Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారీ దేశాలకు, సోషలిస్టు దేశాలకు మధ్యనున్న మౌలికమైన వ్యత్యాసాన్ని కరోనా మహమ్మారి బట్టబయలు చేసింది. భౌగోళికంగా కొన్ని ప్రత్యేకతలు సంతరించుకొన్న, జనసాంద్రత అత్యంత పల్చగా ఉన్న కారణంగా న్యూజిలాండ్ లాంటి అతికొద్ది దేశాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయగల్గినా బ్రిటన్, బెల్జియం, ఇటలీ, అమెరికా లాంటి దేశాలు మహమ్మారి ఉధృతానికి ఎలా విలవిల్లాడాయో ప్రపంచానుభవం ద్వారా మనం గ్రహించాం. నిజానికి అత్యంత అభివృద్ధి చెందిన ధనికదేశాలు తమ వద్ద ఉన్న అపార ధన సంపదతో, ఆధునిక వైద్య ఆరోగ్య వ్యవస్థ సాయంతో, సైన్సు, టెక్నాలజీతో మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యావత్ ప్రపంచం ఆశించింది. కానీ అలా జరుగలేదు. మరో పక్క కరోనా ఎక్కడైతే పుట్టిందని భావిస్తున్నారో ఆ చైనాలోనే చేపట్టిన పటిష్టమైన చర్యలతో మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయగలిగారన్న వార్తలు మనం విన్నాం. క్యూబా, వియత్నాం లాంటి దేశాలు కూడా ఈ వరుసలోనే నిలుస్తాయి.
ప్రజల భాగస్వామ్యంతో వారి బాగోగులు చూసుకుంటూ కొన్ని సామాజిక చర్యలు చేపట్టడం ద్వారా, ప్రజలకు మొదటి నుండే మంచి వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించడం ద్వారా, కొత్త సౌకర్యాలు యుద్ధప్రాతిపదికన చేపట్టడం ద్వారా ఈ దేశాలకు కరోనా కట్టడి సాధ్యమయింది. మొదటి నుంచీ కరోనాకట్టడి చేయడంలో సమర్థవంతంగా వ్యవహరించలేని ధనిక, పెట్టుబడిదారీ దేశాలు కరోనా కట్టడికి వ్యాక్సిన్లు ఒక్కటే పరిష్కార మార్గమని భావించి ఆ దిశగా కృషి చేసి విజయం సాధించాయి. అయితే తాము సాధించిన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణను ప్రపంచ మానవాళికంతటికీ అందించకుండా అవరోధాలు కల్పిస్తూండటం చూస్తున్నాం. మరోవైపు చైనా, క్యూబా లాంటి దేశాలు తమకున్న విజ్ఞాన శాస్త్ర వనరులతో పరిశోధన ద్వారా కోవిడ్-19 కట్టడికి సమర్థవంతమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడమే కాక ప్రపంచ మానవాళికంతటికీ అందించడానికి సిద్ధపడ్తున్నాయి.
అభివృద్ధి చెందిన హైటెక్ ఫార్మా, బయోటెక్నాలజీ పరిశ్రమని ప్రభుత్వ నిధులతోనే ప్రోత్సహించిన ధనిక దేశాలు కోవిడ్-19 వ్యాక్సిన్‌ని తయారుచేయడంలో కృతకృత్యులయినాయి. ఆధునికమైన ఎమ్.ఆర్.ఎన్.ఎ. టెక్నాలజీ ద్వారా తయారైన ఈ వ్యాక్సిన్లు సూత్రరీత్యా ఏవిధమైన ఉత్పరివర్తనాలనైనా సమర్థవంతంగా లొంగదీస్తాయని, ఇటువంటి టెక్నాలజీ భవిష్యత్తులో సార్వత్రిక ఫ్లూ వ్యాక్సిన్, హెచ్.ఐ.వి. వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా బాటలు వేస్తుందని చెప్తున్నారు. సాంప్రదాయ వ్యాక్సిన్ తయారికి లైవ్ వైరస్‌లను ఉపయోగిస్తారు. కాబట్టి అత్యంత భద్రతతో కూడిన బయోసేఫ్టీ లాబ్ (బి.యస్.ఎల్) ఉపయోగించవలసి ఉంటుంది. యమ్.ఆర్.యన్.ఎ. టెక్నాలజీ దీనికి భిన్నంగా ఉండి వ్యాక్సిన్లను తేలికగా, త్వరగా ఉత్పత్తి చేయవచ్చనీ టెక్నాలజీ బదిలీకి 4 నుండి 5 నెలల సమయం మాత్రమే సరిపోతుందని మోడర్నా కంపెనీ మాజీ డైరెక్టరు సుహైబ్సద్ధికి తెలియచేసారు. అంతేకాక ఎమ్.ఆర్.ఎన్.ఎ వ్యాక్సిన్ల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిపిడ్ నానోపార్టికల్స్ అనే పదార్థాన్ని తయారు చేసే టెక్నాలజీ జర్మనీకి చెందిన 'మెర్క్', కెనడా దేశానికి చెందిన ఎక్యూటస్ అనే రెండు కంపెనీలకు మాత్రమే ఉంది. కానీ పెట్టుబడీ దారీ ఉత్పత్తి సంబంధాలకి అత్యధిక లాభార్జనే పరమావధి కాబట్టి, మానవ అవసరాలకంటే లాభాలే ముఖ్యం కాబట్టి మేధో సంపత్తి హక్కుల పేరిట, పేటెంట్ల పేరిట వ్యాక్సిన్ టెక్నాలజీని దానికి సంబంధించిన విజ్ఞానాన్ని బదిలీ చేయడానికి తీవ్ర అవరోధాలు కల్పిస్తున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ వాడకం తదితరాల వలన ఏమన్నా సమస్యలు, తద్వారా ఉత్పన్నమయ్యే న్యాయపరమైన వివాదాల ఖర్చులన్నీ సదరు ప్రభాత్వాలే భరించాలనీ అందుకు అర్జంటీనా, బ్రెజిల్ తదితర ప్రభుత్వాలు తమ దేశ మిలటరీ స్థావరాలను, ఎంబసీ భవనాలను తనఖా పెట్టాల్సిందిగా ఫైజర్ కంపెనీ ఒత్తిడి తెచ్చినట్లుగా వార్తలొచ్చాయి. ఈ విధంగా సామ్రాజ్యవాదం తన యొక్క మిలటరీ శక్తితోనే కాక తమ దేశాలకు చెందిన కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తదితర ప్రాణరక్షక టెక్నాలజీతో కూడ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని శాసిస్తోంది.
మరోపక్క దశాబ్దాలుగా అమెరికా విధించిన ఆంక్షలను తట్టుకుంటూ కూడ తమ ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం తనవంతు కృషిని సమర్థంగా కొనసాగిస్తున్న అతి చిన్నదేశం క్యూబా కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నది. బయోటెక్నాలజీ పరిశోధనలకు, వ్యాక్సిన్లు, మందుల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనా సంస్థని క్యూబా 1981లోనే స్థాపించించి. ది సెంటర్ ఆఫ్ బయోటాక్నాలజీ అండ్ జనెటిక్ ఇంజనీరింగ్ మనుషులు, పశువులకు సంబంధించిన వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ యాంటిబాడీస్, జన్యుమార్పిడి పంటల రూపకల్పనలో నిమగమయివుంది. బయోటెక్నాలజీలో అద్భుత విజయాలను సాధించిన క్యూబా దేశం 30 సంవత్సరాల క్రితమే హవానాలోని ఫిన్లే ఇనిస్టిట్యూట్ ద్వారా ప్రపంచ మొదటి మెనింజైటిస్ (మెదడువాపు) వ్యాక్సిన్‌ను ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు అందించింది.
అదే ఫిన్లే సంస్థ నేడు 5 రకాల కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో పురోగతి సాధించింది. ఇందులో సోబెరనా, అబ్డాలా అనే వేక్సిన్లు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకొన్నాయని క్యూబన్ అధికారులు తెలియచేసారు. 'మాంబిసా' అనే ముక్కులో స్ప్రే చేసే వాక్సిన్ కూడా ప్రయోగదశలో ఉన్నది. గతంలో మెనింజైటిస్ వ్యాక్సిన్‌ను ప్రపంచ మానవాళికి అందించిన క్యూబా ప్రస్తుతం కూడా న్యుమోకాకస్, వూపింగ్ కాఫ్, అత్యంత క్లిష్టమైన ఊపిరిత్తుతుల కేన్సర్‌కి కూడ వాక్సిన్ రూపొందించే కృషిలో ఉంది. ఇప్పుడు రూపొందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్స్ ప్రయోగ పరీక్షలకు వలంటీర్లను ఎంపిక చేసే క్రమంలో అవసరానికి 3 రెట్లు మించి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే క్యూబన్ ప్రజలకు వారి దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ పట్ల ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 11 మిలియన్ల జనాభా కలిగిన అతి చిన్నదేశం 1 లక్షా 50 వేల మంది తమ ఆరోగ్యరంగ కార్యకర్తలకు కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చి ఎవ్వరూ సాహించని ఒక పెద్ద అధ్యయనం చేస్తోందంటేనే వారి పరిశోధనాశక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క కోవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుపుతూనే మరోపక్క ఇరాన్, వెనెజులా దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసి ఏడాదికి 100 మిలియన్ డోసుల సామర్ధ్యాన్ని పెంచుకొనే పనిలో పడింది. పైగా వీరి వ్యాక్సిన్లు సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసుకోవచ్చనీ, 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలను కూడ తట్టుకొనగలదు కనుక ఉష్ణమండల దేశాల ప్రజలు కూడ ఈ వ్యాక్సిన్లను వాడవచ్చనీ తెలుస్తోంది. ధనికదేశాలు తమ వ్యాక్సిన్లను ఇతర దేశాలకి ఇవ్వడానికి ఎన్నో అడ్డంకులు సృష్టించడంతో వెనెజులా, బొలీవియా, ఇరాన్, మెక్సికో, అర్జెంటీనా, ఆంటిగువా లాంటి ఎన్నో దేశాలు క్యూబా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. తమ క్లినికల్ పరీక్షలు, అధ్యయనాలు అన్నీ పూర్తయ్యేటప్పటికి జూన్ లేదా జూలై మాసాలు పడుతుందని అప్పుడే వ్యాక్సిన్ అందించ వీలవుతుందని క్యూబా అధికారులు ప్రకటిస్తూంటే వ్యాక్సిన్ పరిశోధనలో అత్యంత ప్రతిభ, ప్రగతి ప్రదర్శిస్తున్న క్యూబా అంటే గిట్టనివారు క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్స్‌ను ప్రజానీకానికి ఇస్తున్నారనే విష ప్రచారం చేసి గోల చేస్తున్నారు.
ఏప్రియల్ మొదటి వారాంతానికే 160 మిలియన్ డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లు తన ప్రజలకిచ్చిన చైనా, 80 మిలియన్ డోసుల్ని ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేయగా 90 మిలియన్ అదనపు డోసుల్ని బ్రెజిల్, ఇండోనేషియాలోని ఫాక్టరీల్లో తయారు చేస్తున్నట్లు 'చైనా మార్నింగ్ పోస్ట్' పత్రిక ప్రకటించింది. చైనా దేశం తనదైన శైలిలో 120 మిలియన్ డోసుల ఎమ్.ఆర్.ఎన్.ఎ. వ్యాక్సిన్స్ తయారు చేయడానికి ఏర్పాట్లు మొదలైనాయి. చైనా పరిశోధనలో అభివృద్ధి అయ్యే ఎమ్.ఆర్.ఎన్.ఎ. కోవిడ్ వ్యాక్సిన్ 2021 చివరినాటికి రావచ్చనీ, దాన్ని గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేసికోవచ్చనీ తెలుస్తోంది. అంతేకాక ఎమ్.ఆర్.ఎన్.ఎ. వ్యాక్సిన్స్ తయారీకి అత్యంత కీలకమైన 'లిపిడ్ నానో పార్టికల్ కోటింగ్'ను చైనా దేశం కూడ తన సొంతంగా రూపొందించింది.
ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు అపార ధనరాశులు పోగేసుకోవడానికేనా? మానవత్వపు ఛాయలు కనీసం లేవా? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రయివేటు ఫ్రాపిట్స్గా మార్చుకోవడమేనా? అందరికీ ఆరోగ్యం ఎప్పుడు? లాంటి మౌలికమైన ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చనీయాంశాలయిన తరుణంలో ప్రయివేటు పెట్టుబడి చేతిలో బందీ అయినటువంటి వ్యాక్సిన్లు ధనిక, బీద తారతమ్యం లేకుండా ప్రపంచ ప్రజలందరికీ చేరే అవకాశం కనుచూపుమేరలో ఉందా అనే ప్రశ్నకి చైనా, క్యూబా లాంటి దేశాలు సంతృప్తికరమైన సమాధానాలిస్తున్నాయి.
- పి దక్షిణామూర్తి