Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టుకతోనే... పేదరికంలో పుట్టేవారిని గర్భదరిద్రులు అంటారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలవారు మనదేశంలో జన్మత: వివక్షతకు గురవూనే ఉన్నారు. మహిళలు సరేసరి. ఈ ఆర్థిక సామాజిక అంతరాలతో పాటు ఇప్పుడిక మన భారత ప్రజానీకం సాంకేతిక అంతరాన్ని కూడా ఎదుర్కొంటున్నది. కరోనా దెబ్బతో ఇది మనకు పులి మీద పుట్రలా పరిణమించింది.
తిండి, బట్ట, వసతి ఒకనాటి మానవుని కనీస అవసరాలు. వీటికి తోడుగా విద్య, వైద్యం, నీరు, విద్యుత్ (ఇంధనం) ఆధునిక మానవుని కనీస అవసరాలుగా ఐక్యరాజ్యసమితి ఏనాడో పేర్కొన్నది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ అవసరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా పాలన చేయాలి. వీటిని అవసరానికి తగిన విధంగా అనుభవించినప్పుడే జీవించే హక్కు ప్రాణం పోసుకుంటుంది.
సకల సమస్యలకు పరిష్కార మూలం చదువు. కనుక ఆ చదువును అందరూ అందిపుచ్చుకునే విధంగా పోరాటం చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో పిలుపునిచ్చాడు. 2009 విద్యాహక్కు చట్టం కూడా మనకు వచ్చింది. అయినా ఆర్థిక, సామాజిక అంతరాలతో పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. ఇప్పుడు కరోనా అనంతరం సాగే ఆన్లైన్ విద్యావిధానం పూడ్చలేని అగాథాన్ని సృష్టిస్తున్నది.
చిన్న చిన్న చేతివృత్తుల్లో, ఇంటి పనుల్లో అమ్మ నాన్నలకు తోడుగా ఉంటూ, వారి వద్ద ఉన్న సాధారణ స్మార్ట్ఫోన్లతో డాటా అందక, వైఫై లేక పిల్లలు తల్లడిల్లుతూ కుస్తీపడటం చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. కొందరైతే చెట్లు, గుట్టలెక్కుతున్నారు. ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. సందట్లో సడేమియాలా కొన్ని ప్రభుత్వాలు క్రమబద్దీకరణ పేరుతో గప్‌చిప్‌గా పాఠశాలలు మూసివేస్తున్నాయి. ఉపాధ్యాయులను కుదించి, జీతభత్య, నిర్వహణా ఖర్చులు తగ్గించి, తమ బొక్కసాలు నింపుకుంటున్నాయి. 'ఎంత చెట్టుకు అంతగాలి' అన్నట్టు నిరుపేద తల్లి తండ్రులు తమ స్థోమత మేరకు చిన్న చిన్న ప్రయివేటు విద్యాలయాలపై ఆధారపడుతున్నారు. మధ్యలో పిల్లలు మాత్రం ఆగమైపోతున్నారు.
మనదేశంలో 37శాతం పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి. 22శాతం పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నది. వీటిలో ప్రయివేటు పాఠశాలలు కూడా కలిసాయనే విషయం మరువరాదు. కేవలం ప్రభుత్వ పాఠశాల్లో అయితే 11శాతం బడులకే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నది. 28.5శాతం బడుల్లోనే కంప్యూటర్లు ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ తాజాగా తెలిపిన సమాచారం ఇది. దేశం మొత్తం మీద 15లక్షలుపైగా పాఠశాలలు ఉన్నాయని, వాటిలో ఎనిమిదిన్నర కోట్ల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ఇరవై ఆరు కోట్ల మందికి పైగా బాలలు ఈ పాఠశాలల్లో చదువుకుంటున్నారని సమాచారం.
కరోనా ముందున్న స్థితి ఇది. ఈ ఏడాదిన్నరగా బాలల చదువులు ఎంత ఘోరంగా దెబ్బతిన్నాయో అందరికీ ఎరుకే. కరోనా భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మూడో ఉధృతి పిల్లలకే పొంచి ఉన్న ప్రమాదం అని అంటున్నారు. నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగును వర్ణించినట్టు కరోనా విముక్తి గురించి కొందరు అశాస్త్రీయంగా ఎవరకు తోచినట్టు వారు ఎలా మాట్లాడారో, ఇప్పుడు బాలల విద్య గురించీ అలానే మాట్లాడుతున్నారు. నిర్దిష్ట ప్రణాళిక లేదు. 'రాబోయే ఎన్నికల మీద చూపే శ్రద్దలో రవ్వంతైనా బాలల విద్యపై చూపడం లేదు. ఎందుకంటే బడి పిల్లలకు ఓట్లుండవుగా' అని సమాధానపరుచుకునేవారు లేకపోలేదు.
'బాల్యం అమూల్యం, మనదేశ భావి సంపద' అని భావించేవారు మాత్రమే చిత్తశుద్ధితో తాపత్రయ పడుతున్నారు. తరాలు మారుతున్నా అంతరాలు మారని స్థితి మన వ్యవస్థలో వేళ్ళూనుకుని ఉన్నది. పాలకుల విధి విధానాలే ఇందుకు కారణం. కేవలం పాఠశాలకు వెళ్ళే పిల్లల్లో ప్రతి ముగ్గురులో ఒకరు మాత్రమే ఆన్లైన్ విద్యను కొనసాగిస్తున్నారట. మరి మిగిలిన ఇద్దరు చదువుకు దూరం కావాల్సిందేనా..?
చాలామంది పేద తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయి తమ పిల్లలకు సెల్ఫోన్లు కొనలేకపోతున్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో లక్షలాది చిన్న, మధ్య తరగతి ప్రయివేటు స్కూళ్ళు మూతబడుతున్నాయి.
ఆకలికి తిండి గింజలు దొరకని సమాజాన్ని ఇప్పుడు డిజిటల్ ఇండియా ఆవహించింది. ఇదో సరికొత్త సవాలు. ఇంటర్నెట్ ఉండీలేక, అందీఅందక విచిత్ర పరిస్థితి నెలకొన్నది. అనివార్య బోధనా దశగా ఆన్లైన్ విద్య రూపాంతరం చెందుతున్నది. మరోపక్క అసలు అదేంటో అర్థమవక, అందుబాటులోకి రాక తెగిన గాలిపటంలా చాలామంది బాలలు చదువుకు దూరమైపోతున్నారు. ఆర్థికంగా ముందున్నవారు ఈ పరుగుపందెంలో ఎప్పటిలాగనే ముందుంటున్నారు.
ఎడాదిన్నర క్రితం రూ.7లక్షల కోట్లతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన జాతీయ బ్రాండ్ మిషన్, వెయ్యి రోజుల్లో ఆరు లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్‌నెట్‌తో అనుసంధానం చేస్తామన్న ప్రధాని మోడీ హామీలు ఎంతవరకు అమలు అవుతున్నాయో అంతుచిక్కడం లేదు. దీక్ష, ఇ-పాఠశాల (ఎన్.సి.ఇ.ఆర్.టి.), స్వయం ప్రభ ఓ.టి.హెచ్. చానల్ వంటివి వస్తున్నాయి. ఈ ప్రయోగాల అమలుకు, అలవాటుకు చాలా టైమ్ పడుతుంది.
కాగా, ఆన్లైన్ విద్యాబోధన అనేది విద్యార్థులనే కాదు ఉపాధ్యాయులకూ కొత్తే. సజీవ పాఠశాల ఆహ్లాద వాతావరణ విద్యాబోధన ద్వారా విద్యార్థి పొందే శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యవికాసం ఇప్పుడు ఆన్లైన్ విద్యాబోధన ద్వారా విద్యార్థి పొందగలడా..? అన్నది పెద్ద ప్రశ్నార్థకమే.
ఈ విపత్కర పరిస్థితుల్లో అర్జెంటీనా దేశం పుస్తకాలు, ట్యాబ్‌లతో పాటు ఆన్లైన్ విద్యాబోధనకు అవసరమైన ప్రత్యేక పరికరాల కిట్‌ను బాలలకు అందిస్తున్నది. కెన్యాలో గ్రామాలకు 4జి సేవలు అందిస్తున్నారు. చైనాలో పిల్లలకు ఇంట్లోనే బోధించేలా తల్లిదండ్రులకు శిక్షణనిస్తున్నారు. మనదేశంలో కేరళ ప్రభుత్వం 88శాతం విద్యార్థులకు ఆన్లైన్ బోధనను అందుబాటులోకి తెస్తున్నది.
ఆయా దేశాలు తమ సామాజిక జీవన పరిస్థితులకు అనుగుణంగా బాలలకు విద్యను అందించేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. మనం కూడా అంతరాలను పెంచకుండా పిల్లలందరికీ సమంగా విద్యాబోధన అందించాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధితో కూడిన రాజకీయ సంకల్పం ఉండాలి. లేకుంటే ప్రజలే ఉద్యమాలతో వత్తిడిచేయాలి. అంతకు మినహ వేరే మార్గంలేదు మరి.
- కె. శాంతారావు
సెల్: 9959745723