Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మాటలు కోటలు దాటుతున్నా అడుగు మాత్రం గడపదాటడం లేదు'' అన్న చందంగా ఉన్నాయి దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసుసరిస్తున్న విధానాలు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలు, హైకోర్టు సిరియస్ జ్యోక్యంతో తమ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్న వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి హడావిడిగా పరిహారం ప్రకటించి దోషులను కనుమరుగు చేశారు. ఆగమేఘాల మీద రాజకీయ పార్టీల అఖిల పక్ష మీటింగ్ నిర్వహించి రెక్కాడితే గాని డొక్కాడని అట్టడుగు వర్గాలుగా ఉన్న దళితుల ఆర్థిక సామాజిక సమానత్వ సాధన కోసం రూ.1200 కోట్ల నిధితో దళిత్ ఎంపవర్ మెంట్ స్కీమ్ పథకాన్ని ప్రకటించారు.
2011 లెక్కల ప్రకారం రాష్ట్ర సాధారణ అక్షరాస్యత 66.54శాతం ఉంటే ఎస్సీల అక్షరాస్యత 58.90శాతం మాత్రమే అంటే 7.64శాతం వెనుకబడి ఉన్నారు. కుటుంబ సమగ్ర సర్వే 2014 ప్రకారం రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 17.5శాతంగా ఉన్నారు. ఉపకులాల సంఖ్య 56. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీనే ప్రధాన జీవనాధారం గల భూమిలేని కుటుంబాలు 55శాతం, సరైన ఇల్లులేని వారు 67.33శాతం, నల్లానీరు అందుబాటులోలేని వారు 57.14శాతం, కరెంట్ సౌకర్యంలేని వారు 12.28శాతం, టారులెట్స్లేని వారు 64.05శాతం, డ్రైనేజీ వసతి లేనివారు 47.05శాతం, బ్యాంకులు అందుబాటులో లేనివారు 55.08శాతం కుటుంబాలుగా గుర్తించారు. రాష్ట్రంలో అభివృద్థి చెందిన ఇతర ఉన్నత వర్గాలకు సమాంతరంగా సమాజంలో అట్టడుగు వర్గాలుగా ఉన్న 56 ఉపకులాలలోని ఎస్సీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చేయ్యడానికి సీఎం దళిత ఎంపవర్మెంట్ స్కీం తోడ్పడుతుందా? లేదా? అనేది ఎదురుచూడాల్సి ఉంది. సామాజిక సమానత్వం సాధించడానికి అడ్డు గోడలుగా ఉన్న అంటరానితనం, కులవివక్ష, లింగ వివక్షను అంతమొందించడానికి ఉన్న చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి.
ఇక రాష్ట్రంలో 9లక్షల దళిత కుటుంబాలుంటే గ్రామీణ ప్రాంతంలో ఆరులక్షలున్నాయి. 3.50లక్షల కుటుంబాలకు సెంటు భూమి లేదు. మిగతావారు మూడు ఎకరాలలోపు ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే 2014 పేర్కొంది. వీళ్ళందరికీ మూడెకరాల సాగుభూమి ఇవ్వడం లక్ష్యమని ప్రకటించిన ప్రభుత్వం ఎంత మందికిచ్చినదంటే 6916 కుటుంబాలను ఎంపికచేసి 6266 కుటుంబాలకు ఇచ్చినట్టు రికార్డులు చెపుతున్నాయి. భూమి రైతులు అమ్మడం లేదని ఇవ్వడం సాధ్యం కాదని అసెంబ్లీలో ప్రకటించారు. దళితులకు పంచడానికి భూమి లేదన్న ప్రభుత్వం భూ బ్యాంకు ద్వారా 6లక్షల ఎకరాలను బడా కార్పోరేట్ కంపెనీల కోసం సేకరించడం చూస్తే భూ పంపిణీ పట్ల ప్రభుత్వం వైఖరి ఎంటో తెలిసిపోతోంది.
తెలంగాణ ప్రాంతంలో 38లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దీనిలో 25లక్షల ఎకారాలు సాగుకు యోగ్యమైనదని 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన కోనేరు రంగారావు భూ కమిటీ సిపార్సులు రిపోర్టు చేప్పుతుంది. 73ఏండ్ల కాలంలో వివిధ సందర్భాలో పేదలకు అసైన్డ్ చేసిన భూమి 22లక్షల ఎకరాలని, దీనిలో సగం భూములను తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకోని భూముస్వాములు లాక్కున్నారని, వీటిపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి పెత్తాందార్ల చేతిలో ఉన్న భూములను స్వాదీనం చేసుకొని పేదలకు ఇవ్వాలని చెప్పింది. ఇదే పద్ధతిలో ఇనాం, వక్ప్, దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొంది. సమగ్ర భూసర్వే చేసి భూ సీలింగ్ చట్టం ప్రకారం మిగులు భూములను ప్రభుత్వం స్వాదీనం చేసుకొని పంచితే భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు ఇవ్వొచ్చని చెప్పింది. ఈ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. దొడ్డిదారిన సాధాబైనామాల పేరుతో పెత్తాందార్లు తెల్లకాగితాలపై అమ్మకాలు, కొనుగోళ్ళు చేసిన భూములకు పట్టాలిచ్చి కట్ట బెట్టింది. రెవెన్యూ చట్టంలో మార్పులు తెచ్చి తరతరాలుగా దళితుల అనుభవంలో ఉన్న ఊరుమ్మడి భూములు, మాన్యాలు, అటవీ భూములకు పట్టాలిచ్చే ప్రొవిజనే లేకుండా చేసింది. సాగు చేయడం లేదనే పేరుతో డపింగ్ యార్డు, ప్రకృతి వనాల ఏర్పాటు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, స్మశాన వాటికలు, రైతు వేదికల కోసం దళితుల చేతిలో ఉన్న అసైన్డ్ భూములను లాక్కొంటుంది. ప్రాజెక్టుల నిర్మాణం, నిమ్జ్, పార్మా కోసం జరిగిన భూ సేకరణలో దళితుల అసైన్డ్‌మెంట్ భూమినే బలవంతంగా సేకరించారు. పట్టా భూములతో సమాన పరిహారం ఇవ్వాలనే చట్టం డైరెక్షన్ కూడా ఎక్కడా అమలు చేయలేదు. పట్టా భూములకు ఎకరానికి రూ.12.50లక్షలు చెల్లిస్తే అసైన్మెంట్ భూములకు రూ.4లక్షలకు మించి ఇవ్వని ప్రభుత్వం దళితుల సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
జనాభా ఆధారంగా బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రత్యేకంగా వారి అభివృద్థికోసం ఖర్చుచేయాలని కేటాయిస్తున్న ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు ఉమ్మడి రాష్ట్ర పాలనలో రూ.25వేల కోట్లు డైవర్టు అయితే ఏడేండ్ల కేసీఆర్ పాలనలో రూ.39,228కోట్లను దారి మళ్ళించడం చూస్తేనే దళితుల అభివృద్ధి పట్ల ఉన్న కపట ప్రేమ అర్థం అవుతుంది. ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనే అర్భాట ప్రచారం కూడా ఒట్టిబూటకమే అని ప్రభుత్వ లెక్కలే చెప్పుతున్నాయి. 2014 -19 ఐదేండ్ల కాలంలో 5,33,812 మంది స్వయం ఉపాధి కోసం ధరఖాస్తులు పెట్టు కుంటే కేవలం 1,16,759 మంది మాత్రమే లోన్లు మంజూరు చేసి మిగతావారికి మొండి చేయి చూపారు. అంటే మూడోవంతు కూడా లక్ష్యం చేరలేదు. ఎలాంటి షూరిటీలు లేకుండా బ్యాంకులోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడటంలేదు. నిరుద్యోగులకు రూ.3116 నిరుద్యోగబృతి ఇస్తాం అన్న ఎన్నికల వాగ్దానం నేటికి కార్యరూపం దాల్చలేదు.
ఈ ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప వారికిచ్చిన వాగ్దానాలైన మూడు ఎకరాల సాగుభూమి పంపిణీ, రిజర్వేషన్లు పెంపు, రిజర్విషన్లు వర్గీకరణ సాధన, బ్యాక్‌లాక్ పోస్టుల భర్తీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, స్వయం ఉపాధి కల్పన వంటివి ఆచణలో అమలు చేయకుండా గాలికి వొదిలేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు -విడిసిల పేరుతో పెత్తందార్లు కొనసాగిస్తున్న కుల వివక్ష, గ్రామ బహిష్కరణలు, మరోవైపు నేరేళ్ళ దళితులపై దర్డ్ డిగ్రీ ప్రయోగంతో పాటు కులాంతర వివాహాలు చేసుకున్న వారిని నడి బజారులో నరికి చంపుతున్న ఘటనలు నిత్యం బయటపడు తున్నాయి. ప్రభుత్వం బడులను మూసి వేసి ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు పేద విద్యార్థు లను అందించే పీఆర్ఓ పాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం పోషిస్తుంది. కాని ప్రయివేట్ విద్యా సంస్థల్లోని విద్యా హక్కు చట్ట ప్రకారం 25శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా అందించాలన్న సంగతి మాత్రం మరిచింది. వామపక్షాలు, సామాజిక సంఘాలు, మేథావులు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అనేక పోరాటాల ద్వారా సాధించిన ఎస్సీ స్పేషల్ డెవలఫ్‌మెంట్ నిధులు, సమగ్ర ఖర్చు, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు, కోనేరు రంగా రావు భూ కమిటీ సిపార్సులు, దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు వంటివి చిత్తశుద్ధితో అమలు ఎన్ని కోట్ల రూపాయలతో కొత్త పథకాలను ప్రకటించినా దళితుల ఆర్థికాభివృద్థిని సాధించడం అసాధ్యమైనది.
- బి. ప్రసాద్
సెల్: 9490098901