Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజులు, జమీందార్ల ఏలుబడిలో గుడులలో మహిళల జీవితాలు దుర్భరమైపోయాయి. ఆలయాల్లో ఆ దౌర్జన్యాలు కొన్ని శతాబ్దాలుగా కొనసాగాయి. ఒక మహిళపై అత్యాచారం చేసి ఊరు ఉమ్మడి వేశ్యగా మార్చాలి అని అనుకుంటే చాలు - పీడిత, శ్రామిక యువతిని జోగినిగానో, దేవదాసిగానో, మాతంగిగానో మార్చేవారు. ఇది ఆధిపత్య కులాల వారి దుర్మార్గం! జోగినిగా మార్చేసిన ఆమెను ఆలయ అర్చకుడి దగ్గరి నుండి ఆధిపత్య కులాల్లోని ప్రతి ఒక్కడి వరకూ లైంగికంగా వాడుకునే వారు. ఆ రొంపిలోకి దింపిన తర్వాత ఆమె బతికున్నంత కాలం అలా అత్యాచారాలకు గురి అవుతూ ఉండాల్సిందే - ఆమెను గుడికి సంబంధించిన దానిగా 'గుడిచేటి' అని అనేవారు. ఇది దేవుడి మీద భక్తి, ఆలయాల మీద గౌరవ భావం ఉన్నవారు చేసే పనేనా? సాలెగూడులో చిక్కుకున్నట్లు, ఆ జోగిని ఎటూ తప్పించుకోలేని స్థితిలో, దారుణమైన మానసిక వేదనను అనుభవిస్తూ ఉండేది. ఒక్కోసారి తినడానికి తిండిలేక ఇల్లిల్లు తిరిగి అడుక్కోవాల్సి వచ్చేది. ఇవి కాకుండా జోగినులు, మాతంగులు గ్రామంలో చెయ్యాల్సిన పనులు కూడా కొన్ని ఉండేవి. గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ ఇంటికి వెళ్ళి ఆహారమేదీ తీసుకోకుండా కేవలం కల్లుతాగుతూ నాట్యం చేయాలి. జనం విసిరే చిల్లర డబ్బులు ఏరుకోవాలి. ఒక్కోసారి ఆ డబ్బులు నుదురుతోనూ, కంటిరెప్పతోనూ పైకి తీయాలి. కల్లుసీసా నోటితో లేపాలి. ఎవరు ఎలా చేయమంటే అలా చేస్తూ వినోదం పంచాలి. గ్రామంలో ఏ జాతర జరిగినా, పండగ జరిగినా ఈ 'దేవాంగ'నే వీధుల్లో నాట్యం చేయాలి. ఏ కారణం వల్లనైనా కుదరదు అని చెపితే మళ్ళీ కుల పంచాయతీలలో శిక్షలు విధిస్తారు. అది మరింత ఘోరం!
ఈ దేవదాసీ వ్యవస్థను మనదేశంలో రకరకాల పేర్లతో వ్యవహరిస్తారు. కేరళలో 'మహారి' అని, అస్సాంలో 'న్నాటి' అని, మహారాష్ట్రలో 'మురళి' అని, తమిళనాడులో 'తెవర్డి యార్' అని పిలుస్తారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో 'బసివి' అని అంటారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 'తామమ్మ' అని లేదా 'మత్తామ్మ' అని కూడా పిలుస్తారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో 'పార్వతి' అని, నల్లగొండ ప్రాంతంలో 'ఏశకాంత' అని వ్యవహరిస్తారు. వేశ్యకాంత రూపం మార్చుకుని 'ఏశకాంత' అయి ఉంటుంది. ఇక తెలంగాణలోని నిజామాబాదు, అదిలాబాదు, మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 'జోగిని' అని పిలుస్తారు. పేర్లేమైనా పెత్తందార్లు వాళ్ళను ఉపయోగించుకునే తీరు ఒక్కటే. దేవుడి పేరుతో, గుడిపేరుతో జరిగిన, జరుగుతున్న దౌర్జన్యాలకు ఉదాహరణ ఇది. ఈ వ్యవస్థ గూర్చి తెలుసుకోవడమంటే ఎందరో అమాయక స్త్రీల నిలువెత్తు కన్నీటి గాథలను తెలుసుకోవడమే. బసవి, మాతంగి, దేవదాసి వ్యవస్థలు 1988లో రద్దయ్యాయి. ప్రముఖ నాస్తికుడు గోరా తనయుడు లవణం - ఆయన భార్య (గుర్రం జాషువా కూతురు) హేమలతలు చేసిన పోరాట ఫలితంగా ఈ వ్యవస్థలు అధికారికంగా రద్దయ్యాయి. అయినా కూడా అనధికారికంగా అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. (ఇంతెందుకూ? తెలంగాణ ప్రభుత్వమే మహంకాళి బోనాల సందర్భంగా మాతంగిని ఆహ్వానించి ఆమెతో భవిష్యవాణి చెప్పించడం జరుగుతూ ఉంది.) మానవ హక్కుల్ని కాలరాసే ఇలాంటి వ్యవస్థల గూర్చి న్యాయస్థానాలు ఎందుకు ఆలోచించవు?
ఒక ఆడపిల్లను జోగినిగా మార్చాలంటే ఒక చిన్నసాకు చాలు. పిల్లలు కలగడం లేదని, కలిగినా, పుట్టిన వెంటనే చనిపోతున్నారని.. లేదా ఇంట్లో వారికి ఏదో జబ్బు వచ్చిందని.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు. సందర్భం ఏమైనా కావొచ్చు. ఈ వ్యవస్థ మాత్రం మూఢ విశ్వాసంలోంచి మొలకెత్తిందే. మరో వైపు దైవార్పితం - అనే మరో అంధ విశ్వాసాన్ని బలపరుస్తూ, ఒక అమ్మాయిని ఊరికి ఉమ్మడి ఆస్థిగా పరిగణించడం! అమ్మాయి తల్లిదండ్రులు మనసులో ఎల్లమ్మ, పోచమ్మ వంటి దేవతల్ని తలుచుకుని, తమ కూతుర్ని జోగినిగా విడిచిపెడతారు. అలా ఆ దేవత పేరుమీద ముడుపులు కడతారు. మనకు ఉన్న వేల వేల మూఢ విశ్వాసాల్లో ఇదీ ఒకటి. ఆ తరువాత వారి జీవితాలు మెరుగుపడితే ఆ తల్లి కటాక్షమని సంతోషపడతారు. మెరుగు పడకపోతే ఆ తల్లి మనసు ఇంకా కరగలేదని ఓపిక పడతారు. అమ్మాయిని జోగినిగా మార్చే ఘట్టం చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మాయి వయసు ఐదు-ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లిదండ్రులు కుల పెద్దల సమక్షంలో తొలిఘట్టం పూర్తిచేస్తారు. పోతురాజు మంత్రాలు, డప్పుల మోతల మధ్య ఈ తంతు నిర్వహిస్తారు. అది అయిపోయ్యాక అమ్మాయి రజస్వల అయిన తర్వాత 'మైలపట్టం' అనే కార్యక్రమం ఉంటుంది. దీన్ని చాలా పెద్దఎత్తున నిర్వహిస్తారు. పోతురాజు సారథ్యంలో తోటి జోగిని స్త్రీల నాట్యాలతో, ఎల్లమ్మ, పోచమ్మ గుడిదగ్గర కార్యక్రమం నిర్వహిస్తారు. వీలుకాకపోతే అమ్మాయి ఇంటిదగ్గరే నిర్వహిస్తారు.
మైలపట్టం - అంటే అమ్మాయిని పసుపు, కుంకుమ పోసిన పట్టంలో కూర్చోబెట్టడం. మంత్రాలు చదువుతూ 'గావు పట్టి' - రక్తతర్పణం చేయడం. గావుపట్టి - అంటే మేకపోతు పీకను పోతురాజు తన పంటితో కొరికి చంపడం. ఆ రక్తతర్పణం భీభత్సంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఆ ఊరిపెద్దగానీ, పోతురాజు గానీ, ఆ అమ్మాయికి బావ వరుస అయిన వ్యక్తిగాని తాళి కడతారు. దానితో మైలపట్టం కార్యక్రమం పూర్తవుతుంది. ఇక అప్పటి నుండి ఊరి పెత్తందార్లు, భూస్వాములు ఆమెను లైంగికంగా వాడుకుంటూ ఉంటారు. యవ్వనంలో ఉన్నంత వరకే ఏ మాతంగి, ఏ దేవదాసి, ఏ జోగిని జీవితమైనా తిండికి లోటు లేకుండా జరుగుతుంది. యవ్వనం తరిగిపోవడంతో వారికి కష్టాలు ప్రారంభమవుతాయి. దగ్గరికి వచ్చే వాళ్ళుండరు. తిండిపెట్టే వాళ్ళూ ఉండరు.
ఆవు మాంసం తింటే ఆవు తల్లిలాంటిది - ''అమ్మను ఎలా కోసుకుని తింటావురా?'' అని అంటున్న వారు... మహిళల్ని జోగిని పేర దేవునికి ఇచ్చి పెండ్లి చేసి - దేవుడు తండ్రితో సమానం అని అంటున్నారు. నిజమే - దేవుడు తండ్రి అయితే ఆయనను పెండ్లి చేసుకున్న జోగిని తల్లి కాదా? అవుతుంది కదా? మరి ఆమె ఊరి పెత్తందార్ల ఉమ్మడి సోత్తు ఎలా అయ్యిందీ? మతం, రాజకీయం, ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళంతా తాము దేన్నయినా, ఎంతటి వారినైనా కొనేయగలమనీ, తాము చట్టాలకు అతీతులమని భ్రమ పడుతున్నారు. పాలకుల అండదండలు కూడా వారికి లభిస్తుండడంతో - ఈ మధ్యకాలంలో వారికి ధీమా పెరుగుతూ ఉంది. గుళ్ళలోకి లాక్కుపోయి అత్యాచారం చేస్తే విషయం బయటికి పొక్కదని కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. కొంత కాలం క్రితం ఆసిఫా విషయంలో అదే జరిగింది. ఆసిఫానే కాదు అలాంటి పసిపాపలపై అత్యాచారాలు చేసి, పాశవికంగా చంపేసిపోయే ''పవిత్ర భక్తులు'' పెరిగిపోతున్నారు. అంటే జరుగుతున్నదేమిటి? మనువాదం, పాలకుల అండదండలతో వేయి పడగలతో కాదు కోట్ల పడగలతో విస్తరిస్తోంది. ఆసిఫా ఒక ఉదాహరణ మాత్రమే. అలాంటి ఘోరాలు ప్రార్థనా స్థలాల్లో ఎన్నో జరుగుతున్నాయి. మీడియా ద్వారా బయటికొచ్చేవి అతిస్వల్పం. బయటికి రానివి కోకొల్లలు.
అన్ని మతాల మత పెద్దలు వారి వారి ప్రార్థనా స్థలాల్లో చేస్తున్న అత్యాచారాలు రోజువారి దినపత్రికల్లో, మీడియాలో చూస్తూనే ఉన్నాం. 2018 నవంబర్‌లో ఒక బాలికపై ముగ్గురు పాస్టర్లు అత్యాచారం చేశారు. మంగుళూరుకు చెందిన ఆ ముగ్గురు పాస్టర్లపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాస్టర్ల పేర్లనూ పత్రికలు ప్రచురించాయి. వారు జోషువా అమ్మన్, సెబాస్టియన్, బెన్నెట్ అమ్మన్ - ఇక నన్‌పై అత్యాచారం చేసి అరెస్టయిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ సంచలన వార్త సృష్టికర్తగా దేశంలో ప్రసిద్ధుడయ్యాడు. ఆంధ్రప్రదేశ్ - విజయవాడలో ప్రకాశ్‌నగర్‌లోని హరిహరక్షేత్రం పక్కన గల దేవాలయంలోని పూజారి - గుడికి వచ్చిన ఓ అమ్మాయిపై కన్నేశాడు. పూజ చేయిస్తానని మాయమాటలు చెప్పి పక్కగదిలోకి తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. దూరంలో ఉండి గమనిస్తున్న ఆ అమ్మాయి సోదరి విషయం గ్రహించి అల్లరి చేసింది. గుడికి వచ్చిన భక్తులందరి దృష్టి ఆగది మీద పడింది. విషయం అందరికీ తెలిసింది. భక్తులే పూజారికి బడితపూజ చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు రిజిష్టర్ చేయించారు.
ఇలా చిన్న చిన్న సంఘటనలకే జనం జీర్ణించుకోలేకపోతున్నారే - మరి మతం, దేవుడు, గుళ్ళ పేరుతో - మనుస్మృతి ఆసరాతో శతాబ్దాలుగా మహిళల్ని మనుషులుగా కూడా చూడని వ్యవస్థల్ని ఇంకా భరిస్తూ ఉండాలా? ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన పనిలేదా? చివరి దశలో అంతులేని సుఖవ్యాధులకు గురై మాతంగులు, జోగినిలు, దేవదాసీలు దుర్భమైన చావులు చావాల్సిందేనా? వారు చనిపోయినా కూడా వారికి పుట్టిన బిడ్డల పరిస్థితి కూడా అంతే కావాలా? ఊళ్ళో చిన్నా పెద్దా, పేదా ధనిక వర్గాల నన్నింటినీ కలుపుకు పోతూ, లైంగికంగా బలవుతూ బతికే ఇలాంటి జీవితాల గూర్చి ఏ ప్రభుత్వమూ ఎందుకు పట్టించుకోలేదూ? ఇందులో వారికి గొప్ప సోషలిజమేమైనా కనిపించిందా? ఇక్కడ మానవ హక్కులు ధ్వంసమయ్యాయి. జీవితాలు బుగ్గయిపోయాయి. నాగరిక ప్రపంచం మీద ఒక అనైతికత ఉమ్మేస్తోంది. నివారించాల్సింది పోయి అవే మూఢ విశ్వాసాల్ని పోత్సహిస్తాయా? సిగ్గుచేటే కాదూ? దేవుడి మహిమల గూర్చి, ఆలయాల పవిత్రత గూర్చి గొప్పలు చెప్పే మత పెద్దలు ఈ విషయం గూర్చి ఎన్నడూ ఎందుకు నోరెత్తరూ? ఒకవైపు ఆలయ వ్యవస్థ, మరోవైపు రాచరిక - భూస్వామ్య వ్యవస్థలు.. పేదల అంధవిశ్వాసాలు కలిసికట్టుగా పెంచి పోషించిన అధికారిక పడుపువృత్తిని నిరసించే పనిలేదా? బాధ్యత గల సామాజిక కార్యకర్తలు కొందరు నడుంబిగించి, దాని తీవ్రతను తగ్గించ గలిగారు కానీ, పూర్తి ఫలితాలు రాలేదన్నది వాస్తవం! భక్తిపేరుతో వంచించే వాళ్ళను కఠినంగా శిక్షించాలి!!
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు