Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమారు 787 కోట్ల యూరోల రాఫెల్ ఒప్పందంలోని 'అవినీతి, మనీ లాండరింగ్, ఆశ్రిత పక్షపాతం, అనవసరమైన పన్ను బకాయిలు, ప్రభావిత కార్యకలాపాలు' వంటి వివిధ అంశాలపై... జూన్ 14న ఫ్రాన్స్‌లో జుడిషియల్ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కుంభకోణాన్ని మాఫీ చేయడానికి నరేంద్రమోడీ ప్రభుత్వం తన శాయశక్తులా కృషి చేసినా తాజా దర్యాప్తుతో ఈ కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఫ్రాన్స్‌కి చెందిన అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ 'షెర్పా' ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఒప్పందంపై జుడిషియల్ దర్యాప్తు ప్రారంభించాలని ఫ్రాన్స్ జాతీయ ఆర్థిక కార్యకలాపాల ప్రాసిక్యూటర్ (పి.ఎన్.ఎఫ్) కార్యాలయం నిర్ణయించింది. ''రాఫెల్ పేపర్స్'' పేరుతో ఫ్రాన్స్‌లోని స్వతంత్ర ఆన్లైన్ పరిశోధక జర్నల్ 'మీడియా పార్ట్' పలు పరిశోధనాత్మక వ్యాసాలను ప్రచురించింది. 'షెర్పా' తొలుత ఫిర్యాదు చేసినప్పటికీ ఫ్రాన్స్ ప్రయోజనాలను పరిరక్షించేందుకుగానూ ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తుకు పి.ఎన్.ఎఫ్ మాజీ అధినేత ఎలియాన్ హ్యూలెట్ తిరస్కరించారు. తాజాగా 'మీడియా పార్ట్' వ్యాసాలు ప్రచురితమైన నేపథ్యంలో గత నిర్ణయాన్ని రద్దు చేసి, తిరిగి కుంభకోణంపై దర్యాప్తు జరగాలని పి.ఎన్.ఎఫ్ ప్రస్తుత అధ్యక్షుడు జేన్ ఫ్రాంకోయిస్ బానెర్ట్ నిర్ణయించారు.
'రాఫెల్ పేపర్స్' పేరుతో 'మీడియా పార్ట్' అందించిన వివరాల ఆధారంగా వచ్చిన ఆరోపణలపై జుడిషియల్ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఒప్పందంలో రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ పాత్ర ఏమిటన్నదానిపై దర్యాప్తు దృష్టి పెట్టనుందని మీడియా పార్ట్ పేర్కొంది. 2016లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హౌలాండ్, ప్రధాని మోడీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. హౌలాండ్, ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, అప్పటి రక్షణ మంత్రిగా ఉన్న ప్రస్తుత విదేశాంగ మంత్రి జేన్ వైస్ లీడ్రెయిన్ల చర్యలు, నిర్ణయాల చుట్టూ నెలకొన్న పలు ప్రశ్నలపై క్రిమినల్ దర్యాప్తు దృష్టి సారించనున్నట్లు మీడియా పార్ట్ పేర్కొంది. రాఫెల్ మాన్యుఫాక్చరర్ డసాల్ట్ ఏవియేషన్, అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపు మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ఈ క్రిమినల్ ఫిర్యాదుకు, జుడిషియల్ దర్యాప్తుకు కీలకం. 2017లో ఈ రెండు పక్షాలు డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డిఆర్ఎఎల్) పేరుతో జాయింట్ వెంచర్ కంపెనీని పెట్టాయి. నాగ్‌పూర్‌కి సమీపంలోని ప్రాంతంలో ఇండస్టియల్ ప్లాంట్ భవనంలో ఈ కంపెనీ ప్రారంభమైంది. కేవలం రాజకీయ కారణాలు తప్ప రిలయన్స్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి డసాల్ట్కి ఇతరత్రా ఎలాంటి ఆసక్తి లేదని మీడియా పార్ట్ సంపాదించిన విశ్వసనీయమైన పత్రాల ద్వారా వెల్లడైంది. ఈ జాయింట్ వెంచర్ కోసం రిలయన్స్ ఎలాంటి నిధులు అందించలేదని, ప్రాముఖ్యత కలిగిన సాంకేతికతను కూడా ఇవ్వలేదని, కేవలం రాజకీయ ప్రాబల్యంతోనే అది ఈ స్థాయికి వచ్చిందని 'మీడియా పార్ట్' పేర్కొంది.
భారత ప్రభుత్వంతో కలిసి మార్కెటింగ్ కార్యకలాపాలను, సేవలను అందించే బాధ్యతలను అనిల్ అంబానీ గ్రూపునకు అప్పగించారని, రిలయన్స్, డసాల్ట్ మధ్య కుదిరిన ఒప్పందాలను వివరిస్తూ మీడియా పార్ట్ వెలువరించిన పత్రాల్లో ఒక పత్రం పేర్కొంది. రాఫెల్ ఒప్పందంతో సహా భారతదేశ రక్షణ ఒప్పందాల్లో మరో మధ్యవర్తి సుహేన్ గుప్తా ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ భారత వార్తాపత్రికలు ఇచ్చిన సమాచారాన్ని కూడా మీడియా పార్ట్ తన 'రాఫెల్ పేపర్స్' పరిశోధనలో ఉపయోగించింది. గుప్తాను 2019 మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో కుదిరిన 55 కోట్ల యూరోల 'చాపర్ గేట్' ఒప్పందం, ఇతర రక్షణ ఒప్పందాల కోసం రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడానికి గుప్తా ముడుపులు అందుకున్నారని గుప్తాపై ఈడీ నమోదు చేసిన క్రిమినల్ ఫిర్యాదు ఆరోపించింది. అయితే, ఇతర రక్షణ ఒప్పందాలు ప్రస్తుత దర్యాప్తు అంశం (అంటే ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంపై) కానందున ఇతర ఒప్పందాలకు సంబంధించి విడిగా దర్యాప్తులు చేపడతామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, గుప్తాపై 2019 మే 20న రూపొందించిన చార్జిషీట్లో పేర్కొంది. రాఫెల్ ఒప్పందంలో ప్రత్యేకించి ఈ మధ్యవర్తి పాత్ర లేదా ప్రమేయం గురించి భారత్‌లో చివరిసారిగా వినిపించింది అప్పుడే. ఇవన్నీ... ఎన్.రామ్ రాసిన, 2019 జనవరి-ఏప్రిల్ మధ్యన 'హిందూ' పత్రికలో ప్రచురితమైన ఆరు భాగాల పరిశోధనా వ్యాసాల్లో తెలిసిన దానితో ముడిపడి ఉన్నాయి. 'హిందూ' పరిశోధనా పత్రాల్లో పేర్కొన్న ప్రకారం రక్షణ సేకరణ విధానం (డీపీపీ-2013)కు విరుద్ధంగా పలుమార్లు నడుచుకున్నారన్నది ఇప్పుడు స్పష్టమైంది. ''అవినీతి, ప్రభావిత కార్యకలాపాలు, మనీ లాండరింగ్, ఇతర నేరాలు'' జరిగేందుకు వీలు కల్పించేలా నడుచుకున్న అంశాలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు జరుగుతున్నది.
ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ రంగం ప్రమేయంతో ప్రధాన 'మేక్ ఇన్ ఇండియా' అంశం ఇమిడి ఉండటం, అడ్వాన్స్డ్ చర్చలు, దేశీయంగా నిపుణులైన భారత ప్రతినిధి బృందంలోని ముగ్గురు సభ్యులు స్పష్టంగా అసమ్మతి వ్యక్తం చేసినా రాఫెల్ జెట్‌కు ధరను మరీ ఎక్కువ చేసి అంగీకరించడం, రక్షణ మంత్రిత్వశాఖ నిరసన వెలిబుచ్చినా ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు సమాంతర చర్చలు జరపడం, రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో, సరఫరా ప్రొటోకాల్స్‌లో అవినీతి నిరోధక, సమగ్రత, పారదర్శకత క్లాజులను తొలగించడం, ఆర్థిక రుజువర్తనకు అవసరమైన, ప్రభుత్వ ఆర్థిక రంగ నిపుణులు కోరిన సార్వభౌమాధికార లేదా ప్రభుత్వ హామీలను లేదా కనీసం బ్యాంక్ హామీలను రద్దు చేయడం, ఫ్రెంచి సరఫరాదారులకు అనుకూలంగా బాధ్యతలు, పని తీరు, కాలపరిమితులు, పారదర్శకతలకు సంబంధించిన ఆఫ్ సెట్ క్లాజుల్లో ప్రధానమైన మార్పులు చేయడం... వంటి అనేక ఉల్లంఘనలు ఇందులో ఉన్నాయి.
రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి దర్యాప్తు జరగకుండా నివారించేందుకు మోడీ ప్రభుత్వం చాలా గట్టి యత్నాలే చేసింది. సుప్రీం కోర్టు, సంబంధిత కోర్టు ముందుకు వచ్చిన పిటిషన్లో దర్యాప్తు కోసం వచ్చిన డిమాండ్‌ను వ్యతిరేకించింది. రక్షణ మంత్రిత్వశాఖ పట్టుబట్టిన మేరకు 2016 ఒప్పందంలో విమానాల ధరలు మార్చబడ్డాయని 'కాగ్' నివేదిక కూడా పేర్కొంది. ఈ ఒప్పందంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) వేయాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పదే పదే తిరస్కరించింది. ఈ అంశాన్ని లేదా సమస్యను సమాధి చేయడానికి ఇంతలా కష్టపడి ప్రయత్నాలు చేసినా ఫ్రాన్స్ దర్యాప్తుతో మళ్లీ మొత్తంగా ఈ విషయం తెరపైకి వచ్చింది. ఫ్రాన్స్ దర్యాప్తు గురించి ప్రకటన వెలువడిన తర్వాత, భారత ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఆ మౌనమే అన్ని విషయాలను వెల్లడిస్తోంది. ఒకపక్క ఈ ఒప్పందంలోని మరో పక్షం దర్యాప్తుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని చెబుతున్నపుడు మోడీ ప్రభుత్వం ఎన్నాళ్లు స్వతంత్ర, అత్యున్నత స్థాయి దర్యాప్తును వాయిదా వేయగలుగుతుంది?
'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం