Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొంచెం స్వేచ్ఛగావాలి, మనిషిని మనిషని చెబటానికి, పశువుని పశువని చెబటానికి, కొంచెం స్వేచ్ఛ కావాలి, రాత్రిని రాత్రని చెబటానికి, పగటిని పగలని చెబటానికి' అంటాడు కవి శివారెడ్డి. అవును కదా! ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు, చూసింది చూసినట్టు, జరిగింది జరిగినట్టూ ఎవరూ చెప్పటానికి సాహసించటం లేదు. 'క్షేమం అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్ళు తెరిచే భూమి' కదా ఇది!
ఫాదర్ స్టాన్ స్వామి రాజ్యపు కత్తుల రక్తపు మడుగులో ప్రాణాలను విసిరి వెళ్ళినందుకు నాకు ఏమాత్రమూ దు:ఖం కలగడం లేదు. అతని మీద జాలివేయడం లేదు. ఎందుకంటే ఎనభైనాలుగేండ్ల వయస్సులోనూ స్వేచ్ఛకోసం, హక్కుల కోసం, మనుషుల కోసం నినదించి పోరాడి పోరాడి యుద్ధ క్షేత్రంలో వీరుడిలా నేలకొరిగాడు. సామాన్యుల కోసం అసామాన్య సమరంలో అసువులు బాసాడు. కానీ ఆత్మాభిమానాన్ని అమ్ముకోవటానికి పూనుకోలేదు. వీరుల మరణం చరిత్రలిఖిస్తుంది. దుష్టుల, హీనుల నిరంకుశుల నీతి బాహ్యతలను నిలబెట్టి చూపిస్తుంది. ఇప్పుడు మనం దు:ఖపడాల్సింది జాలి పడాల్సింది, చలించాల్సినప్పుడు చలించకపోయేవాళ్ళను చూసి, స్పందించాల్సినప్పుడు స్పందించకపోయే వాళ్ళను చూసి. మాట్లాడకపోతే, స్పందించకపోతే మనం బతికున్నట్టు ఎలా!
స్వామి చనిపోలేదు. అతను అమరుడు. అత్యంత మానవీయంగా బతికాడు. ఎలా బతికితే మనిషవుతాడో అలా బతికాడు. కానీ చచ్చిపోయింది చచ్చిపోతున్నది మానవీయత, ప్రజా స్వామ్యం, న్యాయం. ఇందుకు మనం దు:ఖపడాలి. పన్సారే, థబోల్కర్, గౌరీలంకేశ్ల హత్యలు మనల్ని మేల్కొల్పలేకపోయినందుకు దు:ఖించాలి. ఇంకా ఎన్నో హక్కుల కోసం తపించే గుండెలకు నిర్భంధ సంకెళ్ళు చుట్టిన దృశ్యాలను చూసి దు:ఖించాలి. దు:ఖం మనిషితనం... అదో నిరసన తలం... ప్రశ్నలు మొలకెత్తే సెగల జలం... మనం మనుషులుగా కదలకపోతే మృగాలు మనల్ని నియంత్రిస్తాయి. నియంతృత్వం తాండ విస్తుంది. అమానవీయత రాజ్యమేలుతుంది.
అతడేం చేశాడు, కాళ్ళూ చేతులూ వణికిపోతున్నవాడు రాజ్యాన్నే వణికించాడా! ఏండ్లుపైబడి జ్ఞాపక శక్తీ కోల్పోతున్నవాడు మీ కలల్లో సింహమై గర్జించాడా! నోటికిన్ని మంచినీళ్ళు కూడా చేతితో తాగలేనివాడు, అధిపతుల హత్యకు సమాయత్తమయ్యాడా! ఇవన్నీ హత్యానేరాన్ని న్యాయం చేయటానికి వేసే ఎత్తుగడలు. అసలు చేసిన నేరమేమంటే.. జార్ఖండ్ అటవీ ప్రాంతంలో అడవి బిడ్డలు గిరిజనుల హక్కుల కోసం, అడవిపై వారికున్న హక్కు కోసం దశాబ్దాలుగా పనిచేయటం, అమాయక గిరిజనులను చైతన్య పరచి ఉద్యమించడం. ఆ అటవీ ప్రాంతంలో ఖనిజ సంపద కోసం, అటవీ భూములలోని సంపదను ఆదానీ అంబానీ మొదలైన కార్పొరేటు శక్తులకు దోచిపెట్టటాన్ని స్టాన్ స్వామి ఎంతో స్ట్రాంగ్‌గా నిలువరించే ప్రయత్నం చేశాడు. అందుకు ఆయన జాతి వ్యతిరేకిగా, కుట్రదారుగా ఆరోపించబడ్డాడు. ఆఖరికి చూస్తుండగానే హత్య చేయబడ్డాడు. ఇది దేశం సిగ్గుపడాల్సిన విషయం, క్షమించు స్వామీ అని వేడుకోవాల్సిన విషయం.
మనకు చాలా మంది బాబాలు, స్వాములు ఉన్నారు. కొందరు వ్యాపారాలు చేసుకుంటూ, మోసపు మాటలతో ప్రజల్ని వంచిస్తూనే ఉన్నారు. స్వాములు ఆశ్రమాలు నిర్వహిస్తూ దోపిడీలకు, హత్యలకూ పాల్పడుతున్నారు. జైళ్ళకుపోయి, వెనువెంటనే బెయిల్‌పై స్వేచ్ఛను పొందుతూనే ఉన్నారు. వీళ్ళ కోసం ప్రభుత్వాధినేతలు పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. కానీ స్టాన్ స్వామి మనకొక్కడే ఉన్నాడు. అతడు ఆశ్రమం పెట్టలే, వ్యాపారం చేయలే, మోసపు మాటలు చెప్పలే, యోగా విన్యాసాలు చేయలే, ఆరోగ్యం అందిస్తానని హామీ ఇవ్వలే... మనుషులు బతికే హక్కును కలిగి ఉన్నారని చెప్పాడంతే! అందుకాయనను నిర్బంధించి మరీ చంపేశారు. 'నాకు తెలిసి దయార్ధ్ర హృదయుల్లో స్టాన్ స్వామి ఒకరు. ఇదిరాజ్యం చేసిన హత్య. అంతకంటె తక్కువేమీ కాదు. దురదృష్టవశాత్తూ మన న్యాయ వ్యవస్థ కూడా ఇందులో భాగస్వామి అయింది' అని ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ అన్న మాటలు అక్షర సత్యాలు. కేసు విచారణకు రాకుండానే మరణశిక్ష విధించడం ఎంత ఘోరం! న్యాయ వ్యవస్థ తన కళ్ళకు మాత్రమే కాదు హృదయానికీ కట్టు బిగించి శిలగా మారిందా అనిపిస్తుంది. ఎందుకంటే, నలభైమంది మరణానికి కారణమైన ఉగ్రవాద చర్యతో సంబంధమున్న ఓ అధికార కార్యకర్తకు ఆరోగ్య కారణాలతో బెయిల్ దొరుకుతుంది. కానీ సామాజిక ఉద్యమకారుడిగా పనిచేస్తున్న కదలలేని వృద్ధుడికి ఆరోగ్యం క్షీణించి ఖైదీగానే మరణించినా బెయిల్ దొరకదు. ఎంతటి అన్యాయమైన న్యాయం!
ప్రజాస్వామ్యానికి ప్రశ్న అనేది ప్రాణవాయువు లాంటిది. దాన్ని సహించలేకపోవటం అంటే ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమే. ఎక్కుపెట్టిన ప్రశ్నలన్నింటినీ జైళ్ళలోకి తోసేసి, అధికార దురాగతాల్ని ప్రశ్నిస్తే జాతి వ్యతిరేకులుగా ముద్రవేసే అక్రమ చట్టాల దుర్వినియోగపు దుష్టత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం. ఉపా చట్టం మోపాల్సినంత నేరం ఏం చేశాడు! ఇంతా చేసి ఎనిమిది నెలలుగా నిర్బంధించిన స్టాన్‌స్వామి పైన నేరానికి సంబంధించిన సాక్ష్యాలు, రుజువులు చూపెట్టగలిగారా? కేసు ఫైల్ చేశారా? లేదు. చేయలేరు కూడా. ఆనాడు ఒరిస్సాలో క్రిస్టియన్ ఫాదర్ గ్రాహంస్టేయిన్ని అతని కొడుకుని ఉన్మాద మూకలు నిలువునా తగులబెట్టి చంపేసాయి. నేడు స్వామినీ నిర్ధయగా, నిర్థక్షణ్యంగా చంపేశాయి. ఈ చావులు ఊరికే పోవు.
హత్యానంతరం అఖండ ఘోష హంతకులకు వినిపించకపోవచ్చు. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదని, ప్రశాంతంగా అన్నీ సాఫీగానే జరిగిపోతున్నాయని అనుకుంటూ ఉన్నారేమో! అది మీ పిచ్చితనం. పాకుతూ విస్తరించే చైతన్యమూ వైరస్లాంటిదే. అది గుండెల్లో లేపే అలజడి ఇప్పుడిప్పుడే బయటికి కనపడదులే. గుండెల నుండి ఊపిరితిత్తులకు, అక్కడి నుండి నరనరానికి పారే రక్తంలోకి ప్రవహించి ప్రవహించి నిండుగా, కండ్లలోకి చేరుతుంది. అప్పుడు ఎర్రబడ్డ కళ్ళ ఉరుములు వాళ్ళను దహనం చేయడానికి వెల్లువెత్తుతాయి. ఇక వాళ్ళను ఏ వెంటిలేటర్లూ బతికించలేవు. సముద్ర గాంభీర్యత లాంటిదే చైతన్యం కూడా. వాళ్ళనుకోవచ్చు చచ్చుబడిన మనుషుల నేలుతున్నామని, అమ్మకమయిన మెదళ్ళను మానిటర్ చేస్తున్నామని, పూడుకుపోయిన గొంతులు శబ్దించడం కల్ల అని, ఆలోచనలన్నింటికీ కళ్ళాలు వేసి చేతిన పెట్టుకున్నామని భ్రమించవచ్చు. కాలం కలెపెలా ఉడుకుతోంది. పీడనలోంచే కెరటం ఎగసిపడుతుంది. ఈ హింసకు సమాధానం ఉద్భవిస్తుంది. ఏ కాలంలోనయినా అన్యాయాన్ని నిలదీసేవాడుంటాడు. ఒకరనో ఇద్దరో కావచ్చు. సన్నగా వినిపించవచ్చు. ప్రశ్నల పుట్ట పగులుతుంది. నోటిని కట్టేసుకున్న వాళ్ళ గొంతుపైకీ కత్తులు ఎగురుతాయి. మానవాంశ గల వాళ్ళందరూ మౌనాలను బద్ధలు కొడతారు. ''అడవి అంటుకున్నాక, పులుగులు రెక్కలు విప్పుకుంటాయి, మంటలెగసినట్టు ప్రశ్నలు పెల్లుబుకుతాయి, పక్షులను అరవమని ఎవరూ చెప్పరు, మరణం ముగింపు కాదు, ఓరి పిచ్చి మొఖాలూ! శ్వాసకూ కోరస్లుంటాయి, అవి విడిచిన బాణంలా దూసుకువస్తాయి'' అన్న కవి వాక్కులు ఊహలు కాదు సత్య దర్శనాలు. నిశబ్దం, శబ్దించడానికి చేసే కసరత్తు మాత్రమే. ప్రజల చూపులు నిత్య చలనంలో నిఘాలోనే ఉన్నాయి. కదిలించే వారికోసం ఎదురుచూస్తున్నాయి. తుఫాను ముందరి ప్రశాంతతను చూసి సంబరపడిపోవద్దు. చరిత్ర పేజీలు తిరగేరు! నియంతలెందరో కాలం కాళ్ళ క్రింద కనుమరుగైపోయారు. తిరుగుబాటు ప్రకృతి నియమం. అమరం వీరుల మరణం.
- కె. ఆనందాచారి
సెల్:9948787660