Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొని, ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు కారకులైనారనే ఆరోపణలపై 'ఉపా' చట్టం కింద సంవత్సర కాలంగా నిర్బంధంలో ఉన్న (దేవాంగన కలీతా, నటాషా నార్వల్, ఆల్ ఆసిఫ్ ఇక్బాల్ తన్హా ) విద్యార్థి కార్యకర్తలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ, ఢిల్లీ పోలీసు అధికారుల చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ, హైకోర్టు బెంచ్, ''భిన్నాభిప్రాయాలను అణచివేయాలనే ఆందోళనలో ప్రభుత్వం, రాజ్యాంగం కల్పించిన నిరసన వ్యక్తం చేసే హక్కుకు, తీవ్రవాద చర్యలకు మధ్య ఉన్న రేఖను చెరిపివేయడం, ప్రజాస్వామ్యానికి చేటనీ, 'ఉపా' లాంటి క్రూర చట్టాలను ప్రజలపై మోపడం అంగీకార యోగ్యం కాదని'' వ్యాఖ్యానించింది.
జూన్ 25, 2021న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షాలు, భారత దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థల వినాశన కాలం నాటి (1975-77 మధ్య ఎమర్జెన్సీ) 'చీకటి రోజులను' ఎన్నటికీ మరచిపోలేనివిగా గుర్తు చేసుకున్నారు. విద్యార్థు లకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన జూన్ 15 నుండి, మోడీ, షాలు ఎమర్జెన్సీ గురించి మాట్లాడిన జూన్ 25వ తేదీ మధ్య కాలంలో, దేశం లోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు, మోడీ పాలనలో నెలకొన్న అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులను ప్రతిబింబించాయి. ప్రభుత్వ సంస్థలు, బీజేపీలోని పెద్దలు, ఆరెస్సెస్ అనుబంధ సంఫ్‌ు పరివార్ సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న స్వతంత్ర జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష సభ్యులకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో దాడులు చేస్తున్నాయి.
తీవ్రవాద సమస్యను పరిశీలించి, దానికొక పరిష్కారం కోసం ఉద్దేశించబడినట్టు పైకి కనిపించే 'ఉపా' చట్టం నేడు భారతదేశంలో ఉన్న క్రూరమైన చట్టాలలో ఒకటి. సమస్య మూలం, ఈ చట్టంలోని సెక్షన్ 43 (డీ) (5) లోనే ఉంది. ఈ సెక్షన్ నేరారోపణ చేయబడిన వ్యక్తి విడుదలను అడ్డుకుంటుంది. తీవ్రవాదులనే ఆరోపణలతో నిర్బంధించబడి, కొన్నేండ్ల పాటు జైల్లో మగ్గి, ఆ తరువాత నిరపరాధులుగా విడుదలయిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును అనుభవించడానికి హామీ, రక్షణ కేవలం బెయిలు మాత్రమే. సాధారణ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయడానికి నేరారోపణ చేయబడిన వ్యక్తి పారిపోవడం, సాక్షులను, రుజువులను ప్రభావితం చేయడం లాంటి అంశాలతో పాటు నేర తీవ్రతను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ ఇక్కడ 'ఉపా' చట్టంలోని సెక్షన్ 43 (డీ) (5) అత్యంత వినాశనకరమైన పాత్రను పోషిస్తున్నాయి. అంటే సవాల్ చేయడానికి వీలులేని కేసు డైరీని లేదా పోలీసు రిపోర్టులను మాత్రమే కోర్టు చూస్తుంది. ముందుగా మనకు కనిపించిందే నిజం (ప్రైమా ఫేసీ) అనే ప్రాసిక్యూషన్ కేసు సవాల్ చేయవీలు లేదు కాబట్టి బెయిల్ నిరాకరించబడుతుంది.
'ఉపా' చట్టంలోని సెక్షన్ 43(డీ)(5) యొక్క ప్రభావం ఎంతగా ఉంటుందంటే.. ఒకసారి పోలీసులు ఒక వ్యక్తి పై 'ఉపా'చట్టం కింద కేసు నమోదు చేస్తే, ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు కావడం చాలా కష్టం. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇక్కడ ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. నేర నిరూపణకు సంబంధించిన అనేక ప్రాథమిక నియమనిబంధనలను సెక్షన్ 43(డీ)(5) వదిలేసినప్పటికీ, ఇతర ప్రాధాన్యత గల నియమాలు కొన్ని ఉన్నాయి. ప్రాథమికంగా నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. ఆరోపిస్తున్న నేరాలు నిర్దిష్టంగా పేర్కొనాలి, అమాయకులపై నేరారోపణలు చేయరాదు. 'ఉపా' చట్టం తీవ్రవాద కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించబడింది కాబట్టి, ఆ చట్టాన్ని దానికి మాత్రమే పరిమితం చేయాలి. చేసిన నేరారోపణలు వాస్తవికంగా, నిర్దిష్టంగా ఉండాలి. నేరారోపణ చేయబడిన వ్యక్తి పాల్పడిన తీవ్రవాద చర్యను నిర్దిష్టంగా పేర్కొనాలి. ముఖ్యంగా పోలీసుల ఊహాజనితమైన అనుమానాలను బెయిల్ మంజూరు చేసే సమయంలో పరిగణనలోకి తీసుకొనరు. మన రాజ్యాంగం కల్పించిన నిరసన వ్యక్తం చేసే, భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కుల ఆధారంగా 'ఉపా'చట్టంలోని సెక్షన్ 43 (డీ) (5) వర్తింపజేయడం జరగదని తీర్పులో పేర్కొన్నారు.
ఢిల్లీ హైకోర్టు తీర్పు, పౌర హక్కులు, 'ఉపా' లాంటి తీవ్రవాద వ్యతిరేక చట్టాల ఆవశ్యకత మధ్య సమతుల్యతకు అవసరమైన మార్గాన్ని చూపింది. 'ఉపా' లాంటి చట్టాలతో అస్థిరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, చిత్తశుద్ధి ఉన్న న్యాయ వ్యవస్థ పోషించే పాత్ర కూడా ఉంటుందని కోర్టు విశ్లేషణ రుజువు చేసింది. పోలీసు కేసులను జాగ్రత్తగా పరిశీలించడం, 'ఉపా' లాంటి పాశవిక చట్టాలకు స్పష్టమైన వివరణలను ఇవ్వడం ద్వారా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే పూర్తిగా ఆధారపడి పౌర హక్కులను వదిలివేయకుండా ఉండేట్టు న్యాయస్థానాలు హామీ ఇవ్వవచ్చు.
విడుదలలో జరిగిన ఆలస్యం
బెయిల్ మంజూరు చేస్తూ పేర్కొన్న పత్రాలు స్పష్టంగా ఉన్నప్పటికీ జూన్ 15న విద్యార్థి కార్యకర్తలను విడుదల చేయలేదు. ఢిల్లీ పోలీసులు బెయిల్ ఆజ్ఞలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లి, ట్రయల్ కోర్టులో ఉన్న షూరిటీలు, వారి అడ్రస్‌ల ధృవీకరణకు మరికొంత సమయం కోరారు. నటాశాకు హామీ ఇచ్చేందుకు కోర్టుకు హాజరైన సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, ''కేంద్ర హౌంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న పోలీసులు ఉద్దేశపూర్వకం గానే 'ఉపా' చట్టం కింద నిర్బంధంలో ఉన్న విద్యార్థులకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆజ్ఞలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారు కోర్టుకు చెబుతున్న సాకులు వికారం పుట్టించే విధంగా ఉన్నాయని'' అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకర్, ఆ ముగ్గురు విద్యార్థులతో పోలీసులు వ్యవహరించిన తీరును బహిరంగంగా విమర్శించాడు. 'ఉపా'చట్టంలోని సెక్షన్ 43 డీ (2) ప్రకారం నేరారోపణలు చేయబడిన వ్యక్తులు తమపై చేసిన ఆరోపణలను తెలుసుకునేందుకు చార్జిషీట్ కాపీలు పొందే హక్కు ఉంటుంది. కానీ పోలీసులు దానిని ఉల్లంఘించారు. సెప్టెంబర్ 17, 2020న ట్రయల్ కోర్టు న్యాయమూర్తి చార్జిషీట్ కాపీని వారికి అందజేయాలని ఆదేశించారు. అందుకుగాను పోలీసులు విద్యార్థులకు పెన్ డ్రైవ్‌లు ఇవ్వడం వల్ల, దానిని జైలులో చూసే అవకాశం లేకుండా పోయింది. చార్జిషీట్ కాపీలు వేల సంఖ్యలో ఉంటాయి కాబట్టి అవి ఖర్చుతో కూడిన పని అని ప్రాసిక్యూషన్ వారు చెప్పారు. వాటిని అందించడంలో జరిగిన జాప్యానికి ఢిల్లీ పోలీసులు జిరాక్స్ కాపీలు అందించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉందని సమర్థించుకున్నారు. ఈ సందర్భంలో జస్టిస్ లోకర్ స్పందిస్తూ, ''కానీ దిశా రవి లాంటి పర్యావరణ కార్యకర్తలను నిర్బంధించడానికి బెంగుళూరు వెళ్ళేందుకు అవసరమైన రైలు, విమాన చార్జీలకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు ఉండవ''ని అన్నారు. వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తకుండా, అణచివేసేందుకు ఉద్దేశించబడిన దేశద్రోహ చట్టం (1870) 124 (ఏ)ను కూడా దేశంలో విచక్షణా రహితంగా ఉపయోగిస్తున్నారు. తమకు ఇష్టంలేని ప్రభుత్వాన్ని మార్చుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే, దానిని దేశద్రోహంగా పరిగణించడం అంటే రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోవడం గానే భావించాలి.
బెయిల్ మంజూరు చేసే కోర్టులు కూడా విచక్షణతో న్యాయంగా, నిష్పక్షపాతంగా, ఔచిత్యంతో ('ఉపా'లాంటి చట్టాల కింద నిర్బంధంలో ఉన్న వారి పట్ల) వ్యవహరించాలి. అదేపని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు చేసింది. కానీ, ఉన్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో వ్యవహరించిన తీరు మాత్రం భిన్నంగా ఉంది. అందువలన భీమాకోరేగావ్ కేసులో నేరారోపణలు చేయబడిన వారితోపాటు అనేక మంది సుదీర్ఘకాలంగా నిర్బంధంలో ఉండాల్సి వస్తోంది. ఫాదర్ స్టాన్ స్వామిని నిర్బంధంలో ఉంచి, అనారోగ్యంతో ఉన్న ఆయనను ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స కోసం అనుమతిస్తే, కాళ్ళకు వేసిన బేడీలతో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన ఎనభై ఏండ్ల పైబడిన వయసులో తన పనులు తాను చేసుకోలేకపోయిన స్థితిలో కూడా న్యాయమూర్తులు ఆయనపై కనికరం చూపలేదు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను రక్షించాలని అంటున్నప్పటికీ, వాస్తవంలో దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది. 'ఉపా' చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో కూడా న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేసే సందర్భంలో ఎఫ్ఐఆర్లో చేసిన ఆరోపణలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పౌర స్వేచ్ఛకు సంబంధించి, భారతదేశంలోని న్యాయస్థానాలు ముందు జాగ్రత్తగా, న్యాయంగా, ప్రజాస్వామికంగా వ్యవహరించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించాలి.
- బోడపట్ల రవీందర్
సెల్: 9848412451