Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికన్లు ఖాళీ చేయటంతో ఆఫ్ఘన్లో ఏర్పడే పరిణామాల గురించి షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) తజకిస్థాన్ రాజధాని దుషాన్బేలో మంగళవారంనాడు సమావేశమైంది. ఇది రాసిన సమయానికి అక్కడేం జరిగిందన్న సమాచారం వెలువడలేదు. ఈనెల 16వరకు ఇదే అంశంపై చైనా, భారత్, రష్యా దేశాల ప్రతినిధులు అనేక చర్చలు జరపనున్నారు. ఈ దేశాల మధ్య అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం లేదు. రష్యా, చైనా సమన్వయంతో వ్యవహరించ వచ్చు. అమెరికా మిత్రపక్షంగా ఉన్న భారత్‌తో చర్చలు జరిపినప్పటికీ విశ్వాసంలోకి తీసుకుంటాయా అన్నది సందేహమే. సోవియట్ యూనియన్ను విచ్ఛిన్నం చేసిన తరువాత ఆసియాలో అమెరికాను అడ్డుకొనేందుకు చైనా చొరవతో షాంఘై సహకార సంస్థ ఏర్పడింది. ఆ తరువాతే అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించారు.
తాము పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లోనే అమెరికా పరాభవాన్ని ఎవరైనా ఊహించారా? ఉగ్రవాదం మీద పోరు అని చెప్పి ఇంతకాలం అమెరికాతో చేతులు కలిపిన మోడీ సర్కార్ కూడా ఆ తాలిబాన్లతోనే తెరవెనుక సంబంధాలను కొనసాగించిందని తెలుసా? తాలిబాన్లు రష్యా, చైనాలతో సర్దుబాటుకు సిద్దం అవుతారని ఎప్పుడైనా భావించారా? అసలు ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం, యుద్ధానికి ఎందుకు దిగారు, ఇప్పుడెందుకు వెళ్లిపోతున్నారంటే అమెరికా దగ్గర సమాధానం ఉందా? అక్కడ ఏకరూప ప్రభుత్వం ఉండే అవకాశం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం పతనమైతే అమెరికా చేయగలిగిందీ, చేయాల్సిందీ ఏమీ లేదు. అక్కడి జనం, దాని ఇరుగు పొరుగు దేశాలు ఏం చేసుకుంటాయో వాటి ఇష్టం అని బైడెన్ చెప్పాడు.
ఒక అగ్రరాజ్య అధిపతి నుంచి ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్య వెలువడిందంటే అమెరికాను నమ్ముకున్న దేశాలు తమ పరిస్థితి ఏమిటని ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలి. ఇక్కడే కాదు, ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటిదే జరిగితే దాన్ని నమ్ముకున్న వారు ముఖ్యంగా మన నరేంద్రమోడీ వంటి వారు పునరాలోచన చేయాల్సిన అవసరం లేదా! అమెరికా ఇప్పుడు తప్పుకున్నంత మాత్రాన మిలిటరీ రీత్యా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆ ప్రాంతంలో శాశ్వతంగా జోక్యం చేసుకోదా? మరో రూపంలో, కొత్త ఎత్తుగడతో రంగంలోకి దిగుతుందా? కొంత మంది చెబుతున్నట్లుగా రాబోయే రోజుల్లో అక్కడ చైనా పలుకుబడి పెరుగుతుందా? ఇవన్నీ ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నలే.
ఆఫ్ఘన్ కమ్యూనిస్టు ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టినవారు ముజాహిదిన్లు, వారి వారసులైన తాలిబాన్లు ఇప్పుడు మాస్కోలో రష్యా నేతలతో చర్చలు జరిపారు. తమ గడ్డమీద నుంచి ఇతర దేశాల మీద దాడులు చేయాలనుకొనే శక్తులకు అవకాశం ఇచ్చేది లేదని మాస్కోలో ప్రకటించారు. మరోవైపున చైనా తమకు మిత్ర దేశమని, దానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాదులకు తమ గడ్డమీద ఇంకేమాత్రం ఆశ్రయం కల్పించేది లేదని కూడా వారు ప్రకటించారు.
అసలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతోంది? ఎవరికీ తెలియదు. ఏం జరగబోతోంది? అది అనూహ్యం! తాలిబాన్ల పేరుతో అనేక గ్రూపులు ఉన్నాయి. వాటిలో వాటికి పడనివీ కొన్ని. తాము దేశంలోని 85శాతం ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకున్నామని తాలిబాన్లు చెబుతున్నారు. ఇరాన్, తజకిస్థాన్, చైనా సరిహద్దు ద్వారాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించుకున్నారు. దాని గురించి ప్రభుత్వ స్పందన గురించి తెలియదు. అదెలా సాధ్యం అని జోబైడెన్ అనటం తప్ప అమెరికన్లు కూడా అక్కడి పరిస్థితి గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. అక్కడి అస్థిర, అస్తవ్యస్థ పరిస్థితి కారణంగా చైనా, మన దేశం కూడా దౌత్య సిబ్బందిని వెనక్కు రప్పించాయి. తమ దౌత్య సిబ్బంది రక్షణ కోసం వెయ్యి మంది వరకు తమ సిపాయిలు అక్కడే ఉంటారని అమెరికా ప్రకటించింది.
కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ తొత్తు పాలన ఏర్పాటు చేయాలనుకున్న అమెరికన్లు ముజాహిదిన్లు, తాలిబాన్లను సృష్టించి చివరకు వారి దెబ్బకు తట్టుకోలేక రాజీ చేసుకొని తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోతున్నారు. 1978లో తిరుగుబాటు ద్వారా అధికారానికి వచ్చిన కమ్యూనిస్టు-ఇతరులతో కూడిన ప్రభుత్వానికి ప్రారంభం నుంచే అమెరికన్లు ఎసరు పెట్టారు. దాంతో 1979లో ప్రభుత్వానికి మద్దతుగా సోవియట్ యూనియన్ జోక్యం చేసుకుంది. నాటి నుంచి ముజాహిదిన్ల పేరుతో అనేక తిరుగుబాట్లు వాటి వెనుక పాకిస్థాన్, అమెరికా, సౌదీ అరేబియా హస్తాలున్నాయి. పదేండ్ల తరువాత సోవియట్ ఉపసంహరించుకుంది. తరువాత ముజాహిదీన్లే తాలిబాన్లుగా రూపాంతరం చెందారు. అమెరికన్ల పట్టు పెరిగిన తరువాత ఇరాన్ రంగంలోకి దిగి తనకు అనుకూలమైన తాలిబాన్లను పెంచి పోషించింది.
దేశంలో 85శాతం తమ వశమైందని ప్రకటించుకున్న తాలిబాన్ నేతలు మాస్కో వెళ్లి రష్యా, మధ్య ఆసియాలోని పూర్వపు సోవియట్ రిపబ్లిక్‌లైన తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్కిస్థాన్లు, రష్యా మీద దాడి చేసేందుకు తమ దేశాన్ని స్థావరంగా వినియోగించుకోనిచ్చేది లేదని రష్యా ప్రభుత్వానికి హామీ ఇచ్చి వచ్చారు. ఆ దేశాల మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం ఉంది. దానిలో భాగంగా తజకిస్థాన్‌లో రష్యా మిలిటరీ స్థావరం ఉంది. ఒక వేళ ఏదైనా దాడి జరిగితే ప్రతిఘటించేందుకు తజకిస్థాన్ కూడా 20వేల మంది మిలిటరీని సిద్దం చేసింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తప్పుకొనేందుకు తాలిబాన్లతో రాజీ చేసుకున్న అమెరికా నిర్ణయంతో రష్యా కూడా వెంటనే రంగంలోకి దిగింది. మార్చి నెల నుంచే తాలిబాన్లతో చర్చలు ప్రారంభించింది. దాని పర్యవసానమే మాస్కో పర్యటన, ప్రకటన.
మరోవైపు చైనాను తమ స్నేహదేశంగా పరిగణిస్తామని కూడా తాలిబాన్లు ప్రకటించారు. తమకు సరిహద్దుగా ఉన్న గ్జిన్‌జియాన్ రాష్ట్రంలో ఉఘిర్ ఇస్లామిక్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేది లేదని కూడా చెప్పారు. చైనా-ఆప్ఘనిస్థాన్ మధ్య 80కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. అమెరికా అండతో తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ ఉద్యమం పేరుతో ఆల్‌ఖైదా గ్జిన్‌గియాంగ్ రాష్ట్రంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటి వరకు వారికి ఆఫ్ఘనిస్థాన్ ఒక ఆశ్రయంగా ఉంది. తామింకేమాత్రం వారికి మద్దతు ఇచ్చేది లేదని, తమ దేశ పునర్నిర్మాణం కోసం చైనా పెట్టుబడుల గురించి త్వరలో చర్చలు జరుపుతామని, రక్షణ కూడా కల్పిస్తామని తాలిబాన్ల ప్రతినిధి హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ పత్రిక విలేకరితో చెప్పాడు. గతంలో తమ ప్రతినిధి వర్గాలతో చైనా చర్చలు జరిపిందని గుర్తు చేశాడు.
తాలిబాన్లలో వివిధ ముఠాలు ఉన్నాయి. అవి అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలకు దిగితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్దకం. రష్యా, చైనా, ఇరాన్ తదితర దేశాలు పరిణామాలను ఆచితూచి గమనిస్తున్నాయి. అమెరికన్లు దేశం విడిచి వెళ్లినప్పటికీ తాలిబాన్లలో తమకు అనుకూలమైన శక్తులతో సంబంధాలు, సహాయాన్ని కొనసాగిస్తారన్నది స్పష్టం. కొంత మంది సైనికులు తాలిబాన్ల దాడికి తట్టుకోలేక పొరుగుదేశాలకు పారిపోయినట్టు చెప్పటమే తప్ప వారి సంఖ్య ఎంతన్నది తెలియదు. తాలిబాన్లను పెంచి పోషించిన అమెరికాకు చివరకు వారే ఏకు మేకయ్యారు. ఆల్‌ఖైదా నేత బిన్‌లాడెన్ రూపొందించిన పధకం ప్రకారం న్యూయార్క్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం మీద దాడి చేసిన తరువాత అమెరికా కొత్త పల్లవి అందుకుంది.ఉగ్రవాదం మీద పోరు పేరుతో ప్రత్యక్ష దాడులకు దిగింది. గత రెండు దశాబ్దాలలో పాకిస్థాన్‌లో ఉన్న బిన్‌లాడెన్‌ను పాక్ సాయంతో మట్టుబెట్టటం తప్ప అది సాధించిందేమీ లేకపోగా ఉగ్రవాదులను మరింతగా పెంచింది.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తన స్ధావరంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇరాన్, మధ్య ఆసియా, రష్యా, చైనాల మీద అది దాడులు చేయలేదు. అందుకు అనువైన ప్రాంతం ఆప్ఘనిస్థాన్. అక్కడ కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు గనుక వారు స్ధిరపడితే అది సోవియట్‌కు అనుకూల దేశంగా మారుతుందన్నదే అసలు దుగ్ద. దానితో పాటు ఆప్రాంతలో వెలికి తీయని విలువైన ఖనిజ సంపదమీద కూడా అమెరికా కంపెనీల కన్ను పడింది. అందుకే 1978 నుంచి 2021వరకు అది కొన్ని అంచనాల ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. వేలాది మంది తన సైనికులను బలిపెట్టింది, లక్షలాది మంది ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలను తీసింది. అయినా దానికి పట్టుదొరక లేదు. డబ్బూ పోయి శని పట్టె అన్నట్లు పరువూ పోయింది. మనం స్వతంత్ర విదేశాంగ విధానం నుంచి వైదొలిగి అమెరికా మిత్రులం అయ్యాం గనుక తాలిబాన్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అమెరికా రక్షణలో మనం కూడా కొన్ని పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు వారు ఉండరు కనుక అవేమవుతాయో తెలియదు.
మరోవైపు మా దేశంలో జోక్యం చేసుకోవద్దని కోరుతూ మన అధికారులు తాలిబాన్లతో చర్చలు జరిపారంటూ వచ్చిన వార్తలను మన విదేశాంగ శాఖ తోసి పుచ్చినప్పటికీ వివిధ వర్గాలతో సంబంధాలలో ఉన్నట్లు అంగీకరించింది. క్వెట్టా, క్వటారీ కేంద్రాలుగా ఉన్న తాలిబాన్ల ప్రతినిధులు కూడా ఈ వార్తలను నిర్థారించారు. ఇరాన్, పాకిస్థాన్లతో సంబంధాలులేని తాలిబాన్ గ్రూపులతో మన అధికారులు సంబంధాలను కొనసాగిస్తున్నారు. అమెరికా తప్పుకోవాలని నిర్ణయించిన తరువాత మన దేశం తాలిబాన్లతో చర్చలకు సుముఖత తెలిపింది. గతేడాది దోహాలో జరిగిన చర్చలలో మన ప్రతినిధి బృందం వీడియో ద్వారా పాల్గొన్నది. మన ప్రతినిధులు ఇరాన్, రష్యాతో కూడా తెరవెనుక చర్చలు జరిపారని దాని వలన ఎలాంటి ఫలితం కనపడలేదని కూడా వార్తలు వచ్చాయి.లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి మన దేశ వ్యతిరేక బృందాలకు తావు ఇవ్వవద్దని మన దేశం తాలిబాన్లను కోరుతోంది. చైనా ప్రారంభించిన సిల్క్ రోడ్ ప్రాజెక్టులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ కీలకమైన దేశాలు. ఆ పథకాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం గనుక అక్కడ ఏర్పడే లేదా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగినా చైనాకు అనుకూల పరిస్థితి ఉంటుంది.
షాంఘై ఐదు పేరుతో చైనా, రష్యా, కజకిస్థాన్, తజకిస్థాన్, కిర్కిఝిస్థాన్లతో 1996 ఏప్రిల్ 26న మిలిటరీ సహకార కూటమి ఉనికిలోకి వచ్చింది. తరువాత 2001లో షాంఘై సహకార సంస్దగా ఏర్పడింది. ఆ ఏడాదే ఉజ్బెకిస్థాన్ సభ్యురాలిగా చేరగా 2017లో పాకిస్థాన్, భారత్ సభ్య దేశాలయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, మంగోలియా, బెలారస్ పరిశీలక దేశాలు. ఆర్మీనియా, అజర్బైజాన్, టర్కీ, శ్రీలంక, నేపాల్, కంపూచియా దేశాలతో సంప్రదింపుల కమిటీ ఏర్పడింది.
న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఆల్‌ఖైదా దాడి చేసిన తరువాత దాన్ని అణచివేసేందుకు అమెరికన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రవేశించారు. అంతవరకు ఎవరికీ ఇబ్బంది లేదు గానీ ఆ పని చేయకుండా అక్కడే తిష్టవేయటం అనుమానాలకు కారణమైంది. అయితే తాలిబాన్లకు సలాం గొట్టి ఇప్పుడు తోకముడవటం సైద్ధాంతికంగా అమెరికాను వ్యతిరేకించే వారందరికీ పెద్ద విజయంగా పరిగణించవచ్చు.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ గురించి ఏమి విశ్లేషణలను చేసినప్పటికీ అక్కడ ఏర్పడే ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి పరిణామాలు ఉంటాయి. అందువల్లనే రష్యా, చైనా, ఇరాన్, పాకిస్థాన్, మన దేశం కూడా దేని ప్రయత్నాలను అవి చేస్తున్నాయి. తాలిబాన్లు ఉగ్రవాదులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. వారే అధికారాన్ని చేపడితే దౌత్యపరమైన సంబంధాలను నెలకొల్పుకోవటంలో లేదా తిరస్కరించటంలో ఆయా దేశాల ప్రయోజనాలతో పాటు ప్రపంచ రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిష్తాయి.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288