Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వవిద్యాలయ విద్యకు సింహ ద్వారంగా, అనేక ఉపాధి మార్గాలకు ప్రధాన భూమికగా నిలుస్తున్న ''ఇంటర్ విద్యా వ్యవస్థ'' విద్యారంగానికి వెన్నెముక వంటిది. 50 వసంతాల వయసుగల ఈ ఇంటర్ విద్యా మండలి ప్రస్థానాన్ని 2000 సంవత్సరం ముందు తర్వాత అని చెప్పక తప్పదు. 2000 సంవత్సరం నుంచి కార్పొరేట్ కళాశాలల సంఖ్య, ప్రాధాన్యత పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులకు ఇంటర్ విద్య ఖరీదైనదిగా మారిపోయింది. 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో కేజీ టూ పీజీ ఉచిత విద్యా విధానంలో పేరుకు ''ఉచిత విద్య'' అయినా కార్పొరేట్ కళాశాల వలయాల నుంచి నిరుపేద, మధ్యతరగతి, విద్యార్థులు తప్పించుకోలేని పరిస్థితి నెలకొని ఉంది.
ప్రైవేటు విద్యాసంస్థల ఆకర్షణ విద్యలో భాగంగా పెరిగి పెద్దది అయింది... ఇంటర్లో ''అధిక మార్కులు వచ్చిపడే'' సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం. ఇంటర్ చదివే ప్రతి విద్యార్థి ప్రథమ భాషగా ఆంగ్లాన్ని, ద్వితీయ భాషగా విద్యార్థికి ఇష్టమైన ''ఇంటి భాష'' (మాతృభాష)ను, ఎంచుకొని చదువుకునే వెసులుబాటు ఇంటర్ విద్యా మండలి కల్పిస్తూ ద్వితీయ భాషగా... తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, కన్నడ, మరాఠీ ,ఫ్రెంచ్, ఒరియా, తమిళం, సంస్కృతంలను ఎంపిక చేసుకునే వీలు కలిగించింది.
కార్పొరేట్ సంస్థలు కాలు పెట్టనంతవరకు ఈ ద్వితీయ భాష ఎంపిక విద్యార్థి ఇంటి భాషల మేరకు ఆరోగ్యకరంగానే సాగింది. ఎప్పుడైతే ఇంటర్ విద్యలో ర్యాంకుల వ్యాపారం మొదలైందో అప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలు విద్య మీద కన్నా మార్కులు, ర్యాంకుల మీదే మొగ్గు చూపుతున్నాయి. సంస్కృత పాఠ్యాంశాల్లో నిడివి తక్కువ, బోధన సమయాల కుదింపు వెసలుబాటూ ఉండటంతో కార్పొరేట్ విద్యాసంస్థలు సంస్కృత భాషకు ప్రాధాన్యత ఇస్తున్నాయి తప్ప తద్వారా విద్యార్థుల భాషా నైపుణ్యం పెరుగుతుందని మాత్రం కాదు. ఇక విద్యార్థులకు కావాల్సిందీ అదే... ''తక్కువ కష్టపడి ఎక్కువ మార్కులు పొందడం'' కానీ ఈ తాత్కాలిక ఆనందం వల్ల ప్రయోజనం కన్నా నష్టాలే అధికం. ఇంటర్, డిగ్రీల, తర్వాత ఉపాధి పరమైన ఉద్యోగాలకు కానీ మరే ఇతర పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధించాలి అంటే విద్యార్థులంతా విధిగా తెలుగు భాషా, సాహిత్యాలకు సంబంధించిన సాధారణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వాటిలో నుండి సుమారు 30 వరకు మార్కులు కేటాయించబడితాయి,
ఇలాంటి సందర్భంలో ద్వితీయ భాషగా తెలుగు చదవని వారు ఆ మార్కులు నష్టపోతారు. విశ్వవిద్యాలయ స్థాయిలో అత్యంత ఆదరణ, పరిశోధన, ఉపాధికి, కారణమైన మాస్టర్ డిగ్రీ అయిన ఎంఏ ( తెలుగు) చదివే అర్హత కూడా కోల్పోతారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతం ప్రవేశ పెట్టడం వల్ల కేవలం 404 మంది సంస్కృత బోధకులకు ఉపాధి లభించవచ్చు, కానీ లక్షలాది మంది విద్యార్థుల భాష, భవిష్యత్తు నాశనం కాబోతుంది. ఎలాంటి సంప్రదింపులు కమిటీలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతభాషను ప్రవేశపెడుతూ జారీచేసిన మెరుపు ఉత్తర్వులు అన్ని వర్గాల వారిని అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇది కేవలం జూనియర్ కళాశాలల్లోని తెలుగు ఉపన్యాసకులు ఒకరికి మాత్రమే కాదు, హిందీ బోధకులకు, డిగ్రీ కళాశాలల్లోని అన్ని భాషా బోధకులకు ప్రమాదం తెచ్చిపెట్టే చర్య.
2008లో నాటి ఉమ్మడి తెలుగు రాష్ట్ర పాలకులు ఇంటర్లో ''చరిత్ర పాఠ్యాంశం'' అవసరం లేదని అనాలోచిత చర్యలకు పాల్పడి, తిరిగి ఎలా సవరించుకున్నారో అధికారులకు విదితమే!! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుభాషకు, దాని వికాసానికి, ఒకపక్క ఎంతో కృషి చేస్తామని చెపుతూ, ఇప్పుడు ఇలా బోధనా భాషల్లో తెలుగును నిర్వీర్యం చేయడం గర్హనీయం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశపెట్టబోయే సంస్కృత బోధన ఉత్తర్వులు వెంటనే నిలుపుదల చేసి బంగారు తెలంగాణకు దోహదపడే తెలుగు భాషా బోధనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అభివృద్ధి అంటే తాత్కాలిక ఎదుగుదల కాదు, భావి జీవితాల పటిష్టతకు పునాదిగా నిలవడమే.
- డాక్టర్ అమ్మిన శ్రీనివాస రాజు
7729883223