Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో మొదటి కోవిడ్-19 కేసు 2020 జనవరి 30న నమోదు అయ్యింది. అనంతరం కొనసాగిన మొదటి, రెండవ వేవ్‌లలో ఇప్పటికి 4లక్షల మంది కోవిడ్ బారిన పడి మరణించారు. ఇప్పటికీ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. కోవిడ్19 ప్రబలుతున్న సమయంలో దేశంలో మెజారిటీ ప్రజలైన పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆర్థికంగానూ, సామాజికంగానూ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భౌతికదూరం పాటించేటంత ఎక్కువ గదులుండే విశాలమైన నివాసాలులేక ఐసోలేషన్ సూత్రాలను పాటించడంలో ఇబ్బంది పడ్డారు. సామాజిక స్థాయిలో కూడా వ్యాధి పట్ల నెలకొన్న అపోహల వల్లన, అవగాహనలేమి వలన ఇరుగుపొరుగు వాళ్లతో ఇబ్బందులు, వివక్ష సైతం ఎదుర్కొన్నారు. వ్యాధి తీవ్రమైనప్పుడు హాస్పిటల్లో చేరి వైద్యచికిత్స పొందవల్సిన సందర్భాలలో బెడ్స్ దొరకక, దొరికినా బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రులలో చేరిన సందర్భంలో కోవిడ్ బెడ్‌కు సగటున రోజుకు పాతికవేల నుండి యాభైవేల రూపాయల వరకు ఆసుపత్రుల స్థాయిని బట్టి, వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టి చెల్లించాల్సివచ్చింది. కోవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమెడిసివిర్, టోసిలుజుమాబ్, బ్లాక్ ఫంగస్‌కు వాడే యాంఫొటెరిసిన్ వంటి ఇంజక్షన్లు ప్రజలకు అవసరమయ్యే సమయానికి 10రెట్లు నుంచి 50రెట్లు దాకా అధికధరల్లో బ్లాక్ మార్కెట్ చేయబడి ప్రజలు తీవ్రమైన ఆర్థిక, మానసిక హింసకు గురయ్యారు. ప్రాణాన్ని కాపాడే ఆక్సిజన్ సరఫరాలో కూడా ప్రభుత్వాలు విఫలం చెందాయి. అవధుల్లేని, అరికట్టబడని బ్లాక్ మార్కెట్ వలన, సరైన సమయంలో ఆక్సిజన్ అందక వందలాదిమంది ప్రాణాలు కోల్పాయరంటే అతిశయోక్తి కాదు.
ఇంతటి విపత్తు సమయంలో తెలుగు రాష్ట్రాలలో ప్రజాతంత్ర, అభ్యుదయ సంస్థల చొరవతో మొదలైన ఉచిత ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు గొప్ప ఉపశమనంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహించిన వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ''సుందరయ్య విజ్ఞాన కేంద్రం''(ఎస్.వి.కె), విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ''మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం''(ఎం.బి.వి.కె). ఈ రెండు సంస్థల స్ఫూర్తి, సహకారంతో తెలుగు రాష్ట్రాలలో సుమారు ముప్పైనాలుగు కరోనా ఐసోలేషన్ కేంద్రాలు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం నిర్వహించారు.
విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేద్రం 2020 ఆగస్టు 17న ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా ఐసోలేషన్ కేంద్రం సేవలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రజాతంత్ర ఉద్యమం, ఎం.బి.వి.కె ట్రస్టుల ఉమ్మడి ఆలోచనతో ప్రారంభమైన ఈ కేంద్రం ఫస్ట్ వేవ్‌లో 5గురు నర్సింగ్ సిబ్బంది, 5గురు కన్సల్టెంట్ డాక్టర్స్ టీమ్‌తో 2021 జనవరి 21 దాకా 240 మందికి వైద్యసేవలందించింది. మరలా సెకండ్ వేవ్‌లో కేసులు ఉధృతమైన నేపధ్యంలో 17మంది నర్సింగ్ సిబ్బంది, 10మంది డాక్టర్ల తోటి 2021 ఏప్రిల్ 16 నుండి ప్రారంభమై నేటికీ కొనసాగుతూ రెండవ విడతలో ఇప్పటికే (జున్ 30 నాటికి) 500మందికి వైద్య సేవలందించింది. ఎం.బి.వి.కె స్ఫూర్తి, సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో 25 ఐసోలేషన్ కేంద్రాలు పలు జిల్లాల్లో నిర్వహించబడ్డాయి.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్.వి.కె), బాగ్‌లింగంపల్లిలో రాష్ట్రప్రజాతంత్ర ఉద్యమం, ఎస్.వి.కె కమిటీల చొరవతో నలుగురు డాక్టర్లు, ఐదుగురు నర్సింగ్ స్టాఫ్‌తో సెకండ్ వేవ్‌లో కరోనా ఐసోలేషన్ కేంద్రం సేవలు ప్రారంభించింది. మొదటి రెండు నెలల వ్యవధిలోనే 265మంది కరోనా రోగులకు తన సేవలందించింది. ఎస్.వి.కె ఐసోలేషన్ సెంటర్ ప్రారంభానంతరం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరో ఎనిమిది కేంద్రాలు ప్రారంభమై మొత్తం తొమ్మిది ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహించబడ్డాయి.
ఎస్.వి.కె, ఎం.బి.వి.కె ఐసోలేషన్ కేంద్రాల విశిష్ట పనితీరు :
ఎస్.వి.కె మరియు ఎం.బి.వి.కె సంస్థలు నిర్వహించిన ఐసోలేషన్ కేంద్రాలు ఈ క్రింది అంశాలతో కూడిన విశిష్టతతో వైద్యసేవలు అందించాయి.
1.కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను కుటుంబ సభ్యులు కూడా భయంతో అంటీ అంటనట్టు ఉండిన కాలంలో ఈ ఐసోలేషన్ కేంద్రాలలోని నర్సింగ్ సిబ్బంది, వాలంటీర్లు ఎంతో ఓపికగా, ఆత్మీయతతో వాళ్లకు దగ్గరుండి సేవలందించారు. అనేక కేంద్రాలలో డిశ్చార్జి అయ్యేటప్పుడు పేషెంట్లు '' కన్నతల్లి ఒడిలో నుండి వెళ్తున్నట్లుగా ఉంది'' అని వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం.
2.చాలీచాలని గదులతో, ఇరుకైన నివాసాలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు చక్కటి వసతి సౌకర్యాన్ని ఈ ఐసోలేషన్ కేంద్రాలు కల్పించాయి. విశాలమైన గదులు, హాల్స్, సౌకర్యవంతమైన బెడ్స్, లాకర్స్‌తో కోవిడ్ పాజిటివ్ రోగులకు క్వారంటీన్ సమయంలో వ్యక్తిగత వసతి లేమిని ఈ కేంద్రాలు తీర్చాయి.
3.కోవిడ్ వ్యాధి పరిణామాల పట్ల ఉండే ఆందోళన, భయాలను తీర్చే విధంగా ఈ ఐసోలేషన్ కేంద్రాలలో మ్యూజిక్, పాటలు, సినిమాలు వంటి చక్కటి వినోదాన్ని కూడా అందించి మానసికంగా ఉల్లాసంగా ఉండేలా తోడ్పడ్డాయి. అవసరమైన వారికి తగిన సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేశాయి.
4.ఇంటిని మర్చిపోయేటంత చక్కని రుచులతో భోజన వసతులు కల్పించబడ్డాయి. ప్రతిరోజూ గుడ్డు, పాలు, పండ్లు, మాంసాహారులకైతే వారానికి మూడుసార్లు మాంసాహారం అందించారు. డాక్టర్స్ సలహా మేరకు పోషకవిలువలు కలిగివుండే విధంగా ఆహారాన్ని రూపొందించారు. బి.పి, షుగర్ రోగులకు ప్రత్యేకంగా ఆహారంలో మార్పులు చేసి అందించారు.
5.రోగనిరోధక శక్తికి కీలకమైన వ్యాయామానికి కూడా ప్రాధాన్యతనిచ్చి ప్రతిరోజూ యోగా, రెస్పిరేటరి ధెరపీ, ఇంకా పలురకాల ఎక్సర్సైజులు సుశిక్షుతులైన సిబ్బందితో నేర్పించి చేయించడం జరిగింది. కొన్ని కేంద్రాలలో వీడియోల ద్వారా వ్యాయామాలు గైడ్ చేయడం జరిగింది.
6.కోవిడ్-19 వ్యాధి చికిత్సలో కీలకమైన మానిటరింగ్‌లో నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిచ్చి అమలు చేయడం జరిగింది. రోగులకు టెంపరేచర్, ఆక్సిజన్ శాచురేషన్, బి.పి, పల్స్, రెస్పిరేటరి రేటు వంటి కీలకమైన ఆరోగ్య సూచీలను (ఙఱ్aశ్రీ సa్a) రోజుకు 3-4 సార్లు మానిటర్ చేయడం జరిగింది. అసాధారణమైన రీడింగ్స్ నమోదైన వెనువెంటనే డాక్టర్ల టీమ్ కు తెలియజేసి తగిన మార్పులు చికిత్సలో చేయడం జరిగింది.
7.కోవిడ్-19 చికిత్సలో భాగంగా అవసరమైన సి.టి.స్కాన్, ఇతర పరీక్షలు హేతుబద్దంగా, క్లినికల్‌గా వ్యాధి లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి రోగులపై అనవసర ఆర్థికభారం కలుగని విధంగా నిర్వహించడం జరిగింది.
8.కోవిడ్-19 చికిత్సలో వస్తున్న అప్డేట్స్ను క్షుణ్ణంగా పాటిస్తూ ప్రతి రోగికీ వైద్యం అందించడం జరిగింది. కాంప్లికేటెడ్ కేసులలో చికిత్స గురించి డాక్టర్స్ టీమ్ ఉమ్మడిగా చర్చించి నిర్ణయించిన ప్రకారం చికిత్స అమలు జరపడం జరిగింది. వ్యాధి లక్షణాలు పురోగమిస్తూ ఐసీయూ కేర్ అవసరమయ్యే సూచనలు కనబడ్డ సందర్భాలలో రోగిని తక్షణమే తగిన హయ్యర్ సెంటర్‌కు రిఫర్ చేయడం జరిగింది. కొన్ని సెంటర్లలో డాక్టర్లు పీపీఈ కిట్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్ కేంద్రంలో రౌండ్స్ వేసి పేషెంట్లను ప్రత్యక్షంగా పరీక్షించి చికిత్స చేయడం జరిగింది. ఎస్.వి.కె ఐసోలేషన్, హైదరాబాద్, కొన్ని కేంద్రాలలో ప్రతిరోజూ పేషెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ రౌండ్స్ నిర్వహించడం జరిగింది.
9.సకాలంలో చికిత్స, అనవసరమైన మందులు వాడకపోవడం, స్టిరాయిడ్స్ వంటి మందుల వాడకంలో హేతుబద్దంగా డాక్టర్స్ టీమ్ చర్చించి నిర్ణయించడం వంటి హేతుబద్ధమైన అప్రోచ్ వలన ఈ ఐసోలేషన్ కేంద్రాలలో అత్యంత నాణ్యమైన వైద్యచికిత్స అందించగలిగారు. దాదాపు అందరిలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా 14రోజుల పాటు చికిత్సనందించి డిశ్చార్జి చేయడం జరిగింది.
10.ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకునేందుకు, చికిత్సలో అప్డేట్స్ను అన్ని కేంద్రాలలో సేవలందిస్తున్న వైద్యులకు రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్‌లు నిర్వహించబడ్డాయి. ఫలితంగా ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకుంటూ మరింత మెరుగైన రీతిలో ఐసోలేషన్ కేంద్రాలు వైద్యసేవలందించాయి.
11.ఎస్.వి.కె. ఐసోలేషన్ కేంద్రం, హైదరాబాద్, కొన్ని ఐసోలేషన్ కేంద్రాలలో 24గంటలు రోగుల కోసం ఆంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచబడ్డాయి. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్లు అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంచబడ్డాయి.
12.హయ్యర్ సెంటర్‌కు రిఫర్ చేయాల్సిన సందర్భాలలో పేషెంట్లకు పలు హాస్పిటల్స్‌లో బెడ్స్ లభ్యత, వెంటిలేటర్ లభ్యత వంటి సమాచారాన్ని వారి బంధువులకు ఇచ్చి సమన్వయం చేయడంలో ఐసోలేషన్ కేంద్రాల మెడికల్ ఇన్చార్జిలు బాధ్యత తీసుకుని సహకరించడం జరిగింది.
ఈ ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజాసేవాదృక్పధం కలిగిన 100మందికి పైగా డాక్టర్లు ఈ అన్ని సెంటర్ల ద్వారా తమ వైద్యసేవలు స్వచ్చందంగా అందించేందుకు ముందుకురావడం మంచి కదలికగా చెప్పుకోవచ్చు. దేశ విదేశాల్లోని ఎందరో ప్రజాతంత్రవాదులు, మానవతావాదులు ఈ ఐసోలేషన్ కేంద్రాలకు తమతమ ఆర్ధిక, హార్ధిక సహాయసహకారాలను అందించారు. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, కూలర్లు, ఆహార ధాన్యాలు, మందులు... ఇలా ఎన్నో రకాలుగా తమకు తోచిన సహాయం అందించారు. ఈ ఐసోలేషన్ కేంద్రాల విజయవంతమైన నిర్వహణ వెనుక రాష్ట్రస్ధాయి నాయకుల నుండి సామాన్య కార్యకర్తల వరకు నిరంతరం శ్రమకు వెరవక మహౌత్తేజంగా చేసిన కృషి దాగివుంది. కొన్ని ప్రాంతాల్లో సుందరయ్య సేవాదళం పేరుతో మరణించిన కరోనా రోగుల మతదేహాల దహనక్రియలు కూడా నిర్వహించడం ఈ కృషిలో మరో విశిష్ట ఘటనగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్న సందర్భంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రజాతంత్రఉద్యమ స్ఫూర్తితో కదిలిన ఎం.బి.వి.కె, ఎస్.వి.కె సంస్ధలు ఐసోలేషన్ కేంద్రాల ద్వారా ప్రజలకు చేసిన సేవ చిరస్మరణీయం. 2021 జులైలో ఈ వ్యాసం వ్రాసే నాటికి కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఈ సంస్ధల ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలలో నడుస్తున్న కొన్ని ఐసోలేషన్ కేంద్రాలు తాత్కాలికంగా ముసివేసినప్పటికీ కరోనా ధర్డ్ వేవ్ ముంచుకొచ్చినట్లయితే మరలా ఈ సేవలు కొనసాగిం చేందుకు సన్నద్ధంగా ఉండటం హర్షణీయం.
- డా||కె.శివబాబు