Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇందుగలడందులేడను సందేహము వలదు.. చక్రి సర్వోపగతుండు.. ఎందెందు వెతికి చూసినా అందందే గలడు..'' తన ఆరాధ్య దైవమైన శ్రీ మహా విష్ణువు గురించి ప్రహ్లాదుడు చెప్పిన పద్యమిది. ఇదే కోవలో ఏ సందులో చూసినా, ఏ గొందిలో వెతికినా స్మార్ట్ ఫోన్లు కలవు.. అందులో ఎన్నో వింతలూ విడ్డూరాలు గలవు అన్నట్టుంది సమాజ పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం అమాంతం పెరిగిన తర్వాత... ఆస్ట్రేలియాలో ఉన్న వాడు అండమాన్ నికోబార్ దీవులకు... జపాన్‌లో ఉన్న వాడు జమ్మూ కాశ్మీర్‌కు ఫోటోల దగ్గర్నుంచి, వీడియోల దాకా ఏది కావాలంటే అది క్షణాల్లో పంపగలగుతున్నారు. హైదరాబాద్ బావర్చీ బిర్యానీ అయినా, అమలాపురం పూత రేకులనైనా గంటల్లో తెప్పించుకోగలుగుతున్నారు. చంటి పోరడి గోసి గుడ్డ (ప్యాంపర్లు) దగ్గర్నుంచి మంచాన పడ్డ తాతయ్య డైపర్ల దాకా అన్నింటికీ ఆన్లైన్లోనే ఆర్డరిచ్చేయటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో నేను మాత్రం తక్కువ తిన్నానా...? సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటంలో వెనకెందుకు పడాలి...? అనుకున్నాడేమో ఆ కల్లు గీత కార్మికుడు... తన కల్లు కుండలను మోసుకెళ్లే మనవూరి బండి (టీవీఎస్) నుదుటి మీద (ముందు లైటు భాగంలో) పేటీఎమ్ పేపర్ ఒకటి అతికించాడు. ఆ తర్వాత పూర్తి భరోసాతో తాటి, ఈత వనాలకు దర్జాగా వెళుతున్నాడాయన. దీంతో డౌటనుమానం వచ్చి... 'కిరాణా షాపు వాడో, సినిమా థియేటర్లో టిక్కెట్లు ఇచ్చే దగ్గరో లేదంటే ఏ క్యాబ్ అద్దం మీదో మనం పేటీఎమ్ స్టిక్కర్‌ను చూస్తుంటాం. కానీ ఈయనేంటి టీవీఎస్ మీద దాన్ని అంటించాడు...' అని పక్కనున్న ఒక తమ్ముణ్ని ప్రశ్నిస్తే... 'అన్నా... కల్లు తాగటానికి వచ్చే వారి దగ్గర సమయానికి డబ్బుల్లేకపోతే అప్పివ్వాలి. ఆ తర్వాత వాడు డబ్బులిస్తాడో లేదో తెలియదు. పైగా ఇప్పుడందరూ గూగుల్ పే, పేటీఎమ్ వాడుతున్న క్రమంలో... కల్లు ప్రియులు కూడా నీ దగ్గర గూగుల్ పే ఉందా...? పేటీఎమ్ ఉందా...?' అని అడుగుతున్నారంట... అందుకే తన పంచ కళ్యాణి (టీవీఎస్) ముఖం మీద పేటీఎమ్ స్టిక్కర్‌ను అంటించాడు ఆ కల్లు గీత కార్మికుడు' అని సమాధానమివ్వటంతో... 'ఔరా...' అనుకోవటం నావంతైంది. ఇప్పుడు ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా కల్లు తాగొచ్చు. పేటీఎమ్‌లో డబ్బులు పంపొచ్చు... ఎవరికీ ఏ సమస్యా ఉండదు. సూర్యాపేట జిల్లా శ్రీనివాసపురంలో ఇటీవల వినబడింది ఈ టెక్నాలజీ కథ...
- బి.వి.యన్. పద్మరాజు