Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''లీటర్ పెట్రోల్ రేటుకు రెండు లీటర్ల పాలు వస్తున్నాయి... వాటిని తాగి సైకిళ్లు తొక్కండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ సాధించండి'' ఇది పొగడ్తో... తెగడ్తో అర్థం కావట్లేదు కదా! కాకపోవడమే మంచిది. అర్థం అయితే మళ్లీ మోడీ సాబ్‌కు కొత్త ఆలోచనలు వచ్చేస్తారు. పాల రేటును పెట్రోల్ దగ్గరికి తెచ్చినా తెస్తారు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ దాటి రూ.110 దగ్గరికి వచ్చేసింది. బహుశా వచ్చే నెలాఖరునాటికి సెంచరీన్నర కొడుతుందని వాహనదారులు భావిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ రేట్లు ప్రజలపై ఆర్థికభారాలు మోపుతున్నాయని వామపక్షాలు ఇటీవలి కాలంలో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఎర్రజెండాలు పట్టుకొని నిరసనలు తెలుపుతున్నాయి. సిగళ్ల దగ్గర ప్రజల్లో అవగాహన పెంచేందుకూ, వారిలో పోరాటస్ఫూర్తి రగిల్చేందుకూ ప్రయత్నిస్తున్నాయి. 'ఏం పనీపాటా లేదా మీకు' అంటూ పోలీసులతో ఛీత్కారాలు, బెదిరింపులు ఎదుర్కొంటున్నాయి. అయ్యో... ప్రజలపై భారాలు పడుతున్నాయే... ఏదైనా చేసి, కాస్తో కూస్తో వాటిని తగ్గించాలనే తాపత్రయం కమ్యూనిస్టు కార్యకర్తల్లో కనిపిస్తోంది. కానీ జనానికి ఇవేం పట్టట్లేదు. చౌరస్తాలో సిగల్ పడగానే, అదేదో తమకు సంబంధంలేని విషయం అన్నట్టు ముఖం కూడా చూడకుండా బండ్లపౖౖె రివ్వుమని వెళ్లిపోతున్నారు. ఇలాంటి సంఘటనల్ని చూసిన ఓ జర్నలిస్ట్ మిత్రుడు ''నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. మారదు లోకం.. మారదు కాలం'' అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటను హమ్మింగ్ చేయడం వినిపించింది. 'ఏం బ్రదర్ ఏమో పాడుతున్నావ్' అని అడిగితే ''ఎందుకన్నా జనం పట్టించుకోకున్నా వాళ్ల కోసం ఈ ఎర్రజెండాలోళ్లు తిట్లు తింటూ, కేసులు పెట్టించుకుంటూ తాపత్రయపడుతుంటారు. సిగల్ దగ్గర ఇన్ని బళ్లు ఆగాయి. ఒక్కడన్నా వచ్చి మా కోసం మీరు కొట్లాడుతున్నారు. మీకు మా మద్దతు ఇస్తున్నా అని అంటాడేమో అని చూస్తే, బాధ్యత ఉన్నోడు ఒక్కడూ కనిపించట్లే... అందుకే ఆ పాట పాడుతున్నా'' అని చెప్పాడు. మిత్రుడి మాటల్లోని అంతరార్ధం తెలిశాక నాకూ సిగ్గేసింది!
-ఎస్.ఎస్.ఆర్.శాస్త్రి