Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫాదర్ స్టాన్ స్వామి మరణం దేశంలో మానవహక్కుల గురించిన చర్చకు మరోసారి తెరతీసింది. ప్రత్యేకించి మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛా స్వాంత్య్రాలు, భావప్రకటనా స్వేచ్ఛ వధ్యశిలపైకి చేరాయి. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రశ్నించినట్టు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కంటే అర్థాంతరంగా అమల్లోకి వచ్చిన ఉపా చట్టంలోని ఓ క్లాజుకు ప్రాధాన్యతనివ్వాలా అన్న ప్రశ్న నేడు 138 కోట్ల భారతీయుల ముందున్న హక్కుల సమస్య. భీమా కోరెగాం కేసులో స్టాన్ స్వామిని ఇరికించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలే స్టాన్ స్వామి మరణానికి కారణమయ్యాయి. మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకతే కాదు, ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడ నేరపూరిత చర్యలుగా, ప్రభుత్వాన్ని కూలదేసే కుట్రలుగా మారిపోయాయి. 2014 -2019 మధ్యకాలంలో దేశంలో సుమారు ఏడున్నర వేలమందిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (ఉపా) కింద కేసులు నమోదయ్యాయి. ఆరేండ్లకుపైగా సాగుతున్న దర్యాప్తు, విచారణల్లో ఎంతమందిని న్యాయస్థానాలు నిందితులుగా గుర్తించాయన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి - యూరోపియన్ యూనియన్ మానవహక్కుల సంస్థలు ఏప్రిల్ 2021లో భారతదేశంలో మానవహక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి ప్రత్యేక సదస్సు నిర్వహించి తమ ఆందోళన వ్యక్తం చేయాల్సిన దుస్థితి దాపురించింది.
రాజ్యానికి, వ్యకిగత స్వేచ్ఛకు మధ్య జరుగుతున్న ఘర్షణ ఈ నాటిది కాదు. కనీసం భారతదేశానికి పరిమితమై చూసినా వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంకెళ్లు వేసే ప్రయత్నం వలసపాలనలోనే మొదలైంది. అప్పుడంటే విదేశీ ఆక్రమణ కింద ఉన్నాం. కాబట్టి ఈ దేశ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే తమ అధికారాన్ని చలాయించు కోవటానికి, ప్రజలను అణచివేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ భారతీయులమైన మేము అన్న మకుటంతో రాసుకున్న రాజ్యాంగం ద్వారా పాలించబడతున్న కాలం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం హౌదా కోసం పోటీపడుతున్న కాలం కూడా ఇదే. ప్రభుత్వ నిర్ణయాలను, నిర్ణయాల వెనక ఉన్న ఉద్దేశ్యాలను ప్రశ్నించటం, ప్రజోపయోగం అన్న కొలబద్దతో కొలవటం ప్రజాస్వామ్యంలో మౌలిక లక్షణం. లక్ష్యం. కానీ స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు ఓ క్రమంలో అధ్యయనం చేస్తే భారతీయులమైన మేము అన్న మకుటంతో ఉన్న రాజ్యాంగమే అపహాస్యమయ్యేలా ఉన్నాయి.
ఓ రకంగా చూస్తే భారతదేశంలో ప్రభుత్వపు ఉక్కుపిడికిళ్ల నుండి విడిపించుకునేందుకు ప్రజలు శతాబ్దం పాటు సాగించిన పోరాట చరిత్రే మానవ హక్కుల ఉద్యమ చరిత్రగా కనిపిస్తుంది. ప్రధమ స్వాతంత్య్ర సమరం స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటం సమరశీల ఆందోళనలకు సిద్ధమైంది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పగ్గాలు మితవాదుల నుండి అతివాదుల చేతికి మారటాన్ని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. దాంతో 1908లో భారతీయ నేర శిక్షా స్మృతిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అన్న పదబంధాన్ని తొలిసారి చేర్చారు. నాటి నుండీ 1947 వరకూ స్వాతంత్య్రోద్యమ నాయకత్వాన్ని ఈ క్లాజు కిందనే బ్రిటిష్ ప్రభుత్వం అణచివేసింది. మధ్యలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం వచ్చినా అవి ప్రజల రోజువారీ జీవితామలను ప్రభావితం చేసిన చట్టాలు కావు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు, దేశ గతిని మలుపుతిప్పే ఉద్యమాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ స్వతంత్ర భారతం తొలిసారి సార్వత్రిక సంక్షోభానికి లోనైన 1970 దశకంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ఆమోదించింది. నాటి నుంచీ 2014 వరకూ ఈ చట్టం కేవలం సంస్థలకు వ్యతిరేకంగా మాత్రమే ఉపయోగించబడింది. కానీ 2014లో మోడీ అధికారానికి వచ్చిన తర్వాత వ్యక్తులను దేశ ద్రోహులుగా నిర్థారించి వారికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని ప్రయోగించటం మొదలైంది. ఫలితమే పైన చెప్పిన వేలాదిమంది అరెస్టులు.
ఈ చట్టం కింద అరెస్టయిన వాళ్లే తాము నిర్దోషులమని నిరూపించుకోవాలి. నేరం రుజువు అయ్యేవరకూ అందరూ నిర్దోషులే అన్న ప్రాధమిక న్యాయసూత్రానికి ఈ చట్టం పూర్తి విరుద్ధంగా మారింది. 2002 నాటి ఉగ్రవాద కార్యకాలాపాల నియంత్రణ చట్టంలో (పోటా) ఉన్న కరుడుకట్టిన ఆంక్షలు, నియంత్రణలు అన్నీ ఈ చట్టం తాజా రూపంలో అమలవుతున్నాయి. నాడు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించిన చట్టం పోటా. అప్పటి వరకూ హక్కుగా ఉన్న బెయిల్ నేడు అర్ణబ్ గోస్వామి వంటి ప్రభుత్వ ఆశీస్సులు కలిగిన కొద్దిమందికి మాత్రమే దక్కే సౌఖ్యంగా మారింది. అందుకే సహజ మానవ కాంక్షగా ఉండే స్వేచ్ఛ ఈ ప్రభుత్వం హాయంలో చివరి ప్రాధాన్యతగా మారింది. జైలు ప్రథమ ప్రాధాన్యతగా మారింది. ఈ మార్పుల ఫలితంగానే భీమా కోరెగాం మొదలు పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఉద్యమకారుల వరకూ వేలమందిని విచ్చలవిడిగా ఈ చట్టం కింద అరెస్టు చేసి ఏండ్ల తరబడి జైల్లో మగ్గేలా చేస్తోంది మోడీ ప్రభుత్వం.
స్టాన్ స్వామి కేసులో బెయిల్ కోసం జరిగిన మేధో యుద్ధానికి న్కాయస్థానమే ప్రత్యక్ష రంగస్థలంగా మారింది. కనీసం ఎటువంటి ఆరోపణలు లేకుండా, దర్యాప్తు కూడా పూర్తి కాకుండా స్టాన్ స్వామిని జైల్లో కుక్కేశారు. జైలుకు బెయిలుకు మధ్య సన్నని గీతను దాటేటప్పుడు న్యాయస్థానాలు, న్యాయమూర్తులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి సుప్రీం కోర్టు వివిధ తీర్పుల్లో స్పష్టంగానే పేర్కొంది. కానీ బెయిల్ విషయంలో వేల కోట్ల ప్రజా ధనం లూటీ చేసిన ఆర్థిక నేరస్తులకు ఉన్న స్వేఛ్చ నిర్దిష్ట రాజకీయాభిప్రాయాలు కలిగిన వారికి లేకపోవటం న్యాయవ్యవస్థలోని డొల్లతనాన్నే కాక ప్రజాస్వామ్యంలోని బలహీనతను వెల్లడిస్తోంది. తరచూ ప్రభుత్వాలను మార్చుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని భావించకూడదన్న ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్య వర్తమాన భారతానికి సరిగ్గా సరిపోతుంది.
స్టాన్ స్వామి బెయిల్ విషయంలో న్యాయ వ్యవస్థ వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థలోని బీటలను బట్టబయలు చేస్తోంది. పుట్టుకతోనే సంఘజీవిగా ఉన్న మనిషి పుట్టుకతోనే స్వేఛ్చాజీవి కూడా. వ్యక్తిగత స్వాతంత్య్రం ఇతరుల ప్రయోజనాలను, ఇష్టాయిష్టాలను భంగపర్చనంత వరకూ అనివార్యంగా అమలు జరగాల్సిన శాశ్వతమైన రాజకీయ సాంఘిక మానవహక్కు. కానీ ఇటువంటి శాశ్వత హక్కులు ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిందన్న మౌలిక అవగాహనకు భిన్నంగా వ్యవహరించే ప్రభుత్వం నేడు అధికారంలో ఉండటంతో చట్టాలు, నీతి నియమాలు, కోర్టు తీర్పులు, రాజ్యాంగ ప్రమాణాలను ఎడం కాలితో తన్నేసి వేలమందిని అరెస్టు చేసి ఇష్టం వచ్చిన కేసులు బనాయిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేవలం ఏడెనిమిది వేలమంది మీద మోపబడ్డ ఈ కేసులు 138 కోట్ల మంది తమ నిరసనలను, భిన్నాభిప్రాయాలను, ప్రభుత్వ నిర్ణయాలపై హేతుబద్ధమైన విమర్శలను వ్యక్తం చేయకుండా గొంతులోనే దిగమింగుకునే భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ప్రభుత్వం సాధారణ ప్రజలపై కూడా దేశద్రోహం కేసులు బనాయించేందుకు వెనకాడటం లేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు విస్తృతమైన శాసన, కార్యనిర్వహణాధికారా లుంటాయి. ఈ విస్తృతాధికారాలు విచ్చలవిడిగా అమలు కాకుండా చూడాల్సిన బాధ్యతను రాజ్యాంగం న్యాయవ్యవస్థపై ఉంచింది. న్యాయవ్యవస్థ రాజ్యాంగం తనపై మోపిన గురుతర బాధ్యతను నెరవేర్చటంలో విఫలమైన ఫలితమే స్టాన్ స్వామి హత్య. అందుకే హక్కులు శాంతి భద్రతల సమస్యగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. పదవీ విరమణ చేసిన కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగమోహన్ దాస్ ప్రతిపాదించినట్లు రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు అనుగుణంగా ఉపా చట్టంలో అవసరమైన సవరణల కోసం న్యాయవాదులు, రాజకీయ పార్టీలు, హక్కుల ఉద్యమకారులు, ప్రజాతంత్ర శక్తులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వేదికమీదకు వచ్చి ఉద్యమం సాగించాల్సిన సమయం ఇది. అటువంటి ఉద్యమ నిర్మాణం ద్వారా ఉపా చట్టంలో క్రూరమైన క్లాజులు సవరించటం ద్వారా స్టాన్ స్వామికి నిజమైన నివాళి అర్పించగలం.
- కొండూరి వీరయ్య
సెల్: 8971794037