Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివే విద్యార్థుల కోసం రచించిన చరిత్ర కొత్త సిలబస్ 'పాత సీసాలో పాత సారా' లాగా ఉంది. ప్రాచీన భారతదేశ చరిత్రను శ్లాఘిస్తూ, మొగలులను దురాక్రమణ దారులుగా పేర్కొంటూ, చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ కాలాలుగా ఒక సరళమైన, తప్పుడు వర్గీకరణ చేశారు.
'పునరుద్ధరణ సమతుల్యతను' 'చరిత్రను', మార్క్సిస్ట్ చరిత్రకారులుగా భావించబడుతున్న వారి అదుపు నుంచి పూర్తిగా తప్పించే లక్ష్యంతోనే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెపుతున్నప్పటికీ, జేమ్స్ మిల్ ప్రతిపాదించిన చరిత్ర వలస విభజన పునరుద్ఘాటన ఇది. మొదట చరిత్రను మార్చే ప్రయత్నంలో భాగంగా 1977లో, 1999లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి, భారతీయీకరణ ముసుగులో చరిత్రను కాషాయీకరణ చేయడానికి చేసిన ప్రయత్నాల మార్గంలోనే ఈ ప్రస్తుత రచన కూడా కొనసాగుతుంది. ఎన్సీఈఆర్టీ ద్వారా పాఠశాల స్థాయిలో మార్పులు చేయాలని అప్పుడు జోషీ ప్రయత్నించాడు. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల స్థాయి సిలబస్‌లో మార్పులు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొత్త రచనలను తన వెబ్‌సైట్‌కు పరిమితం చేస్తూ ప్రచారంలో పెట్టిన యూజీసీ, కొత్త సిలబస్‌ను ఎప్పుడు, ఎలా అమలు చేయాలనే విషయంపై మాత్రం మౌనంగా ఉంటుంది. అయినా విద్యావిషయక సమూహం (ఎకడమిక్ కమ్యూనిటీ) గాలి ఎటువైపు వీస్తుందనే విషయాన్ని చాలా తొందరగా అర్థం చేసుకుంటుంది. కొత్త సిలబస్ తగినంత స్థలాన్ని, సామర్థ్యాన్ని ప్రాచీన భారతదేశానికే కేటాయించింది. ఆర్యులు మన దేశీయ మూలాలకు చెందిన వారే అనే విషయాన్ని ఈ సిలబస్ పదే పదే పునరుద్ఘాటిస్తుంది. అన్ని విధాలా కీర్తీ, గౌరవం, ఆర్థికాభివృద్ధి, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది, శాశ్వతమైన శాంతి సౌఖ్యాలతో ప్రాచీన భారతం విలసిల్లినట్లు పేర్కొంటుంది. గుప్త సామ్రాజ్యాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణ యుగమని గొప్పగా పేర్కొన్నారు. కానీ ప్రాచీన చరిత్రకు సంబంధించిన అంశాలలో అపారమైన అనుభవం ఉన్న డీ.ఎన్.ఝా, భారతదేశ చరిత్రలో అసలు ఒక స్వర్ణ యుగం అనేదే లేదనే విషయాన్ని తెలిపాడు.
బాబర్, ఆయన వారసులు చేసిన శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఎర్రకోట, తాజ్ మహల్ లాంటి అద్భుతమైన నిర్మాణాల సృష్టిని, చేసిన సేవలను గుర్తించకుండా మధ్య యుగాల భారతదేశ చరిత్రకు ఉన్న ప్రాముఖ్యతను తక్కువ చేసి చూశారు. ఈ కొత్త సిలబస్‌లో, ఆర్.ఎస్.శర్మ, ఇర్ఫాన్ హబీబ్ లాంటి ప్రఖ్యాతి గాంచిన చరిత్రకారుల రచనలను విద్యార్థులు అనుసరించే జాబితా నుండి తొలగించారు. కొన్ని తరాలుగా విద్యార్థులు ప్రథమ వాచకంగా ఉపయోగించుకుంటున్న ప్రొ.రొమిల్లా థాపర్ రచించిన ప్రాచీన భారతదేశ చరిత్రను కేవలం రెండు పుస్తకాలకే పరిమితం చేశారు. మార్క్సిస్ట్ భావాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని భావించబడుతున్న ఈ చరిత్రకారులు తరచుగా పాలక వర్గాల ఆగ్రహానికి గురవుతున్నారు. ఢిల్లీకి చెందిన చరిత్రకారుల సమూహం గతంలో 'కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద హిస్టరీ టెక్స్ట్ బుక్స్ కాంట్రవర్సీ' అనే రచనతో ముందుకొచ్చింది. దీని రచయితలుగా ఉన్న బిపిన్ చంద్ర, ఇర్ఫాన్ హబీబ్, రొమిల్లా థాపర్, అర్జున్ దేవ్, మృదులా ముఖర్జీ, ఆదిత్యా ముఖర్జీ, సుమిత్ సర్కార్లు భారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వాదనలను ముందు పెట్టారు.
''చరిత్ర గురించి మతతత్వంతో చేస్తున్న వ్యాఖ్యానాలు, భారత దేశంలో ప్రధానమైన మతతత్వ భావజాలాన్ని ఏర్పరుస్తాయి. శాస్త్రీయ, లౌకిక చరిత్రపైన బీజేపీ నిరంతరం ఎందుకు దాడిని తీవ్రం చేస్తుంది? ఎందుకు చరిత్ర రచనలు ఒక్కసారిగా మతతత్వ, లౌకిక రాజకీయ భావజాల శక్తుల మధ్య యుద్ధభూమిగా మారాయి? 1930, 40 దశకాలలో ముస్లిం మతతత్వ వాదులు ద్విజాతి సిద్ధాంతాన్ని (వారు మైనారిటీగా ఉన్న వారిపైన మెజారిటీ మతస్థులు ఆధిపత్యం చెలాయిస్తారనే భయంపై ఆధారపడినప్పటికీ) ధృవీకరించుకునేందుకు చరిత్రను ఉపయోగించుకున్నారు. కానీ హిందూ మతతత్వవాదులు ఈ విషయంలో ఒక ప్రతికూలతతో బాధపడ్డారు. 1947కు ముందు జనాభాలో సుమారు 70శాతంగా, 1947 తరువాత 80శాతానికి పైగా ఉన్న హిందువులు, ముస్లింల చేత అణచివేయబడతారని ఎలా భయపడతారు? లేదా ముస్లింల నుండి వారికి ఎలా ముప్పు ఏర్పడుతుంది? దీనికి సమాధానం, చరిత్రకు సంబంధించని, మతతత్వంతో కూడిన మధ్య యుగాల చరిత్ర వర్ణనలో దొరికింది, ఇప్పుడు దొరుకుతుందని'' అప్పుడు బిపిన్ చంద్ర తెలిపాడు. ఆయన మాటలకు నేటికీ ప్రాసంగికత ఉంది.
ఈ ''మతతత్వ'' వర్ణనను ప్రశ్నించేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా దౌర్జన్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు, అమెరికాకు చెందిన చరిత్రకారిణి ఆడ్రీ ట్రష్కీ, మొగల్ చక్రవర్తి ఔరంగజేబును దేవాలయాలను నాశనం చేసిన వ్యక్తిగా, లేదా ఇస్లామిక్ క్రూరపాలకునిగా కన్నా కొన్ని ప్రత్యేకతలున్న వ్యక్తిగా చూపించినందుకు, ఆమెను అవమానించారు. ఔరంగజేబు దేవాలయాలకు నిధులు, హిందువులకు ఉద్యోగాలు ఇచ్చిన విషయాలను ఆమె ఉదహరించినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. అదేవిధంగా రాజేంద్ర చోళుడు దేవాలయాలను దోచుకొని, దాడులు చేసిన విషయాలను ఆమె గుర్తు చేసినప్పుడు, విద్యావిషయక బృందాలకు అవతల ఉన్న కొందరు వాటిని అంగీకరించారు.
ప్రస్తుతం సిలబస్‌లో చేస్తున్న మార్పుల్లో భాగంగా మార్క్సిస్ట్ భావజాలంతో ఉన్నారని భావించబడుతున్న చరిత్రకారుల తొలగింపుపై కేంద్రీకరిస్తున్నారు. అనేక మంది ప్రముఖ చరిత్రకారుల అభిప్రాయాలు అందరికీ తెలిసినవే, అసలు తెలియని వాస్తవం ఏమిటంటే, వారిని బలవంతంగా ఎవరూ ఏమీ ఒప్పించలేదు, అలా అని వారంతట వారు వచ్చినవారు కూడా కాదు. 1960లలో పాఠ్య పుస్తకాలను రచించే బాధ్యతను ప్రొ.బిపిన్ చంద్ర, ప్రొ.రొమిల్లా థాపర్లకు అప్పజెప్పిన 'ఆల్ ఇండియా ప్యానల్ ఫర్ హిస్టరీ'లో ప్రఖ్యాత చరిత్రకారులైన మహమ్మద్ హబీబ్, నీలకంఠ శాస్త్రి, తారాచంద్, సర్వేపల్లి గోపాల్ లాంటి వారంతా సభ్యులుగా ఉన్నారు. మార్క్సిస్ట్ భావజాల చరిత్రకారులు కానటువంటి వీరంతా మెరిట్ ఆధారంగానే ఎంపికయ్యారు. ''వారు ఇతరులను మెకాలే పిల్లలు అని అంటున్నప్పటికీ, వారే భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ కాలాలుగా విభజించిన జేమ్స్ మిల్కు ప్రత్యక్ష వారసులు. మధ్య యుగాలలో హిందువులు, ముస్లింల క్రూర పాలనలో అనేక బాధలు అనుభవించారనే భావన కూడా వలస పాలకుల కట్టుకథే, ఎందుకంటే ఆ క్రూర పాలన నుంచి హిందువులను బ్రిటిష్ పాలకులు విముక్తి చేశారనే విషయాన్ని బాగా ప్రచారంలో ఉంచారు. ఆ తరువాత హిందూ, ముస్లిం సమాజాలు రెండు ఎప్పుడూ యుద్ధాల్లో మునిగిపోతున్నాయనే ప్రచారం కూడా భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన అవసరమే అన్న సమర్థనను సృష్టించారు. ఈ చరిత్ర యొక్క మతతత్వ వ్యాఖ్యానాలు వలసవాదుల వ్యాఖ్యానాలపై ఆధారపడి చేశారని'' మృదులా ముఖర్జీ అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, మదులా ముఖర్జీ, ఇతరులతో, ఎవ్వరూ కొత్త రచనలకు సంబంధించిన విషయాల గురించి సంప్రదించలేదు. ''కొత్త సిలబస్ అనేది, 1999లో మురళీ మనోహర్ జోషి చేసిన ప్రయత్నానికి కొనసాగింపేనని, ఈ సిలబస్ యొక్క లక్ష్యం ఏమిటో కూడా మాకు తెలియదు, దానిని యూనివర్సిటీలకు పంపిస్తారా? దానిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని చెపుతారా? అనే విషయం కూడా తెలియదు. పూర్తిగా ఇక్కడ పారదర్శకత లోపించింది. యూజీసీ ఈ సిలబస్‌ను తన వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని'' మృదులా ముఖర్జీ అన్నారు.
''1970లో కూడా ప్రొ.హబీబ్ రచనలను పాఠ్యాంశాల జాబితా నుండి తొలగించారు. 1999లో మార్క్సిస్ట్ చరిత్ర కారులుగా పిలువబడుతున్న వారి పాత్ర మసకబారింది. ఆ సమయంలో ప్రఖ్యాత చరిత్రకారుల రచనలను చదవకుండా నిరోధించడం వలన అనేక మంది విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విద్యార్థులు, సూచించిన పుస్తకాల జాబితాను అనుసరించరు. వారికి ఆన్లైన్ తరగతులు, ఈ-బుక్స్‌లోకి ప్రవేశం ఉంటుంది. ''విద్యార్థులకు ప్రచురించిన పుస్తకాలపై ఆసక్తి ఉండదు, వారికి ఈ-బుక్స్, పీడీఎఫ్‌లు, ఆన్లైన్ లెక్చర్లు ఉంటాయి. ప్రభుత్వం ఏమి చేయాలని ప్రయత్నిస్తుంది? ఇది మూర్ఖపు సాహసం అనిపిస్తుంది. ఏ ఒక్కరూ ఒక ఆలోచనను నిలువరించలేరని'' ప్రొ.ముఖర్జీ అన్నారు.
మరోవైపు విద్యావేత్తలు ఏ పనీ లేకుండా ఊరికే కూర్చోవడం లేదు. కేరళ హిస్టరీ కాంగ్రెస్ కొత్త సిలబస్‌ను ఖండిస్తూ, ఇది ''చరిత్రను కాషాయీకరించే ప్రయత్నం'' అని అభిప్రాయపడింది.
''యూజీసీ చరిత్ర చిత్తుప్రతి పీఠికలో, దాని లక్ష్యాలు, భారతదేశ చరిత్ర యొక్క స్థూల, సూక్ష్మ అంశాలపై పూర్తి దృష్టితో, చారిత్రక విధానాలు, చరిత్ర రచనా ఒప్పందాల పట్ల నిష్కపటతను కలిగి ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం ప్రజల, సామాజిక రూపకల్పనల విమర్శనాత్మక చరిత్రలను మినహాయించే ప్రయత్నాలు అంతిమ దశకు చేరుకోవడంతో ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని'' కేరళ హిస్టరీ కాంగ్రెస్ పేర్కొంది.
ఇరవై సంవత్సరాల క్రితం ఇర్ఫాన్ హబీబ్, 'వన్ ఇండియా, వన్ పీపుల్' కోసం రాసిన మాటలు నేటికీ ఆమోదయోగ్యమైనవే. ''కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సంఫ్ుపరివార్లు ముందుకు తీసుకొని వస్తున్న భారతదేశ చరిత్ర, గతంలో ఉన్న ప్రముఖ చరిత్రకారులు, ప్రస్తుత వృత్తిపరమైన ప్రముఖ చరిత్రకారులు చెపుతున్న చరిత్రకు చాలా భిన్న మైనదనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మితవాద చరిత్ర కారులు, వామపక్ష చరిత్రకారులపై పైచేయి సాధించేందుకు వారికి అధికారిక వనరులను కల్పించడం వలన, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన యూజీసీ, ఎన్ఎన్సీ ఈఆర్టీ, ఐసీహెచ్ఆర్లు భారతదేశ చరిత్రను గుర్తించి, అది భారతీయ చరిత్రకారుల మధ్య జరిగే ముఖ్యమైన విద్యావిషయక ధోరణులకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పడం అసంబద్ధమని'' ఇర్ఫాన్ హబీబ్ అభిప్రాయపడ్డాడు.
'ఫ్రంట్ లైన్' సౌజన్యంతో
అనువాదం:బోడపట్ల రవీందర్,
- జియా ఉస్సలామ్
సెల్:9848412451