Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించేందుకు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్‌లో బీజేపీకి అధికారం కట్టబెట్టేందుకు శ్రమించిన ఆయన, ఇప్పుడు కూడా కాషాయ పార్టీని అందలమెక్కించజూస్తున్నారు. బీహార్‌లో ఆర్జేడీకి పడే ఓట్లను చీల్చి, ఆపార్టీని అధికారంలోకి రాకుండా బీజేపీకి పాలనాపగ్గాలు అందేలా చేశారు. బహుజన సమాజ్ పార్టీతో సహా ఆరు ఇతర పార్టీలతో కలిసి అక్కడ ఓవైసీ పార్టీ బరిలోకి దిగింది. 20 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. వారిలో ఐదుగురు విజయం సాధించారు. అలా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓవైసీ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. చివరకు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. లేదంటే అక్కడ ఆర్జేడీ ప్రభుత్వమే వచ్చి ఉండేది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా ''భాగీదారీ సంకల్ప్ మోర్చా'' పేరుతో ఓవైసీ ఒక కూటమిని ఏర్పాటు చేశారు. దీనిలో ఓంప్రకాశ్ రాజ్‌భర్ పార్టీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ కూడా ఉంది. మొత్తంగా వీరు 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించి, బీజేపీకి లాభం చేకూర్చే పనిలో కాషాయ పార్టీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఆయన యూపీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టిసారిస్తున్నారు. దీంతో బీజేపీకి వ్యతిరేక ఓట్లు చీలడంతో బీజేపీ గెలుపు సులువు అవుతుంది. ముస్లింలు ఎంత ఎక్కువగా ఆయన వైపు తిరిగితే బీజేపీకి అంత లాభం కలుగుతుంది. ముస్లింలకు ఇప్పటివరకు ఏ పార్టీ మేలు చేయలేదని, తమ పార్టీ ముస్లింల కోసమే ఏర్పడిందని ఓవైసీ కూడా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓవైసీ ప్రభావం చూపడం అంత తేలిక కాదు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ అది రుజువైంది కూడా. సమాజ్‌వాదీ విజయావకాశాలకు గండి కొట్టి బీజేపీకే లబ్ది చేకూర్చడానికే ఓవైసీ యూపీ వచ్చారని ముస్లింలు గ్రహిస్తే, ఆయన వ్యూహం బెడిసికొడుతుంది. అయితే, ఆ ఒక్క వర్గంపై ఆశలు పెట్టుకొని యూపీ అసెంబ్లీలో చోటు సంపాదించడం కష్టమే. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో జతకట్టిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి ఇక్కడి విపక్షాల్లో అందరికంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్‌కు దీటుగా తమ పార్టీ బరిలోకి దిగబోతోందని మాజీ సీఎం, ఎస్పీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు మాయావతి కూడా బీఎస్పీలో దీనికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ప్రియాంకాగాంధీ పర్యవేక్షణలో కాంగ్రెస్ కూడా ముందుకు వెళ్తోంది. అయితే, వీరెవరి గురించీ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడడం లేదు. అసదుద్దీన్ ఓవైసీనే తమకు ప్రధాన పోటీదారని ఆయన చెబుతున్నారు. దేశంలోని పెద్ద నాయకుల్లో ఓవైసీ ఒకరని, ఆయన కంటూ ప్రజల్లో గుర్తింపు ఉందనీ, పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మాటల్లోనే బీజేపీ, ఏఐఎంఐఎంల బంధం బయటపడుతోంది. ఆదిత్యనాథ్ మరోసారి ఉత్తరప్రదేశ్ సీఎం కాకుండా అడ్డుకుంటామని ఓవైసీ సవాల్ విసరగా, దానిని స్వీకరిస్తున్నామని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఓవైసీ వ్యాఖ్యలు సాధారణమైనవే. ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీకి పునాదులు వేసేందుకు చాలా కాలం నుంచీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఆయనను పెద్ద నాయకుడిగా ఆదిత్యనాథ్ అభివర్ణించడం ఇప్పుడు సందేహాలకు తావు ఇస్తోంది. వీళ్లు ఇలా బయటకు శత్రువులుగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటున్నట్టు తెలిసిపోతుంది. ప్రస్తుతం ఓవైసీ పార్టీకి తెలంగాణలోని హైదరాబాద్‌లోనే కొంత పునాదులు ఉన్నాయి. ఇక్కడ 2018 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా ఓవైసీ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఎలాంటి ప్రభావాన్నీ చూపలేకపోయింది. 2017లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 38 మంది అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో 37 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తంగా పార్టీకి దక్కింది 2.46 శాతం ఓట్లే. మరోవైపు 384 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన బీజేపీ 41.57 శాతం ఓట్లను దక్కించుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమకు ముస్లిం ఓట్లు రావని బీజేపీకి బాగా తెలుసు. దీంతో ముస్లిం ఓట్లను చీలిస్తే, తమకు ప్రయోజనం జరగుతుందని ఆపార్టీ భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఎస్పీ, ఎస్పీల మధ్యే ముస్లింల ఓట్లు చీలేవి. ఇప్పుడు ఓవైసీ ద్వారా ముస్లిం ఓటు బ్యాంకును మరింత చీల్చాలని, ఓవైసీని పెద్ద నాయకుడిగా అభివర్ణిస్తే ఆయనకు వచ్చే ఓట్లు పెరుగుతాయని, ఫలితంగా ఎస్పీ, బీఎస్పీల ఓటు బ్యాంకు తగ్గుతుందని బీజేపీ భావిస్తోంది. ఆ రాష్ట్రంలో ముస్లింల ఓట్లు 19శాతం వరకూ ఉంటాయి. 100కుపైగా స్థానాల్లో వీరు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. ఇక్కడ ముస్లిం ఓట్లు చీలిపోతే, చివరగా లబ్ది పొందేది బీజేపీనే. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ 97మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 67మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చింది. వీరిలో 24మంది ముస్లిం అభ్యర్థులు అసెంబ్లీలోకి అడుగుపెట్టగలిగారు. ముస్లింలు అధికంగా ఉండే దేవ్‌బందీ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించగలిగింది. ఆరాష్ట్రంలో ఓవైసీ అభ్యర్థులు బరిలోకి దిగిన చోట్ల బీజేపీ లబ్ది పొందినట్టు గమనించొచ్చు. బీజేపీకి ఓవైసీ సాయం చేస్తున్నారనేది బహిరంగ రహస్యమైనా, తనకు అలాంటి ఉద్దేశమేదీ లేదని ఓవైసీ చెబుతున్నారు. ఆయన ఏం చెబుతున్నా, ఆయన చర్యల ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి.
- మేకల ఎల్లయ్య
సెల్ : 9912178129