Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థగా ఉన్న యునైటెడ్ ఇండియా కంపెనీని ప్రయివేటీకరించాలని తాజాగా నిటి ఆయోగ్ సంస్థ సిఫార్సు చేసినట్లు పత్రికలలో కథనాలు వస్తున్నాయి. ఈ సిఫార్సులకు అనుగుణంగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జిఐబిఎన్ఎ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఒక బిల్లు తీసుకు వస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 1938లో స్థాపించబడింది. 1972లో ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల జాతీయీకరణ తరువాత ప్రభుత్వం 107 సాధారణ బీమా కంపెనీలను జాతీయం చేసింది. అప్పటి నుండి యునైటెడ్ ఇండియా సంస్థ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. ఇప్పటికే రూ.27,930 కోట్ల పెట్టుబడులను, వందల కోట్ల రూపాయల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. గత ఏడాది రూ.17,000 కోట్ల ప్రీమియమ్‌ను సాధించింది. అటువంటి సంస్థ మీద ప్రభుత్వం దాడికి దిగింది. ఇప్పటికే, న్యూ ఇండియా బీమా సంస్థలో, జిఐసి రీ-ఇన్సూరెన్సు సంస్థలో ప్రభుత్వ వాటాలు అమ్మిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా యునైటెడ్ ఇండియా కంపెనీనే అమ్మేయాలని నిర్ణయించడం శోచనీయం.
నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలను విలీనం చేస్తే, అది ఎల్ఐసీ వలే ఒక అద్భుత సంస్థగా ఉంటుందని, కనుక ప్రభుత్వం ఆ పని చేయాలని నాటి బీజేపీ నాయకుడు విజరు కుమార్ మల్హోత్రా నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ 2001లోనే సిఫార్సు చేసింది. 20ఏండ్లు గడిచినా, ఆ సిఫార్సు అమలు కాలేదు, సరికదా ప్రభుత్వ సాధారణ బీమా సంస్థల అమ్మకానికి నిర్ణయాలు తీసుకోవడం గర్హనీయం.
చట్ట సవరణల పేరుతో లిస్టింగ్‌కు దూకుడు
ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన ఎల్ఐసీ చట్ట సవరణ బిల్లుపై గెజిట్‌ను కొన్ని రోజుల ముందు ప్రభుత్వం విడుదల చేసింది. స్టాక్ మార్కెట్‌కు అనుగుణంగా ఎల్ఐసీలో అంతర్గత మార్పులకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. వచ్చే మార్చి లోపు ఎలాగైనా ఎల్ఐసీలో పెట్టుబడులు ఉపసంహరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోంది. ఎల్ఐసీలో ఐపీవో నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ కారణంగా, ఎల్ఐసీకి ఉన్న ప్రభుత్వ గ్యారెంటీ కొనసాగుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఎల్ఐసీ జాతీయీకరణ ముందు... ప్రయివేట్ బీమా కంపెనీల అక్రమాలను చూసి... ప్రభుత్వం ఎల్ఐసీ పాలసీలకు ప్రభుత్వ గ్యారెంటీ మంజూరు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో పాలసీదారులు దాచుకున్న మొత్తాలకు, బోనస్‌లకు కేంద్ర ప్రభుత్వం అదనంగా గ్యారంటీ ఇస్తుంది. 1956లో ఈ సెక్షన్ 37ను ఎల్ఐసీ చట్టంలో పొందు పరిచినా, ఇంతవరకూ ఎల్ఐసీ ఈ గ్యారెంటీని ఉపయోగించుకోలేదు. దేశంలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అన్ని నిబంధనలు సడలించి పాలసీదారుల క్లెయిములను, ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం లేకుండానే, పరిష్కరించింది. కర్ణుడి కవచ కుండలాలుగా సెక్షన్ 37 ఎల్ఐసీ అమ్ముల పొదిలో ఉంది తప్ప దానిని ఉపయోగించిన సందర్భం ఇంతవరకు లేదు.
స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు సంభవించిన ప్రతి సందర్భంలోనూ ఎల్ఐసీనే మార్కెట్లను ఆదుకున్నది. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో పెట్టిన 100కోట్ల ఈక్విటీ పెట్టుబడిపై 1956 నుంచి ఇప్పటివరకు డివిడెండ్ రూపంలో రూ.26,005 కోట్లను చెల్లించింది. 2019-20 సంవత్సరానికి రూ.2,697 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందించనుంది. పన్నుల రూపంలో ఏటా పది వేల కోట్ల పైబడి చెల్లిస్తున్నది.
లిస్టింగ్ వల్ల కంపెనీలలో ఆర్థిక క్రమశిక్షణ పెరిగేలా ఉంటే, సెబీ కనుసన్నల్లో ఉన్న లిస్టింగ్ కంపెనీలు ఎందుకు విఫలం అవుతున్నాయి? చైనా లైఫ్‌తో సహా, ప్రపంచంలో ఏ ప్రభుత్వ రంగ బీమా సంస్థ కూడా ప్రయివేటు, బహుళ జాతి బీమా కంపెనీలతో పోటీ పడి 50శాతం మార్కెట్ వాటాను సైతం నిలబెట్టుకోలేక పోయాయి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఎల్ఐసీ 23 ప్రయివేటు బీమా కంపెనీల పోటీని ఎదుర్కొంటూ 67శాతానికి పైగా మార్కెట్ షేర్‌తో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది.
లాభనష్టాలతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తతంగా బీమా సేవలను ఎల్ఐసీ అందిస్తోంది. 2547 కార్యాలయాలను (52.1శాతం) 50,000 కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎల్ఐసీ నెలకొల్పింది. 23 ప్రయివేట్ బీమా కంపెనీల 77.1శాతం కార్యాలయాలు మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోనే నెలకొల్పబడ్డాయి. ఎల్ఐసీ ఐ.పి.ఓ.కు తహతహ లాడుతున్న ప్రభుత్వం, ఐఆర్‌డిఎ నిర్దేశించిన నియమాలకు విరుద్ధంగా ప్రయివేట్ కంపెనీలు వ్యవహరిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోదు?
ఎల్ఐసీని తెల్ల ఏనుగుగా గతంలో అభివర్ణించిన కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థలు, నేడు ఎల్ఐసీ మార్కెట్ ప్రదర్శనను పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. ఎల్ఐసీ చాలా బాగా పని చేస్తోంది గాబట్టి స్టాక్మార్కెట్లో లిస్టింగ్ చేస్తే, ఇంకా బాగా ప్రదర్శన చేస్తుందనేది వారి వాదన. దీనికి అనుగుణంగానే వారు ఎల్ఐసీ ఆస్తులకు, పెట్టుబడులకు ప్రచారం కల్పిస్తున్నారు. వారి ఎత్తుగడలను మనం అర్ధం చేసుకోవాలి. ఎల్ఐసీని స్థాపించి డైమండ్ జూబ్లీ పూర్తయిన సందర్భంలో (2016లో) అప్పటి ఆర్థికమంత్రి, అరుణ్ జైట్లీ ఎల్ఐసీ ఒక తిరుగులేని ఆర్థిక సంస్థ అని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తే ఎల్ఐసీ విలువ ఇంకా పెరుగుతుందని అనడం ఈ కోవలోనిదే!
అమెరికాలోని బీమా కంపెనీలను సర్వే చేసే ఎ.ఎమ్ ఏజెన్సీ దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు బయట పెట్టింది. అమెరికన్ బీమా కంపెనీలు అధిక లాభాపేక్షతో తమ 34శాతం పెట్టుబడులను కార్పొరేట్ డెబిట్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాయి. నేడు ఆ ఫండ్ల రేటింగ్ 'జంక్'గా తేలింది. అంటే, ఆ కంపెనీలు పెద్దఎత్తున దివాళా తీసే పరిస్థితి దాపురించింది.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలు చూసైనా, ఎల్ఐసీని లిస్టింగ్ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి. ఎల్ఐసీని 100శాతం ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని చేస్తున్న పోరాట ముఖ్య ఉద్దేశ్యం-ప్రజల సొమ్ము ప్రజల సంక్షేమం కోసం వినియోగించబడాలనే. ఎల్ఐసీ పెట్టుబడులు 130 కోట్ల మందికి ఉపయోగపడాలి తప్ప, 3 శాతంగా ఉన్న సంస్థాగత మదుపుదారులకు కాదు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ పెట్టుబడులపై ఎల్ఐసీ ఆర్జించిన లాభం సుమారు రూ.30,000 కోట్లు కాగా, 2020-21లో అది 47శాతం పెరిగి రూ.44,530 కోట్లు అవడం ఎల్ఐసీ దూరదృష్టికి, దార్శనికతకు అద్దం పడుతుంది. 31.3.2020 నాటికి ఎల్ఐసీ నికర నిరర్ధక ఆస్తులు 0.79 శాతం కాగా, 31.3.2021 నాటికి అది కేవలం 0.05శాతానికి చేరుకుంది. ఇంతకంటే సమర్థవంతంగా ఏ సంస్థ అయినా పని చేయగలదా? ఒకపక్క ఆత్మనిర్భర భారత్ అంటూ, దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించే ప్రభుత్వ బీమా రంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలు తీసుకోవడం సహేతుకం కాదు.
యునైటెడ్ ఇండియా ప్రయివేటీకరణ ప్రయత్నాలను, ఎల్ఐసీ లిస్టింగ్ ప్రతిపాదనలను ప్రభుత్వం విడనాడాలని, బీమా ప్రీమియంపై భారంగా మారిన జీఎస్టీని తొలగించాలని ఇప్పటికే ప్రభుత్వ బీమా రంగ సంస్థల ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. విశాల జన హితం కోసం, దేశ ఆర్థిక స్వావలంబన కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి దేశభక్తులైన ప్రజానీకం మద్దతు పలకాలి.
- పి. సతీష్
సెల్ : 9441797900