Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుప్రీంకోర్టు బరిగీసింది. రాజద్రోహ చట్టం ఇంకా అవసరమా..? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎవరు ఎటు పక్కో తేల్చుకోమని చెప్పింది. స్వపరిపాలనలో వలస పాలన చట్టం మనకెందుకని సూటిగానే అడిగింది. ప్రజల కోసం కొత్తచట్టాలు చేయడమే కాదు, దుర్మార్గ చట్టాలను ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించింది.
ఇప్పుడిది పాలకపక్షాలకే వర్తించదు. ప్రతిపక్షాలతో సహా రాజకీయ పక్షాలన్నింటికీ వర్తిస్తుంది. అధికారంలో లేనప్పుడు ప్రజా ఉద్యమాలపై ప్రేమ ఉన్నట్టు నటించడం, పైపైన ఉద్యమాలతో మమేకం కావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయడం కండ్లముందు నడుస్తున్న చరిత్ర. ఈ చరిత్రను తిరిగి రాయాల్సిన సమయం ఆసన్నమయింది.
ఆ 'ఉక్కుపాదంగా' భావించే రాజద్రోహ నేర చట్టం - 124ఎ ను ఎందుకు తొలగించకూడదనేదే సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్న. కాగా తాజాగా హర్యానా ప్రభుత్వం ఇదే చట్టం కింద వందమంది రైతు ఉద్యమ కార్యకర్తలపై నేరం మోపింది. ఉద్యమకారులందరూ రాజద్రోహులైతే ప్రజా ఉద్యమాలకు మనుగడ ఎక్కడీ ప్రజా ఉద్యమాలకు మనుగడ లేనప్పుడు ప్రజాస్వామ్యానికి ఉనికి ఎక్కడ..? అందువల్ల ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన తక్షణ కర్తవ్యం తోసుకు వచ్చింది. మీనమేషాలకు సన్నాయి నొక్కులకు తావివ్వక ప్రజాచైతన్యానికి నడుం కట్టాల్సిన సందర్భం ఇదని రాజకీయ విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు.
పెల్లుబుకుతున్న రైతాంగ ఉద్యమాల పట్ల ఇంకా చాలా రాజకీయ పక్షాలు ఉదాసీనంగా ఉండటం, సంకుచిత స్వార్థ ప్రయోజనాలతో మిన్నకుండా ఉండటం భావ్యం కాదని, అంతిమంగా అది నిరంకుశ శక్తులకే లాభిస్తుందని పేర్కొంటున్నారు.
రాజద్రోహం నేర చట్టం 124ఎ - రాజ్యాంగ బద్దతను సవాలు చేస్తూ ఎడిటర్స్ గిల్డ్, విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ ఒంబేట్కరే కేసు దాఖలు చేసారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతో పాటు జస్టిస్ బోపన్న, జస్టిస్ హృషికేష్రారుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 'స్వాతంత్రోద్యమంలో మహాత్మాగాంధీ, తిలక్, గోఖలే వంటి జాతీయోద్యమ నాయకుల గొంతు నొక్కేందుకు బ్రిటిష్ వలస ప్రభుత్వం ఈ క్రూర చట్టాన్ని ప్రయోగించింది. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా దీని అవసరం, ప్రాసంగిత ఉన్నదా..?
అవసరానికి చిన్న కలప దుంగను కోసుకునేందుకు రంపమిస్తే.. అడివంతా నరికేలా ఈ చట్టాన్ని వాడుతున్నారు. రాజకీయ వైషమ్యాల కారణంగా ఈ చట్టం దుర్వినియోగమవుతున్నది. అలాగే ప్రత్యర్థుల, భిన్నాభిప్రాయాల గొంతు నొక్కేందుకే ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. మోడీ ప్రభుత్వానికి కాలం చెల్లిన చట్టాలను రద్దుచేసిన చరిత్ర ఉన్నది. మరి దీనిమీద ఎందుకు శ్రద్ధ పెట్టలేదు. మేము ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. కార్యనిరన్వాహక వ్యవస్థ ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తుంది అని మాత్రమే వ్యాఖ్యానిస్తున్నామని, నిశితంగా పరిశీలించి చూస్తే ఈ రాజద్రోహం కేసుల్లో శిక్షపడిన సందర్భాలు బహుస్వల్పం అని ధర్మాసనం తెలిపింది. పిచ్చోని చేతిలో రాయిలా, చివరకు పేకాట ఆడేవారిపై కూడా ఈ చట్టాన్ని ప్రయోగించడం, కేసులో ఇరికించిన వారికి బెయిలు రాకుండా బెదిరించడం చట్టపాలనను చులకన చేయడం కాదా..? అని ప్రశ్నించింది.
ఇది ఇలా ఉండగా హర్యానా రాష్ట్రంలోని సిర్సాజిల్లాలో ఈనెల 11న రైతులు కేంద్రం ప్రవేశపెట్టిన నల్ల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేసారు. ఆ ఆందోళనా ప్రదర్శనలో హింస చెలరేగిందనే నెపంతో ఈ చట్టం కింద వందమంది రైతులపై రాజద్రోహం కేసు మోపారు. రాజద్రోహం సెక్షన్ 124 ఎ దుర్వినియోగం అయిందని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమేమున్నదని స్వరాజ్ ఇండియా సంస్థ సారధి యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాల కోసం దాఖలు చేసిన పిటిషన్లు ఆమోదించడమే కాకుండా, మానవ హక్కులకు న్యాయ సూత్రాలకు సరైన అర్థం ఇవ్వడంలో ధర్మాసనం ఎప్పుడు కీలకంగా వ్యవహరిస్తుందో... ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ నియమాలను సృజనాత్మకంగా వివరించి మానవ హక్కులను నిలబెట్టడంలో అరుదైన విశిష్టస్థానం అప్పుడు పొందగలుగుతుంది.
నిస్సారంగా కాగితాలమీద రాసి ఉన్న హక్కులకు సజీవ చేవను ఇవ్వడానికి లేదా ఉద్యమ చైతన్యాన్ని ముందుకు నడిపించడానికి ఈ వ్యాఖ్యలు తోడ్పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 'అన్యాయంగా ఎవరినైనా ఖైదు చేసే ప్రభుత్వ పాలనలో న్యాయవంతునికి నిజమైన స్థానం ఖైదే' అన్న తత్వవేత్త ధోరో మాటలు సంపూర్ణ నిజం కాకముందే మేల్కోవడం మంచిది కదా..!
- కె శాంతరావు
సెల్: 9959745723