Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండవసారి అధికారం లోకి వచ్చిన రెండేండ్ల తర్వాత తన మంత్రివర్గాన్ని సమూల ప్రక్షాళన చేసిన ప్రధాని మోడీ చర్యలో స్పష్టమైన రాజకీయ సంకేతాలున్నాయి. తన ప్రభుత్వమూ బీజేపీ కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు. దీన్ని విస్తరణ మార్పు అనేకంటే తిరగనేత అనడం మెరుగు. ఒకేసారి 12మందిని బయిటకు పంపించడం, ఏడుగురు సహాయ మంత్రుల హోదా పెంచడం, 36 మందిని కొత్తగా తీసుకోవడం ద్వారా మొత్తం 43మందితో ప్రమాణ స్వీకారం చేయించడం గతంలో ఎన్నడూ జరగలేదు. దేశ రాజకీయాలలో కేంద్ర పాలనా చరిత్రలో ఇది పెద్ద మార్పు. అంతా అయిపోయిందనుకున్నాక ప్రకాశ్‌జవదేకర్, రవిశంకర్ ప్రసాద్‌లు తప్పుకోవడం చాలామందిని దిగ్భ్రాంతపరచింది. ఇదంతా ఎన్నికల వ్యూహంతో చేశారని బీజేపీ నేతలు పైకి గొప్పగా చెప్పుకోవచ్చు గాని పరిస్థితి బాగాలేదని మోడీ ఒప్పుకోవడంగా చూడకతప్పదు. ఒక ప్రధాని ఏకంగా ఇంతమందిని ఒకేసారి తప్పించవలసిరావడం నిస్సందేహంగా పెద్ద సవాలే. అంత పెద్ద ఆపరేషన్ అవసరమనే మోడీ భావించారు. కేరళలో పినరాయి విజయన్ రెండవసారి గెలిచాక మొత్తం మంత్రివర్గాన్ని కొత్తగా తీసుకున్నారు. ఏపీలో జగన్ సగం పదవీ కాలం తర్వాత మంత్రివర్గాన్ని మొత్తం మార్చేస్తామని ముందే ప్రకటించారు. ఇప్పుడు మోడీ చేసింది కూడా అలాంటి ప్రయోగమే. కాస్త చిన్నవారిని తీసుకోవడంలోనూ విజయన్ కనిపిస్తాడు. తన మంత్రి వర్గాన్ని రెండున్నరేండ్ల తర్వాత పూర్తిగా మార్చేస్తానని ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ నమూనా ఛాయలు కూడా కనిపిస్తాయి. నలుగురు మాజీ ముఖ్యమంత్రులూ, 23మంది సీనియర్ ఎంపీలూ, 18మంది మాజీ సహాయ మంత్రులూ వచ్చినవారిలో ఉన్నారంటే అనుభవం కొరత ఒకవైపు, తనతో తలపడనివారిని ఎంపిక చేయాలనే సమతూకం మరోవైపు ప్రభావం చూపాయి. మహిళలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలకు కూడా విస్తృత ప్రాతినిధ్యం కల్పించారంటే ఇప్పటివరకూ అది లేదనీ, సామాజిక సమీకరణలు సరైన సంకేతాలు ఇవ్వలేదనీ ఒప్పుకున్నారన్నమాట. మరి ఇంతకాలం బీజేపీ చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ ఎక్కడకు పోయింది? గతంలో అద్వానీ కమండల్ తీస్తే అప్పటి ప్రధాని విపి సింగ్ మండల్ తీశాడని అనేవారు. ఇప్పుడూ రెండూ మావే అనడానికి వీలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం పెంచేసినట్టు ప్రచారం జరుగుతున్నది. వాస్తవంలో వారే గాక కార్పొరేట్ శక్తులూ మాజీ ఐఎస్ఎస్లూ పెద్ద ఎత్తున ప్రవేశించారు.
యూపీ సమస్తం, ఏపీకి రిక్తహస్తం
తమకు 71మంది ఎంపిలను ఇచ్చిన యూపీ నుంచే అత్యధికంగా ఏడుగురికి ప్రాతినిధ్యం కల్పిస్తూ (మొత్తం 15) దక్షిణాదిని తమిళనాడులో ఒక్కమంత్రికే పరిమితంచేయడం, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి హోదాపెంచుతూ, ఏపీని చిన్న ఈశాన్య రాష్ట్రగవర్నర్ పదవితో సరిపెట్టడం యాధృచ్చికం కాదు. ఈ రాష్ట్రాలలో ఇంకేమీ అవకాశాలు లేవని బీజేపీ అధిష్టానం నెమ్మదిగా అంగీకరిస్తున్నదన్నమాట. పాలిచ్చే గేదెకే గడ్డి వేయాలన్నట్టు సీట్లు రాని రాష్ట్రాలకు కేంద్ర పదవులు కేటాయించదలుచుకోలేదు. తెలంగాణ నుంచి తమతరపున నేరుగా ఎన్నికైన ఎంపీలు ఉన్నా, ఏపీలో టీడీపీ నుంచి వచ్చి కలిసిపోయిన వారు ఉన్నా స్థానం కల్పించలేదంటే అదే కారణం. ఇక్కడ హడావుడి చేసేనేతలకు ఈధోరణి ఆశాభంగమే. కోవిడ్ 19ను ఎదుర్కోవడంలో వైఫల్యానికీ, ధరలు, నిరుద్యోగం అపారంగా పెరగడానికీ, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికీ కారకులైన మూల విరాట్టులు మోడీ షాలు మారకుండా ఉత్సవ విగ్రహాల వంటి ఇతరులను ఎందరిని మార్చితే ఎంత ప్రయోజనం?
మంత్రుల మార్పు తీరు
ఆరోగ్యశాఖనే తీసుకుంటే చప్పట్టు, పళ్లాల నుంచి వాక్సిన్ విజిట్స్ వరకూ చేసింది మోడీ. హేమాహేమీలైన కేంద్ర మంత్రులందరూ పొగిడి తరించింది ఆయనను. తీరా ఇప్పుడు హర్షవర్థన్ అందుకు కారణమని తీసేస్తే ప్రధాని పాత్రేమిటి? ఇప్పుడు నియమితుడైన మన్సుఖ్ మాండవీయ కూడా ఎరువులు, రసాయనాల మంత్రిగా ఆ వైఫల్యంలో భాగస్వామి. (ఆయనను ఆశాఖలో కొనసాగిస్తూనే స్వతంత్ర బాధ్యత మరొకరికి అప్పగించారు) ఆయనకు ఈ రంగంలో ఎలాటి పరిజ్ఞానం లేకపోయినా జన ఔషది ప్రచార ప్రహసనం నడిపి మెప్పించారు. ఇక వలసకార్మికుల వలసలు, వ్యథార్థ గాథలు దేశాన్ని కలచివేయడమే గాక ప్రభుత్వ అసమర్థతను, అలక్ష్యాన్ని వెల్లడించాయి. గనక కార్మిక శాఖామంత్రి సంతోష్ గాంగ్వర్ను తీసేశారు. విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ అసంబద్ద మార్పులతో అంతా తలకిందులు చేశారు గనక తప్పించడం అనివార్య అవసరం. ఆ స్థానంలో తెచ్చిందెవరినంటే విశాఖ ఎక్కు విక్రయానికి ఆధ్వర్యం వహించే ధర్మేంద్ర ప్రధాన్‌ను! ఐటీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సోషల్‌మీడియా సంస్థల సమస్యపై సరిగ్గా వ్యవహరించలేదని అమెరికాకు ఆగ్రహం కలిగింది. ఇక ప్రకాశ్ జావదేకర్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తట్టుకుని సానుకూల ఇమేజి కల్పించడంలో విఫలమైనారు గనక అనురాగ్ ఠాగూర్‌ను నియమించారు. ఈయనెవరంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారం, మత విద్వేషం రగిలించినందుకు గాను ఎన్నికల ప్రచారం నుంచి బహిష్కరించబడిన ఈ ప్రబుద్దుడు ఎలాంటి సమాచార ప్రచారం చేస్తారో చెప్పాలా? ఇక రైల్వేశాఖకు వస్తే మోడీ మొదటి నుంచీ దాన్ని తనకు బాగా నచ్చినవారికి అప్పగిస్తూ ఏదో తలకిందులు చేయాలని చూస్తున్నారు. మొదటి దఫాలో సదానంద గౌడ రైల్వేశాఖ చూస్తే, తర్వాత శివసేన నుంచి సురేష్ ప్రభును ప్రత్యేకంగా తీసుకొచ్చి అప్పగించారు. తర్వాత కొంతకాలానికి ఆయననూ తప్పించి పీయూష్ గోయెల్ ఉద్ధరిస్తాడన్నారు. ఇప్పుడు ఆయనకూ ఉద్వాసన చెప్పి ఆమెరికాలో చదువుకుని వచ్చిన కాన్పూర్ ఐఐటియన్ అశ్వనీ వైష్ణవ్‌ను కూచోబెట్టారు. ఆర్థిక రంగం క్షీణతకు అధిక భారాలకు కారణమైన నిర్మలా సీతారామన్ మాత్రం ఓకేనా!
చిన్న పార్టీలూ కలిస్తేనే...
ఇవన్నీ ఎన్ని చేసినా వచ్చే ఎన్నికలలో ఎదురీత తప్పదనీ, చిన్న చిన్న మిత్రపక్షాలను కూడా కలుపుకొంటేనే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కగలమనీ ఒప్పుకోవలసి వచ్చింది. అప్నాదళ్ నుంచి జేడీయూ వరకూ అందరికీ ప్రాతినిథ్యం ఇవ్వడంలో ఇదే కనిపిస్తుంది. మొదటి మంత్రివర్గంలో అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పాటిల్ మోడీ మొదటి మంత్రివర్గంలో ఉండగా తర్వాత తొలగించేశారు. ఇప్పుడు ముందే మాట్లాడి మరీ చేర్చుకున్నారు. రెండవసారి కేంద్రంలో చోటు కల్పించని జేడీయూకు ఇప్పుడు ఒక్కస్థానమిచ్చారు గానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిష్‌కుమార్‌కు అంతగా ఇష్టంలేని ఆర్సి సింగ్‌ను ఎంపికచేశారు. నితిష్ ఆయనను ఆభినందించకపోగా రెండు స్థానాలు ఇవ్వనందుకు కినుక వహించారట. ఇక బీజేపీ కోసం ఎల్జేపీని చీల్చిన పశుపతిని కేంద్రంలో తీసుకోవడం కూడా నితిశ్‌కు నచ్చేది కాదు. ఇంత సోషల్ ఇంజనీరింగ్ అంటూనే యూపీలోని నిషద్పార్టీని నిర్లక్ష్యం చేశారు.
బ్రాండ్ మోడీకి బలిహారం
మోడీ మొదటిసారి ప్రధాని అయ్యేనాటికే అద్వానీ వంటివారు పక్కకు నెట్టివేయబడ్డారు. అప్పటికి ఉన్న అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్ వంటివారు చనిపోయారు. రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ, మరో ఇద్దరు మాత్రమే పాతవారున్నారు. అయితే ఏం జరిగేది తనకు అసలు తెలియదని రాజ్‌నాథ్ మంత్రివర్గ మార్పులకు ముందురోజే చెప్పేశారు. బీజేపీలోనూ ఇప్పుడు మోడీ షాల ద్వయందే రాజ్యం. పనిచేయని వారిని శిక్షించినట్టు సమర్థతకు పట్టం కట్టినట్టు ఏదేదో చెబుతున్నా అదంతా ప్రచారానికి మాత్రమే. మోడీ హయాంలో అధ్యక్షతరహాలో ప్రధాని కార్యాలయం (పీఎంవో) సమస్తం శాసిస్తున్న సంగతి ప్రపంచానికి తెలుసు. కాని వైఫల్యాలను మరెవరిపైకో నెట్టి బ్రాండ్ మోడీని కాపాడాలి. మరో విధంగా చెప్పాలంటే బ్రాండ్ మోడీ బ్యాడ్ మోడీగా మిగలడానికి కారణమైన విధానాలను మార్చకుండా మరెవరో అసమర్థులనీ అందుకోలేక అప్రతిష్ట తెచ్చారని చెబితే చెల్లుతుందా? ఆ కపటనాటకంలో భాగమే ఇదంతా. 2022, 2023లలో జరిగే రాష్ట్రాల ఎన్నికలు అంతిమంగా 2024 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ అవకాశాలకు గ్రహణం పట్టిందనే అంచనా ఆరెస్సెస్‌తో సహా సంఘపరివార్‌కు కలవరం కలిగిస్తున్నది. కనుకనే వారు మోడీకి సర్వాధికారాలు ఇచ్చేశారు. నిర్ణయాలన్నీ ఆయన చేసినా తొలగించినవారికి తీసుకునేవారికి కూడా తెలియజేసే బాధ్యత బీజేపీ నాయకులకు అప్పగించారు. ఆఖరి నిముషంలో పార్టీ అధ్యక్షుడు జెడి నడ్డా తొలగించేవారికి ఫోన్ చేస్తే, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కొత్తగా తీసుకునేవారికి చేశారట. అంటే ప్రధాని గాని అమిత్ షా గాని వారికి అందుబాటులో ఉండే ప్రసక్తి లేదన్నమాట. అయితే 2022లో యూపీ, పంజాబ్, గుజరాత్ ఎన్నికలలో బీజేపీ అవకాశాలు ఈ మార్పులతో పెరుగుతాయా అంటే గ్యారంటీ ఏమీ లేదు. అప్పుడు విఫలమైతే మళ్లీ పెనుమార్పులు చేయబోరని చెప్పలేం. మంత్రులు మారారుగాని మోడీ మంత్రం మారలేదని ఒక వ్యంగ్య వ్యాఖ్యాత అన్నట్టుగా ఇదంతా మోడీ చుట్టూనే తిరగడం అందరికీ తెలిసిన సత్యం. మాజీ ఐఎఎస్‌లూ పెద్దగా పట్టులేని చోటా నాయకులైతే ఆ ప్రదిక్షణ మరింత బాగా చేస్తారు గనకనే మోడీ కొత్తమొహాలనూ 11 మంది మాజీ అధికారులనూ కార్పొరేట్ కరోడాలను తీసుకున్నారు. రాజ్యాంగ పరంగా మొత్తం 81మంది మంత్రులకు అవకాశం వుంటే ఇప్పటికే 75 మందినీ తీసేసుకున్నారు. మినిమం గవర్నమెంట్ మాగ్జిమం గవర్నెన్స్ (కనీస ప్రభుత్వం గరిష్ట పాలన) అనే నినాదం ఇప్పుడు తలకిందులైంది. మాగ్జిమం గవర్నమెంట్ మినిమం గవర్నెన్స్ వచ్చేసినట్టే కనిపిస్తుంది. పార్లమెంటు సమావేశం కాబోతుండగా ఇంత పెద్ద కసరత్తుచేసి వారిని సభలోకి వదిలితే అర్థవంతమైన చర్చలు, సమాధానాలు, సమాచార సమర్పణ ఆశించడం ఎలా?
- తెలకపల్లి రవి