుంబంగా ప్రపంచంలో కీర్తించబడాలి.
- మేకిరి దామోదర్
సెల్:9573666650