Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశ కార్పొరేట్లు గత రెండు దశాబ్దాలుగా గుట్టుగా భారీమొత్తాలలో సంపదను తమ ఖాతాల్లోకి మళ్ళిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ నుండే ఈ తరలింపు సాగుతోంది. అప్పులు తీర్చలేక దివాలా తీసిన కంపెనీల నుంచి బకాయిలను రాబట్టే చట్టం ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్ట్సీ కోడ్ (ఐబిసి). పారుబకాయిలను పరిష్కరించే ఈ క్రమం చాలా దశల్లో పడుతూ, లేస్తూ ముందుకు సాగుతుంది. అయితే ఈ మధ్య పరిష్కారం అవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ కేసులు పరిష్కారం అవుతున్న తీరును పరిశీలిస్తే మూడు ధోరణులు కనిపిస్తున్నాయి. 1. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎక్కువ 'కత్తిరింపు''లను భరించాల్సివస్తోంది. దాని ఫలితంగా నష్టాలను చవిచూడవలసివస్తోంది. ఆ బ్యాంకులకు తిరిగి ప్రభుత్వ బడ్జెట్ నుంచి పెట్టుబడులు సమకూర్చాలి. అంటే అంతిమంగా ఆ భారం పన్నులు చెల్లించే సామాన్యులపైన పడుతోంది. 2. అప్పులు ఎగవేసిన కంపెనీలను తమ స్వాధీనం చేసుకునే కార్పొరేట్లు వాటిని గీసిగీసి బేరమాడి తక్కువ ధరకే చేజిక్కించు కుంటున్నాయి. 3. అప్పులు ఎగవేసిన సంస్థల ప్రమోటర్లు, ప్రధాన వాటాదారులు ఈ పారుబకాయిల మాఫీ వలన ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు. గతంలో ఆ కంపెనీల లాభాలను కొల్లగొట్టి వాటిని దివాలా తీయించింది కూడా వీరే.
అప్పు చేయడం, వాయిదాలు చెల్లించకుండా బకాయి పెట్టడం, దివాలా లీసిన ఆ కంపెనీని కొనేందుకు మరో సంస్థ సిద్ధపడుతుందో లేదో కూడా తెలియని రీతిలో బకాయిల మాఫీకి ఒప్పందాలు చేసుకోవడం- ఈ రూటులో ప్రభుత్వం నుంచి సంపద బడా కార్పొరేట్లకు తరలిపోవడం నయాఉదారవాద విధానాల అమలులో ఒక భాగంగా ఉంది.
పారుబకాయిలను పరిష్కరించడానికి ప్రతిపాదనను రూపొందించేందుకు ఒక నిపుణుడిని నియమిస్తారు. ఆ ప్రతిపాదనను రుణదాతల కమిటీ ఆమోదించాలి. ఆ తర్వాత అది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సిఎల్‌టి) అనే జ్యుడిషియల్ కమిటీ పరిశీలనకు, ఆమోదానికి పోతుంది.
అయితే ఎన్‌సిఎల్‌టికి సైతం ఇటీవల సాగుతున్న వ్యవహారం భరించరానిదిగా తయారైంది. ఈ పారుబకాయిలను తిరిగి రాబట్టే వ్యవహారంలో నిజాయితీ సందేహాస్పదంగా ఉన్నట్టు ఎన్‌సిఎల్‌టి భావిస్తున్నది. ఉదాహరణకు వీడియోకాన్ కేసును చూద్దాం. ఆ కంపెనీ అప్పు రూ.35,000 కోట్లు తిరిగి చెల్లించలేక బకాయి పడింది. దానిని పరిష్కరించే ప్రతిపాదన ఎన్‌సిఎల్‌టి ముందుకు వచ్చింది. ఈ వీడియోకాన్‌ను ట్విన్ స్టార్ టెక్నాలజీస్ అనే సంస్థ (ఇది మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ యజమానిగా ఉన్న వేదాంత గ్రూపుకు చెందిన కంపెనీ) స్వాధీనపరుచుకోడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. వీడియోకాన్‌కు రుణం ఇచ్చిన రుణదాతలు కూడా అంగీకరించిన పరిష్కారం ప్రకారం ట్విన్ స్టార్ రూ.2,962 కోట్లు చెల్లించి ఆ దివాలా కంపెనీని స్వాధీనపరుచుకోవచ్చు. అంటే మొత్తం రుణంలో కేవలం 4.15శాతం మాత్రమే చెల్లించి వేదాంత కంపెనీ వీడియోకాన్‌ను చేజిక్కించుకోవచ్చు. రుణం ఇచ్చిన వారు 95.85శాతం కత్తిరింపుకు సిద్ధపడ్డారన్నమాట!
ఈ లావాదేవీని సమర్ధించడానికి ఉపయోగించిన తర్కాన్ని చూస్తే బుర్ర తిరిగిపోతుంది. ఇంత తక్కువ మొత్తానికే రుణదాతలు ఎందుకు అంగీకరించారు? మూతబడిన ఆ కంపెనీ విలువ(లిక్వి డేషన్ వాల్యూ) రూ.2,568.13 కోట్లు అని అంచనా వేశారని (ఈ అంచనాను వేసే వాల్యుయర్ ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్ట్సీ బోర్డు నుంచి గుర్తింపు పొందినవాడై ఉండాలి) అంతకన్నా వేదాంత కంపెనీ ఇస్తానన్న సొమ్ము ఎక్కువే అయినందున ఈ లావాదేవీ తమకు అంగీకారమేనని రుణదాతలు తెలియజేశారు. మూతబడ్డ కంపెనీ విలువ (ఇది ఊహాజనితమైనది) అంటే ఆ కంపెనీ ఆస్తులను మార్కెట్లో అమ్మకానికి పెడితే వచ్చే విలువ. ఈ విలువ ఆ ఆస్తుల వాస్తవ మార్కెట్ విలువను సరిగ్గా సూచించకపోవచ్చు. వీడియోకాన్‌కు రవ్వ ఆయిల్‌ఫీల్డ్‌లో 25శాతం వాటా ఉంది. ఈ ఆయిల్ ఫీల్డ్‌లో ఓఎన్జీసీ 40శాతం, వీడియోకాన్ 25 శాతం, కెయిర్న్ ఎనర్జీ (ఈ సంస్థను వేదాంత ఇదివరకే స్వాధీనం చేసుకుంది) తదితర వాటాదారులు తక్కిన 35శాతం వాటాలు కలిగివున్నారు. 2019-20లో రోజుకు 14,232 బ్యారెళ్ళ చమురు వెలికి తీసిన ఈ ఆయిల్ ఫీల్డ్ నుంచి ఏప్రిల్-జూన్ 2020 కాలంలో రోజుకు సగటున 22,037 బ్యారెళ్ళ చమురు తీశారు. కారుచవుకగా వీడియోకాన్‌ను వేదాంత చేజిక్కించుకుంటే దాని వాటా 47.5శాతానికి పెరుగుతుంది. ఇది ఓఎన్జీసీ వాటా 40శాతం కన్నా ఎక్కువ. వీడియోకాన్‌కి ఉన్న ఇతర ఆస్తులు, భూముల విలువ కూడా కలిపితే వీడియోకాన్ విలువ అంచనా వేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఐబిసి రూపొందిచిన పరిష్కారం, రుణదాతలు అత్యంత హీనమైన విలువకే ఆమోదం తెలిపిన తీరు, అన్నీ ఐబిసి విధానం ప్రకారమే జరుగుతున్నందున నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దీనిని ఆమోదించడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
అయితే ఈ విధంగా చాలా ఉదారంగా బడా కార్పొరేట్ సంస్థలకు సంపద తరలిపోవడం చూస్తూ ఎన్‌సిఎల్‌టి ఊరుకోలేకపోయింది. ఒకవైపు తన ఆమోదాన్ని తెలియజేస్తూనే, ఈ వ్యవహారంలో వేదాంత సంస్థ రుణదాతలకు చెల్లిస్తున్నది అతి స్వల్పంగా ఉంది అని తన అభిప్రాయాన్ని తెలిపింది. అంతేగాక, లిక్వడేషన్ వాల్యూకు అతి దగ్గరగా వేదాంత సంస్థ తన ఆఫర్ ఇచ్చిందని, ఆ రెండింటికీ మధ్య తేడా చాలా స్వల్పంగా ఉన్నదని, కనుక రహస్యంగా ఉంచవలసిన సమాచారాన్ని ఎవరైనా లీక్ చేసివుండే అవకాశం ఉందేమో పరిశీలించాలని సూచించింది. అయితే, ఎన్‌సిఎల్‌టి ఆమోదం లభించింది గనుక వీడియోకాన్ సంస్థ ప్రమోటర్లు తమ సంస్థ ఆస్తులను రుణదాతలకు అప్పగించేశామని చెప్పుకుని ఊరట చెందవచ్చు.
కొన్నిసార్లు ఈ రుణ పరిష్కారం అమలయ్యే విధానం మరీ వెర్రి తలలు వేస్తూ ఉంటుంది. ఏ సంస్థ అప్పు తీర్చలేక బకాయిపడిపోయిందో, ఆ సంస్థకే భారీ డిస్కౌంట్ ఇస్తూ ఇంకోపక్క ఆ సంస్థమీద ఆధిపత్యాన్ని కూడా దానికే వదిలిపెడుతూ పరిష్కరించవచ్చు! ఎన్‌సిఎల్‌టి చెన్నై బెంచ్ వద్ద తీర్పు కోసం వచ్చిన శివ ఇండిస్టీస్ హోల్డింగ్స్ అనే కార్పొరేట్ కంపెనీ కేసు ఇందుకొక ఉదాహరణ. సి.శివశంకరన్ అనే ప్రమోటర్ ఈ కంపెనీని స్థాపించాడు. రూ.4863 కోట్ల రుణం తిరిగి చెల్లించలేక బకాయిపడినందున జూలై 2019లో రుణదాతలు పరిష్కారం కోసం ప్రక్రియ ప్రారంభించారు. రెండేండ్ల అనంతరం, ఐడిబిఐ నేతృత్వంలోని రుణదాతల కమిటీ ఒక విచిత్రమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఐబిసి చట్టంలోని సెక్షన్ 12-ఎ ను ఉపయోగించి రుణగ్రహీతతో వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకుంటామని దరఖాస్తు చేసింది. ఆ వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రకారం శివ ఇండిస్టీస్ రూ.323 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. అదిగాక థర్డ్ పార్టీ గ్యారంటర్స్ రూ.555 కోట్లు చెల్లిస్తారు. మొత్తం కలిపితే అప్పులో కేవలం 18శాతం మాత్రమే తిరిగి చెల్లిస్తారు. ఆ కంపెనీ యథాతథంగా శివశంకరన్ ఆధిపత్యంలోనే కొనసాగుతుంది. ఈ విధమైన ఒప్పందం వెనక హేతుబద్ధత ఏమిటో వివరించమని ఎన్‌సిఎల్‌టి రుణదాత ఐడిబిఐని అడిగింది. ఈ విధమైన పరిష్కారాలను ఆమోదిస్తే అదొక కొత్త ఒరవడి అయిపోయే ప్రమాదం ఉంది. అప్పు ఎగ్గొట్టిన వాడే తిరిగి రుణ పరిష్కారం పేరుతో భారీ డిస్కౌంట్ పొంది తన అప్పులో అత్యధిక భాగాన్ని తిరిగి చెల్లించనవసరం లేకుండా ఉండవచ్చు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ సందర్భాలు ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్ట్సీ కోడ్ (ఐబిసి) ఏవిధంగా సంపదను పెట్టుబడిదారులకు బదలాయించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోందో వెల్లడి చేస్తున్నాయి. ఈ బదలాయింపునకు ఐబిసి చట్టం ఒక ముసుగులాగా పని చేస్తోంది. 2000 సంవత్సరం తర్వాత రుణాల మంజూరు బాగా వేగం పుంజుకున్నది. ఆ రుణాలలో పారుబకాయిలుగా మారుతున్న రుణాల సంఖ్య బాగా పెరిగిపోవడాన్ని మనం గత దశాబ్ద కాలంగా చూస్తున్నాం. ఈ రుణాల ఎగవేతదారుల్లో ప్రధానంగా బడా కార్పొరేట్లే ఎక్కువమంది ఉన్నారు. అందువలన ఆ రుణాలను తిరిగి రాబట్టడం చాలా కష్టం గా మారింది. వివాదాలను కోర్టుల్లోకి లాగి ఏండ్ల తరబడి సాగదీస్తున్నారు. ఈ లోపు ఆ కంపెనీల ఆస్తుల విలువలు పడిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఐబిసిని 2016లో తెచ్చింది. ఇంతకు ముందు కూడా రుణ వసూలు ట్రిబ్యునల్, లోక్ అదాలత్, సెక్యూరిటైజేషన్ అండ్ రి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇంట్రెస్ట్ చట్టం 2002 వంటివి ఉన్నాయి. వాటి క్రింద రుణదాతలకు ఎక్కువ అధికారాలు ఉండేవి. కాని పారుబకాయిలను తిరిగి రాబట్టడంలో అవి కృతకృత్యం కాలేకపోయాయి. పెద్ద పెద్ద అప్పులను తిరిగి రాబట్టలేకపోవడంతో బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. వాటి నష్టాల్లో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తే తప్ప అవి నడవలేని స్థితి వచ్చింది. ఈ సమస్యకు ఒక పరిష్కారం గా ఐబిసి చట్టాన్ని తెచ్చామని, ఒక నిర్ణీత కాల వ్యవధిలోపల ఈ చట్టం ద్వారా సమర్ధవంతంగా పారుబకాయిల సమస్యను పరిష్కరించడానికి వీలౌతుందని ప్రభుత్వం చెప్పుకుంది.
తన వాదనను బలపరచుకోడానికి కొన్ని దృష్టాంతాలను చూపింది ప్రభుత్వం. ఎస్సార్ స్టీల్ బకాయి రూ.49,000 కోట్ల లో 92శాతాన్ని రుణదాతలు తిరిగి రాబట్టగలిగారు. భూషణ్ పవర్ అండ్ స్టీల్‌కు ఇచ్చిన రూ.47,157 కోట్లలో 41శాతం, భూషణ్ స్టీల్‌కు ఇచ్చిన రూ.56,022 కోట్లలో 64 శాతం, బినాని సిమెంట్స్‌కు ఇచ్చిన రుణం రూ.6469 కోట్లు మొత్తం తిరిగి రాబట్టారు. అంతకు ముందున్న చట్టాలద్వారా అయితే ఇంతింత రుణాలను తిరిగి రాబట్టగటిగివుండేవారు కాదు.
అయితే ఇక్కడ గమనించవలసినదేమంటే పైన ప్రస్తావించిన దృష్టాంతాలు కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు మాత్రమే. అన్ని పారు బకాయిల విషయంలోనూ ఇదే తీరుగా తిరిగి రాబట్టగలిగారని అనుకోవద్దు. అంతకుముందున్న చట్టాల ప్రకారం పరిష్కరించిన పారుబకాయిల 26శాతం ఉంటే ఐబిసి వచ్చాక పరిష్కరించినవి 39శాతం. అంటే ఈ చట్టంతో మొత్తం పరిస్థితి అంతా మారిపోతుందని చెప్పినది ఇంతవరకూ ఆచరణ రూపం దాల్చలేదు.
ఒకటి, రెండు మినహాయింపులను చూపించి బ్రహ్మాండంగా పరిష్కరించేశామని చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు 2018 రెండో త్రైమాసికంలో 12 కేసులను పరిష్కరించారు. వాటిద్వారా రికవరీ మొత్తం రూ.42,885 కోట్లు. అయితే, అందులో ఒక్క భూషణ్ స్టీల్ కేసు రూ.35,571 కోట్లు. అదే విధంగా 2019 మూడవ త్రైమాసికంలో 31 కేసులను పరిష్కరించారు. వాటిద్వారా రూ.27,159.17 కోట్లు రికవరీ వచ్చింది. అయితే అందులో ఒక్క భూషణ్ పవర్ అండ్ స్టీల్ వాటాయే రూ.14, 789 కోట్లు! 2020 మొదటి త్రై మాసికంలో 29 కేసుల్లో పరిష్కారం ద్వారా రూ.25,355.37 కోట్లు రాబడితే, అందులో కేవలం జేపీ ఇన్ఫ్రాటెక్ ద్వారానే రూ.23,223 కోట్లు వచ్చాయి. మొత్తం 15 త్రైమాసికాలకు గాను 7 త్రైమాసికాలలో మాత్రమే 30శాతం గాని, అంతకు కాస్త ఎక్కువగా కాని రికవరీ వచ్చింది. ఆ ఏడింటిలో మాత్రమే రుణదాతలు 70శాతం లేదా అంతకన్నా తక్కువ కత్తిరింపు కు పరిమితం అయారు. తక్కిన 8 త్రైమాసికాలలో 70శాతం కన్నా ఎక్కువే కత్తిరింపు జరిగింది.
లిక్విడేషన్ విలువ (కంపెనీ ఆస్తులను స్క్రాప్ కింద అమ్మేస్తే వస్తుందనుకునే మొత్తం) కన్నా రెండు రెట్లు (అంతకన్నా తక్కువే) వచ్చినది 15 త్రైమాసికాలకుగాను 11 త్రైమాసికాల్లో మాత్రమే. లిక్విడేషన్ విలువ కన్నా 1.3 రెట్లు మాత్రమే ఎక్కువ వచ్చింది 8 త్రైమాసికాల్లో. సగటున చూస్తే రికవరీ చేయగలిగిన మొత్తం లిక్విడేషన్ విలువ కన్నా పెద్ద ఎక్కువేమీ కాదు. అందుచేత ఈ పరిష్కార క్రమంలో రహస్యాలు బైటకు పొక్కుతున్నాయేమో పరిశీలించాలని ఎన్‌సిఎల్‌టి కోరడం ఎంతైనా సమంజసం.
బడా కార్పొరేట్లనుంచి పారు బకాయిలను వసూలు చేయడంలో పెద్ద పురోగతి సాధిస్తుందని ఐబిసి గురించి చాలా గొప్పగా ప్రచారం జరిగింది. కాని ఆ కార్పొరేట్లు మాత్రం ఏ మాత్రమూ ఖాతరు చేయకుండా యథావిధిగా అప్పులను ఎగ్గొడుతూనేవున్నారు. వారిని నిరోధించేబదులు బ్యాంకుల నుంచి ఆ బడా కార్పొరేట్లకే సంపదను తరలించే సాధనంగా ఐబిసి ఉపయోగపడుతోంది. ఈ బ్యాంకుల్లో అత్యధికం ప్రభుత్వరంగంలో ఉన్నవే. అంటే సారాంశం సాధారణ పౌరులే వాటి యజమానులు. సాధారణ ప్రజానీకం నుంచి సంపద బడా కార్పొరేట్లకు తరలిపోతోంది. (స్వేచ్ఛానుసరణ)
- సి.పి.చంద్రశేఖర్