Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ సర్కారు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పర్చింది. రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ అనుబంధ సహకార శాఖను ఏకపక్షంగా అందులో చేర్చింది. గృహమంత్రి అమిత్ షాకు అప్పజెప్పింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధం.
ప్రజలు తమ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం ఏర్పర్చుకున్న సంయుక్త యాజమాన్య, ప్రజాస్వామ్య, స్వతంత్ర వ్యాపార సేవా కేంద్రాలే సహకార సంస్థలు. సభ్యులే వనరులు సమీకరించుకుంటారు. దలారీలు ఉండరు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. సామాజిక విశ్వాసంతో స్వావలంబనకు, సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయి. ప్రయివేటు సంస్థలు ఇష్టపడని తక్కువ లాభాల గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంస్థలు సేవలందిస్తాయి. సహకార రంగంలో శ్వేత, హరిత విప్లవాలు జరిగాయి. పేదలు, నిరక్షరాస్యులు, నైపుణ్యతలులేని ప్రజల ప్రగతికి సహకార సంస్థలు పాటుపడ్డాయి.
ప్రథమ ప్రధాని నెహ్రూకు సహకార ఉద్యమంలో ప్రగాఢ నమ్మకం. ''దేశమంతా సహకార ఉద్యమం, సహకార ఆలోచన వ్యాపించాలి. సహకారం ప్రాథమిక కార్యాచరణ కావాలి. దేశ భవిష్యత్తు సహకార విజయంపై ఆధారపడి ఉంది'' అన్నారు నెహ్రూ. సహకార వ్యవస్థను పంచవర్ష ప్రణాళికల్లో చేర్చారు. సహకార బ్యాంకులు రాష్ట్రాల సొసైటీల రిజిస్ట్రార్, రిజర్వ్ బ్యాంక్‌ల ఉభయ నియంత్రణలో ఉండేవి. 2020 సెప్టెంబర్‌లో మోడీ ప్రభుత్వం బ్యాంకింగ్ క్రమబద్దీకరణ చట్టం ద్వారా రిజర్వ్ బ్యాక్ పర్యవేక్షణ కిందికి తెచ్చింది. సహకార బ్యాంకులపై కేంద్రం పెత్తనాన్ని పెంచింది.
ఇండియాలో 28కోట్ల సభ్యత్వంతో 8.5లక్షల సహకార సంఘాలు, 95 వేల వ్యవసాయ సహకార సంస్థలు, 1.4 లక్షల పాల సహకార సంఘాలు ఉన్నాయి. మార్చి 2018కి 96,248 గ్రామీణ సహకార పరపతి బ్యాంకులు, మార్చి 2019కి 1,544 పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయి. భారత వ్యవసాయదారుల ఎరువుల సహకార సంస్థకు 30 వేల, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్యకు 5 వేల శాఖలున్నాయి. గుజరాత్ అమూల్‌కు 13 జిల్లాల్లో 13 వేల గ్రామాల్లో పాల సంఘాలున్నాయి. వీటికి మౌలిక వసతులు, సౌకర్యాలు, నిధుల కొరత తీర్చాలి కాని కేంద్రం హస్తాల్లో బంధిస్తే ఉపయోగం లేదు.
సహకార రంగంలో మోడీ-షా జట్టు చరిత్ర తెలిసిందే. గుజరాత్ సహకార సంస్థల్లో ప్రభుత్వ నియంత్రణతో మోడీ అధికారం చిక్కించుకున్నారు. ముఖ్యమంత్రి కాగానే సహకార సంఘాల స్వాధీనత తీవ్రమైంది. అధికారులపై కేసులు బనాయించారు. బీజేపీలో చేరితే వదిలేశారు. లొంగనివాళ్లను జైళ్లకు పంపారు. మొత్తం గుజరాత్ సహకార రంగాన్ని ఆక్రమించారు. ఆర్థికంగా పిప్పి చేశారు. సహకార సంఘాలను రాజకీయ లబ్ధికి వాడుకున్నారు. పాల ధర పెంచారు. సంఘాల డబ్బు ఎన్నికలకు వాడారు. అవినీతికి పాల్పడి సంఘాల పనులను పెద్ద మొత్తాలకు గుత్తేదారులకు ఇచ్చారు. సహకార సంఘాలు దివాళాతీశాయి. రాజకీయ జోక్యం, కార్పొరేట్ల ప్రవేశంతో అమూల్ నష్టాల్లో నడుస్తోంది. బీజేపీ నాయకులు అమూల్ నిధులు వాడుకున్నారు. నష్టాల అమూల్‌ను ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్‌లలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ మంత్రిత్వశాఖ ఏర్పాటు ద్వారా దేశవ్యాపితంగా సహకార రంగాన్ని కబళించజూస్తున్నారు.
అదే జరిగితే వస్తుసేవల పన్నులాగా సహకార రంగ ఆదాయాలనూ కేంద్రం తీసుకుంటుంది. సహకార రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెపుతుంది. సహకార రంగంలో ప్రధానమైంది వ్యవసాయం. సహకార రంగాన్ని అడ్డుపెట్టుకొని కేంద్రం వ్యవసాయ నల్లచట్టాలను అమలుచేస్తుంది. ఉత్తర ప్రదేశ్ రైతులను తప్తిపర్చటానికి ఈ శాఖను వాడుకోవచ్చు. నల్ల చట్టాలతో నష్టపోయిన రైతులున్న పశ్చిమ యూపీలో 110 అసెంబ్లీ స్థానాలున్నాయి. సహకార సంస్థలను వాడుకొని ఈ చట్టాల వ్యతిరేకుల నోళ్ళు మూయించవచ్చు. మహారాష్ట్రలో సహకార రంగాన్ని వాడుకొని ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. సహకార రంగం బలంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలలో తారుమారు రాజకీయాలు నడపవచ్చు. మోడీ అస్తవ్యస్త పాలనలో ఆర్థికం కుదేలైంది. సహకార సంఘాలతో బూటక పరిష్కారం చూపవచ్చు. పోయిన ప్రతిష్టను పొందవచ్చు. స్థానిక, రాష్ట్రాల, 2024 సాధారణ ఎన్నికల్లో లబ్ధిపొందవచ్చు. ఈ గుజరాత్ నమూనాను మోడీ-షా జట్టు ఇప్పుడు మొత్తం దేశానికి అనువర్తించింది.
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మోడీ సర్కారుకు అవకాశాలను అందిస్తుంది. అది ప్రజలను మరింత పాతాళానికి తొక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు భయ, భ్రమ, భ్రాంతి, ప్రలోభాలతో మోడీ చర్యను ప్రతిఘటించలేదు. ప్రజా సంఘాలు, పౌర సమాజం ఎదిరించాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545