Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కులవివక్ష, మత వివక్ష, మహిళల పట్ల వివక్ష, ఉద్యోగాల్లోనూ వివక్ష, కూలీల వేతనాల్లోనూ అంతే. కానీ భార్యాభర్త విడాకుల్లోనూ పెద్ద వివక్షే ఉన్నది. బంధాలు, అనుబంధాలు పెనవేసుకున్నప్పటికీ అనివార్యకారణాలతో విడాకులు తీసుకోవాల్సి వస్తే పేద,ధనిక, దళితులు, అగ్రవర్ణాల్లోనూ వ్యత్యాసం కనపడుతున్నది. ''బలమైన బంధాల్లో'' చిన్నచిన్న మనస్పర్థలొచ్చి విడాకులు తీసుకుందామంటే... కులానికో తీర్పు, మతానికో పంచాయతీలు చేస్తారు. కాపురాలు చక్కదిద్దేపేరుతో టీవీల్లో లైవ్ చర్చ పెట్టి, బజారుకీడుస్తున్నారు. అందులోనూ ఎక్కువ జంటలు అత్యంత నిరుపేదలే కనిపిస్తున్నాయి. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, సోమరిపోతులుగా, వేశ్యలుగా, అక్రమ సంబంధాలకు నెలవుగా వారిని చిత్రీకరించి, వారి బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమేరకు నచ్చజెప్పినా... అట్టడుగువర్గాలను వివక్షకు గురిచేస్తున్నాయనే వాదన వినిపిస్తున్నది. ధనవంతుల్లో అంతకంటే ఘోరాతిఘోరంగా మహిళలు హింసించబడుతున్నా అవి బయటకు రావు. టీవీల్లో కనిపించవు. వారిని పిలిచే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే వారి ఆత్మగౌరవం మంటకలుస్తుందని ఎక్కడా బయటకుపొక్కనీయరు. గుట్టుచప్పుడు కాకుండా కోర్టుల్లోనూ, లోపలి ఇంట్లోనూ విడాకులు ఇప్పించి మహిళను వేరేలా చిత్రికరించి పంపిస్తారు. ఇదో రకమైన వివక్షే. ఇవేవీ బయటకు రావు. కానీ ఇటీవల రెండు జంటల విడాకులు ప్రపంచ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి. అదో గొప్పగా కార్యంగా మీడియా చిత్రికరించింది. ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్-మిలిండాగేట్స్, బాలీవుడ్ అగ్రనటుడు అమీర్‌ఖాన్-కిరణ్‌రావు జంటల విడాకులు వెనక గుట్టు ఏమీ లేదన్నట్టుగా అదో రాచకార్యంగా వారే ప్రకటించారు. అదే విధంగా గాయని సునీత మీడియా అధినేత రామ్‌తో రెండోపెండ్లి చేసుకోవడం కూడా మీడియాకు పండుగైంది. అదే ఊర్లో రెండో పెండ్లి చేసుకుంటే ఆ మహిళ పట్ల ఉండే వివక్ష అంతా ఇంతాకాదు. ఇది మన దొంతరల సమాజంలో ఉన్న రుగ్మత.
- గుడిగ రఘు