Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ముసుగు వెయ్యొద్దు మనసు మీద'' అని సీతారామశాస్త్రిగారు ''మస్తు పాట రాసినా'' అని లోలోన అనుకుంటే దాన్ని వేరేగా చూపారని తరువాత సమజైంది ఆయనకు. ఆమాట పైకి చెప్పేసి తరువాత మామూలుగానే ఉన్నాడాయన. అలా ముసుగులేయకుండా మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. నాకు ఆ పాట విన్నప్పుడంతా మనుషులు వాడే రకరకాల ముసుగులు యాదొస్తాయి. చిన్న పిల్లలు ఆడుకోవడానికి వేసుకునే జంతువులు, పక్షుల ముసుగులు ముద్దొస్తాయి. తమను కాపాడమని అవి చెబుతున్నట్టు అనిపిస్తుంది.
ఇక ఎన్నికలొచ్చినప్పుడు చూడాలి, నాయకుల విగ్రహాలకు ముసుగులేస్తారు. ఎందుకది అని అడిగితే ఆయన లేదా ఆమె బొమ్మ చూసి ప్రజలు ఓటేస్తారు అన్న అనుమానం. అందరికీ తెలుసు ఫలానా కూడలిలో ఉన్న బొమ్మ ఫలానా నాయకురాలిది, నాయకుడిది అని. అయినా బొమ్మలన్నింటికీ ఎన్నికలైపోయేదాకా ముసుగులు వేసేస్తారు. కొన్నిచోట్లనైతే అచ్చు కరోనా ప్యాక్ లాగా బట్టతో చుట్టిపెడతారు. వీటివల్ల అదనపు ఖర్చే కాని ఏ ఇతర ప్రయోజనం లేదనిపిస్తుంది.
ఎండనుండి కాపాడుకోవడానికి కొన్ని ముసుగులైతే ఒక్కోసారి చలినుండి రక్షించుకోవడానికి కొన్ని ఉంటాయి. మొత్తం మీద దేన్నుంచైనా తప్పించుకోవడానికి, అది మన దగ్గరికి రాకుండా మొహం చాటేయడానికి రకరకాల ముసుగులుంటాయి. అసలు శ్రీరమణగారిని అడిగి మాస్కులు మానవ సంబంధాలు ఎలా ఉంటాయని అడిగితే మనకి నిజంగా మంచి వ్యాసమొకటి రాసిస్తారు. మొహానికి కాదు మనసుకు ముసుగులేసుకుంటారని మనుషులను తిట్టే వాళ్ళూ ఉన్నారు. అటుంటూనే వేసుకునే వాళ్ళూ ఉన్నారు అది వేరే సంగతి. మనిషికిలేని అందం కోసమే రంగులు ఉన్నాయి అని ఆత్రేయగారు అన్నట్టు మనసులో ఏముందో తెలుసుకోకుండా మొహం పైన నవ్వుల ముసుగుల్ని వేసుకునే వాళ్ళు కొందరుంటారు. ఇవ్నీ పైకి కనిపించని ముసుగులు. తమ పాలనలో లోపాలు కనబడకుండా వివిధ పథకాల ముసుగులను వేసి ప్రజల్ని మభ్యపెట్టే వాళ్ళు అమాత్యుల వారు. వారికి కావలసింది తమ అధికార ముసుగు. ఆ ముసుగు మొహానికే అతుక్కుని ఉండాలన్నది వారి కోరిక. కానీ ప్రజలు అలా ఎప్పుడూ చేయరు. దుమ్ము పట్టిన మాస్కులను తీసేసినట్టే కుర్చీలకు అతుక్కుపోయిన వారిని మారుస్తుంటారు. ఏ ముసుగూ లేకుండా తమని బాగా చూసుకున్నవారిని నెత్తిన పెట్టుకొని మరీ చూసుకుంటారు.
అసలు ముసుగుకంటూ ఒక స్టేటస్ వచ్చిందీ, గడ్డిపోచకంటే పలుచగా చూసినోళ్ళు కూడా అమ్మో ముసుగు, వామ్మో ముసుగు అంటూ దాన్ని ధరించడం మాత్రం కరోనా పుణ్యాన్నే. తమ ప్రాణం, ఇతరుల ప్రాణాలంటే లెక్కలేని వాళ్ళను, ఆ.. మాకేమవుతుందిలే అని బలాదూరుగా తిరిగే వాళ్ళను వదిలేస్తే ఎక్కువమంది సిన్సియర్‌గా వేసుకున్నారు మాస్కులు. ఇక ఆడికారులో పోయేవాళ్ళు ఒకరకం మాస్కులు ధరిస్తే, ఇంకా ఇతరులు తమతమ అభిరుచులనుబట్టి రకరకాల ముసుగులనబడే కరోనా మాస్కులను ధరిస్తున్నారు. ముసుగులను తీయండి అనే రోజులు పోయి వేసుకొండి, వేసుకోకుంటే ఖబడ్దార్ అనే రోజులొచ్చేశాయి.
ఆదివారం కాబట్టి ఖాళీ సమయం దొరికి మాస్కులన్నీ సమావేశమయ్యాయి అనుకుందాం. నీవు ఫలానా యాక్టరు పెట్టుకునే మాస్కువు కదా! నీ అనుభవం ఎలా ఉంది చెప్పు అంటే మధ్యలో నుండి ఓ డిస్పోజబుల్ మాస్కు వచ్చి ఏదో చెప్పబోతుంది. నువ్వు రెండు మాస్కులు వచ్చిన తరువాత వచ్చిన దానవు, నేను మొదటినుండీ ఉన్నదాన్ని అని లొల్లి లొల్లి చేశాయనుకుందాం. ఆ డిస్పోజబుల్ మాస్కు తక్కువ తినిందా, ఈ రెండో వేవ్‌లో మొదట వాడిపడేసే మాస్కు పెట్టుకొని పైన పర్మనెంటు మాస్కు పెడుతున్నారు. కాబట్టి నీ ఇస్టైల్ కాస్త తగ్గించు అనే అవకశమూ ఉంది. అప్పుడు ఒరిజినల్ మాస్కు సమయస్ఫూర్తిగా, నన్ను ఉతికే సమయమైంది నేను ఇంటికిపోతాను అని హుందాగా తప్పించుకుపోవచ్చు మర్యాద నిలబెట్టుకోవడానికి. అరే ముఖ్యమైన మాస్కులు మన ముఖ్యమంత్రులు పెట్టుకునే ముసుగులు రాలేదే అని అధ్యక్ష మాస్కు అంటుంది. అరే ఏం మాట్లాడుతున్నవ్, వాళ్ళెప్పుడైనా పెట్టుకున్నారా అని ప్రతిపక్ష నాయకుని మాస్కు అనొచ్చు, అది వేరే విషయం. ఇంకో డిస్పోజబుల్ మాస్కు లేచి వాడిపడేసిన మమ్మల్ని మొన్న ఒక రోజు చెత్త కుండీ పక్కన చూశాను. ప్రపంచానికి ప్లాస్టిక్ తరువాత ఈ మాస్కుల చెత్త ప్రమాదకారిగా మారనుందని అటుగా పోయే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తమ ప్రాణాలకోసం మనల్ని వాడుకుని ఆ తరువాత మర్యాదగా సాగనంపే గుణం ఈ మానవులకు ఎప్పుడొస్తుందో? యూజ్ అండ్ త్రో సంస్కృతి బాగా పెరిగిపోయింది అనేసరికి ఇంకో బట్ట మాస్కు లేచి ఇంకా మీదే నయం ఒకసారి వాడి పడేస్తారు. మమ్మల్ని రోజూ సర్ఫు నీళ్ళలో, డెట్టాల్ నీళ్ళలో నానబెట్టేవారు కొందరైతే, వేడి నీళ్ళలో ఉతికే వాళ్ళు కొందరు. ఇంకొందరైతే అసలు ఉతకనే ఉతకరు. డాక్టర్లు ఉతకకుండా పెట్టుకునే మాస్కుల వల్ల నల్ల ఫంగసు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. మానవుడి తప్పులను మనమీదికి వేస్తున్నారు. ఏమైనా ఆ పీపీఈ కిట్లకు ఇస్తున్న మరియాద మనకు ఇవ్వడం లేదు. దీన్ని తీవ్రంగా పరిశీలించాలి అనొచ్చు. ఇలా ఎవరి కష్టాలు వాళ్ళకున్నట్టు మాస్కుల కష్టాలు మాస్కులకుంటాయి. మన ప్రాణాలను కాపాడుతున్న వాటిని నిజంగానే ఒక పద్ధతిలో చూసుకోవాలి.
రెండవ వేవ్‌కు రెండు మాస్కులైతే మూడవ వేవ్‌కు మూడు మాస్కులు వేసుకోవాలా అన్నది కొందరి అనుమానం. ఎందుకంటే రెండు మాస్కులతో ఊపిరాడక నానా ఇబ్బందులూ పడుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే మన భూమిని ముసుగులాగా కాపాడుతున్న ఆ ఓజోను పొరను రక్షించకపోతే ఈ భూమి వేడెక్కి పర్యావరణం కాలుష్యంతో నిండిపోయి ఒక పక్క, జీవుల సమతుల్యత లేకుండా పోవడం ఒకపక్క జరిగి జనాలకు వివిధ జబ్బులొస్తున్నాయని గుర్తుచేస్తూనే ఉన్నారు. అందుకే ముసుగు ఏదైనా... ఆదివారం నాడు, సెలవు దినాల్లో కాస్త ఆలోచించి మనల్ని రక్షించే ముసుగులు ఏవో భక్షించే ముసుగులు ఏవో కనుక్కొని ముందుకు పోతే మంచిది.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298